మాకు ఈ చెడ్డపేరు వస్తుందని అప్పుడే తెలుసు!

మాకు ఈ చెడ్డపేరు వస్తుందని అప్పుడే తెలుసు!


 అలాంటి న్యూస్ వినాల్సి వస్తే... ఫీలవకు అన్నారు! 


- నీరజ, రంగనాథ్ పెద్ద కుమార్తె


తెలుగు ప్రేక్షకులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ‘రంగనాథ్ గారేంటి? అలా చేయడం ఏంటి?!’  రంగనాథ్ పిల్లలూ ఆ షాక్‌లో నుంచి బయట పడలేదు.  ‘నాన్నగారేంటి? ‘అలా’ వెళ్లిపోవడం ఏంటి?!’ రంగనాథ్... విమానం ఎక్కరు. భయం! బస్సూ ఎక్కరు.  భయం! అంత భయం ఉన్నవారు.. ఇంత ధైర్యం ఎలా చేశారు? డెస్టినీ..!?! ఏ పరిస్థితులు ఆయన్ని ఈ విపరీతానికి ప్రేరేపించాయి? అందరూ ఉన్నా...తనకు ఎవరూ లేరనుకున్నారా? ఉన్నవారికి తను లేకున్నా ఫరవాలేదనుకున్నారా? ఎన్నో ప్రశ్నలు. మరెన్నో సందేహాలు.  సమాధానాల కోసం ‘సాక్షి ఫ్యామిలీ’... రంగనాథ్ పిల్లల్ని కలిసింది. వారి బాధను షేర్ చేసుకుంది.

 


 


 


(రంగనాథ్ చివరి సంతకం)

‘‘నాన్న గారు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం నాకు ఇప్పటికీ మింగుడుపడట్లేదు. ఇంకా షాక్‌లోనే ఉన్నా. అందరూ వచ్చి పలకరించడం, నాన్న గారి గురించి మాట్లాడడంతో మళ్ళీ మళ్ళీ ఆయనే గుర్తుకొస్తున్నారు. చెల్లెలు, తమ్ముడి కన్నా నాన్న గారికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన ఉరేసుకుని ఉన్న దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు.



 ఆయనిలా చేసుకోవడానికి కారణం అర్థం కావడం లేదు. కనీసం నోట్ అయినా రాసి ఉంటే తెలిసేదేమో, అదీ లేదు! సాధారణంగా ఆయన ఏ మాత్రం డల్‌గా ఉన్నా నేను కనిపెట్టేస్తా. ఈ దుర్ఘటన జరగడానికి రెండు రోజుల ముందు కూడా కలిశా. కానీ, ఆయన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడే మూడ్‌లో ఉన్నారని గ్రహించలేకపోయా. ఎన్నడూ లేనిది నుదుట బొట్టు పెట్టుకొని, కనిపించారు. ఏదో దేవుడి మీద భక్తి, ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నారనుకున్నా. అదీ మంచిదేలే అనుకున్నాను. కానీ, ఇలా చేస్తారనుకోలేదు.

 

 నాన్నగారికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. మేము ఏ రోజూ ఆర్థికంగా ఆయన్ని ఇబ్బందీ పెట్టలేదు. ఆయన కూడా ‘నాకున్నది చాలు’ అనేవారు. ఆయనకు తృప్తి ఉండేది. సినిమాల్లో, టీవీలో పాత్రల కోసం కూడా ఆయన వెంపర్లాడింది లేదు. అవకాశాలు వచ్చినా నాన్న గారికి ఓపిక పోయింది. ‘ఎవరి కోసం చేయా లమ్మా! ఎవరి కోసం సంపాదించాలమ్మా!’ అనేవారు. కానీ, మేమే ‘అలా కాదు నాన్నా! డబ్బు కోసం కాదు. సెట్స్‌కెళ్ళి నటిస్తుంటే నీకు ఉత్సాహంగా ఉంటుంది. తెలిసినవాళ్ళందరితో కలవచ్చు. మాట్లాడుకోవచ్చు’ అని ఎంకరేజ్ చేసేవాళ్ళం. నటిస్తూ ఉంటే పనిలో పడి, ఒంటరితనం పోతుందని అలా చెప్పేవాళ్ళం. కానీ, ఆయనకు ఎక్కడో ఆసక్తి పోయింది.  

