షూటింగ్ లో నమాజు చేయడానికి ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా?

షూటింగ్ లో నమాజు చేయడానికి ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా?


మండే లైట్లు... ముఖాన మేకప్... చూసే కెమెరా... యాక్షన్ కేకలు... కట్ చేసి బయటికొస్తే ఆ నటన వెనుక ఒక మనిషి ఉంటాడు.  విశ్వాసం ఉంటుంది.  మనసులో ఒక పవిత్ర భావన ఉంటుంది.  అలీ, షఫీ, సన... రంజాన్ మాసం ఆచరణలో ఉన్నారు.  ఆ పవిత్ర భావనను మనకు పంచుతున్నారు.



అనాథలకు ఇఫ్తార్ ఇస్తాను - అలీ

రంజాన్ మాసంలో ‘రోజా’ (ఉపవాసం) ఉంటారు కదా... షూటింగ్స్ వల్ల ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందేమో?

ఒక్కోసారి అలా జరిగే అవకాశం ఉంటుంది. ఈసారి అలానే జరిగింది. ఓ సినిమా షూటింగ్ కోసం పాన్ తినాల్సి వచ్చింది. కాదనలేను. వృత్తిరీత్యా తినాల్సి వచ్చింది. చిన్న పానే అయినా తిన్నట్లే కదా. ఈ కారణంగా మూడు రోజులు రోజాకి బ్రేక్.



అలా కూడా చేయొచ్చా?

తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తాం?



రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా షూటింగ్ చేయడం నీరసంగా అనిపించదా?

ఈ మాసంలో మాత్రం నీరసం అనిపించదు. భగవంతుడి కోసం ఉపవాసం చేస్తున్నామనే ఫీలింగ్. భార్యాబిడ్డలు, బంధువులూ అందరి క్షేమం కోసం రోజా ఉంటాం కాబట్టి ఏమీ అనిపించదు. ఉపవాసంతో పాటు రోజు మొత్తంలో ఐదుసార్లు తప్పకుండా నమాజు చేయాలి. అప్పుడే ఆ ఉపవాసానికి ఫలితం ఉంటుంది. భగవంతుడు కూడా ఇష్టపడతాడనే నమ్మకంతో చేస్తాం కాబట్టి చాలా సంతృప్తిగా ఉంటుంది.



మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం అంటే కష్టమే?

ఇక్కడో విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న మొదలైతే వచ్చే ఏడాది 13 రోజులు ముందు మొదలవుతుంది. ఆ వచ్చే ఏడాది పదమూడు రోజుల ముందే వచ్చేస్తుంది. ఆ విధంగా చూస్తే మరో పదేళ్ల వరకూ వేసవి కాలంలోనే రంజాన్ వస్తుంది. వేసవిలో నీళ్లు తాగకుండా ఉండటం కొంచెం కష్టమైన పనే. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇలా వేసవిలో రంజాన్ వచ్చింది. ఇది రెండోసారి.

 


చిన్నప్పుడు రోజా ఉండేవారా?

తొమ్మిది, పదేళ్లప్పుడు అనుకుంటా. ఫస్ట్ టైమ్ రోజా ఉన్నాను. అది కూడా మూడు రోజులే. పదేళ్లు దాటని పిల్లలు చివరి మూడు రోజులు మాత్రమే రోజా ఉండొచ్చు. సౌదీలో అయితే ఐదేళ్ల నుంచే పాటించాలి.

 


మీ కుటుంబంలో అందరూ రోజా పాటిస్తారా?

నా భార్య, అమ్మ, తమ్ముడు, తమ్ముడి భార్య అందరూ ఉంటారు. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే.

 


మామూలుగా మీరు ఇఫ్తార్ విందు ఇస్తుంటారా?

