కలలున్నాయ్... కన్నీళ్లున్నాయ్..!

కలలున్నాయ్...  కన్నీళ్లున్నాయ్..! - Sakshi


‘సమాజంలో ఆడ-మగ ఇద్దరే కాదు...

మేమూ మనుషులమే! మాకూ మనసుంది. మాకూ కన్నీళ్లున్నాయి.

మా జీవితాలు ఎవరికీ పట్టవు... అవహేళనలూ, అపవాదులే తప్ప మా గురించి పట్టించుకున్న వారే లేరు’

ఇవీ హిజ్రాలుగా అందరూ పిలిచే ట్రాన్స్‌జెండర్స్ వ్యధ!

నేడు ట్రాన్స్‌జెండర్స్ డే. ఈ సందర్భంగా మనకు ఒక వైపే తెలిసిన వారి జీవితాల్లోని రెండో కోణం...


 

‘హిజ్రా వ్యవస్థ వేల యేళ్ల నుంచే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఏ మార్పూ లేనిది మా హిజ్రాలలోనే!’ అంటూ వేలాది ట్రాన్స్‌జెండర్ల మానసిక వ్యధను తమ మాటల్లో వినిపించారు వైజయంతి, స్వాతి, నందిని, నమిత, కావేరి, స్నేహలత. వారి ఆవేదన వారి మాటల్లోనే...

 

‘‘మాలో అందరం గత జీవితంలో మగవాళ్లమే! ఆడవాళ్లుగా మారాలనే కోరిక.. ఆడవాళ్లలాగే దుస్తులు ధరించాలనే ఆరాటం చిన్ననాటి నుంచి కుదురుగా ఉండనిచ్చేవి కావు. అందుకే ఆడవాళ్లలా దుస్తులు ధరించి సంబరపడతాం. అంతకంటే అందంగా తయారవ్వాలని, అలాగే మాట్లాడాలని, అలాగే నాజూగ్గా ఉండాలని తపన పడతాం. ఇది ఇంట్లో వారికి నచ్చదు. కొడతారు. హింసిస్తారు. అయినా మా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇంట్లో నుంచి గెంటివేస్తారు. ఎక్కడికెళ్లాలి?! ఎవరు ఆదుకుంటారు?! అందుకే మా లాంటి వారిని వెతుక్కుంటూ వెళతాం.



సెక్స్ మార్పిడి కోసం అప్పులు...



మాలాగే హిజ్రాలుగా మారతామంటూ వచ్చేవారూ ఉంటారు. అయితే వెంటనే హిజ్రాగా మార్చేయం. కనీసం ఏడాది పాటు హిజ్రాలతోనే కలిసి ఉండాలి. అన్నిరకాలుగా పరీక్షించి, నమ్మకం కుదిరిన తర్వాత హిజ్రా కుటుంబ పెద్ద అనుమతితో మాలో కలుపుకుంటాం. ఆడవారిలాగ మారడానికి సెక్స్ మార్పిడి(ఎస్.ఆర్.ఎస్- సెక్సువల్ రీ-ఎసైన్‌మెంట్ సర్జరీ) చేయించుకోవాలనుకుంటాం. అలా చేయించుకున్నవారు మాలో చాలామంది ఉన్నారు. డబ్బులు లేక చేయించుకోని వారు ఎంతోమంది. సెక్స్ మార్పిడికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అందుకోసం అయినవారిదగ్గరే అప్పులు చేస్తాం. ఆ అప్పు తీర్చడానికి ఎన్నో పాట్లు పడతాం.

 

పోరాటమే మా జీవితం...