 

 హైదరాబాద్‌లో మా ఇంటికెదురుగా ఉన్న బ్యాంక్‌లో నాన్న గారికి ఖాతా ఉంది. డబ్బులు కావా లంటే, అక్కడికే వచ్చేవారు. అక్కడికి ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఏది ఉంటే, అది తినడానికి పెట్టేదాన్ని. ఆకలి లేకపోతే, ‘వద్దమ్మా’ అనేవారు. యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళేవారు.

 

 పిల్లలందరినీ పద్ధతిగా పెంచారాయన. ఎవరి మీదా ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కూతురి దగ్గర అల్లుడి ఇంట్లో ఉండడం బాగుండదను కొనేవారు. ‘నేను అల్లుళ్ళ దగ్గర ఉండలేనమ్మా’ అని చెప్పారు. తమ్ముడి భవిష్యత్తు దృష్ట్యా బెంగుళూరులో వాడు ఉద్యోగం చేయడానికి సరే అన్నారు. ‘మీకెక్కడ, ఎలా హ్యాపీగా ఉంటుందనిపిస్తే, అలాగే ఉండండి నాన్నా’ అనేవాళ్ళం. ఆయన విడిగా ఉంటానంటే సరేనని ఒప్పుకున్నాం. కానీ, అది చివరకు ఎదురు తంతుందనీ, ఆయనను ఒంటరిగా వదిలేశామన్న నింద మోయాల్సి వస్తుందనీ నేను ఊహించలేదు.  

 

 మా నాయనమ్మ కర్నూలులో ఉంటుంది. ఆమె ఫోటో ఈ మధ్యే మా బాబాయ్ కూతురు వాట్సప్‌లో పంపింది. బాగా వృద్ధురాలైన ఆమెకు వినికిడి తగ్గింది. మనుషుల్ని కూడా గుర్తుపట్టట్లేదు.

 

 ‘రంగనాథ్’ అని మాత్రం కొడుకు గురించి అంటూ ఉంటుంది. నాయ నమ్మ ఫోటో చూశాక, ఆమెకు ఏదో అయినట్లు నాన్న గారికి పీడకల వచ్చిందట. నాయనమ్మను చూసి వస్తానని నెల న్నర క్రితం అప్పటికప్పుడు కర్నూలె ళ్ళారు. ఒకటిన్నర రోజు లక్కడే ఉండొచ్చారు. అప్పుడూ ఏమీ అనలేదు. నాన్న గారికి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండైన నందా అంకుల్ గూడూరులో ఉంటారు.

 

 సెప్టెంబర్‌లో ఆయన పుట్టిన రోజు కూడా బాగా చేశారు. కనీసం నందా అంకుల్‌తో కూడా నాన్న గారు తన బాధేమిటో చెప్పలేదు. సహజ మరణ మైతే కొంత కాలానికైనా సర్దు కుంటామేమో కానీ మమ్మల్ని అనాథల్ని చేసి, ఇలా ఆత్మహత్యకి పాల్పడడం జీర్ణించు కోలేకపోతున్నాం.



 అమ్మ అంటే నాన్న గారికి బాగా ఎటాచ్ మెంట్. ప్రమాదవశాత్తూ మేడ మీద నుంచి కిందపడి, అమ్మ మంచానికే పరిమితమై పోతే ఆమె కన్నుమూసేవరకు పధ్నాలుగేళ్ళపాటు పసిపిల్లలా చూసుకున్నారు. మంచాన పడ్డ మా అమ్మను చూసుకోవడానికి అప్పట్లో పనిమనుషులు కూడా దొరికేవారు కారు.

 

  పెళ్ళి అయిపోయాక, నేనూ వచ్చేశా. మా తమ్ముడు చదువుకొంటూ ఉండేవాడు. నాన్న గారు వాళ్ళు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయ్యాక కూడా చాలామంది పనిమనుషుల్ని మార్చాల్సి వచ్చింది. చివరకు ఇప్పుడున్న మీనాక్షి దొరికింది. ఆమె చాలా మంచిది. అప్పట్లో మా అమ్మగారికి ఎంతో చేసింది. అమ్మ పోయాక నాన్నను చూసుకోవడానికి కూడా వేరెవరో ఎందుకని నమ్మకస్థురాలైన మీనాక్షినే పెట్టాం. అమ్మనీ, తననీ బాగా చూసుకున్న మీనాక్షికి ఏమైనా చేయాలనే నాన్న గారు ఆ రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ల డబ్బులు (రూ. 5 లక్షలు) ఆమెకిమ్మని రాశారు.

