మీకూ నచ్చుతుంది! అంత లేదు : ట్రంప్‌

హాలీవుడ్‌ నటి    మెరిల్‌ స్ట్రీప్‌

 


మూడుసార్లు ఆస్కార్‌లు వచ్చాయంటే.. నాలుగోసారీ రావచ్చని అంటున్నారంటే.. ఈమె.. ప్రేక్షకులకు నచ్చిందన్న మాట.ఈమె జీవితంలోని స్కార్‌ (మరక)లను చూస్తే మీకూ నచ్చుతుంది.



టీవీ ముందు ఉన్నారా? ఉంటే, ఉత్తమ నటి కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు ఎవరికి వచ్చిందో మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది. లేదా, ఈ క్షణమో, మరుక్షణమో తెలియబోతూ ఉంటుంది. ఇసబెల్లి హూపే (63), రూఫ్‌ నేగా (35), నేటలీ పోర్ట్‌మన్‌ (35), ఎమ్మా స్టోన్‌ (28).. అండ్‌.. మెరిల్‌ స్ట్రీప్‌ (67).. ఈ ఐదుగురి మధ్య పోటీ ఉంది. మెరిల్‌ స్ట్రీప్‌ సీనియర్‌ నటి. ఆస్కార్‌ నామినేషన్‌లలో కూడా ఉత్తమ నటిగా ఆమే సీనియర్‌! ఇప్పటికి మొత్తం ఇరవైసార్లు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. మూడు ఆస్కార్‌లు సాధించారు. ‘అండ్‌ ది ఆస్కార్‌ గోస్‌ టూ..’ అని ఈ ఉదయం కనుక మీకు ఆమె పేరు వినిపించిందంటే ఆ మూడు నాలుగౌతాయి. ఆస్కార్‌లు మూడు నాలుగవడం, నాలుగు ఐదవడం గొప్ప సంగతే. అయితే అంతకన్నా గొప్పవైన విశేషాలెన్నో మెరిల్‌ స్ట్రీప్‌ జీవితంలో ఉన్నాయి!



‘ది డీర్‌ హంటర్‌’ చిత్రంతో ఉత్తమ సహాయనటిగా 1979లో తొలిసారి ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు మెరిల్‌. అయితే ఆ అవార్డు ‘కాలిఫోర్నియా స్వీట్‌’ చిత్రంలోని మ్యాగీ స్మిత్‌కు వెళ్లిపోయింది. క్రామెర్‌ వర్సెస్‌ క్రామెర్‌ (1980) మెరిల్‌ తొలి ఆస్కార్‌ చిత్రం. సోఫీస్‌ చాయిస్‌ (1983), ది ఐరన్‌ లేడీ (2012).. ఆ తర్వాతి ఆస్కార్‌ చిత్రాలు. ఇవాళ కనుక అవార్డు  వస్తే.. ‘ఫ్లారెన్స్‌ ఫాస్టర్‌ జంకిన్స్‌’ ఆమెకు ఆస్కార్‌ తెచ్చిపెట్టిన నాలుగో చిత్రం అవుతుంది.



అంత లేదు : ట్రంప్‌

ఈ ఏడాది జన వరి 8న కాలిఫోర్నియాలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ వేడుకలు జరిగాయి. అవార్డు అందుకుంటూ మెరిల్‌ స్ట్రీ్టప్‌ యాక్సెప్టెన్స్‌ స్పీచ్‌ ఇచ్చారు. మెరిల్‌.. హిల్లరీ అభిమాని. మరో పన్నెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హిల్లరీ రాజకీయ విరోధి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి, అతడి పేరెత్తకుండా తన ప్రసంగంలో విమర్శించారు మెరిల్‌. ‘ఇతరులను విసిగించి, వేధించి, హింసించడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేవారితో మనం జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె అమెరికన్‌ ప్రజలను హెచ్చరించారు. వెంటనే ట్రంప్‌ వైపు నుంచీ ఓ వ్యంగ్యాస్త్రం వచ్చి మెరిల్‌కి తగిలింది. ‘షి ఈజ్‌ ఏన్‌ ఓవర్‌–రేటెడ్‌ యాక్ట్రెస్‌’ అని ట్రంప్‌ కామెంట్‌ చేశారు. ఓవర్‌ రేటెడ్‌ అంటే.. ‘అంత లేదు’ అని! ఏదో ఉడుకుమోత్తనంతో ట్రంప్‌ అలా అన్నారు కానీ, మెరిల్‌ స్ట్రీప్‌ యోగ్యత గల నటి. అందుకే మీడియా ఆమెను ‘ది బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఆఫ్‌ హర్‌ జనరేషన్‌’ అంటూ ఉంటుంది.



