ఆ పుస్తకాలు గుర్తున్నాయా?

ఆ పుస్తకాలు గుర్తున్నాయా?


పుస్తక ప్రచురణ.

 

‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది’... ఇలా అనుకోవడానికి తిలక్‌కు వేరే కారణాలున్నా మనకి మాత్రం 1950ల నుంచి ఓ ముఫ్పైయేళ్ళ పాటు సంగీతం, సాహిత్యం, సినిమా రంగాల్లో కురిసిన వెన్నెల వాన గుర్తుకొచ్చి బెంగ కలుగుతుంది. ఆ వెల్లువ అన్ని వైపులకీ ప్రవహించడానికి, ఆసరాగా నిలబడి మరింత బలంగా ముందుకు నడవడానికి ముఖ్యపాత్ర పోషించింది పుస్తకాలను ముద్రించిన సంస్థలే. వాటిలో ఒక వెలుగు వెలిగి, చరిత్రలోకి జారిపోయిన రెండు సంస్థల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఒకటి ‘సోవియట్ పుస్తక ప్రచురణ సంస్థ’, రెండు ‘దక్షిణ భాషా పుస్తక సంస్థ’ (సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్టు).

 సోవియట్ యూనియన్‌లో ముద్రించిన అనేక భారతీయ భాషా పుస్తకాలు ‘ఫారెన్ లాంగ్వేజ్ పబ్లిషింగ్ హౌస్’ ద్వారా ఇండియాకి వచ్చేవి. సోవియెట్ ఈ పుస్తకాలే కాకుండా ‘సోవియట్ లాండ్’ అనే పక్ష పత్రికని ఇంగ్లిషు, బెంగాలీ, హిందీ, తెలుగులో (సోవియట్ భూమి) ప్రచురించి వెలువరించేది. ఇవన్నీ ‘పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్’ ద్వారా రవాణా ఖర్చులు లేకుండా మన దేశానికి వస్తే వాటిని వివిధ ప్రాంతాలకు చేర్చి, అతి తక్కువ రేటుకి అమ్మేవారు. తెలుగులో ‘విశాలాంధ్ర బుక్ హౌస్’ వీటిని అమ్మేది. సోవియట్ పతనంలో ఈ చౌక పుస్తకాల కథ కూడా కంచికి చేరింది. ఇదంతా చాలామందికి యింకా గుర్తున్న జ్ఞాపకమే కాబట్టి దక్షిణ భాషా పుస్తక సంస్థను గురించి మాట్లాడుకుందాం.



పదేళ్ళ దాకా పిల్లలకి రంగు రంగుల బొమ్మలతో, చిట్టిపొట్టి కథలతో అందమైన పుస్తకాల ఎర వేసి, ఆ తర్వాత నెమ్మదిగా సోవియట్ రచయితల్ని రక్తంలోకి ఎక్కిస్తూ పోతూ ఉంటే, ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి అందరూ సోవియట్ ప్రచురణల ద్వారా కమ్యూనిస్టులు అయిపోతారని అమెరికా పీడకల కంది. పీచు మిఠాయి రేటుకే పుస్తకాలు అమ్మి, దేశాలకి దేశాల్నే కొనేస్తోందని బెంగపడింది. అయితే సోవియట్‌లా తిన్నగా బరిలోకి దిగే వెసులుబాటు అమెరికాకు లేదు. పెట్టుబడిదారులకి అలవాటైన పెరటి దారులు మాత్రమే ఉంటాయి. తలుపులు తీయడానికి రాక్ ఫెల్లర్లు, ఫోర్డులు, బిల్‌గేట్లు ఛారిటబుల్ ట్రస్టు తాళాలతో రెడీగా ఉంటారు.



