'నువ్వు నాతో ఉంటే ఏ కష్టమూ రాదంది'

'నువ్వు నాతో ఉంటే ఏ కష్టమూ రాదంది' - Sakshi


అర్ధాంగి  జీవన సహచరి-3

 

 మాది ఏలూరు. నేను ఆర్మీలో చేస్తాను. నా అర్ధాంగి పేరు శైలజ.  మాకు పెళ్లై 15 సంవత్సరాలు. ఒక బాబు, ఒక పాప. సందీప్, లక్ష్మీ. సీత రాముడి వెనకాల వనవాసం వెళ్లిందని విన్నాము, చదివాము. చూడలేదు. కానీ నా భార్య సీతలాగా నా వెనకాలే నేను ఎక్కడకు వెళితే అక్కడకు రాగలిగింది. నాతో శ్రీనగర్, గంగానగర్, బీహార్, మధ్యప్రదేశ్.. ఇలా! వద్దన్నాను. బాగా చలిప్రదేశాలు అని చెప్పాను. ‘‘ఇండియా బోర్డర్... ఎప్పుడేం జరుగుతుందో తెలియదు’’ అని నేను అంటే నా భార్య ‘‘నువ్వు నాతో ఉంటే ఏ కష్టమూ రాదు’’ అని చెప్పింది. నేను క్లర్క్ అవడం వల్ల నాకు ఆఫీస్‌లో వర్క్‌లోడ్ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండుసార్లు నైట్ డ్యూటీస్ ఉంటాయి. అసలే ఏమీ తెలియని మనిషి, ఒంటరిగా ఎలా ఉండగలదు? అనుకున్నాను. కానీ తను మాత్రం అందరితో కలిసి మెలసి ఉండేది. తనకు తెలియదు అని నేను అనుకోవడమే కానీ తనే నాకు అన్నీ తెలియజేసేది. తను ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటుంది. నన్ను కూడా తెలుసుకోమంటుంది. నాతో ఉంటూనే తను బిఏ చదివి ఎంఏ కంప్లీట్ చేసింది. డ్యాన్స్, బ్యుటీషియన్, కంప్యూటర్ కోర్సులు చేసింది. ఖాళీగా ఉండకూడదు. మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అని చెబుతుంది.



ఆర్మీ వాళ్లు చాలామంది కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల ప్రేమతో సంపాదించిన సంపాదన మొత్తం తల్లిదండ్రులకే పంపేస్తారు. చివరికి తమకు ఏమీ లేకుండా చేసుకుంటారు. నాకు తల్లిదండ్రులంటే గౌరవం, ప్రేమ. అదే ప్రేమతో నేను కష్టపడి సంపాదించుకుని, నేనే కాలేజీ ఫీజులు కట్టుకుని మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడిని. నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఖర్చులకు ఐదువందల రూపాయలు ఉంచుకుని మిగిలిన డబ్బును మా తల్లిదండ్రులకు పంపేవాడిని. పెళ్లి అయిన తరువాత, పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇంటికి డబ్బులు పంపేవాడిని. కానీ నా తల్లిదండ్రులు నా డబ్బుతో తింటూ, ఉంటూ ఇల్లు కట్టుకుని ఆ మొత్తం ఇల్లు మా అన్నయ్య పేరు మీద పెట్టారు. ఇది మాకు చెప్పలేదు. నా మిత్రుడి ద్వారా నాకు తెలిసి మా నాన్నను అడిగితే ‘‘నువ్వు పంపిన డబ్బులు కావు. అది నా కష్టార్జితం. అందుకే నేను మీ అన్నకు రాశాను. నువ్వు డబ్బు పంపిస్తూ ఉండు. తరువాత ఎప్పుడో నీకు ఇస్తాను’’ అని నాన్న అన్నారు. నా జీతం అంతా పంపేవాడిని. చివరికి చూస్తే ముందు వెనుక ఒక్క రూపాయి కూడా లేదు. నా భార్యాబిడ్డల పరిస్థితి ఏమవుతుంది? ఏమీ అర్థం కాలేదు. ఓ రోజు డిప్రెషన్‌లో నా భార్యకు ఫోన్ చేసి ‘‘కూడబెట్టిందేమీ లేదు, నేనొక్కణ్ణే మిగిలాను’’ అని చెప్పాను. ‘‘పోయిన డబ్బు గురించి ఆలోచించకండి, అవసరం అయితే కూలోనాలో చేసుకుని బ్రతుకుదాం’’ అని నాకు ధైర్యం చెప్పింది. ఆ రోజు నా భార్య డబ్బుకే ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడితే చనిపోడానికే నిర్ణయించుకున్నాను.  అలా మాట్లాడకుండా ఆమె నా ప్రాణం కాపాడింది.



నాకు కామెర్లు వచ్చి, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను పసిబిడ్డలా చూసుకుంది నా భార్య. పథ్యం కోసం చేసిన చప్పిడి కూరలు తినలేక తనని తిట్టేసేవాడిని. ‘‘చూడండి, నేను కూడా ఇవే తింటున్నా’’ అని నాకు చూపిస్తూ, నవ్విస్తూ, నా కోపం తగ్గించేది. అవి నా జీవితంలో మరపురాని రోజులు. నన్ను కని జన్మనిచ్చింది మా అమ్మ అయితే, ఆ ప్రాణాలను నిలబెట్టింది మాత్రం నా భార్యే. ఇప్పుడు తనే నా ఊపిరయింది.

 - చంద్రశేఖరరావు (శైలజ భర్త)  శైలజ

 



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top