నీలో ఉంది : తల్లి

పిల్లలకు పోషకాహారం ఒక్కటే సరిపోదు. కాన్ఫిడెన్స్‌ను కూడా పట్టించాలి. మెరిల్‌ ఇంట్లో పెద్ద పిల్ల. బలంగా ఉంటుంది. బట్, మానసికంగా చిక్కిపోతోంది! ఎవరితోనూ కలవదు. మాట్లాడదు! మామూలుగానైతే తల్లి తల పట్టుకుంటుంది. తండ్రికి చెబుతుంది. మేరీకి కారణం తెలుసు కాబట్టి కంగారు పడలేదు. తనెలా ఉండేదో, తనెలా ఉంటోందో.. కూతురూ అలాగే ఉంటోంది.. ఇట్రావర్ట్‌లా! మేరీ కమర్షియల్‌ ఆర్టిస్ట్‌. ఆర్ట్‌ డైరెక్టర్‌. ఎప్పుడూ ఆలోచనల్లో ఉంటుంది. కొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. తండ్రి ఫార్మాస్యూటికల్‌ ఎగ్జిక్యూటివ్‌. అతడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఇంట్లో మాట్లాడడు. రెండు నిశ్శబ్దాల మధ్య మూడో నిశ్శబ్దం అయిపోయింది మెరిల్‌.



అప్పుడు పదేళ్లో, పదకొండేళ్లో ఉంటాయి మెరిల్‌కి. ‘ఇలా రా..’ అని పిలిచింది తల్లి. ‘సీ మెరిల్‌! యు ఆర్‌ కేపబుల్, యు ఆర్‌ గ్రేట్‌’ అంది. మెరిల్‌ కళ్లలో వెలుగు! ‘నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండు. లేజీగా మాత్రం ఉండకు. ఉన్నావని కాదు. ఉండొద్దని’ అంది. మెరిల్‌ కళ్లలో మెరుపు. ఆ క్షణం నుంచి మెరిల్‌ ఒక్కమ్మాయి కాదు. ఇద్దరు అమ్మాయిలు. రెండో అమ్మాయి అమ్మ! అమ్మ ఏదైనా.. ‘ఐ యామ్‌ గ్రేట్‌’ అనుకునేలా చెబుతుంది. కానీ అందరూ అమ్మలా ఉండరు.



అసలేం బాగోదు : క్రిటిక్‌

‘గోకీ కిడ్‌ విత్‌ గ్లాసెస్‌ అండ్‌ ప్రిజ్జీ హెయర్‌’ అని అంటుంది మెరిల్‌ గురించి.. ఫిల్మ్‌ క్రిటిక్‌ కరీనా లాంగ్‌వర్త్‌.. పాత సినిమాలను ముందేసుకుని వాటిల్లో మెరిల్‌ని చూస్తూ! కళ్లద్దాలు పెట్టుకున్న ఉంగరాల జుట్టు ఒంటెలా ఉంటుందట మెరిల్‌. ఇలాంటివి చాలా విన్నారు మెరిల్‌.. ఇటీవలి ట్రంప్‌ ‘ఓవర్‌–రేటెడ్‌’ కామెంట్‌ వరకు. చిన్న స్మైల్‌.. వాటికి సమాధానం.



పన్నెండేళ్ల వయసులో స్కూల్లో పాట పాడే అవకాశం వచ్చింది మెరిల్‌కి. ఎస్టెల్‌ లీబ్లింగ్‌ అనే గాయని బయటి నుంచి వచ్చి ఎలా పాడాలో నేర్పించారు. మెరిల్‌ పాడింది. పాట అర్థం ఏమిటో తెలియకుండానే, పాటలోని భావాన్ని అనుభూతి చెందకుండానే పాడింది. తననే అది నచ్చలేదు! ‘నచ్చనిది ఎంత తేలికైనా దాన్ని చెయ్యకు. న చ్చినది ఎంత కష్టమైనా దాన్ని∙చెయ్యకుండా వదలకు’ అని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాతెప్పుడూ ఇష్టం లేకుండా ఏ పనీ చేయలేదు మెరిల్‌.



