నవలా చిత్రాలకు మధుమాసం


కొన్నేళ్ల క్రితం... నేను జర్నలిస్టుగా పని చేస్తున్న రోజుల్లో... రామానాయుడుగారిని కలవడానికి, ఆయన స్టూడియోకి వెళ్లాను. మా సంభాషణ ముగిసిన తర్వాత నాయుడుగారు బయల్దేరుతుంటే - ఓ రచయిత ఆయన దగ్గరకొచ్చి, తను రాసిన నవల ఇచ్చాడు. ‘చదివి చెబుతా’ అన్నారు రామానాయుడుగారు. ఆ రచయిత వెళ్లిన తర్వాత నేను నాయుడుగారిని అడిగాను. ‘‘సార్, నిజంగానే చదువుతారా?’’ అని. ఆయన నవ్వి, ‘‘నా పనే అది. తప్పకుండా చదువుతా. నచ్చితే సినిమాగా కూడా తీస్తా. సినిమాకి అసలు పెట్టుబడి డబ్బులే కాదు, కథ. రూపాయి (ఆయన దృష్టిలో రూపాయి అంటే కోటి) పెట్టాలన్నా, రూపాయి రావాలన్నా - కథ బాగుండాలి. లేకపోతే ఏమీ చెయ్యలేం’’ అంటూ ఆయనొక సూత్రం చెప్పారు.



కథలు మన దగ్గరికి రావు. మనం వెదుక్కుంటూ వెళ్లాలి. వినాలి, చదవాలి. ఒకటికి రెండుసార్లు వడపోతే పోస్తేగాని, ఓ నిర్ణయానికి రాకూడదు. వచ్చిన తర్వాత, నమ్మిన తర్వాత అందులో అక్షరమ్ముక్క కూడా మార్చకూడదు. ఇదే ఫార్ములా ఆయన జీవితాంతం ఫాలో అయ్యారు. అర్ధ శతాబ్దంలో పలు భాషల్లో ఆయన తీసిన సినిమాల్లో చారిత్రక విజయాలున్నాయి, పరాజయాలున్నాయి. కథని, అందులోని ఎమోషన్స్‌ని ఆయన ఏనాడూ విస్మరించలేదు. అందుకే కేవలం ఓ నిర్మాతగానే మిగిలిపోకుండా, తన జీవితాన్ని, కుటుంబాన్ని నమ్మదగ్గ ఓ బ్రాండ్‌నేమ్‌గా భారతీయ సినిమాలో నిలబెట్టారు. ఆయన రూపొందించిన వాటిల్లో 10 నవలా చిత్రాలు.

 

1. ప్రేమనగర్ (1971)




 ఇండస్ట్రీలో ఉండగలగడమా... కారంచేడు వెళ్లిపోవడమా అన్నంత సందిగ్ధ పరిస్థితుల్లో, అక్కినేని నాగేశ్వరరావుగారి సతీమణి అన్నపూర్ణగారు తను చదివిన ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి నవల గురించి చెప్పారు. అప్పటికి ఒకరిద్దరు నిర్మాతలు ఆ నవలను సినిమాగా తీద్దామనుకుని, ఏవో కారణాల వల్ల వెనకడుగేశారు. రామానాయుడు నవల చదివారు. మరో ఆలోచన లేకుండా సినిమా తీద్దామని నిర్ణయానికొచ్చారు. దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, రచయిత ఆచార్య ఆత్రేయగారితో కూర్చుని - నవలను సినిమాకి అనుగుణంగా మలుచుకున్నారు. నవలకి భిన్నంగా క్లయిమాక్స్ డ్రమటైజ్ చేశారు. ఖర్చు చూస్తే, భారీగా కనబడుతోంది. తేడా వస్తే - పరిస్థితి అగమ్యగోచరం! ‘ప్రేమనగర్’ తాజ్‌మహల్ (సమాధి) అయిపోవచ్చు. భారీ వర్షాల్లో భయపడకుండా సినిమా రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ క్లాసిక్‌గా నిలిచిపోయింది ‘ప్రేమనగర్’. ఈ కథతోనే ఆయన తమిళంలోకి (‘వసంతమాళిగై’ - శివాజీ గణేశన్, వాణిశ్రీ), హిందీలోకి (‘ప్రేమ్‌నగర్’ - రాజేష్‌ఖన్నా, హేమమాలిని) అడుగుపెట్టారు.