 

 నాన్న గారికి మొదటి నుంచీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆర్థికంగా ఇంకా బాగుండి ఉంటే, సంఘానికి చాలా చేయాలని ఉండేది. ఇంట్లో ఉంటే ఉదయం ఎప్పుడూ టీవీలో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ పెడతారు. అవే చూస్తుంటారు. సొసైటీలో జరుగుతున్న దారుణాలు చూసి, కథలు, కవితల రూపంలో స్పందిస్తారు. ‘సమాజం ఎటుపోతోంది! బంధాలకూ, బాంధవ్యాలకూ చోటు లేకుండా పోయింది’ అని బాధపడుతుండేవారు.

 

ఆలుమగల గురించి ఆయన రాసిన కవిత్వం చదివి, అయిదేళ్ళ క్రితం విడిపోయిన జంట మళ్ళీ కలిసిందట. ఆ సంగతి వాళ్ళే నాన్న గారికి ఫోన్ చేసి చెప్పారు. అది తెలిసి ఆయన ఎంత సంతోషించారో చెప్పలేం! ఆ సంగతి మా అందరితో పంచుకున్నారు. (పొంగుకొస్తున్న దుఃఖంతో...) అందరికీ సాయపడా లనే స్వభావం ఉండి, అన్ని కవిత్వాలు రాసి, అంత ఫిలసాఫికల్‌గా ఉండే ఆయన చివరకిలా చేసుకొని తీరని బాధ మిగిల్చారు. హి హ్యాజ్ టేకెన్ ఎ రాంగ్ స్టెప్. ఈ శోకం నుంచి, ఈ షాక్ నుంచి మేము, మరీ ముఖ్యంగా నేను ఎప్పటికీ తేరుకోలేనేమో!’’

 

  అమ్మ పోయాక అప్పుడప్పుడు ‘ఇంకెందుకు నేను’ అనే వాళ్ళు. అయితే, నేను చాలా సెన్సిటివ్. పైగా హార్ట్ పేషెంట్‌ని. అందుకే నా గురించి ఆలోచించేవారు. ఆరు నెలల ముందో, ఏడాది ముందో ఒకసారి- ‘నేనేదైనా చేసుకున్నట్లు న్యూస్ వస్తే ఫీలవకు! బెంగపెట్టుకోకమ్మా!’ అన్నారు. నేను షాకైతే, ‘ఏదో ఒకరోజు అంతా పోవాలి కదా!’ అని సర్దారు. తర్వాత సర్దుకున్నారు. ‘ఏదో మూడ్‌లో అన్నారులే... చాలా రోజులైందిగా’ అనుకున్నా. కానీ, ఉన్నట్టుండి ఇలా చేసుకుంటారనుకోలేదు.

 

♦  మీ నాన్న గారి మరణంతో మీ జీవితంలో వచ్చిన మార్పు?

రంగనాథ్ ఏకైక కుమారుడు నాగేంద్రకుమార్: షాకిం గ్‌గా ఉంది. బెంగుళూరులో జీవితం తలకిందులైంది. మారిన పరిస్థితుల్లో కొత్త పాత్రకు సిద్ధం కావాలి. హైదరా బాద్ షిఫ్టై, మొత్తం వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది.


♦  ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?

 అలాంటివేమీ లేవు. హి ఈజ్ ఏబుల్ టు మెయిన్‌టైన్ హిమ్‌సెల్ఫ్. ఆయన ఏ రోజూ మమ్మల్ని పైసా అడగలేదు. ‘నాన్నా! డబ్బులు ఏమైనా కావాలా’ అని అడిగితే కూడా ‘నాకేమీ అక్కర్లేదు. మీరు బాగుంటే అదే చాలు’ అనేవారు. అవసరమైతే మాకే ఆయన డబ్బులు ఇచ్చేవారు. మాకే కాదు... బయటవాళ్ళకి - చదువుకోవడానికి కష్టపడుతున్న వాళ్ళకీ, పిల్ల పెళ్ళి చేయలేక ఇబ్బందిపడుతున్నవాళ్ళకీ ఆయన వేలు, లక్షల్లో సాయం చేసిన సంఘటనలున్నాయి. కాకపోతే, కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియ కూడదనేవాళ్ళు. నైతికంగానూ అండగా నిలబడేవాళ్ళు కానీ, ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. ఒక్కమాటలో హి ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. అహంకారం, పొగరు లేవు. ఎదుటివాళ్ళను ఎప్పుడూ బాధపెట్టేవారు కాదు. 

 

♦   నాన్నగారు చనిపోయారనే వార్త మీకెలా తెలిసింది?