తప్పకుండా. అయితే సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయను. అనాథాశ్రమంలో ఉండే వంద మంది పిల్లల కోసం ఈ నెల 26న విందు ఏర్పాటు చేశాను. విందు ఆరగించిన తర్వాత వాళ్ల పేగు నుంచి ఒక త్రేన్పు వస్తుంది చూడండి.. అదే మా కుటుంబానికి లభించిన ఆశీర్వాదంగా భావిస్తా.

 


పేదలు, కోటీశ్వరులు ఎవరికైనా పండగ ఒకటే..

అది కరెక్టేనండి. మా విషయమే తీసుకోండి. రోజుకి పది రూపాయలు సంపాదించేవాడూ.. రోజూ కోటి రూపాయలు సంపాదించేవాడు.. ఎవరైనా సరే కార్పెట్ మీదే నమాజు చేయాలి. దేవుడి దగ్గర అందరూ సమానమే అనడానికి ఇదొక నిదర్శనం.



పిల్లలకు పుస్తకాలు పంచాను - సన

రంజాన్ మాసం విశేషాలు పంచుకుంటారా?

పవిత్రమైన మాసం. అందరికీ తెలిసిందే. ఎప్పటిలానే నేను ఈసారి కూడా రోజా ఆచరిస్తున్నాను. వర్క్ చేసేటప్పుడు నాకు ఫుడ్ మీద మనసు లాగదు.


షూటింగ్ లొకేషన్లో నమాజు చేయడానికి ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా?

మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది. రంజాన్ మాసం గురించి ఒక్క ముస్లిమ్‌లకే కాకుండా అందరికీ అవగాహన వచ్చింది. ఈ మాసంలో మేం నమాజు చేస్తాం అనే విషయం పెద్దగా తెలిసేది కాదు. దాంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ దొరికేది కాదు. ఇప్పుడు ఆ టైమ్‌కి బ్రేక్ ఇస్తున్నారు. మామూలుగా చంద్రుడు అస్తమించాక మసీదులో సైరన్ మోగుతుంది కదా. మావాళ్లు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెబుతారు. అప్పుడు నమాజు చేస్తాను.


ఈ సీజన్‌లో మీరు పాటించే ఆహార నియమాల గురించి చెబుతారా?

సాయంత్రం చంద్రుడు అస్తమించినప్పట్నుంచీ తెల్లవారుజాము వరకూ ఏదైనా తీసుకోవచ్చు. రోజంతా నీళ్లు తాగం కాబట్టి శరీరం డీ-హైడ్రేట్ అవుతుంది. అందుకే సాయంత్రం డ్రై ఫ్రూట్స్, నిమ్మరసం వంటివి తీసుకుంటా. ఆ తర్వాత నాన్‌వెజ్ తింటాను. తెల్లవారు జాము మాత్రం పండ్లు, ఇడ్లీ, రోటీ, పెరుగు, టీ.. ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటాను.


మూడుపూటలా ఆహారం తీసుకోవడానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారే అడ్జస్ట్ అవుతుందా?

మొదటి వారం రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది. టైమ్ కాని టైమ్‌లో ఫుడ్ తీసుకుంటాం. అప్పుడు ఆకలి అనిపించదు. కానీ, నాలుగైదు రోజుల తర్వాత అలవాటవుతుంది.


మహిళలకు ఉండే సహజమైన ఆ నాలుగైదు రోజుల పరిస్థితిలో రోజా ఆచరిస్తారా?

హిందూ సంప్రదాయంలానే ఆ మూడు రోజుల్లోనూ మేం కూడా పూజలవీ చేయం. రంజాన్ మాసంలో ఆచరించే ఫాస్టింగ్‌ని ఆ నాలుగైదు రోజులు బ్రేక్ చేస్తాం. ఆ తర్వాత మళ్లీ యథావిథిగా రోజా ఆచరిస్తాం.


ఈ మాసంలో సేవా కార్యక్రమాలు చేయడం మంచిదట కదా?