2. జీవన తరంగాలు (1973)



రైటర్స్‌కి కమర్షియల్ క్రేజ్ తీసుకొచ్చిన రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణిగారు. ఓ వారపత్రికలో ‘జీవన తరంగాలు’ సీరియల్‌గా వస్తుండేది. పాఠకులు వచ్చేవారం వరకూ ఆగలేకపోతుండేవారు. అందువల్ల ఆ సీరియల్ పేజీలు (ఫారమ్) ప్రింట్ కాగానే మార్కెట్లోకి వస్తుండేవి. వాటిని వేడివేడి పచ్చి మిరపకాయ బజ్జీల్లా పాఠకులు ఎగబడి, ఆ కాసిన్ని పేజీలు పావలాకి కొనుక్కుని, చదువుతుండేవారు. ఓ సీరియల్ నవలకు అవసరమైనన్ని ఆసక్తికరమైన మలుపులు, పాత్రలతో ఈ కథ సాగుతుంది. అప్పటికది మల్టీస్టారర్. శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, వాణిశ్రీ, లక్ష్మి. తమ్ముడి కోసం బలవంతంగా తాళి కట్టిన హీరో - తమ్ముడి కోసం ఎంతో వేదన అనుభవించిన హీరోయిన్ - రసవత్తరమైన డ్రామా. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జీవన తరంగాలు’ను హిందీలో ‘దిల్ అవుర్ దీవార్’, తమిళంలో ‘తిరుమాంగల్యం’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి మొదటి సినిమా), కన్నడంలో మాలాశ్రీతో ‘తవరమనె ఉడగురె (1991)’ పేరుతో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. కన్నడంలో ఈ సినిమా చూసిన దర్శకుడు ప్రేమ్, ఓ పాటలో (తెలుగులో ‘ఈ జీవన తరంగాలలో’ పాట) తెలియకుండానే తల్లి పాడె మోసే కొడుకు క్యారెక్టర్ చూసి, ఆ స్ఫూర్తితో ‘జోగి’ అనే కథ రాసుకుని, సినిమా తీశాడు. సెన్సేషనల్ హిట్. (తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’ పేరుతో వచ్చింది). హిందీలో ‘దిల్ అవుర్ దీవార్’ స్ఫూర్తితో టీవీ సీరియల్ వచ్చింది. తెలుగులో కూడా మొన్నమొన్నటి దాకా ప్రసారమైంది. మరో విశేషం - హీరో కృష్ణంరాజు ఇదే నవలను ‘జీవన తరంగాలు’ అనే టీవీ సీరియల్‌గా నిర్మించారు.



3. చక్రవాకం (1974)



ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రాసిన మరో నవల ‘చక్రవాకం’. నవలగా పాఠకుల ఆదరణ పొందినా, విషాదాంతం కావడంతో సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అంతవరకూ చిన్న చిన్ని పాత్రలు చేసిన రామానాయుడుగారు ‘చక్రవాకం’లో శోభన్‌బాబు అన్నగా ఓ కీలకమైన పాత్ర పోషించారు. పాటలు ఇప్పటికీ హిట్టే.



4. సెక్రటరీ (1976)



యద్ధనపూడి సులోచనారాణిగారి మొదటి పాపులర్ నవల ‘సెక్రటరీ’. ఆరడుగుల అందగాడు. ‘ఆత్మవిశ్వాసం’ ఓ పాలు ఎక్కువైన హీరోయిన్, పొడవాటి కారు - పెద్ద పెద్ద బంగళాలు. ఓ రొమాంటిక్ నవలకు పెద్ద బాలశిక్ష ‘సెక్రటరీ’ నవల. ‘జ్యోతి’ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవల సినిమా తీస్తున్నారంటే - ప్రేక్షకుల్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా అక్కినేని - వాణిశ్రీ, కె.ఎస్. ప్రకాశరావుగారు, ఆత్రేయగారు, కె.వి. మహదేవన్, అన్నింటికి మించి రామానాయుడుగారు. ఆ రోజుల్లో సోషల్ పిక్చర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్ జరిగిన వాటిల్లో ‘సెక్రటరీ’ది మంచి రికార్డ్. సినిమా టైటిల్స్‌లో ఆర్టిస్టుల పేర్ల బదులు, పాత్రల పేర్లే (రాజశేఖరం, జయంతి..) వేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే!



5. ఒక చల్లని రాత్రి (1979)



డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా కె. వాసు దర్శకత్వంలో చంద్రమోహన్, మాధవి జంటగా ‘ఒక చల్లని రాత్రి’ సినిమా నిర్మించారు. భార్యను అనుమానించే ఓ భర్త కథతో తీసిన ఈ సినిమా హిట్ కాలేదు.

 

6. అగ్నిపూలు (1981)



 సీరియల్ నవలలు రాజ్యమేలుతున్న రోజుల్లో యద్ధనపూడి సులోచనారాణి రాసిన డెరైక్ట్ నవల ‘అగ్నిపూలు’. కృష్ణంరాజు ద్విపాత్రాభినయంతో జయప్రద, జయసుధ లాంటి భారీ తారాగణంతో కె. బాపయ్య దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. అయితే అనుకున్నంత విజయం సాధించలేదు. జయప్రద చేసిన స్నేక్‌డాన్స్ పాపులరైంది.

