మెగా మీటర్

మెగా మీటర్ - Sakshi


కొత్తసినిమా గురూ!

 

సినిమాల్లో ఫైట్ చేయడానికి డూప్‌లుంటారు. రియల్ లైఫ్‌లో డూప్‌లు కుదరవు. ఎవరికి వాళ్లు ఫైట్ చేయాల్సిందే! ఫైట్‌లోనే ఉంటుంది అసలు మజా. ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకోకూడదట! ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకోవాలట! ప్రపంచం మెచ్చిన ఫైటర్... ఆ ‘బ్రూస్‌లీ’ చెప్పింది ఇదే! మరి ఈ ‘బ్రూస్‌లీ’ దాన్ని ఎంతవరకూ పాటించాడు? మెగాస్టార్ స్పెషల్ అప్పీయరెన్స్ కూడా తోడవడంతో... బాక్సాఫీస్ వద్ద మెగామీటర్ గిర్రున తిరిగిందా?!

 

ఎంత పెద్ద ఫైటరూ ఏకకాలంలో రెండు చోట్ల ఫైట్ చేయలేడు. కాని అలాంటి సందర్భం వస్తుంది. విలన్... హీరో తండ్రిని చావు బతుకుల్లోకి నెట్టి మరోవైపు హీరోయిన్‌ని ఇంకోవైపు బంధించి ఎవరిని రక్షించుకుంటావో రక్షించుకో... నీకు పదిహేను నిమిషాలే టైమ్ అంటాడు. ఎంతటి హీరోకైనా ఇది పరీక్షా సమయమే. హీరో సహజంగానే తండ్రి ప్రాణాల కోసం హాస్పిటల్‌కు పరిగెడతాడు. మరి హీరోయిన్ సంగతి? దుండగులు హీరోయిన్ వైపు కదులుతారు. మరో రెండు మూడు నిమిషాల్లోనే ఆమె ప్రాణాలు పోబోతున్నాయి. ఇంతలో ఆకాశం ఫెటిల్మని ఉరిమింది. నేల మీది దుమ్ము ఆమ్మని పైకి లేచింది. హెలికాప్టర్ ప్రొఫెల్లర్ గాలిని చీల్చుతుండగా దుండగులు నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండగా ఒక కాలు డోర్ తెరుచుకుని ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత పూర్తి రూపం.

 

ఎవరది? ఇంకెవరు... మెగాస్టార్...

 సినిమా రంగంలో ఫైటర్‌గా పని చేస్తున్న హీరోకు సహాయం చేయడానికి సాక్షాత్తు మెగాస్టారే ప్రత్యక్షమయ్యాడు.

 హీరోయిన్ నోరు వెళ్లబెట్టి చూస్తోంది. ఆమెను మెగాస్టార్ పలకరిస్తూ ఉండగా ఒక దుండగుడు కత్తి విసిరాడు. మెగాస్టార్ ఒడుపుగా దానిని పట్టుకున్నాడు. అప్పుడు పంచ్ డైలాగా: జస్ట్ టైమ్ గ్యాప్. టైమింగ్‌లో గ్యాప్ ఉండదు. సాధారణ ప్రేక్షకుడికి సంబరం. హాల్లో కేకలు. అభిమానులకు పైసా వసూల్. సినిమా కథలో హీరో తండ్రిని కాపాడుకోవడానికి తాపత్రయపడుతుంటే నిజ జీవితంలో తండ్రి కొడుకు సినిమాలో కొద్ది క్షణాలపాటు మెరిసి సినిమాకు అదనపు ఊపిరి పోశాడు. చిరంజీవ సుఖీభవ.. సుఖీభవ.



పేరులో ఏముంది?

బ్రూస్ లీ 1973లో చనిపోయాడు. అప్పటికి అతడి వయసు కేవలం 32. అంత తక్కువ వయసులో మరణించినా మరణించి ఇన్ని తరాలు గడిచిపోయినా ఆ పేరుకున్న చరిష్మా తరగలేదు. ఆ పేరు వల్లే ప్రపంచ సినిమాలో దేశ దేశాల కుర్రకారులో మార్షల్ ఆర్ట్స్‌కు క్రేజ్ పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. తన పద్దెనిమిదో ఏట జేబులో కేవలం 100 డాలర్లతో హాంగ్ కాంగ్ నుంచి అమెరికా చేరుకున్న బ్రూస్ లీ ఎంతో సంపద, పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో కూడా అంతంత మాత్రం చదువుకుని అంతంత మాత్రం ఆర్థిక నేపథ్యం ఉన్న కొడుకు ప్రాణాలకు ముప్పు ఉండే స్టంట్ మేన్ ఉద్యోగం చేస్తూ కుటుంబ విలువలు అనే సంపదను సొంతం చేసుకుంటాడు. వృత్తిగతంగానే కాదు కుటుంబ సభ్యుల కోసం కూడా ఒక ఫైటర్‌గా పోరాడే యువకుడే ఈ సినిమా హీరో- రామ్ చరణ్.