జీవించింది :  ప్రొఫెసర్‌

మెరిల్‌ అప్పుడప్పుడు కాలేజ్‌ నాటకాల్లో స్టేజీ ఎక్కేది. అదీ ఆమెకు ఇష్టం లేదు. ఇలా పైకి వెళ్లి, అలా కిందికి వచ్చేసేది. అయితే ఓసారి అలా పైకి వెళ్లినప్పుడు, తిరిగి కిందికి రావాలనిపించలేదు! ఆ ప్లే పేరు ‘మిస్‌ జూలీ’. అందులో మెరిల్‌ జూలీ పాత్ర వేసింది. ఒక్క దెబ్బతో మెరిల్‌ కాలేజీ జూలీ అయిపోయింది. అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు, కొన్ని ప్రేమలేఖలు! కాలేజీ డ్రామా ప్రొఫెసర్‌ అట్కిన్‌సన్‌... మెరిల్‌ యాక్టింగ్‌కు ముగ్ధుడయ్యాడు. ‘ఆమె స్వీయ నటి’ అన్నాడు. ఆ అభినయం, ఆ డైలాగ్‌ డెలివరీ.. మెరిల్‌ జీవించింది’ అన్నాడు.



ఫీజు కట్టావా? : డ్రామా స్కూల్‌

ఎంత స్వీయ నటన అయినా, శాస్త్రీయత అవసరమే కదా. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో ఎం.ఎఫ్‌.ఎ. కోర్సులో చేరింది మెరిల్‌. అతి ఖరీదైన కోర్సు అది. ఫీజుకోసం మెరిల్‌ రెస్టారెంట్‌లలో వెయిట్రెస్‌గా పని చేసింది. టైపింగ్‌ చేసింది. ఏడాదికి పది స్టేజి నాటకాలు వేసింది. తిండీతిప్పలు లేకుండా ఓవర్‌వర్క్‌ చేసింది. డబ్బులొచ్చాయి. వాటితోపాటే కడుపులో అల్సర్లు కూడా! ఆరోగ్యం పాడైంది. ఒక దశలో ఎం.ఎఫ్‌.ఎ. మానేసి న్యాయశాస్త్రానికి మారిపోదామని కూడా ప్రయత్నించింది కానీ యాక్టింగ్‌ అప్పటికే ఆమె ప్రాణం అయింది. ‘ఎ మిడ్‌సమ్మర్స్‌ నైట్స్‌ డ్రీమ్‌’లోని హెలీనా మొదలు, వీల్‌ఛెయిర్‌లో కదిలే 80 ఏళ్ల వృద్ధురాలి వరకు తను వేసిన ప్రతి పాత్రకూ ప్రాణం పోసింది.



స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో ఫీజొక్కటే తలనొప్పి కాలేదు మెరిల్‌కి. ‘యాక్టింగ్‌ ఎక్సర్‌సైజు’లు ఆమెను బాధించేవి. నేర్పించడానికి వచ్చేవాళ్లు ఒంటిపై ఎక్కడెక్కడో తాకేవారు! అభ్యంతరకరమైన అభినయాల కోసం ఒత్తిడి చేసేవారు. ఇవన్నీ తట్టుకుని, ఇంతకన్నా ‘అప్‌డేట్‌’ అయిన ప్రపంచంలోకి వచ్చి పడింది మెరిల్‌. అది.. సినిమా ప్రపంచం.



ముఖం చూడు : నిర్మాత

1977 నాటి ‘జూలియా’ నుంచి 2018లో విడుదలకు సిద్ధమవుతున్న ‘మేరీ పాపిన్స్‌ రిటర్న్స్‌’ వరకు సుమారు 60 చిత్రాల్లో నటించారు మెరిల్‌. టీవీ ఎపిసోడ్‌లు, స్టేజ్‌ డ్రామాలు అవన్నీ.. ఇంకో లెక్క.



