మ్యారేజ్ కౌన్సెలింగ్

మ్యారేజ్ కౌన్సెలింగ్ - Sakshi


కలిసి ఉండలేక విడిపోవాలనుకునే దంపతులు కొందరు. విడిగా ఉండాల్సి వచ్చి కలిసిపోవాలని తపించే దంపతులు కొందరు. విడిపోడానికి కోర్టులు ఉన్నాయి. చట్టాలున్నాయి. కలిసిపోడానికి ఈ కోర్టులతో, చట్టాలతో అవసరం లేదు కానీ... దంపతులలో ఏ ఒక్కరు విముఖంగా ఉన్నా... రెండోవారు దాంపత్య జీవితం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్

రైట్స్’తో ఒకటవచ్చు.

 

కేస్ స్టడీ

సహజీవనంలోనూ హక్కులు వర్తిస్తాయి

విజయ, వేణుగోపాల్ 15 ఏళ్ల నుండీ కలసి జీవిస్తున్నారు. సంతానం కూడా కలిగింది. వారికి వివాహ వ్యవస్థ పట్ల, సంప్రదాయం పట్ల నమ్మకం లేదు. అందువల్ల వివాహం చేసుకోకుండా సహజీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా వారిని భార్యాభర్తల్లానే అంగీకరించారు. కానీ పాప పుట్టాక, అదీ ఆమెకు ఐదేళ్లు నిండినప్పటినుండీ వేణుగోపాల్ ప్రవర్తనల్లో చాలా మార్పు వచ్చింది. భార్యను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. మాటలతో, చేతలతో మనోవేదనకు గురిచేయడం ప్రారంభిం చాడు.



కట్టుకున్న భార్యలా విజయ తనపై అధికారం చలాయిస్తోందని, విజయ పెత్తనం తనపై చెల్లదని, కనీసం ఇంటి అవసరాలకు, పాప పోషణకూ కూడా డబ్బులివ్వకుండా సతాయించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు తాను మరలా వివాహం చేసుకుంటారనీ తమది చట్టబద్ధమైన వివాహం కాదనీ విజయను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. విజయ, వేణుగోపాల్ మాటలకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నిజంగా తమది భార్యాభర్తల సంబంధం కాదా? తనకూ పాపకూ చట్టపరంగా ఏ రక్షణలూ, హక్కులూ లభించవా అని ఆవేదనకు లోనైంది. ఈ విషయాన్ని గురించి న్యాయవాదిని సంప్రదించింది.



ఇరువురు యువతీ యువకులు చాలాకాలం కలసి జీవిస్తే వారు చట్టప్రకారం భార్యాభర్తల్లానే పరిగణింపబడతారనీ, స్త్రీ భాగస్వామికి చట్టబద్ధమైన రక్షణలూ, హక్కులూ లభిస్తాయనీ, హింస నుండి ఎదుర్కొనే హక్కూ, ఆస్తికి సంబంధించిన అన్ని హక్కులూ, వారి సంతానానికి చట్టబద్ధత అన్నీ లభిస్తాయని తెలుసుకుంది. వేణుగోపాల్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సెక్షన్ 2 (ఎఫ్) డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 కూడా సహజీవనాన్ని వివాహబంధంగా గుర్తించిందనీ తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది.



సహజీవనంలో ఉండే భాగస్వాములకు అదివరకే వివాహమై ఉండరాదు. అంటే ఇరువురూ అవివాహితులై ఉండాలి. ఒకవేళ వివాహమై ఉంటే, భర్త నుండి గానీ, భార్య నుండి గానీ విడాకులైనా తీసుకొని ఉండాలి. లేకుంటే భార్య కానీ, భర్త కానీ జీవించి ఉండకూడదు. ఇరువురూ మేజర్లై ఉండాలి అని సుప్రీంకోర్టువారు తెలిపి ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, సహజీవనమంటే అక్రమ సంబంధం కాదు.


