చిరునవ్వే జీవితాభరణం

చిరునవ్వే  జీవితాభరణం


జీవించడం ఒక కళ. ఆ కళను సాధన చేస్తూ సమాజానికి ధ్యానయోగాన్ని పరిచయం చేసిన గురు శ్రీశ్రీ రవిశంకర్! సమాజంలోని రుగ్మతలను నయంచేసే మందు ఆర్ట్ ఆఫ్ లివింగే అంటారు ఆయన! జాతి, మత, కుల విభేదాలను ఓ చిన్న సమ్మేళనం ద్వారా తొలగించుకోవచ్చు.. చెలిమిని పెంపొందించుకోవచ్చు.. వసుధైక కుటుంబ భావనను సాధించుకోవచ్చు అని ‘స్నేహ మిలన్’ అనే కార్యక్రమం ద్వారా చాటే ప్రయత్నం చేస్తున్నారు రవి శంకర్! తాజాగాబెంగళూరులోని ఆయన ఆశ్రమంలో ప్రపంచంలోని అన్ని మతాల ప్రతినిధులతో స్నేహమిలన్  జరిగింది. ఆ సందర్భంగా  తనను కలిసిన సాక్షి ప్రతినిధితో రవిశంకర్ పంచుకున్న మనోభావాలు.

 



సరస్వతి రమ



అనారోగ్యంగా ఉన్నవాళ్లకుమందు ఎంత అవసరమో, సమాజానికి వచ్చిన అంతర్గత కలహాలనే రుగ్మతలకూ  మందు ఇవ్వాల్సిన అవసరం అంత ఉంది. ఆ మందే ‘స్నేహ మిలన్’. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి.. మన సంప్రదాయం. దాన్ని పరిరక్షించుకోవాలి. ప్రపంచంలోని భిన్న మతాల మధ్య సమన్వయాన్ని, సయోధ్యను కుదిర్చే వేదికే స్నేహ మిలన్. అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే ప్రయత్నం. ఈ ఏడాదిలో ఇది రెండో సమావేశం. దీనికి ప్రపంచంలోని వివిధ మతాల ప్రతినిధులంతా హాజరయ్యారు. భేదాభిప్రాయాలున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోతాయి. చర్చిస్తే ఐక్యతను సాధించగలం. ఆ లక్ష్యంతోనే సాగుతోంది మా స్నేహమిలన్.



పెషావర్.. ఓ దుర్ఘటన



ఒకవైపు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచే ప్రయత్నం కొనసాగుతుండగా ఇంకోవైపు పాకిస్తాన్ పెషావర్‌లోని స్కూల్ పిల్లల మీద ఉగ్రవాదుల దాడి అమానుష కృత్యం. పసి పిల్లల మీద అలాంటి చర్యకు పాల్పడ్డారంటే వాళ్లు మనుషులు కాదు. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లల మీద దాడి చేసిన ఉగ్రవాద సంస్థే మొన్న మార్చి 8న పాకిస్తాన్‌లోని మా ఆశ్రమం మీదా దాడి చేసింది. దుండగులు ఆశ్రమానికి నిప్పంటించి కాల్చేశారు. దైవానుగ్రహం వల్ల  భక్తులెవరూ ఆశ్రమంలో లేరు కాబట్టి సరిపోయింది. మానవీయ విలువలు తగ్గిపోవడం వల్లే ఇలాంటి హింసాకృత్యాలు జరుగుతుంటాయి. ఇలాంటి అకృత్యాలను నివారించడానికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవసరం. ఈ సాధన మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మన ఆలోచనావిధానాన్ని మారుస్తుంది. సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది.



శాంతిదూతగా...