వీలుంటే ఎప్పుడు చేసినా మంచిదే. కానీ ఈ మాసంలో పర్టిక్యులర్‌గా కొంతమంది చేస్తారు. నేను ఇఫ్తార్ విందులు ఇస్తాను. సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను ఏ స్వచ్ఛంద సంస్థలనూ సంప్రతించను. నా కంటి ముందు ఉన్నవాళ్లల్లో ఎవరికి సహాయపడితే బాగుంటుందో చూసుకుని వాళ్లకు చేస్తాను. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలను చదివిస్తుంటాను. లక్కీగా ఈసారి స్కూల్స్ తెరిచే సమయానికే రంజాన్ మాసం మొదలైంది. దాంతో పిల్లలకు పుస్తకాలు, ఇంకా కావల్సినవి ఏర్పాటు చేశాను. అది చాలా సంతృప్తిగా ఉంది.



జకాత్ పాటిస్తాను - షఫీ

రంజాన్ మాసం గురించి మీరు చెప్పదల్చుకున్న విషయాలు?

‘నేను ఎవర్ని? నా భావాలు ఎలా ఉన్నాయి.. నాలో అత్యాశ, అసూయ ఉన్నాయా?’ అని తెలుసుకోవడానికి ఉపయోగపడే మాసం ఇది. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. టోటల్‌గాచెప్పాలంటే ‘ఆత్మ’ను పరిశుద్ధం చేసే నెల ఇది. ఈ నెల మాత్రమే కాదు మిగతా పదకొండు నెలలూ ఇలానే ఉంటే మన జీవితానికి ఏది అవసరమో అది మిగులుతుంది.. ఏది అనవసరమో అది మిగలదు. కరెక్ట్‌గా చెప్పాలంటే ‘పర్సనాల్టీ డెవలప్‌మెంట్’కి ఉపయోగపడే నెల ఇది. ఏడాది మొత్తం ఇది ప్రాక్టీస్ చేయాలి.



భావాలు తెలుసుకోదగ్గ నెల ఇది అన్నారు?

రోజంతా ఉపవాసం చేసినప్పుడు ఆకలి వేయడం సహజం. అప్పుడు ఒక పూట మాత్రమే తిని, మిగతా పూటలు పస్తులుండే పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు మనలో తెలియని ఓ మానవత్వం మొదలవుతుంది. ఇతరుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలనే ఆలోచన ఏర్పడుతుంది. సాటి మనిషికి సహాయపడాలనే తపన కలుగుతుంది. ఉదాహరణకు ‘హజ్’ యాత్ర (మక్కా మసీదు యాత్ర)కి వెళ్లాలనుకున్నప్పుడు ఆ సమయంలో మన కళ్లెదురుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ యాత్రకు అయ్యే డబ్బుతో వాళ్లకు సహాయం చేయొచ్చు. యాత్ర చేసినంత పుణ్యం వస్తుంది. డబ్బురూపంలో కాకుండా వేరే రూపంలో కూడా కొంతమందికి సహాయం అవసరమవుతుంది. అది కూడా చేయొచ్చు.



ఈ మాసంలో కొంత సంపాదనను పేదలకు కేటాయించాలట?

అవును. దాన్నే ‘జకాత్’ అంటారు. కొంత భాగాన్ని కాదు వీలున్నవాళ్లు ఎక్కువ ఇచ్చినా తప్పులేదు.  భగవంతుణ్ణి పూజించడం అంటే ఏంటి? ఇతరులకు సహాయం చేయడమే. రంజాన్ మాసంలో ఉన్న గొప్పదనం ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. ఇతరులను నిందించకూడదు. వీలైనంత పరిశుభ్రంగా ఉండాలి. 30 రోజులు అలా ఉండటంవల్ల మిగతా జీవితంపై ఆ ప్రభావం ఉంటుంది. తెలియకుండానే ఏడాది పొడవునా కల్మషం లేని మనసుతో ఉంటాం.  

- షఫీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top