 

7. అహ నా పెళ్ళంట (1987)



రచయిత ఆదివిష్ణు ‘పల్లకి’ వార పత్రికలో రాసిన ‘సత్యంగారిల్లు’ నవల ఆధారంగా తీశారీ సినిమా. ‘రాజేంద్రప్రసాద్, రజని నటించారు. పిసినారితనం గురించి కాళ్లకూరి ‘వరవిక్రయం’ నాటకంలో చూచాయగా ఉంటే, ‘అహ నా పెళ్లంట’ సినిమాకు వచ్చేటప్పటికి పరాకాష్టకు చేరుకుంది. బ్రహ్మానందానికి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమానే. అప్పటి శ్లాబ్ సిస్టమ్‌లో  కనకవర్షం కురిపించిందీ చిత్రం.

 

8. సర్పయాగం (1991)




పరుచూరి సోదరులు సినిమాల్లో బిజీగా ఉండి కూడా కొన్ని నవలలు రాశారు. భరతఖండం భగ్గుమంటోంది (భారతీరాజా ఈ నవల ఆధారంగా సినిమా తీద్దామనుకునేవాళ్లు), ‘నల్లపూసలు’ (శోభన్‌బాబుతో కార్తీకపౌర్ణమి’ సినిమా తీశారు) నవలలు రాసిన తర్వాత, ‘ఉదయం’ వీక్లీలో ‘సర్పయాగం’ రాశారు. ప్రాణాలు పోసే డాక్టర్ కొందరి ప్రాణాలు తీయమని కిరాయి హంతకులను ఆశ్రయించడం ఈ సినిమాలోని ఆసక్తికరమైన అంశం. అది రామానాయుడుగారికి నచ్చడంతో - శోభన్‌బాబు రీలాంచింగ్ ప్రాజెక్ట్‌గా పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించారు. రోజా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందీ సినిమా.

 

9. పెద్ద మనుషులు (1999)



90వ దశకం దాటేటప్పటికి తెలుగులో నవలలకు ఆదరణ తగ్గింది. అయినా కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన ‘శతదినోత్సవం’ నవల ఆధారంగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ‘పెద్ద మనుషులు’ చిత్రం తీశారు రామానాయుడు. సత్యనారాయణ, కోట ‘పెద్ద మనుషులు’గా నటించారు.



10. మధుమాసం (2007)



బలభద్రపాత్రుని రమణి రాసిన ‘నీకూ నాకూ మధ్య’ నవల ఆధారంగా ‘మధుమాసం’ సినిమా తీశారు. చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో సుమంత్, స్నేహ జంటగా నటించారు. నవలల్లో ఉన్న భావం చెడకుండా, చక్కగా తెరకెక్కించారు.

 - తోట ప్రసాద్, సినీ రచయిత

 

మరికొన్ని విశేషాలు...


 

రామానాయుడు గారికి ఇష్టమైన నవలల్లో ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రాసిన ‘శాంతినికేతన్’ ఒకటి. సినిమాగా తీయడం సాధ్యపడలేదు. దాంతో, అపర్ణ (వెంకటేశ్ ‘సుందరకాండ’ హీరోయిన్) నాయికగా టీవీ సీరియల్ తీశారు. అలాగే యద్ధనపూడి రాసిన ‘అభిశాపం’ అనే నవల కూడా ఆయనకు చాలా ఇష్టం. చాలాసార్లు అనౌన్స్‌మెంటు వచ్చి, ఎందుకో కార్యరూపం దాల్చలేదు. రచయిత శ్రీరాజ్ ‘యువ’ (‘విజయ’ చక్రపాణి గారిది) మాసపత్రికలో రాసిన ఓ కథకు బహుమతి వచ్చింది. అదే కథ నాటకమై చివరికి ‘కలికాలం’ సినిమా అయ్యింది. సురేష్ సంస్థలో ‘సూరిగాడు’ సినిమాకు కథ అందించిన తర్వాత శ్రీరాజ్ ఓ స్క్రిప్ట్ రాశారు. అది నాయుడుగారికి ఎంత నచ్చిందంటే - వెంకటేశ్‌తో సినిమా తీయాలని ప్లాన్ చేశారు. జరగలేదు. కొన్నేళ్లపాటు ఆ స్క్రిప్ట్ ఆయన దగ్గర అలానే ఉంది. ఓసారి పాత స్క్రిప్ట్‌లు తిరగేస్తుండగా కనపడింది. వెంటనే ఆ హీరో పాత్రను హీరోయిన్‌గా మార్పులు చేర్పులు చేయించి ‘ప్రేమించు’ సినిమా తీశారు. అది మంచి విజయం సాధించింది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top