కొడుకు సంతోషమే తండ్రికి బలం

కొడుకు సంతోషమే తండ్రికి బలం - Sakshi


శివుడిలా తండ్రి జ్ఞానాన్నిస్తాడు. తండ్రిని మించిన గురువు లోకంలో లేడు. తండ్రి పక్కన కూర్చుని సమకూర్చుకున్న జ్ఞానం అద్భుతంగా ప్రకాశిస్తుంది. విద్య విషయంలో కొరతంటూ ఏదయినా ఉందంటే – అది తండ్రి లేకపోవడమే. చదువుకున్నవాడు తన కొడుకుని బాగా చదివించాలని కోరుకుంటాడు. చదువురానివాడు కూడా తన కొడుకు బాగా చదువుకుని గొప్పగా బతకాలని కోరుకుంటాడు. ముఖ్యంగా చదువుకోని తండ్రి తాను ఆరుగాలం కష్టపడితే వచ్చిన డబ్బుపెట్టి కొడుకుని చదివిస్తాడు.


ఆ కొడుకు అంత ప్రయోజకుడై మంచి ప్యాంటు, షర్టు వేసుకుని, టై కట్టుకుని, బూట్లు వేసుకుని కారు దగ్గరకి వెళ్ళిపోతుంటే తండ్రి వెళ్ళి డోరుతీసి పట్టుకుని వాడలా కారులో వెళ్ళిపోతుంటే చూసుకుని ఎంత మురిసిపోతాడో ! తనేం కట్టుకోలేదు, తనేం చుట్టుకోలేదు. పరమేశ్వరుడికి ఎంత సహనం ఉంటుందో రక్షకత్వంలో తండ్రికి అంత సహనం ఉంటుంది. ఆ ఓర్పులేనినాడు సుఖమన్నమాట లేదు జీవితంలో. దీనినే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అద్భుతంగా చెప్తాడు – అన్నం తినకుండా మారాం చేస్తున్న కొడుకుని పాలబువ్వ తిందువుగాని రారా అని బతిమిలాడుకుంటుంటే... వాడు వినకుండా అరటిపండు ఒలిచిపెడితే తింటానంటే... తల్లిదండ్రులకు ఆకలేస్తున్నా చంపుకుని ఎండయినా, వానయినా, అర్ధరాత్రయినా, అపరాత్రయినా బయటకు వెళ్ళి నానాతంటాలుపడి అరటిపండు తెచ్చి తినిపిస్తారు.


వాడది కడుపునిండా తిని పడుకున్న తర్వాత వాళ్ళు తింటారు. బాల్య చాపల్యం, తెలియనితనం.. అది సహించాలంటే ఎంతో ఓర్పుండాలి.  ఎంత ఆకలేస్తున్నా సరే, ముందు మనం తిందాం, తర్వాత బిడ్డలకు పెడదాం అనుకునే తల్లిదండ్రులుండరు లోకంలో. రామయణంలో అయోధ్య ప్రజలు రాముని గురించి చెబుతూ – ‘రాముడు అమ్మలా ఏడుస్తాడు, తండ్రిలా సంతోషిస్తాడు’ అంటారు. అమ్మలా ఏడవడమేమిటి, తండ్రిలా సంతోషించడమేమిటి!? చిన్నప్పుడెప్పుడో తన వల్ల జరిగిన ఏ నిర్లక్ష్యం కారణంగానో బిడ్డకు ఓ చిన్న దెబ్బతగిలింది. అదప్పుడే నయమైపోయింది. ఇప్పుడు వాడు పెద్దవాడయినా, చిన్నప్పటి సంఘటన గుర్తుకు తెచ్చుకుని తల్లి పొగిలి పొగిలి ఏడుస్తుందట.


అలాగే తండ్రి – తనుచేస్తున్న ఉద్యోగానికి వలంటరీ రిటైర్మంట్‌ పెట్టేశాడు. పిఎఫ్‌ అమ్మేస్తాడు. ఆ డబ్బంతా పెట్టి కొడుకుని చదివించాడు. వాడు విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు కార్లు కొన్నాడు. ఆ విషయాలన్నీ తండ్రికి చెబుతుంటాడు. ఇక్కడ ఈయన ఆరోగ్యం బాగుండదు, డాక్టర్లు కూడా జాగ్రత్తని హెచ్చరికలుచేస్తున్నా ‘నాన్నగారూ, మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అని కొడుకు అడిగితే ‘ఆ, బాగుంది’ అని అంటాడు తప్ప అసలు విషయం చెప్పడు.


చెపితే వాడు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఖర్చుచేసుకుని వచ్చేస్తాడేమో, మహా అయితే మరో నాలుగేళ్ళు బతుకుతానేమో, దానికి లక్షలకు లక్షలు వాడి డబ్బు ఖర్చయిపోతుందేమోనని ఆలోచిస్తాడు తప్ప, శరీరం వదలిపెట్టడానికి ఇష్టపడతాడు తప్ప కొడుకు డబ్బుతో బతకడానికి, కొడుకుని కష్టపెట్టడానికి ఏ తండ్రీ ఒప్పుకోడు. కొడుకు సుఖపడుతున్నాడు...చాలు.. అదే తండ్రికి సంతోషం. కొడుకుకు ఉన్నది లాక్కోవాలని తండ్రి ఎప్పుడూ  కోరుకోడు. తండ్రి అంత ఆర్తితో, అంత ప్రేమతో ఉంటాడు. పెళ్ళిలో స్నాతకోత్సవానికి ముందు నాందీశ్రాద్ధం అని పితృదేవతలను ఆశీర్వచనం కోసం పిలుస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top