పడుపు కోత

పడుపు కోత - Sakshi


ఆత్మకేనా గౌరవం? దేహానికి ఉండదా? దేహానికి గౌరవమా?! ఎవరిలా అంటోంది? సెక్స్ వర్కర్లు. అవును, మనుషులందరికీ ఆత్మగౌరవం ఉన్నట్లే, తమకు అదనంగా దేహ గౌరవం కూడా ఉండాలని వారు కోరుకుంటున్నారు. తమ దేహంపై జరుగుతున్న లైంగిక హింస నుంచి తమను కాపాడుకునేందుకు ప్రత్యేక హక్కులు కల్పించమని ఏళ్లుగా ఆక్రోశిస్తున్నారు. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్ ‘డి వాలెన్’లో ‘సెక్స్‌వర్కర్లను గౌరవించాలి’ అనే నినాదంతో ఒక కాంస్య విగ్రహం ఉంది.  మనం అలా విగ్రహాలు పెట్టక్కర్లేదు. ఆ మహిళలను  హింసించకపోతే చాలు. నేడు పడుపు వృత్తి కార్మికులపై హింసను నిర్మూలించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా కొందరు సెక్స్‌వర్కర్ల నేపథ్యం, వారి మనోభావాలు.

 

హైదరాబాద్ అమీర్‌పేటలో రాంకీ ఫౌండేషన్ తరచు నిర్వహిస్తుండే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సెక్స్‌వర్కర్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అనాథ అయిన సునీతను మేనత్త పెంచి ఈ వృత్తిలోకి దింపింది. ఇప్పుడు సునీత పదేళ్ల కొడుక్కి తల్లి. కొడుకును హాస్టల్‌లో ఉంచి చదివిస్తూ ఒంటరిగా జీవిస్తోంది. ‘‘ఈ వృత్తి నుంచి బయటపడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, పెళ్లి కలకాలం నిలుస్తుందనే భరోసా కొరవడడమే ఇందులో కొనసాగడానికి కారణం’’ అంటోందామె.



కల్పనది మరో విషాదం. భర్త మరో స్త్రీతో వెళ్లి పోయాడు. గత్యంతరం లేక పుట్టింటికి పోతే ఆదరణ కరవైంది. విశాలమైన ప్రపంచంలో పొట్ట నింపుకోవడానికి చాలా పనులున్నాయనే నమ్మకంతో ఆమనగల్లు నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి పడింది. ఎటు వెళ్లాలో తెలియక రోజంతా ఓ మూల కూర్చునే ఉంది. అది గమనించి ఓ బ్రోకర్... తన ఇంట్లో పని చేస్తే అన్నం పెట్టి, బట్టలిస్తామని ప్రలోభ పెట్టి ఈ కూపంలోకి దించాడు. ఇక మిగిలిన వారంతా భర్త, పిల్లలు ఉన్నవారే. వారి జీవితాలన్నీ కొంచెం అటూ ఇటూగా ఒకేలా ఉన్నాయి.

 

భర్త బాధ్యత మరిస్తే..!



భర్త బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఇల్లు గడవక ఈ దారిపట్టిన వారే వారంతా. ‘‘నాకు ఇద్దరు అమ్మాయిలు. సాయంత్రానికి మద్యం, మాంసం లేకుంటే భర్త చావబాదుతాడు. ఏడకెల్లి తేవాలె - అంటే... ఆ మాటే పట్టదు. పుట్టింటోళ్లను యాచించి మొగుణ్ణి, పిల్లల్ని సాకాలంటే ఎన్ని రోజులని? అంట్ల గిన్నెలు తోమితే మా కడుపులు నిండుతాయనుకుంటే... ‘ఇంటింటికీ వెళ్లి గిన్నెలు కడిగితే నామోషీ’ అని అంతెత్తున ఎగిరి పుట్టింటికి తరిమేశాడు. ఏ పనీ చేయకపోతే బతుకు సాగదు. అందుకే ఇలా’’ అంటోంది సుధారాణి.