నేరేషన్ ఎలా ఉంది?

ఒక మంచి కుటుంబం. తండ్రి (రావు రమేశ్), తల్లి (పవిత్రా లోకేశ్), కూతురు (కృతీ కర్బందా), కొడుకు (రామ్ చరణ్)... పక్కన వచ్చి వెళుతూ ఉండే పెదనాన్న (తనికెళ్ల భరణి)... స్టంట్ మేన్‌గా కొడుకు పని చేస్తున్న సినిమా ఫీల్డ్‌లో అతడి స్నేహబృందం (జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి)... వాళ్లను విసిగించే స్టుపిడ్ స్టంట్ హీరో (బ్రహ్మాజీ)... వీళ్లతో ఒక మంచి బేస్ ఈ సినిమాలో పడినట్టయ్యింది. వీటి చుట్టూ కథ కొనసాగించాలంటే చాలా బలమైన కుటుంబ సన్నివేశాలు కావాలి. కాని దాని వల్ల యాక్షన్ మిస్సయ్యే అవకాశం ఉంది. అందుకని ఒక ఊచకోత సన్నివేశాన్ని పెట్టి దాని చుట్టూ ఒక సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. ఆ ఊచకోత ఎవరు చేశారు, ఎందుకు చేయించారు, దానికి ఈ కథతో సంబంధం ఏమిటి, అవి హీరోని ఎలా చుట్టుముట్టబోతున్నాయి... ఇవన్నీ ప్రేక్షకులకు ముడి వేస్తూ వెళుతూ కథను నెరేట్ చేశారు. అయితే ఫస్ట్‌హాఫ్‌లో ఉన్న ఆ వేగం, సన్నివేశాల మార్పు సెకండ్ హాఫ్‌లో ఉండుంటే ఇంకా బాగుండేది. బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’లో బ్రూస్ లీ అక్కను హత్య చేస్తారు. ఈ కథలోనూ అక్క పాత్రను చంపి ఉంటే కథ భీతావహంగా ఉండేది. అలా చేయకుండా పాత్రను బతికించినందుకు ప్రశంసించాలి.



ఎవరికెన్ని మార్కులు?

సినిమా మొదటి నుంచి చివరి వరకూ రామ్‌చరణ్ కన్సిస్టెన్సీ మెయింటెయిన్ చేశాడు. డైలాగ్స్‌లో, డాన్సుల్లో, ఫైట్స్‌లో ఫ్యాన్స్‌కు ఏం కావాలో అలా కనిపించే ప్రయత్నం చేశాడు. ‘ఎలగెలగా’, ‘ఇప్పుడు కరెక్ట్ మీటర్‌లో ఉంది’ వంటి చిరంజీవి మేనరిజమ్స్‌ను ప్రదర్శించి అభిమానులను మెప్పిస్తాడు. చిరంజీవి కనిపించే సన్నివేశంలో కూడా తండ్రీ కొడుకులిద్దరూ చెరో గుర్రాన్ని స్వారీ చేసి కాసేపు అభిమానులను అలరించారు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించింది. తెలుగు సినిమాల్లో అందరు హీరోయిన్లూ తింగరి బుచ్చులు కనుక ఈమె కూడా తింగరి బుచ్చిగా మెప్పించే ప్రయత్నం చేసింది. తర్వాతి ఓటు అక్క పాత్రను పోషించిన కృతి కర్బందాకి. డీసెంట్‌గా తన పాత్ర మేరకు పోషించింది. మిగిలిన నటులందరూ తమ శక్తి మేరకు సపోర్ట్ చేశారు. లేట్‌గా వచ్చేది - ‘వెన్నెల’ కిశోర్. ఉగాండాలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ లిండాతో ఉగాండా భాషలో మాట్లాడుతూనే ఇక్కడ జరుగుతున్న సన్నివేశానికి టెన్షన్‌గా రెస్పాండ్ కావడం బాగానే పేలినా ఆ పరిధిని ఇంకా పెంచి వాడుకునే ప్రయత్నం చేయలేదు.



సాంకేతికంగా...