 

ప్రశ్న - జవాబు

మా పెళ్లి అయి 20 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు విజయవాడలో ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నారు. మావారు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివించే స్తోమత లేక, విజయవాడలో చిన్న పోర్షన్ అద్దెకు తీసుకొని, పిల్లలను చదివిస్తున్నాను. నేను కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఇంటి అద్దెకు, పిల్లల అవసరాలకు సరిపడా ఆర్జిస్తున్నాను. భర్తకు దూరంగా ఉండటం కొంచెం కష్టమైనా, పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఉన్నతి కోసం పిల్లలతోనే ఉంటున్నాను. వారానికి, పదిహేను రోజులకు మేమంతా కలుసుకొంటున్నాము. హైదరాబాద్ నుండి విజయవాడకు నా భర్త వీకెండ్స్‌లో వస్తూ పోతూ ఉంటున్నాడు.



నా సంపాదన వల్ల ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇదిలా ఉండగా మావారికి ఇటీవల చిరాకు, అకారణ కోపం ఎక్కువైనాయి. చీటికీ మాటికీ పోట్లాటకు సిద్ధమవుతున్నారు. నేను తనతో లేనని బాధతో ఉన్నారని పదే పదే అంటుండడంతో నేను తరచు హైదరాబాద్ వెళ్లి అక్కడ పనులన్నీ చక్కదిద్ది, అన్నీ ఏర్పాటు చేసి వస్తున్నాను. అయినా వారి ప్రవర్తన మారలేదు. ఒక నెల నుండీ ఆయన మా దగ్గరకు రావట్లేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు. తీరా చూస్తే, నాకు కోర్టు నుండి నోటీసు వచ్చింది. నా భర్త ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ కింద హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో కేస్ వేశారు. పిల్లల చదువు మధ్యలో ఉంది. నేనేమి చేయాలి; కోర్టులో ఎలా ప్రొసీడ్ అవ్వాలి?

- బి. అమల, విజయవాడ




భయపడవలసిన అవసరం లేదు. ఏ కారణం లేకుండా భార్య భర్తను గానీ, భర్త భార్యను గానీ వదలి, కాపురం చేయకుండా విడివిడిగా ఉంటే, తమ కాపురం హక్కులు/ వైవాహిక హక్కులు పునరుద్ధరించమని సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద దాఖలు చేసే పిటిషన్ ఇది. కోర్టువారు విచారణ జరిపి సహేతుకమైన కారణం లేకుండా, భార్య భర్తను కానీ లేక భర్త భార్యను కానీ వదిలివేసి విడిగా జీవిస్తున్నారని భావిస్తే, భర్తను భార్యను కాపురానికి తీసుకొని వెళ్లమని కానీ లేక భార్యను భర్త దగ్గరకు వెళ్లి కాపురం చేయమని గానీ డిక్రీ జారీ చేస్తారు. మీరు విజయవాడలో ఉండటానికి సరైన కారణం ఉంది. అంటే పిల్లల చదువు, వారి భవిష్యత్తు కోసమే మీరు అక్కడ ఉంటూ, మీ భర్త వద్దకు వెళ్లి వస్తూ, అతనికి మీ వద్దకు రానిస్తూ ఉన్నారు. కనుక మీ భర్త మీపై వేసిన కేసును కొట్టివేస్తారు. మీరు విజయవాడలో ఉండటానికి గల కారణాలు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు నిరూపించుకోండి.



మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. నాకు 23 ఏళ్లు. మా చెల్లికి 20 సం. మా అమ్మగారు ఇటీవలే మరణించారు. మా అమ్మకు ఒక చెల్లెలు, ఒక అన్నయ్య ఉన్నారు. వారంతా చక్కగా సెటిలయ్యారు. మా తాతగారు అంటే అమ్మా వాళ్ల నాన్నగారికి పదెకరాల భూమి ఉంది. ఆయన వీలునామా రాయకుండానే (అమ్మకంటే ముందే) మరణించారు. మా అమ్మగారు ఉన్నంతకాలం మా మేనమామ ఆస్తి పంపకం జరగనివ్వకుండా అడ్డుపడుతూ వచ్చాడు. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మామయ్యను ఆస్తి పంచమంటే మీ అమ్మే పోయింది. ఇక మీతో మాకు సంబంధమేమిటి? అంటున్నాడు. మాకు న్యాయం జరగదంటారా?

