అప్పుడు నా శరీరం మెల్లిగా పైకి లేచినట్లనిపిస్తుంది!

అప్పుడు నా శరీరం  మెల్లిగా పైకి లేచినట్లనిపిస్తుంది! - Sakshi


ఆధ్యాత్మికం... ఆ బాట చాలా బాగుంటుంది...

ధ్యానం... ధ్యాసతో చేస్తే దేవుడు కనిపిస్తాడు...

పుస్తక పఠనం... కొన్ని సందేహాలకు నివృత్తి...

సమాధి స్థితి... ఆ సాధన ఎలా చేయాలి?

ఇలాంటి విషయాల గురించి జగపతిబాబు

మాట్లాడితే ఎవరికైనా వింతగా ఉంటుంది..

అసలు జగపతిబాబు అంటే ఏంటి?

మంచి విలాస పురుషుడు...

చక్కగా పార్టీలు చేసుకుంటాడు...

 సెంటిమెంట్స్ ఉండవు... దైవభక్తి సున్నా...

పుస్తకాలంటే పడదు...

ఇలా చాలా చాలా అనుకుంటారు.

కానీ... జగపతిబాబులో తెలియని మరో కోణం ఉంది.

ఓ సందర్భంలో జగపతిబాబుతో మాట్లాడినప్పుడు

ఆ కోణం బయటికొచ్చింది..

ఎవరూ ఊహించని ఆ కోణాన్ని ‘సాక్షి’ ఆవిష్కరించింది.

 


మీరు పార్టీ యానిమల్ అనీ, జీవితం అంటే కేవలం ‘ఎంజాయ్‌మెంట్’ అనే భావనలో ఉంటారనీ బయట మీకు ఇమేజ్ ఉంది. కానీ, మీలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని తెలిసింది. నిజమేనా?



(నవ్వుతూ)... చెబితే ఆశ్చర్యపోతారు. ఆధ్యాత్మికం అంటే నాకు చాలా ఆసక్తి. పూర్తిగా నిమగ్నమైతే దాని తాలూకు అనుభూతిని ఆస్వాదించవచ్చు. జీవితాన్ని ఆస్వాదించడం అంటే పార్టీలు చేసినప్పుడే కాదు.. ఆధ్యాత్మిక బాటలో వెళ్లినప్పుడు కూడా ఆనందం పొందవచ్చు. నేను కొంతమంది దగ్గర ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తుంటాను. వాళ్లల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లిన మహానుభావుడాయన. రజనీతో నేను ‘కథానాయకుడు’, ‘లింగ’ చిత్రాల్లో కలిసి నటించాను. ఆ షూటింగ్ సమయాల్లో మేమిద్దరం ఆధ్యాత్మికత గురించి బాగా చర్చించుకునేవాళ్లం. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. తత్వశాస్త్రానికి సంబంధించినవీ, ఆధ్యాత్మికతకు సంబంధించినవన్నీ చదువుతుంటాను. ఒకరోజు రజనీగారి దగ్గర ‘మీరెన్నో పుస్తకాలు చదువుతుంటారు కదా.. నాకేదైనా మంచి పుస్తకం సూచించండి’ అనడిగా. అప్పుడాయన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ముందు పేజీలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంతకం కూడా పెట్టి ఇచ్చారు. నాకేదైనా కొత్త పుస్తకం దొరికితే చదవకుండా ఉండలేను. ఆ పుస్తకాన్ని అప్పటికప్పుడు చదవడం మొదలుపెట్టా. నాలుగు వందల పై చిలుకు పేజీలుంటాయి. రెండు రోజుల్లో ఆ పుస్తకం పూర్తి చేసేశా. ఓ కొత్త ప్రపంచంలోకి విహరించేలా చేసింది.



ఇంకా మీరు బాగా ఇష్టపడి చదివిన పుస్తకాల గురించి చెప్పండి?



