భోజనం రెడీ.. మీరు రెడీనా?

భోజనం రెడీ.. మీరు రెడీనా?


రెస్టారెంట్‌ మిస్టేక్స్‌



పాకా హోటల్‌కీ, పెద్ద రెస్టారెంట్‌కీ రుచిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. బట్, పద్ధతుల్లో తేడాలుంటాయి. పాకలో ఫ్రీడమ్‌ ఉంటే... పెద్ద రెస్టారెంట్‌లో ‘కట్టేసినట్టు’గా ఉంటుంది! ఎలా తిన్నా, ఎలా ఉన్నా.. పాక పాయింట్‌ అవుట్‌ చెయ్యదు. పెద్ద రెస్టారెంట్‌లో మాత్రం ప్రతిదానికీ ఓ మెథడ్‌ ఉంటుంది. ఓ మర్యాద ఉంటుంది. అది తెలియక ఆల్రెడీ మనం కొన్ని మిస్టేక్స్‌ చేసి ఉంటాం. ఇక ముందు చేయకుండా ఉండడానికీ, పాకలో ఫ్రీడమ్‌నే పెద్ద రెస్టారెంట్‌లోనూ ఫీల్‌ అవడానికి కొన్ని టిప్స్‌ ఇవి.



నేర్చుకుందాం!

ఆమెకు లోకాన్ని చూపించండి


మీరు, మీ గర్ల్‌ఫ్రెండ్‌ రెస్టారెంట్‌కి వెళ్లారు. గర్ల్‌ఫ్రెండ్‌ కాకపోతే మీ వైఫ్‌. ఎలాగూ ఎదురెదురుగా కూర్చుంటారు. గుడ్‌ మేనర్స్‌ ఏంటంటే.. ఆమెకు చక్కగా రెస్టారెంట్‌ అంతా కనిపించేలా మంచి ‘వ్యూ’తో ఉన్న సీటును ఆఫర్‌ చెయ్యడం. అర్థం కాలేదా? మీరు గోడకు వీపు ఆన్చి కూర్చొని, మీరు, మీ వెనుక గోడ మాత్రమే ఆమెకు కనిపించేలా మీ ఎదురు సీట్లో ఆమెను కూర్చోబెట్టడం మేనర్స్‌ కాదు మరి.



అదో పెద్ద విషయం కాదు

మధ్యలో వాష్‌రూమ్‌కి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’ అని లేచి వెళితే చాలు. ఎక్కడికి వెళుతున్నారో మీ టేబుల్‌ మీద ఉన్నవారందరికీ చెప్పనవసరం లేదు.



సాల్ట్‌ అడిగితే పెప్పరూ ఇవ్వండి

‘కాస్త ఆ ఉప్పు అందిస్తారా?’ అని మీ పక్కన లేదా ఎదురుగా కూర్చొన్న వాళ్లు మిమ్మల్ని అడిగినప్పుడు.. ఉప్పును మాత్రమే అందించం కరెక్ట్‌ కాదు. జతగా పెప్పర్‌ షేకర్‌ను కూడా అందించాలి. అడిగింది మాత్రమే ఇవ్వడం కదా మర్యాద... అనకండి. అడగలేదని ఇవ్వకపోవడం కూడా... ఇదిగో ఇలాంటి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ విషయాల్లో అమర్యాదే.



మోచేతులతో కుదిపేయకండి

మోచేతులను టేబుల్‌ పైన ఉంచకండి. ఇప్పుడైతే అంత పట్టింపు ఉండడం లేదు కానీ, ప్రాచీన కాలాల్లో దుంగలతో ఎగుడు దిగుడుగా చేసిన బల్లలపై కూర్చొన్నప్పుడు మోచేతులను టేబుల్‌ మీద ఉంచడం నిషిద్ధంగా ఉండేది. మోచేతి కుదుపులకు బల్లపై పాత్రలు కదలకుండా ఉండడం కోసం ఆ నియమం పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కానీ, అలా పెట్టడం మర్యాద కాదు అనే భావన అలాగే కొనసాగుతోంది.  



