‘రిషి’లేని మాకు జీవితమే లేదు!

‘రిషి’లేని మాకు జీవితమే లేదు!


... రిషితేశ్వరి తండ్రి ఆవేదన                

రిషిలేని నా జీవితం ఏమీ లేదు. ఎవరైనా ఒక పూట తిండి పెడితే చాలు.

జంతువుగా బతుకుతున్నా. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు.

నా కూతురు మరణానికి కారణమైన వారందరికీ శిక్ష విధించాలి.

నాగార్జున యూనివర్సిటీలో... మనిషి చనిపోయేంతంగా ర్యాగింగ్ రూపంలో రాక్షసత్వంఉంది.

కొందరు విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఏం చేసినా ఫర్వాలేదు,

ప్రిన్సిపాల్‌తో బాగా ఉంటే సరిపోతుంది... అనే పరిస్థితి అక్కడ ఉంది.

ఎంత ధైర్యవంతులైనా... పుకార్ల విషయంలో మనోధైర్యం కోల్పోతారు.

యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటికైనా వీటిని సరిదిద్దుకోవాలి.



ఇంటర్‌లో ఉన్నప్పుడు రిషి కోసం స్కూటీ కొన్నాను.  ‘మరో నాలుగేళ్లు పోతే మీరు ప్రస్తుతం నడిపే బైక్‌కు కిక్ కొట్టడం ఇబ్బంది అవుతుంది నాన్నా. అప్పుడు నా స్కూటీ మీకు ఉంటుంది’ అని తను బయటకు తీసేది కాదు. మురళీకృష్ణ. ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి తండ్రి. కూతురే జీవితం అనుకున్న ఆయన కలల సౌధం కుప్పకూలిపోయింది. ర్యాగింగ్ అనేరాక్షసత్వానికి ఆయన జీవితం గమ్యం లేని పయనంలా మారింది. మరణానికి కారకులకు శిక్షపడాలనీ, తనలాంటి పరిస్థితి మరోసారి ఎవరికీ రాకూడదనీ న్యాయం కోసం పోరాడుతున్న ఆ తండ్రి ఆవేదన ఇది...

 

http://img.sakshi.net/images/cms/2015-07/51438200744_Unknown.jpgర్యాగింగ్ అనే రాక్షసత్వం నా కూతుర్ని మింగేసింది. ఇప్పుడు నేను మనిషిగా లేను. ఆశలు లేవు. ఆశయాలు లేవు. రిషి లేని నా జీవితం ఏమీ లేదు. ఎవరైనా ఒక పూట తిండి పెడితే చాలు. జంతువుగా బతుకుతున్నా. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు. ఇప్పుడు వీసీలు, ఐఏఎస్‌తో కమిటీ ఏర్పాటు చేశారు. వీసీలు ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. నా నమ్మకం ఐఏఎస్ అధికారి పైనే. ఇలాంటి ఘోరం మరోసారి ఎక్కడా, ఎవరికీ జరక్కూడదు. నా కూతురు మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. ఇప్పుడు బయటికి కనిపిస్తున్న వారినే కాదు, పాత్రధారులందరినీ బయటకి లాగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇలాగైతేనే న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వారందరికీ శిక్ష పడాలి. ఎంతెంత తప్పు చేస్తే అంతంత శిక్ష విధించాలి.



 అది రాక్షసత్వం...

 సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు పరిచయం కావడం వరకు ఏదైనా ఓకే. సీనియర్ విద్యార్థి జూనియర్‌ను నోట్స్ రాయమని అడగడం, స్టడీ అసైన్‌మెంట్ ఇవ్వడం వంటివి పరిచయానికి ఉపయోగపడతాయి. నాగార్జున యూనివర్సిటీలో అలా లేదు. మనిషి చనిపోయేంతగా అక్కడ ర్యాగింగ్ రూపంలో రాక్షసత్వం ఉంది. చేరిన రోజే అక్కడ జూనియర్లను మంచినీళ్లు తెమ్మని చెప్పడం నుంచి మొదలవుతుంది ర్యాగింగ్. తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇవన్నీ ప్రిన్సిపాల్‌కు తెలుసు. ఏ రోజూ వీటిని సరిచేసేందుకు ప్రయత్నించలేదు. అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీయే లేదు. నాకు బాధ అనిపించే విషయం ఏమిటంటే... ప్రిన్సిపాల్ ఇప్పటికీ వాస్తవాన్ని గుర్తించడంలేదు. తన తప్పును సరి చేసుకోవడం లేదు. నా బిడ్డ బలి అయ్యాక కూడా వారి తీరు మారడం లేదు. పైగా వారు బాగానే చేస్తున్నట్లు నమ్మించడానికి రిషి చనిపోయాక పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. దానికి నాకు ఆహ్వానం పంపలేదు. వేరే వారు చెబితే వెళ్లాను. రిషి సూసైడ్‌నోట్ కాపీలను అక్కడికి వచ్చిన పేరెంట్స్‌కు పంపిణీ చేశా. మీటింగ్‌లో మాత్రం అక్కడ అంతా బాగుందన్నట్లు భ్రమింపచేసేందుకు ప్రయత్నించారు. పర్మినెంట్ స్టాఫ్‌తో కాకుండా... తాత్కాలిక సిబ్బందితోనే మాట్లాడించారు. అందులో ఒకాయన... గర్ల్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ లేదని చెప్పాడు. నాకు వింతగా అనిపించింది. అదే విషయం ఆయనను అడిగా. గర్ల్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ లేదనే విషయం ఆయనకు ఎలా తెలిసింది? ఆయన గర్ల్స్ హాస్టల్‌కు వెళ్లే ఆ విషయం చెప్పాడా? వెళ్తే ఏ టైంలో వెళ్లాడు? అని ప్రశ్నించా. అందరు పేరెంట్స్ నా ప్రశ్నలు కరెక్టని అన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి.