సినిమాల్లోకి వచ్చే వరకు వచ్చేస్తానని అనుకోని మెరిల్, ‘టాక్సీ డ్రైవర్‌’ (1976) సినిమాలో రాబర్ట్‌ డెనీరో నటనను చూశాక సినిమాల్లోకి వచ్చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.  



సినిమాల్లో చిన్న చిన్న డబ్బింగులు చెబుతూ, స్టేజి మీద పెద్ద పెద్ద పాత్రలు వేస్తున్నారు మెరిల్‌. ఓసారి పెద్ద డబ్బింగ్‌ చాన్స్‌ వచ్చింది. ‘కింగ్‌ కాంగ్‌’ సినిమాలో ముఖ్యపాత్రకు డబ్బింగ్‌ చెప్పాలి. నిర్మాత ఆడిషన్‌ పెట్టించాడు. మెరిల్‌ ఫెయిలయింది! ‘ఇది ఎంత అగ్లీగా ఉంది! దీన్నెందుకు తెచ్చావ్‌ నా దగ్గరికి?’’ అని నిర్మాత ఇటాలియన్‌ భాషలో తన కొడుకుపై చికాకు పడుతున్నాడు. మెరిల్‌కి ఇటాలియన్‌ వచ్చని అతడికి తెలీదు. ‘నేను ఉండవలసిన దానికన్నా అందంగా లేకపోయినందుకు చింతిస్తున్నారు. కానీ మీకిదే ఎక్కువ’ అని చెప్పి విసురుగా వెళ్లిపోయారు మెరిల్‌. అక్కడి నుంచి ‘బ్రాడ్‌వే’కి వెళ్లిపోయారు. రంగస్థలానికి. అలా డ్రామాల్లోంచి డ్రామా ఫిల్మ్‌ ‘జూలియా’లోకి వచ్చారు మెరిల్‌.



వచ్చేయ్‌ సినిమాల్లోకి : డెనీరో

జూలియాలో మెరిల్‌ది చాలా చిన్న పాత్ర. జేన్‌ ఫాండా అనే సీనియర్‌ నటికి సహనటి. సినిమా రిలీజ్‌ అయ్యాక.. షూటింగ్‌లో తను ఒక సీన్‌లో మాట్లాడిన మాటల్ని, ఆ సీన్‌లో కాకుండా వేరే సీన్‌లో విని బిత్తరపోయారు మెరిల్‌. దేవుడా.. సినిమా అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అని వణికిపోయారు. సినిమాల్లోకి రావాలనుకుని తప్పు చేశాను అనుకున్నారు. అసలు సినిమాలే వద్దనుకున్నారు.

అప్పుడు వచ్చాడు రాబర్ట్‌ డెనీరో ఆమె దగ్గరికి! బ్రాడ్‌వేలో ‘ది చెర్రీ ఆర్చిడ్‌’ అనే నాటకంలో మెరిల్‌ చూసి, ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఓ కొత్త సినిమాలో అతడు నటిస్తున్నాడు. అందులో మెరిల్‌ని తన గర్ల్‌ ఫ్రెండ్‌గా నటించమని కోరాడు. తన అభిమాన నటుడు అడుగుతుంటే మెరిల్‌ కాదంటుందా! అలా.. ‘ది డీర్‌ హంటర్‌’ అనే యుద్ధ చిత్రంతో మెరిల్‌ కెరీర్‌ మలుపు తిరిగి, ఆమెను ఆస్కార్‌ మెట్ల వరకు తీసుకెళ్లింది.



నిన్ను ప్రేమిస్తున్నా : కజాలే

కరీనా లాంగ్‌వర్త్‌ మాటల్లో.. మెరిల్‌ది ‘హై లెవల్‌ స్టార్‌డమ్‌’. కానీ ఆమె చాలా సాధారణ జీవితం గడిపారు. ది డీర్‌ హంటర్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో ఆమె తన సహ నటుడు జాన్‌ కజాలేతో ప్రేమలో పడ్డారు. అతడితో సహజీవనం చేశారు. షూటింగ్‌లో తన పార్ట్‌ ముగియగానే.. అప్పటికే లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న కజాలే చనిపోయాడు. చనిపోతాడనే తెలిసే మెరిల్‌ అతడి ప్రేమను అంగీకరించిందేమో!



