ప్రింటు కొట్టు ఇల్లు కట్టు..!

ప్రింటు కొట్టు ఇల్లు కట్టు..! - Sakshi


మనుషుల్లేకుండా ఇల్లు కట్టడం సాధ్యమైతే..?

పగుళ్ల బారిన రోడ్లు... పైసా ఖర్చు లేకుండా వాటంతట అవే రిపేరైతే...?

రహదారులు.. కార్లకు కరెంటు సప్లై చేస్తే?

ఎలా ఉంటుంది? మహా అద్భుతం అవుతుందంటున్నారా?

నిజమే... థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఇంకొన్నేళ్లు పోతే ఇవన్నీ సాధ్యమే!


 

ఒకప్పటి మాట. ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం మట్టి, రెల్లుగడ్డి ఉంటే సరిపోయేది. రోమన్లు కాంక్రీట్‌ను ఆవిష్కరించడంతో పరిస్థితి మారిపోయింది. బోలెడంత మంది కూలీల శ్రమ తోడై అద్భుతమైన భవనాలు రూపొందాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇల్లైనా, స్కై స్క్రాపరైనా, బ్రిడ్జిలైనా... ఇలా ఏ నిర్మాణమైనా కాంక్రీట్ తప్పనిసరైపోయింది. ఇకపై మాత్రం అలా ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. విషవాయు వుగా చెప్పుకుంటున్న కార్బన్‌డైయాక్సైడ్‌నే ఇటుకలుగా మార్చేయడం మొదలుకొని మనుషుల అవసరమే లేకుండా రోబోల సాయంతోనే ఇళ్లు కట్టడం వరకూ అనేకానేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

 

పగుళ్లు మాయం

వానా కాలం వచ్చిందంటే చాలు.. రోడ్లన్నీ పగుళ్లుబారిపోవడం... గుంతలు పడిపోవడం మనం చూస్తూంటాం. ఐదేళ్ల క్రితం రోడ్ ఐల్యాండ్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించాడు. స్మార్ట్ కాంక్రీట్‌ను తయారు చేశాడు. ఈ కాంక్రీట్‌తో వేసిన రోడ్లు పగుళ్లుబారితే... ఎవరూ రిపేర్ చేయాల్సిన అవసరముండదు. కొద్ది సమయం తరువాత పగుళ్లన్నీ వాటంతట అవే మూసుకుపోతాయి. సోడియం సిలికేట్‌తో తయారైన అతిసూక్ష్మమైన గుళికలను కాంక్రీట్‌కు జత చేయడం ఈ స్మార్ట్ కాంక్రీట్  వెనుక ఉన్న కిటుకు. పగులు ఏర్పడినప్పుడు ఈ సోడియం సిలికేట్ గుళికలు ఒకరకమైన ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఈ ద్రవం జిగురులా పనిచేసి పగుళ్లను మూసేస్తుంది. కొంతమంది ఇతర శాస్త్రవేత్తలు సోడియం సిలికేట్ స్థానంలో బ్యాక్టీరియాను, ప్లాస్టిక్ క్యాప్సూల్స్‌ను వాడి ఇదే ఫలితాలను సాధించారు.

 

వైరింగ్, ప్లంబింగ్‌లు కలిపి...

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అంతగా అందుబాటులోకి రాకమునుపు అంటే సుమారు పదేళ్ల క్రితమే అమెరికా శాస్త్రవేత్త బెహ్రోక్ ఖోష్‌నవిస్ కాంటూర్ క్రాఫ్టింగ్ పేరుతో రోబోటిక్ ఇంటి నిర్మాణానికి ఓ వ్యవస్థను తయారు చేశారు. కాంక్రీట్‌ను ఓ గొట్టం ద్వారా బలంగా పంప్ చేయడం ఈ టెక్నాలజీలోని కీలకాంశం. కాంక్రీట్ పొరలను వరుసగా పేర్చుకుంటూపోతే గోడలు తయారవుతాయి. నిర్మాణ సమయంలోనే ఎలక్ట్రిక్ వైరింగ్ మొదలుకొని, ప్లంబింగ్ వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. ఫలితంగా అతితక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుంది. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలను నిర్మించేందుకు ఈ టెక్నాలజీ పనికొస్తుందని భావిస్తున్నారు.