 మేము వేరేవేరే ఊళ్ళలో ఉంటున్నాం. హైదరాబాద్‌లో నాన్న గారుంటున్న ఇంటికి దగ్గరలో మా పెద్దక్క నీరజ ఉంటోంది. మా పెద్దక్క బెంగుళూరులోని మా చిన్నక్క శైలజకు ఫోన్ చేసి, విషయం చెప్పింది. చిన్నక్క నాకు చెప్పింది. తెలియగానే హడావిడిగా బయలుదేరాం.

 

మీ నాన్న గారితో ఆఖరుసారిగా ఎప్పుడు మాట్లాడారు?

 గత నెల (నవంబర్) మాట్లాడా. నాన్నగారు చనిపోవ డానికి రెండు రోజుల ముందు కూడా హైదరాబాద్ వచ్చి, ఆయనని చూడాలనిపించింది. ఆ మాటే మా వాళ్ళతో అంటూ వచ్చా. కానీ, మా ఆవిడ పేషెంట్. ఆవిడను కూడా చూసుకోవాలి. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది.

 

♦  కన్నతండ్రితో నెల రోజుల క్రితం మాట్లాడారా!?

 మేమెక్కువగా ఆయనను ఫోన్‌లో విసిగించం. ఎందు కంటే, ఆయనెప్పుడూ ఏదో పనిలో ఉంటారు. ఉదాహర ణకు, ఆ మధ్య పుట్టినరోజుకు ఫోన్ చేస్తే, ఆయన అనాథా శ్రమంలో అన్నదానంలో ఉన్నారు. మరొకసారి ఫోన్ చేస్తే, ఏదో సభలో ఉంటారు. కొన్నిసార్లు కథలు, కవిత్వాలు రాసుకొనే మూడ్‌లో ఉంటారు. మరికొన్నిసార్లు రాత్రివేళ ఆయన తొందరగా నిద్రపోతారు. సాయంత్రం మూడు, నాలుగు గంటలు ఆయన ఫోన్ తీయలేదంటే, సీరియస్‌గా టెన్నీస్ ఆడుతూ ఉండి ఉంటారని అర్థం. అందుకే, ఉయ్ డోన్ట్ నో వెన్ టు కాల్ హిమ్. ఫోన్ చేస్తే మూడు రింగుల య్యాక కూడా ఆయన తీయలేదంటే, బిజీగా ఉన్నారని పెట్టేస్తాం. ఆయనే మళ్ళీ మాకు కాల్‌బ్యాక్ చేస్తారు.

 

మీరెందుకని మీ నాన్న గారితో ఉండట్లేదు?

గతంలో నేను, మా ఆవిడ, మా అబ్బాయి - మేమంతా అమ్మానాన్నలతో కలసి హైదరాబాద్‌లోనే గాంధీనగర్‌లోనే ఉండేవాళ్ళం. కానీ అమ్మ ఉన్నప్పుడు ఆమెను చూసుకోవడంతో, ఆమె పోయిన తరువాత ఒంటరితనంతో నాన్నగారికి స్ట్రెస్ ఉండేది. హీరోగా వెలిగిన ఆయనను మామూలు మని షిలా అబ్బాయిని చూసుకోమనీ, ఇంటి పని చూడమనీ చెప్పలేం! ‘వయసు మీద పడుతోంది, ఓపిక లేద’ని ఆయనా ఇష్టపడ లేదు. అప్పటి దాకా అమ్మను చూసు కున్న ఆయన్ని మళ్ళీ మా బరువు బాధ్యతలతో ముంచేయడం సరికాదు. ఆయన స్వేచ్ఛగా ఉండడా నికి ఇష్టపడ్డారు. నేనూ ఉద్యోగ రీత్యా బెంగళూరు మారా. దానివల్ల ‘ఆయన్ని వదిలేశారు. చూసుకోవడం లేద’ని మాకు చెడ్డపేరొస్తుందని అప్పుడే తెలుసు. కానీ, ఆయన ఇష్టాన్ని గౌరవించాం.

 

యాక్సిడెంటై మంచానపడ్డ భార్యను ఆయన పధ్నాలుగేళ్ళ పాటు చంటిబిడ్డలా సాకడం సామాన్య విషయం కాదు!