సాధారణంగా ఏ శాంతి సమావేశాలనైనా ప్రశాంత వాతావరణమున్నచోటే నిర్వహిస్తుంటారు. కానీ శాంతియుత వాతావరణమున్న చోట ఇలాంటి సమావేశాలు అక్కర్లేదు. ఎక్కడైతే అశాంతి నెలకొని ఉందో అక్కడ శాంతి ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిన అవసరముంది. అందుకే నిరంతరం తెగల మధ్య అంతర్గత యుద్ధాలతో అట్టుడికిపోతున్న ప్రాంతంలో ఓ శాంతిసమావేశం ఏర్పాటు చేయాలని తలచాను. అందుకు ఇరాక్‌ను ఎంచుకున్నాను. యుద్ధభూమిలో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనగానే చాలామంది ‘ప్రమాదకరమైన పనిచేస్తున్నారు. వద్దు వెళ్లొద్దు’ అని హెచ్చరించారు. ‘వెళ్తాను. చూద్దాం ఏమవుతుందో’ అని వెళ్లాను. సమావేశం ఏర్పాటు చేశాను. విజయవంతమైంది. అక్కడున్న పదిహేనులక్షల మంది నిరాశ్రయులకు మా వాలంటీర్లు చక్కగా సేవలందిస్తున్నారు. నూట ఇరవై టన్నుల ఆహారాన్ని పోగుచేసి సింజార్ మౌంటెన్ పైనున్న నిరాశ్రీతులకు అందజేశారు. అయితే అదంతా అంత తేలికగా ఏమీ జరగలేదు. మా హితులు హెచ్చరించినట్టుగానే ప్రమాదాలు ఎదురైనాయి.  ఓరోజు అక్కడి గవర్నర్‌ను కలవడానికి వెళ్తుంటే ఓ ఆత్మాహుతి దళం పేల్చిన బాంబుదాడి నుంచి రెప్పపాటులో బయటపడ్డాం. అయినా అధైర్యపడలేదు. చేస్తున్నది మంచి పనైనప్పుడు భగవంతుడి ఆశీస్సులుంటాయి. మనుషుల మధ్య విశ్వాసాలు కొరవడే ఇలాంటి అకృత్యాలు జరుగుతుంటాయి.



మనిషిని మనిషి నమ్మినరోజు ఈ వైషమ్యాలు తొలగి పోతాయి. ఆ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా! అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాదులను బుల్లెట్ నుంచి బ్యాలెట్ దారికి తేగలిగాం. అంటే వాళ్లకు ఓ వ్యవస్థమీద నమ్మకం ఏర్పర్చగలిగామన్నమాట. ఉగ్రవాదులు, తీవ్రవాదులు.. అందరూ మనుషులే. వాళ్లకేదో నష్టం జరిగింది. వాళ్ల జీవితాల్లో మానని గాయం ఉంది. వాళ్లకు మన అటెన్షన్ కావాలి. అది మేం ఇచ్చాం. ఆ గాయాన్ని మాన్పే వైద్యాన్నిస్తున్నాం. ప్రాణాయామం, ధ్యానం, జీవితాన్ని విశాల దృక్పథంతో చూడడాన్ని నేర్పిస్తున్నాం. దీనివల్ల వాళ్ల మనసుల్లో ఉన్న చెడు తొలగిపోయి, తోటి మనుషుల పట్ల ప్రేమాభిమానాలు, నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. వాళ్లలోని హింసాప్రవృత్తిని నాశనం చేస్తాయి. మనకు కావల్సింది కూడా ఈ మార్పే కదా!



రోల్‌మోడల్స్ కావాలి..



మన దగ్గర ఆదర్శాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పేవాళ్లూ చాలామందే ఉన్నారు. కాని అనుసరించేవాళ్లే లేరు. సిద్ధాంతాలు వల్లె వేయడం కాదు వాటిని ఆచరించి చూపే వారు కావాలి. చెప్పేదొకటి.. చేసేదొకటైతే చెప్పే సిద్ధాంతం ప్రభావాన్ని చూపదు. కాబట్టి చెప్పే మాటలను చేతల్లో చూపే రోల్‌మోడల్స్ కావాలి మనకిప్పుడు.



ఆధ్మాత్మిక చింతనవల్లే..



నేటి దైనందిన జీవితం విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తోంది. దాన్ని తప్పించుకునే మార్గం మన దగ్గరే ఉంది. అదే జీవన కళ. ధ్యానం, సుదర్శన క్రియ ఆ కళలో భాగాలే. మెదడులో ఉన్న ఒత్తిడిని ధ్యానంతో జయించొచ్చు. ప్రశాంతత.. మనం పొందలేనిదేమీ కాదు. కొంచెం సమయం కేటాయిస్తే చాలు ధ్యానంతో దాన్ని సొంతం చేసుకోవచ్చు. పల్లె, పట్నం, పిల్లాపాప, యువత, వృద్ధులు, ఆడ, మగ.. ఇలా ఎవరికైనా జీవితంలో సమస్యలు, సవాళ్లు సర్వసాధారణం. వాటిని ఎదుర్కొనడానికి ఆత్మబలం కావాలి. అది సాధనవల్ల వస్తుంది. ఆ సాధనే ధ్యానం. పది నిమిషాల ఏకాగ్రత.. మనలో శక్తిని జనింపచేస్తుంది.



 దీన్ని సాధన చేసేవాళ్లు సంతోషంగా ఉంటారు. చుట్టుపక్కలున్నవాళ్లనూ సంతోషంగా ఉంచుతారు. లోకాన్ని ఆనందమయం చేస్తారు.