ఆధారం లేని బతుకులు మావి. మేం పుట్టినప్పుడు మా కులాలు వేరు, మా జాతులు వేరు. కానీ హిజ్రాగా మారాకా..!! మా కులం, మతం అంతా ఒక్కటే! మాకు ఉండడానికి సొంత గూడు ఉండదు. అద్దెకు ఎవరూ ఇళ్లు ఇవ్వరు. ఎక్కడో ఒకరు ఇచ్చినా ఆ వీధి వీధి అంతా మమ్మల్ని చూడరాని విధంగా చూస్తారు. వారి మాటలు, చేష్టలు నిత్యం మాకు నరకమే! గుర్తింపు కార్డులు లేవు. బ్యాంకు ఖాతాలు తెలియవు. పొట్ట కూటి కోసం భిక్షాటన, వ్యభిచారం వృత్తిగా ఎంచుకుంటాం. అయినా మాలో కొందరు కష్టపడి బాగా చదువుకున్నవారు ఉన్నారు. కానీ, ఒకరో ఇద్దరికో ఉద్యోగాలు ఉన్నాయి. హిజ్రా అని తెలిసి ఎవరూ పనిలో పెట్టుకోరు. కొందరు సినిమాల్లో నటిస్తున్నవారు ఉన్నారు. మంచి జీవితాల్లో ఉన్నారు. కానీ హిజ్రాలలో 95 శాతం మందిది అత్యంత కష్టతరమైన జీవితమే. లేచింది మొదలు కడుపు నింపుకోవడానికి పడరాని పాట్లు పడాల్సిందే! జీవితంతో పోరాడుతున్నాం. జీవితాంతం పోరాడుతూనే ఉన్నాం. అయినా మేం సంతోషంగానే ఉంటాం. మమ్మల్ని దూరంగా పెట్టిన సమాజంతో మాకేం పని. మేమూ మీలాగే పుట్టాం. మీలాగే జీవిస్తున్నాం. ఈ సృష్టిలో ఆడ-మగ ఎలాగో మేమూ అలాగే! కానీ అడుగడుగునా ఉండే వివక్షే మమ్మల్ని నిత్యం బాధిస్తుంటుంది. యాభై ఏళ్లు పై బడితే మా బతుకులు మరింత దుర్భరం. సంపాదన ఉండదు. సాటి హిజ్రాలే వారి సంపాదనలో సగభాగాన్ని పెద్దవారి పోషణకు ఖర్చుపెడతారు. ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. అయినా భరించుకోవాలి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉంటే 3 నెలలకోసారి వైద్య పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. చనిపోతే సూఫీ మత పద్ధతిలో ఖనన కార్యక్రమాలు ఉంటాయి.



భర్తతో కాపురం చేయాలనుకుంటాం..



మాకు ఆడవారు అక్కచెల్లెళ్లతో సమానం. మగవారినే ప్రేమిస్తాం. అభిమానిస్తాం. మమ్మల్ని కావాలనుకునేవారికి ప్రేమగా దగ్గరవుతాం. ఎవరికీ తెలియకుండా పెళ్లిళ్లూ చేసుకుంటాం. నమ్మకంతో వారినీ మా సంపాదనతోనే పోషిస్తాం. కానీ వారు జీవితంలో స్థిరపడ్డాక మమ్మల్ని వదిలేసి పోతారు. ‘నీ అవసరం తీరింద’ని ముఖం మీదే చెప్పేస్తారు. ఆ బాధను ఎవరితో చెప్పుకుంటాం? మా బాధను  ఎవరు అర్థం చేసుకుంటారు? రుజువులు ఏం చూపించగలం? సమాజంలో అందరికీ పోలీసుల రక్షణ ఉంది. మాకు మాత్రం లేదు. మా కష్టసుఖాలను అర్థం చేసుకునేది మాలో మేమే! అందుకే మాకు మేమే -అమ్మ, అక్క, వదిన, చెల్లె, బిడ్డ.. అవుతాం. మా జట్టులో పెద్దవాళ్లు ఎంత చెబితే అంత! పొల్లుపోకుండా వారి మాటలు వింటాం. వినకపోతే మా వ్యవస్థలో మేమే కఠిన శిక్షలు పెట్టుకొని, అమలు చేసుకుంటాం.



పిల్లలు, కుటుంబం కావాలనుకుంటాం...



సెక్స్ మార్పిడి చేయించుకున్నా మాకు పిల్లలు కలగరు. హిజ్రాలుగా మారిన పిల్లలను, అనాథలైన  ఆడ-మగ పిల్లలను పెంచుకుంటాం. మా కుటుంబాలలోని పిల్లల బాధ్యత కూడా కొన్ని సందర్భాలలో మాకు అప్పజెబుతారు. మా సంపాదనతోనే వారి బాగోగులు చూస్తాం.  చదువులు చదివిస్తాం. అలా విశాఖపట్టణంలోనూ, విజయవాడలోనూ పిల్లలను దత్తత తీసుకున్న హిజ్రాలు ఉన్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక మమ్మల్ని చూస్తారనే నమ్మకం లేదు. పెద్దయ్యాక మమ్మల్ని ఛీత్కరించుకుంటారేమో అనే అనుమానమూ లేదు. ప్రేమతోనే దగ్గరకు తీస్తాం. ప్రేమగా పెంచుతాం. ప్రేమనే పంచుతాం. మొన్నీ మధ్య రైలులో ఒక స్త్రీ కాన్పు నొప్పులతో బాధపడుతుంటే పురుడు పోసింది మా హిజ్రానే! ప్రేమిస్తే ప్రాణమిస్తాం.