హీరోయిన్ అనుష్క యోగా ఎక్స్‌పర్ట్ అనే విషయం తెలిసిందే. తను కూడా మంచి మంచి పుస్తకాలు చదువుతుంటుంది. ‘లింగ’ షూటింగ్ సమయంలో మేం ఫిలాసఫీ, స్పిరిచ్యువాల్టీ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో పుస్తకాల గురించి కూడా చర్చించుకున్నాం. అప్పుడు తను నాకు ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ అనే పుస్తకం ఇచ్చింది. అది కూడా ఏకబిగిన చదివేశా. ఇంగ్లిష్‌లోనే కాదు.. తెలుగులో కూడా ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో ఆ పుస్తకం దొరుకుతుంది.



మీరు ధ్యానం చేస్తారా? ఒకవేళ చేస్తే పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ ధ్యానం చేయగలుగుతారా?



ధ్యానం చేస్తాను. ప్రతిసారీ అనను కానీ, చాలాసార్లు డెప్త్‌లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. అద్భుతంగా ధ్యానం చేయగలను. ఎంత అంటే.. ఒక్కోసారి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ‘చిన్నగా నా శరీరం కొంచెం పైకి లేచినట్లుగా’ అనిపిస్తుంది. అఫ్‌కోర్స్ శరీరం లేవదు కానీ, ఎంతో ఏకాగ్రతగా ధ్యానం చేసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది.



ధ్యానానికి సంబంధించిన ఆశ్రమాలకు వెళుతుంటారా?



చాలా ఆశ్రమాలకు వెళ్లాను. విపాసనా, కల్కి భగవాన్, కర్తాళ్, హిమాలయాల వరకూ వెళ్లాను. ఆశ్రమాలకు వెళ్లినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.



ధ్యానం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమా?



చాలా అవసరం. మానసిక శాంతి పొందాలంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ప్రభావం ఎంత ఉంటుందో చేసినవాళ్లకి తెలుస్తుంది. దానివల్ల పొందే ఆనందం ఎలా ఉంటుందో చేస్తే తెలుస్తుంది. రజనీకాంత్‌గారు ఒక మీటింగ్‌లో ఏమన్నారంటే... ధ్యానం అంటే ఏమీ లేదు. ‘కూర్చోండి.. కళ్లు మూసుకోండి. ఏ ఆలోచన వస్తే అది రానివ్వండి. బలవంతంగా ఆలోచించడం మానాలనో, వేరే ఆలోచించాలనో అనుకోకండి. అలా ధ్యానం చేయగా చేయగా.. అసలు ఆలోచనలే రాకుండా మైండ్ అంతా బ్లాంక్‌గా అయిపోతుంది. ధ్యానంలో అదే ఉచ్చ స్థితి.



మీరు ఆ ఉచ్చ స్థితికి ఎప్పుడు చేరుకున్నారు.. ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తుంటారు?



సరిగ్గా గుర్తు లేదు కానీ, ఎప్పుడో చేరుకున్నాను. గంట నుంచి గంటన్నర ధ్యానం చేసినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాను. ఎక్కువగా ధ్యాన కేంద్రాలకు  వెళ్లినప్పుడు చేస్తుంటాను. వాతావరణం బాగున్నప్పుడు, ఆ సమయంలో నేను ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తా.

  కొంతమంది ఎదుట దీపం పెట్టుకునో లేక ఏదైనా దేవుణ్ణి మనసులో అనుకొనో ధ్యానం చేస్తారు.. అలానే చేయాలా?

 అలా ఏం లేదు. కొంతమంది ‘ఓం మంగళం’ అనుకుంటారు. ఇవేవీ అనుకోకుండా కూడా ధ్యానం చేయొచ్చు.

 

మీరెప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా దైవం కళ్ల ముందు మెదిలినట్లు అనిపించిందా?