ఉపఖండంలో సోవియట్ భావదాడిని ఎదుర్కోడంలో భాగంగా ‘ఫోర్డు ఫౌండేషన్’ సహకారంతో 1950లలో ఏర్పాటు అయినదే ‘సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్టు’ - దక్షిణ భాషా పుస్తక సంస్థ. ఈ సంస్థ బలంగా నిలబడడానికి గట్టి పునాదులే వేశారు. సర్వేలు జరిపి, ప్రజలు ఎలాంటి పుస్తకాలు కావాలనుకున్నారో తె లుసుకున్నారు. అన్ని విషయాలు సవివరంగా సరి చూసుకున్న తర్వాతే కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీంట్లో భారత ప్రభుత్వం కూడా చేతులు కలిపింది. దక్షిణ భారతంలో చాలా పేరున్న ఐదు విశ్వవిద్యాలయాల అధిపతులు ఈ ట్రస్టు సభ్యులు. ఈ సంస్థ తనంత తానుగా పుస్తకాలు వెయ్యలేదు. దక్షిణాదిన ఉన్న అనేక మంది ప్రచురణకర్తల ద్వారా పుస్తకాలు అచ్చు వేయించింది. పుస్తకాలకి ముందు మాటలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖా మంత్రులు లాంటి వారు కూడా రాశారు. ఈ సంస్థ రెండువందల పుస్తకంగా వేసిన డా.రాధాకృష్ణన్ రచనల తమిళ అనువాదాన్ని 1960 ఫిబ్రవరి పన్నెండున నెహ్రూగారు ఆవిష్కరించి, పెద్ద ఉపన్యాసం కూడా యిచ్చారు. ఈ యజ్ఞంలో భాగంగా కరుడుగట్టిన కమ్యూనిస్టులను కూడా ముగ్గులో దింపిందీ సంస్థ. వేర్వేరు ప్రచురణ సంస్థలు పుస్తకాలు వేయటం వలన యిది సాధ్యపడింది. తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, మద్దిపట్ల సూరి, బైరాగి, నండూరి విఠల్, వేల్చేరు నారాయణరావు లాంటి పేరున్న రచయితలతో పాటు ప్రజలకు పరిచయమున్న అనేకమంది రచయితలు ఈ కార్యక్రమంలో తలో చెయ్యి వేశారు.



ఈ సంస్థ తెలుగులో వేసిన పుస్తకాలలో మచ్చుకు కొన్ని - ప్రకృతి పిలుపు, కూలిన వంతెనలు, ఆకలి చేసిన నేరం, భగ్న మందిరం, రాము - రాక్షసులు, కోకొరోకో, ప్రశస్త ఆధునిక జర్మన్ కథానికలు, బెంగాలీ కథలు, ఇదా నాగరికత, వేలుగాడి కొడుకు- యితర విదేశీ కథలు, స్వప్న లోకంలో అణు- అమ్మణి, యింకా చాలా చాలా పుస్తకాలు, కథలు, నవలలే కాకుండా తత్వశాస్త్రం, మతం,  విజ్ఞానశాస్త్రం, నాటక కళ, శిల్పశాస్త్రం, పురావస్తు పరిశోధన,  దక్షిణాది దేవాలయాల గొప్పతనం యిలా అనేక విషయాల మీద రాయించి, వేయించిందీ సంస్థ. పుస్తకం మీద ఏదో ఒక మూల చిన్నగా సంస్థ లోగో ఉండటం తప్పించి, సోవియట్ పుస్తకాల్లా ఉనికిని చాటే ప్రయత్నాలేవీ ఈ సంస్థ చెయ్యలేదు. అయితేనేం దక్షిణాది భాషా సాహిత్యానికి, కళలకి ఎనలేని ఉపకారం చేసింది. ఒకే కిటికీ నుంచి వస్తున్న గాలి నుంచి మళ్లించి, అనేక కాంతిరేఖల ద్వారాలు తెరిచింది. సోవియట్ పతనం ముందే పసిగట్టి, యిక బెంగలేదనుకొని తన అవతారం చాలించింది. ఇదే నిన్న కురిసిన వెన్నెల వాన. మీకెక్కడైనా ఈ వెన్నెల తడి తగిలితే దాన్ని ఆస్వాదించండి. మరింతమందికి దాన్ని చేర్చండి.

 - కృష్ణమోహన్‌బాబు, 9848023384

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top