సాక్షి ‘ఫ్యామిలీ’ విజేతలు వీరే

సాక్షి ‘ఫ్యామిలీ’ విజేతలు వీరే - Sakshi


మహిళా దినోత్సవం సందర్భంగా ‘మార్చి 8 మహిళ’ పురస్కారాల కోసం వచ్చిన ఎంట్రీలలో ‘అమ్మ’, ‘అర్ధాంగి’, ‘మహిళారైతు’ కేటగిరీల నుంచి పోటీకి అర్హమైన 24 మంది గురించి సాక్షి ‘ఫ్యామిలీ’లో ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు వరుసగా 8 రోజుల పాటు రోజుకు ముగ్గురు చొప్పున ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. అలా ప్రచురించిన వారిలోంచి న్యాయనిర్ణేతలు ఆరుగురిని (కేటగిరీకి ఇద్దరు చొప్పున) విజేతలుగా ఎంపిక చేశారు. ఈ ఆరుగురినీ మార్చి 7న (మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు) హైదరాబాద్‌లో ‘సాక్షి’ సన్మానిస్తుంది. ఆ విషయాన్ని విజేతలకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. పోటీలో పాల్గొన్న అందరికీ అభినందనలు.

 - ఎడిటర్, ‘సాక్షి’ ఫీచర్స్

 

అమ్మ అమృతమూర్తి


 

శివమ్మ

 

ఈ తల్లి సమాజం గురించి గానీ, సంప్రదాయం గురించి గానీ భయపడక, మనోనిబ్బరంతో వ్యవహరించింది. అంతకంటే ముఖ్యంగా, జీవిత చరమాంకంలో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా, ఆత్మ స్థయిర్యంతో ఒంటరిగా, ఆనందంగా జీవించడం! అమ్మగానే కాదు, ఒక స్త్రీ గా కూడా శివమ్మ జీవితం ఆదర్శం.

 

సుశీల

 

త్యాగాలు అందరు తల్లులూ చేస్తారు. కానీ, జీవిత శైలి, ఆచరణాత్మకత గురించిన సందేశాలు పిల్లలకిచ్చే తల్లులు తక్కువ. ముఖ్యంగా ఆఖరి వాక్యాలు ఈ తల్లిని ఉత్తమురాలిని చేశాయి. ‘‘ఎవరికైనా చెప్పే ముందు మనం ఆచరించాలి’’ అన్న సూక్తిని పిల్లలకు వారసత్వంగా ఇచ్చిన తల్లి ఈమె.

 

 

అర్ధాంగి  జీవన సహచరి

 

మాధవి


 

భర్త చేసిన పొరపాట్ల వల్ల కలిగిన ఆర్థిక సమస్యలకూ, అతని అనారోగ్యం వల్ల ఎదురైన ఇబ్బందులకూ అతన్ని నిందించకుండా, అతనికి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, ఒక గొప్ప పని చేసింది. భర్త కోసం తన కిడ్నీని మరొకరికి ఇచ్చేందుకు, తద్వారా ఆ మరొకరి కిడ్నీని భర్తకు అమర్చేలా చేసేందుకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అంతేకాదు,   అవయవ దానాన్ని ఉద్యమంగా నడిపేందుకు ‘అవయవ దాన ప్రచార కమిటీ’ని ప్రారంభించ డానికి భర్తని ప్రోత్సహించడమే కాకుండా, తన వంతు కృషి చేయడం అభినందనీయం!  

 

 ఇందిర

 

 ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందుల్ని ఎదుర్కోడానికి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి, న్యాయవాద వృత్తిలో ఉన్న భర్తకే న్యాయం చేకూర్చింది.

 

మహిళారైతు భూదేవి

 

క్రాంతి

 

అమెరికా జీవితాన్ని కాదని ఆరుగాలం కష్టించే రైతు వృత్తిలోకి వచ్చిన మహిళారైతు క్రాంతి అభినందనీయురాలు.  తాను విత్తిన విత్తనం భూమిని చీల్చుకుని వచ్చి ఎదిగే క్రమం, దానిని కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఆఖరికి అది తనతో పాటుగా పది మందికి తిండి పెట్టగలగడం... గొప్ప అనుభూతినిచ్చే క్రమం. వ్యవసాయంలో కష్టముంది కానీ చాలా తృప్తి, సంతోషం కూడా ఉంటుంది. ఈ సంగతెరిగిన క్రాంతికి అభినందనలు.

 

 చంద్రమ్మ

 


సమాజంలోని అత్యంత కింది వర్గానికి చెందిన చంద్రమ్మ, జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుని మహిళారైతుగా ఎదిగిన క్రమం చాలా గొప్ప విషయం. వొంటరి మహిళగా ఉంటూ, కుంగిపోకుండా పోరాడి నిలవడమే కాదు, పదిమందికి ఆదర్శంగా నిలిచింది చంద్రమ్మ.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top