ఒకసారి అనిపించింది. షిర్డీ సాయిబాబా కనిపించారు. మా ఆవిడ బాబా భక్తురాలు. ఒక చిన్న వీధి, పక్కనే ఓ చిన్న గల్లీ, అక్కడ ఓ రాయి, దాని మీద సాయిబాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా కనిపించింది. నేను కూర్చుని ధ్యానం చేస్తున్న చోటు నుంచి ఓ నాలుగైదడుగుల దూరంలో ఈ దృశ్యం కనిపించింది. బాబాగారు నావైపు ఆనందంగా చూడటంలేదు. దీనంగా చూశారు. అప్పుడు నేనా ధ్యానంలోనే ‘ఎందుకు అలా చూస్తున్నావ్?’.. అంటున్నా. అప్పుడాయన ‘హు..’ అంటూ ఓ నవ్వు నవ్వి మాయమయ్యారు. దానికర్థం తెలియదు. ‘పిచ్చోడా.. పోరా.. నువ్వు బాగుపడితే బాగుంటుంది అన్నారా?’ అనుకున్నాను. మా ఇంట్లో బాబా భక్తులున్నారు కానీ.. నేనంత భక్తుణ్ణి కాదు. అందుకుని ఎందుకు కనిపించారా? అని ఆలోచించాను.



ఇది ఎప్పుడు జరిగింది?



రెండేళ్ల క్రితం జరిగింది. బాబాగారి నవ్వు ఇంకా గుర్తుంది. ఆ నవ్వు నాకు పాజిటివ్‌గా అనిపించింది.

     

మీకు తత్వశాస్త్రం (ఫిలాసఫీ) అంటే ఇష్టమేనా?




చాలా. అందులో ఉన్న లాజిక్ ఇష్టం. వయసొచ్చిన తర్వాత కాదు.. చిన్నప్పట్నుంచీ ఇష్టం. నా ఆలోచనలు కొన్ని కొన్ని ఫిలసాఫికల్‌గానే ఉంటాయి. ఉదాహరణకు.. అనుబంధాలను తీసుకుందాం. దూరంగా ఉన్నంతవరకే అవి జీవితాంతం కొనసాగుతాయని బలంగా నమ్ముతాను. నేను ఉమ్మడి కుటుంబాన్ని పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే, ఇంట్లో ఎక్కువమంది ఉంటే అన్ని తలకాయలూ ఆలోచించడం మొదలుపెడతాయి. అప్పుడు ఎవరికి వాళ్లు తాము అనుకున్నది జరగాలని పంతం పడతారు. ఈ క్రమంలో మనస్పర్థలు నెలకొని, విడిపోయే వరకూ వెళ్లిపోతారు. అదే దూరంగా ఉంటే.. ఇవన్నీ జరగవు కదా.



కానీ.. ఉమ్మడి కుటుంబంలో ఓ భద్రతా భావం ఉంటుంది కదా?



దూరంగా ఉన్నా ఆ భావం ఉంటుంది. దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్లు వేరు మనం వేరు అని కాదు. మనసులో పగ పెట్టుకుని పక్కన ఉండేకన్నా.. దూరంగా ఉండి ప్రేమగా మెలగటం ఉత్తమం. ‘మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ మోర్ ట్రబుల్ అన్నది నా అభిప్రాయం. అందుకే ‘దూరంగా ఉండి దగ్గరగా ఉండటం బెటర్’ అంటున్నా.

- డి.జి. భవాని

 

ఈ మార్పు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పలేను కానీ.. ఏ మంచి పుస్తకమైనా మనల్ని ప్రభావితుల్ని చేస్తుంది. కొన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. నేను పైన పేర్కొన్న రెండూ పాజిటివ్ బుక్సే. ఇవి కాకుండా ఇంకా చాలా పుస్తకాలు చదివా. కొన్ని పుస్తకాల్లో మహానుభావులు సమాధి స్థితిలోకి వెళ్లిన వైనం చదివి, ఆశ్చర్యపోయాను. ఆ స్థితికి చేరుకోవడానికి ఎలా సాధన చేయాలో నేను చదివిన పుస్తకాల్లో లేదు. ఆ సాధనను అధ్యయనం చేయాలనే తపన ఉంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top