 - జి. రాగసుధ, వినుకొండ


 

మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీ మామయ్య వాదన తప్పు. ఆస్తి ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. మీ తాతగారి పొలంలో మీ అమ్మకు, పిన్నికి, మామయ్యకూ సమానమైన వాటా వస్తుంది. మహిళ అయినా, పురుషుడు అయినా ఉమ్మడి ఆస్తిలో వారికి ఉన్న వాటాలు వారి తర్వాత లేదా వారు మరణించాక వారి వారి వారసులకే సంక్రమిస్తాయి. అంతేకాని, జీవించి ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం కాదు. మీ తల్లి మరణించినంత మాత్రాన ఆమెకు ఆస్తిలో హక్కు రద్దుకాదు. మీ తల్లికి సంబంధించి మీ అక్కచెల్లెళ్లు వారసులు కనుక మీకు తప్పకండా వాటా వస్తుంది. మీరు తగిన సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించండి. తప్పకుండా సఫలమవుతారు.



మా పెళ్లయ్యి ఐదు సంవత్సరాలైంది. నా భర్త శాడిస్ట్ అని వివాహమైన కొద్దికాలానికే తెలిసింది. పరువు మర్యాదలకు భయపడి కొన్నాళ్లు ఓపిక పట్టాను. నన్ను నానా నరకయాతనలకు గురిచేశాడు. ప్రతిరోజూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. వాళ్లతో, వీళ్లతో అక్రమ సంబంధాలు అంటకట్టి వేధించేవాడు.  భరించలేక పుట్టింటికి వచ్చాను. నా ఉద్యోగం నేను చేసుకుంటూ నా జీవనం నేను సాగిస్తున్నాను. ఇది కూడా సహించలేని నా భర్త నేను పనిచేసే ఆఫీస్‌కు వచ్చి, నానా రభస చేస్తున్నాడు. నన్ను దారి కాచి వేధిస్తున్నాడు. నాకు డి.వి.యాక్ట్ గురించి తెలిసి ప్రొటెక్షన్ ఆఫీసర్ గారిని సంప్రదించి, వారి దగ్గర రక్షణ ఉత్తర్వులు కోరుతూ పిటిషన్ పెట్టుకున్నాను. వారి దానిని కోర్టువారికి పంపారు. అక్కడ నా మొర విన్న మేజిస్టేట్‌గారు ‘ఎక్స్‌పార్టీ రక్షణ ఉత్తర్వులి’చ్చారు. నా భర్తకు ఒక కాపీ కూడా పంపారు. అయినా అతని వేధింపులు ఆగలేదు పైగా అవి సివిల్ ఆర్డర్స్ అని తననేమీ చేయలేవని వాదిస్తున్నాడు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.

- పి. అనూరాధ, విశాఖపట్నం




డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం సివిల్ చట్టమైనప్పటికీ దానికి క్రిమినల్ అధికారాలు ఉన్నాయి. కోర్టువారిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి, మిమ్ములను వేదనకు గురిచేస్తున్నాడు. అందువలన మీరు సెక్షన్ 31 ప్రకారం అంటే బ్రీచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కింద కేసు వేయండి. విచారణ తర్వాత మీ భర్తకు సంవత్సరం జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. అసలు ఈ పిటిషన్ వేసిన వెంటనే, అతని వేధింపులు ఆగే అవకాశం వంద శాతం ఉంది.

 

ఇ.పార్వతి

అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top