 సేవ చేయాలనే మనసున్నా, అలా చేయడానికి ధైర్యం కూడా ఉండాలి. అది ఎంత మందికుంటుంది! పనిమనిషి పక్కన లేకపోతే, ఒంటికీ, రెంటికీ వెళితే శుభ్రం చేయడం, భార్యని పసిబిడ్డను చూసుకున్నట్లు చూసుకోవడం కష్టం. అవన్నీ నాన్నగారు చేశారు. పైగా పేషెంట్‌కు మన కష్టం తెలియనివ్వకుండా, విసుక్కోకుండా, నవ్వుతూ చేశారు.

 

రంగనాథ్ గారికి మీరెంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు?

మేము ముగ్గురం. మా పెద్దక్క నీరజ హౌస్‌వైఫ్. హైదరాబాద్‌లోనే ఉంటుంది. పెద్ద బావ గారు ఫార్మస్యూ టికల్ కంపెనీలో చేస్తారు. చిన్నక్క శైలజ బెంగుళూరులో కాలేజ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్. చిన్న బావగారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీర్. నేను, మా ఆవిడ, అబ్బాయి (అగస్త్య సాయిరిత్విక్) బెంగుళూరులో ఉంటాం.

 

ఇంతమంది ఉన్నా, తన పక్కన ఎవరూ లేరని ఆయన...

 (మధ్యలోనే..) ‘ఐ నీడ్ సమ్ స్పేస్’ అని ఆయన న్నారు. ఆయన అలా బలవంతం చేయబట్టే, స్వేచ్ఛగా వదిలేశాం. ‘వియ్ హ్యావ్ టు ఫేస్ దిస్ డే’ అని తెలిసినా సిద్ధపడ్డాం. తొమ్మిదో తరగతి చదువుతున్న మా పెద్ద మేనల్లుడే (పెద్దక్క కొడుకు శశాంక్) నా స్థానంలో ఇక్కడ మా నాన్న గారి దగ్గరకు తరచూ వచ్చి, ‘తాతా! ఎలా ఉన్నా’వని అడుగుతుండేవాడు. పెద్దక్క వచ్చి ఆయన క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని కనుక్కునేది.

 

హీరోగా వెలిగిన నాన్నగారు చిన్న వేషాలూ అరుదైన పరిస్థితిలో బాధ, డిప్రెషన్ ఏమైనా మీతో వ్యక్తంచేసేవారా?

 డిప్రెషన్ అంటూ చెప్పింది ఏమీ లేదు. ‘హీరోగా వెలిగినా, కాలంతో పాటు మారడానికి తగినంత వర్క్ చేయలేదేమో’ అని అంటూ ఉండేవారు. ‘డ్యాన్స్‌లు, ఫైట్స్ లాంటి  వర్క్ చేయలేదు. చేసి ఉంటే, చిరంజీవి తరంలో కూడా నిలబడి ఉండేవాణ్ణి’ అనేవారు. కానీ, ఆయనకు అసంతృప్తి లేదు. ‘నాకు రావాల్సినదాని కన్నా ఎక్కువే వచ్చింది’ అనేవారు. పదేళ్ళకోసారి మార్పు వస్తుంది. కొత్తనీరు వచ్చినప్పుడు హుందాగా వెనక్కి తగ్గడం నేర్చుకోవాలనేవారు. హీరో శోభన్‌బాబు లాంటి వాళ్ళు చెప్పినమాటల్ని గుర్తుచేసేవారు. హీ నోస్ ది ఫేడింగ్ ఎవే ఆఫ్ ది ఫేమ్. హి యాక్సెప్టెడ్ ఇట్ విత్ డిగ్నిటీ.



సినిమా రంగంలో ఆయనకు మంచి స్నేహితులు లేరా?

లేకేం! మద్రాసులో ఉన్న రోజుల నుంచి శరత్‌బాబు, చలపతిరావు, శారద లాంటివారందరూ ఫ్యామిలీ మెంబర్సే. అల్లు అరవింద్, చిరంజీవి, కోట శ్రీనివాసరావు గారు లాంటి చాలామంది సన్నిహితులు. గిరిబాబు గారైతే వెరీక్లోజ్. అందరితో ఫోన్‌లో టచ్‌లో ఉండేవాళ్ళు.

 

కానీ, ఆయన ఊళ్ళకు, విదేశాలకు వెళ్ళడం తక్కువే కదూ!