 గ్రామాల్లో సేవా కార్యక్రమాలుఇవ్వాళ మనదగ్గర జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కారణం విషరసాయనాలతో చేస్తున్న వ్యవసాయమే. ఇది గొలుసు సమస్యలను సృష్టించి చివరకు అన్నదాతను ఉరికంబానికి ఎక్కిస్తోంది. దీనికి విరుగుడు సేంద్రియ సేద్యం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా దీన్ని మేం మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాం. తద్వారా రైతు అభ్యున్నతికి కృషి చేస్తున్నాం.

 

యువత.. ఆర్ట్ ఆఫ్ లివింగ్..


 

నేను ఇంతక్రితం చెప్పిన రోల్‌మోడల్స్ కొరతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీరుస్తుంది. దానికి యువతే మాకు లక్ష్యం. ఇందులో భాగంగా యువతకు ప్రాణాయామం, ధ్యానం, విచార బోధన చేస్తాం. దీనివల్ల వాళ్లు తమ ఆలోచనావిధానం ఎలా ఉందో తెలుసుకుంటారు. విశ్లేషణ, విచక్షణా జ్ఞానం వస్తుంది. ఇదంతా దీర్ఘకాలిక వ్యవహారం కాదు. దీర్ఘకాల ప్రక్రియల మీద నాకు విశ్వాసం లేదు. కాబట్టి మా కార్యక్రమాలన్నీ షార్ట్‌టైమ్ ప్రోగ్రామ్సే. అయిదు రోజులు చాలు. యువతను యువతే ఆకర్షిస్తుంది కనుక మా దగ్గర వాలంటీర్స్ అందరూ యువతే. వాళ్లే తమ వయసువాళ్లను ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్స్‌గా మారుస్తున్నారు. మా శాఖలు ప్రపంచమంతా ఉన్నాయి. మా వాలంటీర్స్‌తో యూత్ స్నేహం చేస్తే చాలు!

 

స్మైల్ అండ్ సర్వ్

 

రోల్‌మోడల్స్ యువత నుంచే రావాలి. ధ్యానం.. చిరునవ్వు, సేవ ఈమూడే యువతను ముందుకు నడిపిస్తాయి. అందుకే వాళ్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే... ధ్యానంతో ఒత్తిడి దూరం చేసుకోండి. చిరునవ్వును ఆభరణంగా మలచుకోండి. సేవను నైజంగా మార్చుకోండి. మనదేశం వనరుల గని. వాటిని సద్వినియోగ పర్చుకునేదిశగా మీ శక్తియుక్తులను పెట్టండి.

 

వసుధైక కుటుంబం

 

టెక్నాలజీ.. మన ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఎలా మార్చిందో ఆధ్యాత్మిక చింతన అలా ఈ ప్రపంచాన్ని ఓ కుటుంబంలా మారుస్తుంది. ఇప్పుడున్న సమాజానికి సాంకేతికత... ఆధ్యాత్మికత... ఈ రెండూ కావాలి. హింసలేని సమాజాన్ని నేను కాంక్షిస్తున్నాను. ప్రేమమయమైన సమాజాన్ని కోరుకుంటున్నాను. దీనికి ప్రజలందరి సహకారం కావాలి!

 

సమష్టి కృషి

 

ధార్మికక్షేత్రంలో ఉండేవాళ్లు, రాజకీయనాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా.. ఈ నలుగురూ సమష్టిగా పనిచేస్తేనే సమాజం ఉన్నతి సాధిస్తుంది. ఉదాహరణకు.. ఇక్కడున్న (కర్ణాటకలోని) అల్కావతి నదిలో నలభై ఏళ్ల నుంచి నీళ్లు లేవు. మా వాలంటీర్స్ వెళ్లి దాన్ని బాగుచేశారు. దాని ఒడ్డున మొక్కలు నాటారు. చెక్‌డ్యామ్ కట్టారు. ఇప్పుడా నది నీటితో కళకళలాడుతోంది. దాని దరిదాపుల్లో 600 అడుగుల లోతు తవ్వితే కాని నీరుపడని ప్రదేశాల్లో ఇప్పుడు 50 అడుగుల లోతుకే నీటి ఊట బయటపడుతోంది. ఇది పెద్దమార్పు కదా. అలాగే ఆడశిశు మరణాలను నివారించడంకోసం ప్రజల్లో అవగాహనకల్పించే ప్రయత్నం చేశాం. అదేవిధంగా జాతి, మతాల విభేదాలు తొలగి అందరూ కలిసిమెలసి ఉండడానికి ‘హార్మొనీ ఇన్ డైవర్సిటీ’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నాం. ఇలా సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే సుందరసమాజాన్ని నిర్మించుకోవచ్చు. నేను చెప్పేదొక్కటే.. ఆధ్యాత్మిక చింతనలేకపోవడం వల్లే సమాజంలో ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనే అన్ని రుగ్మతలకు అసలైన మందు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top