అసలు పేరు : మేరీ లూయీస్‌ స్ట్రీప్‌

జననం : 1949 జూన్‌ 22

జన్మస్థలం : న్యూ జెర్సీ (యు.ఎస్‌.)

తల్లిదండ్రులు : మేరీ, హ్యారీ

తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్లు

చదువు : బి.ఎ. (1971); ఎం.ఎఫ్‌.ఎ. (1975)

నటన : 1975 నుంచి ఇప్పటి వరకు

నటిగా ప్రత్యేకత : పాత్రలో ఒదిగిపోవడం

జీవన సహచరుడు : జాన్‌ కజాలే (1976–78)

భర్త : డాన్‌ గామర్‌ (వివాహం 1978)

పిల్లలు : అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు

అవార్డులు : లెక్కలేనన్ని!



మత విశ్వాసాలు మనశ్శాంతిని ఇస్తాయని నమ్ముతారు మెరిల్‌. అలాగని ప్రార్థనలోని శక్తిని ఆమె అంగీకరించరు! మనిషి తట్టుకుని నిలబడాలి. దేవుడి మీద వాలిపోకూడదు అనేది మెరిల్‌ ఫిలాసఫీ. రాజకీయంగా ఆమెది వామపక్ష ధోరణి. ఇటీవల ట్రంప్‌.. వలసల విధానాన్ని కట్టడి చేసినప్పుడు.. ఆమె కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘హాలీవుడ్‌ ఈమాత్రం అయినా నేలపై దోగాడుతూ ఉందంటే బయటి నుంచి వచ్చిన వాళ్ల వల్లనే. వీళ్లందరిన్నీ తన్ని తరిమేస్తే అమెరికాలో ఇక చూడ్డానికి వాలీబాల్, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ తప్ప కళలన్నవే ఉండవు’ అన్నారు మెరిల్‌ స్ట్రీప్‌.

ఇంత ధైర్యంగా ట్రంప్‌ని కామెంట్‌ చేసినందుకైనా ఆస్కార్‌ కమిటీ మెరిల్‌కి అవార్డు ఇవ్వొచ్చు. ప్రతిమనే ఇవ్వక్కర్లేదు. ప్రత్యేక ప్రశంసాపత్రం ఇచ్చినా చాలు.. ‘రియల్‌ ఆర్టిస్ట్‌’ అని! అది ఆమెను గౌరవించడానికి కాదు. ఆస్కార్‌ తనని తాను గౌరవించుకోడానికి.    



1వ ఆస్కార్‌

















2వ ఆస్కార్‌

























3వ ఆస్కార్‌

మార్గరెట్‌ థాచర్‌ అంటే మెరిల్‌కి ఇష్టం లేదు. అందుకే ‘ది ఐరన్‌ లేడీ’ చిత్రంలో

థాచర్‌ పాత్రను వెయ్యడానికి నిరాకరించారు. దర్శకుడు లాయిడ్‌ నచ్చజెప్పడంతో ఓకే అన్నారు. చివరికి ఆ చిత్రం మెరిల్‌కు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డు అందించింది!

















4వ ఆస్కార్‌

ఇవాళ గనుక మెరిల్‌ స్ట్రీప్‌కు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డు వస్తే.. ఇప్పటికే అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకున్న కేథరీన్‌ హెప్‌బర్న్‌తో సమానం అవుతారు.



ఎం.ఎఫ్‌.ఎ. చదువుతున్నప్పుడు, దాన్ని వదిలేసి ‘లా’ చేద్దామనుకున్నారు మెరిల్‌. ఆలస్యంగా నిద్రలేవడంతో లా ఇంటర్వూ్య టైమ్‌ దాటిపోయి, ఎం.ఎఫ్‌.ఎ.లోనే కొనసాగవలసి వచ్చింది. అప్పుడు మెరిల్‌ టైమ్‌కి నిద్రలేచి ఉంటే, ఇప్పుడు మనకింత మంచి నటి దొరికి ఉండేవారు కాదేమో!

అవార్డుల ఫంక్షన్‌లో తన రెండో ఆస్కార్‌ (ఉత్తమ సహాయ నటిగా) ప్రతిమను బాత్రూమ్‌లో మర్చిపోయి వచ్చి, మళ్లీ తెచ్చుకున్నారు మెరిల్‌!

మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top