బైరూపులతో ఇబ్బందులు...



ఇప్పటికే సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మాలాగా వచ్చే బైరూపులతో ఎన్నో ఇక్కట్ల పాలవుతున్నాం. ఈ బైరూపులు మగాళ్లే! వారికి భార్య, పిల్లలు, ఇళ్లు ఉంటాయి. అయినా హిజ్రాల వేషంతో బలవంతంగా వసూళ్లకు తెగపడతారు. దొంగతనాలు చేస్తారు. తప్పుడు పనులు చేసేది వీరైనా అపవాదు మాత్రం మా మీదే పడుతుంది. వాళ్లలో మమ్మల్నీ కలిపి ఇంకా చులకనగా చూస్తారు. బయట రోడ్లపై కనిపించే వారిలో సగానికి సగం మంది హిజ్రాలు కాదు. ఏ మాత్రం గుర్తింపు లేని మేం జీవనప్రయాణాన్ని కష్టంగా సాగిస్తుంటే బైరూపులనే ఈ మాయగాళ్లతో మాకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అంటూ తమ సమస్యలను తెలియపరిచారు స్వాతి, నందిని, నమిత, కావేరి, స్నేహలత. కార్పోరేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న వైజయంతి మాట్లాడుతూ- ‘ఉపాధికి ఎన్నో వృత్తులు ఉన్నాయి. కానీ, వాటిని ఇక్కడ హిజ్రాలకు పరిచయం చేసేవారు లేరు. ఈ సమాజం మా కాళ్ల మీద మమ్మల్ని నిలబడనిస్తే చాలని వేడుకుంటున్నాం’’ అని ముగించారు.



ఉత్తరాదిన ఇచ్చే గౌరవమర్యాదలు, ప్రభుత్వ పథకాలు అక్కడి హిజ్రాలను ఉన్నతమార్గంలో పయనింప జేస్తున్నాయి. దక్షిణాదిన మాత్రం హిజ్రాలు అట్టడగుస్థాయిలో ఇంకా నిత్యసమరం చేస్తూనే ఉన్నారు.  అటు మగవారిలోనూ, ఇటు ఆడవారిలోనూ కలవలేక సమాజంతో ఛీత్కరింపబడుతున్న హిజ్రాలకు సరైన గౌరవం దక్కాలని కోరుకుందాం.

 - సంభాషణ: నిర్మలారెడ్డి

 

ముస్తాబు మాకు ప్రాణం...

మాలో అన్నీ స్త్రీలలో ఉండే భావాలు ఉంటాయి. అందుకే ఆడవారిలాగే ఇంకా చెప్పాలంటే వారికన్నా అందంగా తయారవ్వాలనే ఆలోచన ఎక్కువ. వీధిలో వెళుతుంటే ఆడవారి కన్నా మేమే అందంగా ఉన్నామని మగవారు అనేలా తయారవ్వాలనుకుంటాం. ఆడ-మగ ముస్తాబు ఎంత సహజంగా ఉంటుందో, మేం అలాగే ఇంకా బాగా ముస్తాబు చేసుకుంటాం. నేను ఇప్పటికే సినిమాల్లో నటిస్తున్నాను. నటనలో రాణించాలన్నదే నా ఆశ. మాలో కొంతమంది బ్యూటీషియన్లూ ఉన్నారు.

 - నమిత



మార్పు రావాలి...

నేను ఇప్పుడు ప్రసిద్ధ ఎమ్.ఎన్.సి కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. వృద్ధులైన నా తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాను. నా సహోద్యోగులు నా పనితనాన్ని చూస్తున్నారు. అభినందిస్తున్నారు. అంతే తప్ప ‘నువ్వు ఇలా అని’ ఏనాడూ చిన్నచూపు చూడలేదు. ఇదే దృక్ఫథం అందరిలోనూ రావాలి. హిజ్రాలకూ మనసుంటుందని, వారూ మనుషులని అందరూ భావించాలి. వివక్ష చూపకుండా అందరితో కలిసి అందరూ సంతోషంగా ఉండే రోజులు రావాలి. హిజ్రాలు చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు ఇచ్చి గౌరవంగా జీవించే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి.  

 - వైజయంతి వసంత మోగ్లీ

 (జెండర్ హక్కుల ఉద్యమకారిణి)


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top