కనిపించేలా పెట్టుకోకండి

రెస్టారెంట్‌లో భోంచేస్తున్నప్పుడు సెల్‌ ఫోన్‌ని కనిపించేలా పెట్టుకోకండి. సెల్‌ఫోన్‌ కనిపిస్తూ ఉంటే.. తినడం మీద మీ ధ్యాస ఉండదు. మీతో పాటు డైనింగ్‌కి వచ్చిన వాళ్ల మీదా మీ దృష్టి ఉండదు. ఉన్నా, మీరు వారితో అర్థవంతంగా, మనస్ఫూర్తిగా సంభాషించలేరు.



గుడ్‌.. బెటర్‌.. వరెస్ట్‌

ఇక లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌. వెయిటర్‌కి టిప్‌ ఎంత ఇవ్వాలి? చక్కగా సర్వ్‌ చేస్తే.. బిల్లుపై 20 పర్సెంట్‌ ఇస్తారు. ఓ మోస్తరుగా సర్వ్‌ చేస్తే 10 పర్సెంట్‌ ఇవ్వొచ్చు. సర్వీస్‌ వరెస్ట్‌గా ఉంటే జీరో పర్సెంట్‌. ఇది అమెరికాలో సంగతి. చైనా, కొరియా, హంగ్‌కాంగ్‌లలో టిప్‌ అన్నదే ఉండదు. జపాన్‌లో టిప్‌ ఇస్తే ‘ఎంత పొగరు’ అనుకుంటారట. ఎవరు ఎలా ఉన్నా.. మీరు టిప్‌ ఇస్తుంటే మాత్రం నొప్పించక, తానొవ్వక టైపులో.. ఇస్తే చాలు.



పక్కపక్కన పెడితే ఫినిష్‌  

తినడం ఫినిష్‌ చేసేశాక.. ప్లేట్‌లో నైఫ్‌ని, ఫోర్క్‌నీ పక్కపక్కన ఉంచండి. అప్పుడు మీ భోజనం పూర్తయిందని వెయిటర్‌కి అర్థమౌతుంది. ఒకవేళ తినడం పూర్తి కాకపోతే, తింటూ తింటూ కాస్త విరామం ఇస్తే.. అప్పుడు నైఫ్‌ని, ఫోర్క్‌నీ పక్కపక్కన కాకుండా, ఠి షేప్‌లో ఉంచండి. వెయిటర్‌ మీ దరిదాపుల్లోకి రాడు.



ఎక్కడెక్కడ తిరిగిందో తెలుసుగా!

హ్యాండ్‌బ్యాగ్‌ని టేబుల్‌పై పెట్టకండి. అలా పెట్టడం హైజీన్‌ కాదు. అంతేకాదు, అది చాలా మొరటుపని. మీతో పాటు అప్పటి వరకు ఆ హ్యాండ్‌బ్యాగ్‌ ఎక్కడెక్కడ తిరిగిందీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి! ఇక ఆ పని చెయ్యరు.



చివరి వరకు ఒడిలోనే ఉండాలి

టేబుల్‌ మీద ఫోల్డెడ్‌ నేప్‌కిన్స్‌ ఉంటాయి. కుర్చీలో కూర్చున్నాక ఒక నేప్‌కిన్‌ను మడత విప్పి మీ ఒడిలో ఉంచుకోండి. తినడం పూర్తయ్యే వరకు అది మీ ఒడిలోనే ఉండాలి. తింటూ తింటూ మధ్యలో మీరు ఏ హ్యాండ్‌వాష్‌కో, మరోచోటుకో వెళ్లవలసి వస్తే, మీరు లేచిన కుర్చీ సీటుపైన ఆ నేప్‌కిన్‌ను ఉంచి వెళ్లాలి. ఒకవేళ మీరు ఆ నేప్‌కిన్‌ని టేబుల్‌ మీద ఉంచి వెళితే మీ భోజనం పూర్తయిందని వెయిటర్‌ ప్లేట్‌ తీసేసే ప్రమాదం ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top