అవిశ్రాంతం అరవై తర్వాత

అవిశ్రాంతం అరవై తర్వాత


పనిచేస్తూనే ఉన్నాను..!

ఆయన ఒకప్పుడు రేడియో కార్యక్రమాల రూపకర్త... ఆ తర్వాత దూరదర్శన్ నిర్వాహకులు... సివిల్స్ విద్యార్థులకు అధ్యాపకులు... పాఠ్యాంశాల రచయిత... సెన్సార్‌బోర్డు సభ్యులు...దేవుని కల్యాణానికి వ్యాఖ్యాత... ఇలా ఒకదానికి మరోటి పొంతన కనిపించని రంగాల్లో నిమగ్నమైన ఆ వ్యక్తి...డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు. అవిశ్రాంతంగా గడిచిపోతున్న ఆయన విశ్రాంత జీవితం గురించి ఆయన మాటల్లోనే...

 

నేను రిటైరయ్యి పదేళ్లయింది. అయితే ‘ఈ రోజు ఏ పనీ లేదు, ఎలా పొద్దుపుచ్చాలో అనిపించిన క్షణం ఒక్కటీ లేదు. నా వ్యాపకాలకు 24 గంటలు సరిపోవడం లేదు. నేను చురుగ్గా ఉండడానికి, నా మానసిక ఆరోగ్యానికి కారణం అదే అనుకుంటాను. ఈ పదేళ్లలో ఆ భగవంతుడు నా చేత ఎన్నో పనులు చేయించాడు. అంతా దైవికంగా జరిగిపోయినట్లనిపిస్తుంది. దూరదర్శన్ నుంచి రిటైరయిన పదహారో రోజున మా ఆవిడతోపాటు హైదరాబాద్‌కి వస్తున్నా. ఢిల్లీ విమానాశ్రయం లాంజ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎపివిఎన్ శర్మ కనిపించడంతో ఆయన్ను పలకరిద్దామని దగ్గరకు వెళ్లాను.



ఏం చేస్తున్నారనే ప్రశ్నకు అనాలోచితంగా ‘స్వామి దగ్గర నేనూ పనిచేద్దామనుకుంటున్నాను’ అనేశాను. ఆయన వెంటనే సరే ననడంతోపాటు కొద్దిరోజుల్లోనే ఫోన్ చేసి జీతం గురించి అడిగారు. అప్పుడు కూడా ‘స్వామి ఎంత ఇస్తే అంత’ అనేశాను సంతోషంగా. అలా టిటిడిలో అన్నమాచార్య కీర్తనలను రికార్డు చేసే ‘దృశ్య శ్రవణ ప్రాజెక్టు’ కో ఆర్డినేటర్‌గా రెండేళ్ల కాలంలో వంద క్యాసెట్లు రికార్డు చేశాను. అదే సమయంలో అన్నమాచార్య 600 జయంతి ఉత్సవాల సందర్భంగా ‘సప్తగిరి సంకీర్తనలు’ కార్యక్రమాన్ని సుమారు వెయ్యి మంది గాయనీగాయకులతో నిర్వహించాను.



ఇవన్నీ నా హయాంలో నిర్వహించాననే తృప్తితో ఉండగానే టిటిడిలో మరో మూడేళ్ల కొనసాగింపు ప్రతిపాదన వచ్చింది. అలా ఎస్‌విబిసి (శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్)లో తొలి ఉద్యోగినయ్యాను. ఇప్పుడు ఆ చానెల్ చూస్తుంటే అందులో నేనూ ఓ సైనికుడిననే ఆనందం కలుగుతుంటుంది. అందులో మూడేళ్లు చేసిన తర్వాత 2010లో హైదరాబాద్ కొచ్చేశాను. నా రచనా వ్యాసంగాన్ని రిటైరైన తర్వాత కూడా కొనసాగించాను. నేను రాసిన 80 పుస్తకాల్లో పాతిక పుస్తకాలు ఈ పదేళ్లలో రాసినవే!

 

ఐఎఎస్ శిక్షణ...: ఓ స్నేహితుడు నేను ఐఎఎస్ ఇంటర్య్వూ బోర్డులో సభ్యుణ్ణని తెలుసుకుని వాళ్ల కాలేజీలో ఇంటర్ నుంచి విద్యార్థులకు ఐఎఎస్ శిక్షణకు సిద్ధం చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పి నిర్వాహకుడి దగ్గరకు తీసుకెళ్లారు. అలా ఆ కోచింగ్ సెంటర్‌కి తొలి ప్రిన్సిపల్ నయ్యాను. 


ఓ ఏడాది పాటు పని చేసి, ఆ కోచింగ్ సెంటర్‌ని వదిలాక సివిల్స్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే మరో సంస్థ ఆహ్వానం మేరకు వారికి క్లాసులు చెప్పడం మొదలెట్టాను. దాంతోబాటు పుస్తకాలు రాసుకుంటూ, వార, మాసపత్రికలకు వ్యాసాలు అందిస్తూ, సాహిత్య సమావేశాలు, పుస్తకావిష్కరణ సభలతో గడిచిపోతున్న కాలంలోనే అంటే 2010 లోనే ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి నన్ను రీజనల్ సెన్సార్‌బోర్డు మెంబరుగా నియమించారు. అది రెండవ దఫాకు కొనసాగి గత ఏడాది జూన్ నెలతో ముగిసింది.

 

సామాజిక బాధ్యతగా...: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆదిశంకర ఐఎఎస్ అకాడమీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ అకాడమీకి సలహాదారుగా ఉన్నాను. ఆ సమయంలోనే పిల్లలకు సులువుగా అర్థమయ్యేటట్లు సివిల్స్ పుస్తకాలు... మూడు ఇంగ్లిష్, రెండు తెలుగు మొత్తం ఐదు రాశాను. ఇవి కాక నేను గడచిన ముప్ఫైఏళ్లుగా తిరుమల వేంకటేశ్వరుని కల్యాణం, భద్రాచల సీతారాముల కల్యాణం, తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నాను. ఇవిగాక అప్పుడప్పుడూ నా రచనల మీద పరిశోధన చేస్తున్న పిహెచ్‌డి స్కాలర్స్ కలుస్తుంటారు. ఇప్పటి వరకు నా రిటైర్‌మెంట్ లైఫ్ ఇలా గడిచింది.

 

ఇక ముందు నేషనల్ ఠాగూర్ ఫెలోషిప్ కోసం ‘తెలుగు పత్రికల సాంస్కృతిక సారస్వత సేవ’ మీద పరిశోధన గత వారమే మొదలుపెట్టాను.

 ...::: వాకా మంజులారెడ్డి

 ఫొటోలు: శివ మల్లాల

 

 మా ఆవిడ శోభాదేవి కూడా రచయిత్రే! నా రచనల్లో చాలా వరకు నేను చెప్తుంటే తను రాసినవే ఎక్కువ. నాకు 2000లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ముల్క్ రాజ్ ఆనంద్ రాసిన ‘మార్నింగ్ ఫేస్’కి, తెలుగు యూనివర్శిటీ అవార్డు తెచ్చిపెట్టిన అమితా ఘోష్ రచన ‘షాడో లైన్స్’ అనువదిస్తున్నప్పుడు నాకు సరైన తెలుగు పదం స్ఫురించనప్పుడు తాను అందించేది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top