 ‘‘తిండి పెట్టని మొగుణ్ణి వదిలించుకుని నా పొట్ట, పిల్లల పొట్ట నింపనీకి ఏదో ఒక పని చేసుకుంటే బతుకు వెళ్లబారుద్ది. కానీ పిల్లలు పెద్దయి పెళ్లి చేయాలంటే నువ్వు మొగుణ్ణి వదిలేశావంటుంది సమాజం. బంధువులు కూడా మా పిల్లల్ని దూరం పెడతారు. ఇదైతే ఎవరికీ తెలియదు గుట్టుగా సాగిపోతుంది. రోగిష్టి వాడైనా సరే భర్త అనే ఓ వ్యక్తి ఉన్నాడంటే మరికొన్ని సమస్యలు దూరంగా ఉంటాయి. పిల్లలు పెద్దయి ఉద్యోగాల్లోకి వచ్చే దాక ఇంతకంటే మరో దారి కనిపించడం లేదం’’టోంది సుభాషిణి.

 

హింస నుంచి హింసలోకి...



భర్త పెట్టే హింస నుంచి బయటపడడానికి ఈ దారి పడితే ఇందులోనూ హింస తప్పట్లేదంటోంది అపర్ణ. ‘‘వీథి రౌడీలు పిలుస్తుంటారు, పోలీసులు పెట్టే బాధలతోపాటు నకిలీ పోలీసుల బెడద. కొందరు విటుల వికృత ధోరణులను భరించాల్సిందే. ఒకరని చెప్పి ఎక్కువ మంది ఉన్నా మాట్లాడలేం. ఒకసారి తలుపు గడియ పెట్టాక వాళ్లు కొట్టినా నోరెత్తలేని పరిస్థితి. గొంతు పెగిలితే అల్లరయ్యేది తామే’’ ఆమె ఆవేదన చెందింది.



ఇక రాజ్యలక్ష్మయితే, ‘‘పిల్లలు పెద్దయ్యాక ఏ కర్రీ పాయింటో పెట్టేసుకునే బతికేయగలను’’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పింది. స్థానిక నాయకులు, బస్తీవాసుల అండలేకపోతే బజ్జీల బండి కూడా నడపలేమంటూ వాపోయిందొక మహిళ. మునిసిపాలిటీ వారికి లంచాలు, పోలీసులకు మామూళ్లు ఇవ్వలేక ఇడ్లీబండి వంటి ప్రయత్నాలన్నీ అటకెక్కాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో టీ స్టాల్ పెట్టుకుంటే దానిని కూడా నడుపుకోనివ్వలేదంటూ... మాకే కనుక పోలీసుల బెడద తప్పిస్తే ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుటే బండి పెట్టి బజ్జీలేస్తానంటూ ఆవేశంతో ఊగిపోయింది రంగమ్మ.

 

రోగాల బారిన పడకుండా...



ఈ వృత్తిలో ఉన్నప్పుడు వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ముఖ్యంగా హెచ్‌ఐవి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారీ మహిళలు. ఈ విషయంలో సమాజంలో చైతన్యం తెస్తున్నారు కూడా. సేఫ్ సెక్స్ గురించి చైతన్యం తీసుకురావడానికి తమ దగ్గరకు వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కండోమ్ అవసరాన్ని తెలియచేస్తున్నారు. ఇంత చేస్తున్న వీరు.. ప్రభుత్వ అనుమతితో గుర్తింపు కార్డు ఇప్పిస్తే వేధింపుల్లేకుండా జీవించగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఉన్నట్లు పరీక్షలు చేసి లైంగిక వ్యాధుల లేవని నిర్ధారించిన తర్వాత మాత్రమే తమ దగ్గరకు వచ్చే పద్ధతిని పాటించాలని కూడా సూచిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top