 

బరువు తక్కువ.. శక్తి ఎక్కువ

గాలికంటే తేలికగా ఉంటుంది... కానీ శక్తి మాత్రం ఉక్కు కంటే ఎక్కువే. ఏమిటో చెప్పుకోండి? నానోట్యూబ్‌లు! అవును మీటర్‌లో వందకోట్ల కంటే తక్కువ మందముండే ఈ నానోట్యూబ్‌లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిని నిర్మాణాల్లో ఉపయోగించామ నుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ సైజులోనే సెన్సర్లు కూడా తయారు చేస్తే వాటిని నిర్మాణాల్లో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఉపయోగించుకోవచ్చు.

 

కార్బన్‌డైయాక్సైడ్ ఇటుకలు

ప్రపంచం మొత్తమ్మీద కార్లు, పవర్‌ప్లాంట్ల ద్వారా వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌డైయాక్సైడ్ వాయువు ఎంతో మీకు తెలుసా? దాదాపు 3000 కోట్ల టన్నులు! వాతావరణ మార్పుల ప్రభావాన్ని తప్పించుకునేందుకు ఒకవైపు దీని మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు వాతావరణంలోకి చేరే ఈ విషవాయువునే మన అవసరాలు తీర్చుకునే వనరుగా మార్చేందుకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకడుగు ముందుకేసి  బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవి సాయంతో ఈ వాయువును ఘన పదార్థంగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియ ద్వారా తయారయ్యే కాల్షియం కార్బొనేట్‌ను ఇటుకల్లా వాడటం ద్వారా కార్బన్‌డైయాక్సైడ్‌ను వాతావరణంలోంచి తొలగించడంతోపాటు దాన్ని నిరపాయకరంగా భవనాల రూపంలో నిల్వ చేయవచ్చు.

 

కరెంటునిచ్చే రోడ్లు

రోడ్లపై వెళుతున్నప్పుడు ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ అవుతూంటే....?  భలే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లను వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జ్ చేసుకుంటాం కదా.. అచ్చంగా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది ఈ కార్ల ఛార్జింగ్ కూడా. కాకపోతే ఇందుకోసం రోడ్లన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. న్యూజీలాండ్‌లోని ఓ కంపెనీ ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఇలాంటి ఓ రోడ్డు నిర్మించి విద్యుత్ వాహనాలను ఉపయోగిస్తోంది. రహదారుల్లోనే గాజుతో తయారైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాహనాలకు అందివ్వడం ఈ ప్రాజెక్టులోని కీలకాంశాలు. ఇదిలా ఉండగా రహదారులు పీల్చుకునే సూర్యరశ్మి తాలూకూ వేడిని కూడా విద్యుత్తుగా మార్చి వాడుకునేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వాడటం ద్వారా రోడ్లపై కదిలే వాహనాల కంపనాలను కూడా విద్యుత్తుగా మార్చే టెక్నాలజీలు సిద్ధమవుతున్నాయి.

- గిళియార్

 

ఇల్లు కట్టే ప్రింటర్

త్రీడీ ప్రింటర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. కాగితపు ప్రింటర్ల మాదిరిగా కాకుండా ఇవి వస్తువులను ప్రింట్ చేసి ఇస్తాయి. భవిష్యత్తులో మాత్రం ఏకంగా ఇల్లు మొత్తాన్ని ఈ టెక్నాలజీ ద్వారా నిర్మించుకోవచ్చు. నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ ‘దస్’ ఇప్పటికే ఇలాంటి ప్రింటర్ సాయంతో ఓ ప్లాస్టిక్ ఇల్లు కట్టేసింది కూడా. కామేర్‌మేకర్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన భారీ ప్రింటర్ కొన్ని రోజుల వ్యవధిలోనే లెగో బ్లాక్స్‌ను చేర్చినట్టు ఇంటి గదులను కట్టి, పేర్చింది. మరోవైపు ఓ చైనా కంపెనీ సిమెంట్ కాంక్రీట్‌లను ఉపయోగించి భారీ ఫ్రేమ్‌లను తయారు చేసి... వాటితో గదులను తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన ఇళ్ల ఖరీదు రూ.మూడు లక్షలకు మించకపోవడం గమనార్హం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top