డెరైక్టర్ శ్రీను వైట్ల ఒక కసితో కష్టపడి తీసిన సినిమా ఇది. ‘ఆగడు’ ప్రతికూల రిజల్ట్ చూపాక మరో జనరంజకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది. తెలుగు వాతావరణానికి సరిపడ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నా, నెరేషన్ బోర్ కొట్టకుండా బ్లాక్స్‌గా కథను నెరేట్ చేస్తున్నా - అన్నీ వచ్చిపోయే పాత్రలుగా అయ్యాయా అనే సందేహం వస్తుంది. మరింత కన్విక్షన్‌తో ఎంఫసిస్ పెట్టాల్సిన చోట పెట్టి, ‘ఎస్... ఇది నా స్టేట్‌మెంట్’ అని చెప్పడంలో శ్రీను వైట్ల సంకోచం కొంత కనిపిస్తోంది. అన్ని మసాలాలూ మిస్సవకుండా ఉండాలన్న జాగ్రత్త ఎక్కువ కనిపిస్తుంది. పాటలు కథలో కనెక్ట్ అయ్యాయా, అంతరాయంగా ఉన్నాయా అనేది అర్థం కాదు. కోన వెంకట్ తన హిట్ డెరైక్టర్‌కు ఎక్కువ రిస్క్‌లేని కథను ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘కథలో కంటెంట్ లేకపోయినా క్లయిమాక్స్‌లో అన్నీ ఉండాలి’ వంటి డైలాగ్స్ మెరిశాయి. తమన్ ట్యూన్స్‌లో ‘మీటర్ మీటర్ మెగా మీటర్...’ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అతడు ఎక్కువ శ్రద్ధ పెట్టాడని అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, యాక్షన్... శ్రీను వైట్ల ధోరణిలో కొనసాగాయి. కుటుంబం మధ్య సాగే పాట ఉంటే బాగుంటుందేమో! ఆలోచన చేసుండాల్సింది. మంచి సెంటిమెంట్ సాంగ్‌కు అవకాశం ఉన్న కథ ఇది.



ముక్తాయింపు

కొత్తగా చేసి ప్రేక్షకులను ఒప్పించడం కంటే అంగీకరించిన ధోరణిలో మరింత ఒప్పించడానికి తీసిన సినిమా ఇది. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. దర్శకుడు, హీరో, నిర్మాత (డి.వి.వి. దానయ్య), రచయిత ప్రయత్నలోపం లేకుండా కష్టపడ్డారని సినిమా చూస్తుంటేనే తెలుస్తోంది. అయితే కొంత తాజాదనం, మరికొంత బలమైన కథనం ఉంటే ఈ సినిమా కచ్చితంగా ఎక్కడో ఉండేది. ఇప్పటికి ఇది మొదట అభిమా నుల సినిమా. తర్వాత ప్రేక్షకుల సినిమా.



కథ ఏంటంటే...

భారతీయ సంప్రదాయంలో తోబుట్టువులకు ఉన్న విలువ వేరు. వారికి తమ్ముళ్లో అన్నలో పంచే ఆప్యాయత వేరు. ఈ కథలో కలెక్టర్ కావాలనుకునే అక్క కోసం సర్వం త్యాగం చేసే తమ్ముడు కనిపిస్తాడు. అంతంత మాత్రం సంపాదన ఉన్న తండ్రిని చూసి కలెక్టర్ కావాలనుకున్న అక్క ఆశయాన్ని చూసి తాను కూడా బాగా చదువుకుంటానంటే తండ్రికి ఎక్కడ భారం అవుతుందోనని చదువులో వెనుకబడి అక్కను ముందు వరుసలో నిలబెట్టి కుటుంబ గౌరవాన్ని పై వరుసలో నిలబెట్టడానికి తాపత్రయపడే కొడుకు కథ ఇది. గతంలో చిరంజీవి ‘మగ మహారాజు, విజేత, గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల్లో ఇలాంటి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు కొడుకు రామ్‌చరణ్ కూడా అదే వరుసలో ఈ కథను ఎంచుకుని కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు.

 

మెరిసిన మెరుపులు


రామ్‌చరణ్, రావు రమేశ్‌ల మధ్య ఉండే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉన్నా పైకి వాదులాడుకుంటూ కనిపించడం చాలా ఇళ్లల్లో కనిపించే సన్నివేశాలను జ్ఞప్తికి తెస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వారిద్దరి మధ్య నడిచిన సన్నివేశం బాగా నవ్విస్తుంది. విలన్ ట్రాప్ వల్ల ఇరుక్కుని ఐఏఎస్ కలను నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడబోయే అక్కయ్యతో ఆ ఆత్మహత్య ఆపమని చెప్పే సన్నివేశంలో రామ్‌చరణ్ భావోద్వేగాలను కలిగించే నటనను ప్రదర్శించాడు. ప్రతి మాటలో ‘నిద్ర’ గురించి మాట్లాడే మేనరిజంతో రకుల్ ప్రీత్ సింగ్ అక్కడక్కడ మెరుపులు మెరిపించింది. బ్రహ్మానందానిది అలవాటైన పాత్రే అయినా కొన్ని సన్నివేశాలు ఆయన వల్ల పేలాయి. వీటన్నింటి కంటే ఆమిర్ ఖాన్ పి.కెను పోలిన పాత్రలో ఉన్న రెండు మూడు నిమిషాలు అలీ తెగ నవ్విస్తాడు. మెగాస్టార్ ఫినిషింగ్ టచ్ ఎలాగూ ఫైనల్ టచ్.


 - సాక్షి ఫ్యామిలీ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top