పేదల గుండెచప్పుడు వినిపించాలి!

పేదల గుండెచప్పుడు వినిపించాలి!


సువార్త



ఆలోచనల ఉత్పత్తి కేంద్రం, యంత్రం మెదడు. అందుకు అదివాడే ముడిసరుకు ‘స్వార్థం’!! తాను ఆరంభించిన దైవరాజ్య నిర్మాణాన్ని అందుకే మెదడుతోగాక, దేవుడిచ్చే ‘పరిశుద్ధాత్మ శక్తి’తో జరపాలని యేసుక్రీస్తు తన అనుచరులను ఆరోహణ సమయంలో ఆదేశించాడు. (అపొ 1:1–8). మెదడెప్పుడూ ‘నీగురించే ఆలోచించుకో’ అంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో పని చేశారు కాబట్టి ఆదిమ అపొస్తలులు ఆస్తులు, డబ్బు జోలికి పోలేదు, అధికారాది ప్రలోభాలకు లోను కాలేదు. చివరికి హతసాక్షులయ్యేందుకూ వెనకాడలేదు. దేవునికి, ప్రజలకు మధ్య అనుసంధాన వ్యవస్థగా దేవుడు లేవీయులను యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులుగా నియమిస్తే కాలక్రమంలో అది పూర్తిగా దిగజారి దౌర్జన్యపూరితమైంది. అందుకే యేసుప్రభువు వారిలాగా ఉండవద్దని, అగ్రస్థానాలు, పీఠాలు, కోరుకోకుండా తమను తాము పూర్తిగా తగ్గించుకొని సాత్వికత్వం, పవిత్రత, నిస్వార్థత కలిగిన పరిచారకులై ప్రలోభాలకు అతీతంగా ఉంటూ పేదలకు సేవచేయాలని ఆదేశించారు (మత్త 23:12).



విషాదమేమిటంటే, యేసుక్రీస్తు ఆనాడు ఖండించిన యాజక వ్యవస్థలాగే, ఈనాటి పరిచారకుల వ్యవస్థ లోనూ విలువలు లోపిస్తున్నాయి. పరిచారకులు పేదలు, బలహీనుల పక్షంగా నిలబడవలసింది పోయి, డబ్బు, విలాసాలు, డాంబికాల వేటలో వారికందనంత ఎత్తుకు ఎదగడమే విజయమని భావిస్తున్నారు. పేదవిశ్వాసులను నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టి, పెద్దకార్లలో వచ్చే ధనికులైన విశ్వాసుల కారు తలుపులు తెరిచే సంస్కృతికి తెర తీశారు. నిరంతరం పేదలు, బలహీనులు, నిర్భాగ్యుల కోసమే తపించి అలమటించిన యేసుక్రీస్తు ‘ఆరాధనాస్థలాలు’ ఇవి ఎలా అవుతాయి? యేసు పేదల ప„ý పాతి అన్నది బైబిలు చెప్పే సత్యం కదా! ఇది అరణ్యఘోష కాకూడదు మిత్రులారా! ఇలా ఆత్మీయంగా, సామాజికంగా కూడా నిర్వీర్యం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది.



పరిచారకుల్లో బోధకుల్లో పవిత్రత, ఆత్మీయ పోరాట పటిమ లోపిస్తే విశ్వాసులు అందుకు పూనుకుని తీరాలి. వేలు, వందలకోట్ల రూపాయలు వేళ్లతో లెక్కపెట్టగలిగినంత మంది దుర్బోధకుల బ్యాంకుల్లో, ఇళ్లలో, లాకర్లలో పేరుకుపోవడం కాదు; కులమత వివక్ష లేకుండా పరిచర్యం చేయగలిగిన వందలాది అనాథాశ్రమాలు, ఆశ్రయకేంద్రాలు, ఉపాధి కేంద్రాలు, ఉచిత విద్యాబోధనా సంస్థలు, ఉచిత ఆసుపత్రులు ఆరంభమయ్యేందుకు ఆ డబ్బు ఉపకరించాలి. చర్చి ఆదివారం నాడు ఆరాధనాస్థలంగానే కాదు, సోమవారం నుండి శనివారం దాకా పేదలు, బలహీనుల పరిచర్య కేంద్రంగా ఉండాలి. ఇది ఎవరో చెప్పేది కాదు, యేసుప్రభువే నిర్దేశించిన విధానం (మత్త 25:31–40). విశ్వాసులంతా ఒకటైతే ఈ దేశంలో పేదరికం అంతర్థానమవుతుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top