 అవును. తెలుగు సంఘాల కార్యక్రమాలకు అమెరికా రమ్మనమని శరత్‌బాబు లాంటివాళ్ళు అడిగేవారు. కానీ, నాన్న గారు ఆసక్తి చూపించేవారు కాదు. పైగా, విమాన ప్రయాణమంటే మహా భయం. చివరికి బస్ జర్నీ కూడా! ఆల్వేస్ ట్రైన్ జర్నీనే! 1970ల చివరలో ‘లవ్ ఇన్ సింగ పూర్’లో చేస్తున్నప్పుడు తప్పనిసరై, విమానంలో వెళ్ళారని నాన్న గారి బెస్ట్ ఫ్రెండ్ నందా అంకుల్ చెబుతుంటారు. ఒకసారి మద్రాసులో ఉండగా నెల్లూరులో సన్మానానికి వెళ్ళాలంటే రైలు మిస్సయిందట. బలవంతాన బస్సులో పంపిస్తే, ‘క్షేమంగా చేరగానే ఫోన్ చేస్తా’ అన్నారట!

 

చనిపోవడానికి ముందు ఇటీవల ఆయన ఎటూ వెళ్ళలేదా?

 తాత, నాయనమ్మలకు అయిదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. నాన్న గారే అందరిలోకీ పెద్ద. మా నాయనమ్మ జానకీదేవి రిటైర్డ్ స్కూల్‌టీచరైన బాబాయ్ దగ్గరుంటుంది. చనిపోవడానికి నెలన్నర ముందు నాన్న గారు కర్నూలు వెళ్ళి, కన్నతల్లిని చూసొచ్చారు. ఆమె 88 ఏళ్ళ వృద్ధురాలు. మనం చెప్పేది విని అర్థం చేసుకొనే స్థితిలో లేదు. తట్టుకో లేదని నాన్న పోయినట్లు ఇప్పటికీ చెప్పకుండా దాచాం.

 

ఛాన్సుల్లేక కుంగిపోయినా, అది మీ దగ్గర దాచారేమో?

 లేదండీ! ఆ మధ్య ‘గోపాల గోపాల’లో నటించారు. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలు’లోనో, మరేదోనో టీవీ సీరి యల్‌లోనో కూడా నటించారట. అవకాశాలు లేవని ఆయన అనడం, అనుకోవడం మేము వినలేదు.

 పూజగూడు దగ్గర ‘డెస్టినీ’ అని రాసి ఉరిపోసుకున్నారే... ‘తలరాత’ అనే అర్థంలో ‘డెస్టినీ’ రాశారేమో!

 

పనిమనిషి మీనాక్షికి డిపాజిట్లు ఇమ్మని రాయడం గురించి?

 మీనాక్షి నమ్మకంగా, సిన్సియర్‌గా పనిచేసిన ఆవిడ. దగ్గరలోనే ఆసుపత్రిలో ఆయమ్మగా పనిచేసేది. 2006 నుంచి ఇంట్లో అమ్మకు సేవలు చేసింది. అమ్మ పోయాక, నాన్న గారి బాగోగులు చూసింది. భార్యనూ, తననూ తల్లిలా చూసుకున్న ఆమెకు పోయే ముందు ఏదైనా చేయాలని నాన్న గారు అనుకోవడం తప్పా? ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తోందని తెలిసి, ఆమెకు కూడా వీలుంటే ఇవ్వమని మంత్రికి ఫోన్ చేశారు. 70వ ఏట ఉన్న వ్యక్తి చనిపోయే ముందు పెద్ద మనసుతో తోటివారి గురించి ఆలోచిస్తే, దాన్నీ కొందరు అనుమా నించి, తప్పుపడితే ఎలా? మనం ఏ సమాజంలో ఉన్నాం!  

 

భార్య పోయాక ఆయన డిప్రెషన్‌లో జారిపోయారంటారా?

కావచ్చు. ఎక్కడో ఆయనకు ఇతరులతో పోలికొచ్చిం దేమో! ఒంటరితనం, డిప్రెషనొచ్చాయేమో! కానీ, తను స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. ఆయన సంతోషమే మా సంతోషం! అందుకే, ఆయన మానాన ఉండనిచ్చాం. (బాధగా...) చివరకు ‘ఆయన్ని అనాథను చేసేశారు’ అన్న చెడ్డపేరే మిగిలింది. పేపర్లలో, టీవీల్లో ఎవరికి తోచినట్లు వాళ్ళు రాశారు, చెప్పారు. చివరకు అందరికీ సంజాయి షీలు చెప్పుకుంటున్నాం. ఆయన జనం మనిషి కాబట్టి, మాకు ఇది తప్పదు. ఉయ్ హ్యావ్ టు గివ్ ఎక్స్‌ప్లనేషన్!

 - రెంటాల జయదేవ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top