ఆపలేరు... అడిగితే ఓపలేరు!

ఆపలేరు... అడిగితే ఓపలేరు! - Sakshi


అధికారుల అసహనం

 

స్త్రీలపై ఇంతగా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ఎవరూ నివారించలేరా? ఈ సందేహాలు మీక్కూడా వస్తే ఎవరినైనా అడగండి కానీ, రాజకీయకుల్ని, పెద్దపెద్ద హోదాలలో ఉన్న ప్రభుత్వాధికారులను మాత్రం అడక్కండి. ఎందుకంటే, వాళ్లు చెప్పే సమాధానాలు అసహనంతో కూడుకున్నవి అయి ఉంటాయి. ఎందుకు అసహనం? నివారించలేనప్పుడు పొడుచుకొచ్చేది అసహనమే కదా.

 

ఉదా: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బెంగుళూరులోని ఓ పబ్లిక్ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అత్యాచారం కేసులో ‘‘పురోగతి ఏమైనా కనిపించిందా?’’ అనే ప్రశ్నకు సిద్ధరామయ్య మీడియాపై విరుచుకు పడ్డారు. ‘‘ఇది తప్ప మీకు ఇంకో వార్త లేదా?’’ అని అసహనం వ్యక్తం చేశారు. ఇంకో ఉదా: ఉత్తర ప్రదేశ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ. ఆయనలోనూ ఇదే అసహనం! పదవిలోంచి దిగిపోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని శాంతిభద్రతల గురించి విలేఖరులు ‘అత్యాచారాల మాటేమిటి?’ అన్నప్పుడు ఖురేషీ చాలా చికాకుగా ‘‘ప్రభుత్వం ఏం చెయ్యగలదయ్యా. ఆ దేవుడే దిగి వచ్చినా అత్యాచారాలను ఆపలేడు’’ అని అన్నారు!!

 

ఈ రెండు తాజా ఉదాహరణలను బట్టి చూసినా... మహిళల భద్రతను ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని అర్థమౌతోంది. ఈ స్థితిలో ప్రభుత్వం మోయవలసిన బరువు బాధ్యతలు కూడా మహిళా కమిషన్‌ల మీద పడుతున్నాయి. సమస్య ఎక్కడుందో గుర్తించడం, సమస్యకు పరిష్కారాన్ని సూచించడం మాత్రమే కాకుండా కనీస అవసరాలకు సైతం ప్రభుత్వంతో ‘తలపడి’ మరీ సాధించుకోవడం కూడా మహిళా కమిషన్‌ల వంతే అవుతోంది. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర మహిళా కమిషన్ అదే పోరుబాటలో ఉంది.

 

అస్సాంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో 51 శాతం వీధి దీపాలు లేకపోవడం వల్లనేనని కమిషన్ గుర్తించింది. ‘‘పైకి ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు. కానీ చీకటి పడుతుంటే మహిళలకు ఇక్కడ భద్రత కరువవుతోందన్న మాట మాత్రం వాస్తవం’’ అని కమిషన్ చైర్‌పర్సన్ మీరా బారువా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే,  మరో రెండు ముఖ్యసమస్యలపైన కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందులో

ఒకటి: గృహహింస.

రెండోది: మంత్రగత్తెల పేరుతో అమాయక గ్రామీణ మహిళలను చంపడం! పైన పేర్కొన్న సమస్యలు ఒక్క అస్సాంవే కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. మహిళల భద్రత తమకు పట్టనట్లున్న ప్రభుత్వాలు కనీసం మహిళా కమిషన్‌లకు తగినన్ని నిధులైనా సమకూరిస్తే పరిస్థితి చాలావరకు మెరుగవుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top