ఆ పెరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది - అక్కడి వ్యవస్థలోని లోపాలను సరి చేసుకోవడానికి కాదు. వాళ్ల తప్పులు బయటపడకుండా సర్దుకోవడానికే. వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ మీటింగ్‌కు వైస్‌చాన్సలర్ వచ్చేవారు. వార్డెన్ రావాలని పేరెంట్స్ చాలా మంది కోరారు. ఆమె తాను రాలేననీ... పేరెంట్సే తన దగ్గరికి రావాలనీ వర్తమానం పంపించారు. ఇదీ అక్కడి పరిస్థితి. ర్యాగింగ్‌పై రిషి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ అంటున్నారు. ఓరల్‌గా (మౌఖికంగా) చెబితే చర్యలు తీసుకోరా? ఒకే విద్యాసంస్థలో ఉన్నవారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యమవుతుందా? ఇవన్నీ ప్రిన్సిపాల్‌కు తెలియవా? అక్కడ వ్యవస్థ మారాలి. రిక్షా కార్మికుడు తప్పు చేస్తే అతనొక్కడే నష్టపోతాడు. విద్యావ్యవస్థలో ఉన్నవారు తప్పులు చేస్తే ఆ నష్టం ఎంతో చెప్పే పరిస్థితి ఉండదు.



రిషి ధైర్యవంతురాలు

 నా కూతురు అని చెప్పడం కాదు.. రిషితేశ్వరి ధైర్యవంతురాలు. ఆమెది పోరాడే స్వభావం. ఆత్మహత్య చేసుకునే అమ్మాయి అసలే కాదు. ఆర్కిటెక్చర్ ఆమె ఇష్టపడి చేరిన కోర్సు. ఎంట్రెన్స్‌లో 112వ ర్యాంకొచ్చింది. హైదరాబాద్‌లో కాలేజీలో హాస్టల్ సౌకర్యం ఉండదు. నాగార్జున వర్సిటీలో అయితే హాస్టల్ ఉంటుంది, భద్రత ఉంటుందని భావించి అక్కడ జాయిన్ చేయించా. రిషిని హాస్టల్‌లో జాయిన్ చేసేటప్పుడు అందరూ అడిగారు. మీ పాప సంగతేమోగానీ ఆమెకు దూరంగా మీరు ఉంటారా అన్నారు. భద్రత ఉంటుందని భావించిన హాస్టల్‌లోనే ఘోరం జరిగింది. నా జీవితం శూన్యమైంది. ఫ్రెషర్స్ డే రోజు తనతో ఓ సీనియర్ స్టూడెంట్ అగౌవరంగా మాట్లాడిన విషయం చెప్పింది. ఆ http://img.sakshi.net/images/cms/2015-07/41438201181_Unknown.jpgమరుసటి రోజు అదే విద్యార్థి క్లాస్‌కొస్తే అతని ప్రవర్తన సరికాదని గట్టిగానే బదులిచ్చినట్లు చెప్పింది. అలాంటమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అంటే నేను నమ్మను. వర్సిటీలో ఒక ప్రణాళిక ప్రకారం ఇలాంటివి జరిగాయి. తప్పు చేసేవాళ్లను, అలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను ప్రిన్సిపాల్ మందలించాలి. సరైన దారిలో పెట్టాలి. నాగార్జున యూనివర్సిటీలో అలా లేదు. కొందరు విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఏం చేసినా ఫర్వాలేదు, ప్రిన్సిపాల్‌తో బాగా ఉంటే సరిపోతుంది... అనే పరిస్థితి అక్కడ ఉంది. ఇలాంటివి విద్యా సంస్థలో ఉండడం సరికాదు. ఎంత ధైర్యవంతులైనా... పుకార్ల విషయంలో మానసికధైర్యం కోల్పోతారు. యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటికైనా వీటిని సరిదిద్దుకోవాలి. యూనివర్సిటీలో పరిస్థితి బాగుపడాలంటే ప్రిన్సిపాల్ ఇప్పటికైనా ఆ పోస్టు వదిలేసి వెళ్లిపోవాలి.

 

పాపే ప్రాణం

 రిషితేశ్వరి మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్‌లో చేస్తుందని ప్రణాళిక వేసుకున్నాం. హైదరాబాద్ సమీపంలో ఇల్లు కట్టుకుని అక్కడి నుంచి తన చదువు, కెరియర్... ఇలా ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కూలిపోయాయి. రిషికి నాతో అటాచ్‌మెంట్ ఎక్కువ. వాళ్ల అమ్మ కంటే ఎక్కువ. ఏ విషయమైనా నాకు చెప్పేది. ఇంటర్‌లో ఉన్నప్పుడు రిషి కోసం స్కూటీ కొన్నాను. ఆమె ఎక్కువగా బయటికి తీసేది కాదు. ఎందుకని అడిగితే... ‘మరో నాలుగేళ్లు పోతే మీరు ప్రస్తుతం నడిపే బైక్‌కు కిక్ కొట్టడం ఇబ్బంది అవుతుంది నాన్నా. అప్పుడు నా స్కూటీ మీకు ఉంటుంది’ అని చెప్పింది.



అది కరెక్టు కాదు

ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. రిషితేశ్వరి మంగళవారం చనిపోయింది. ప్రతి శనివారం డ్యూటీ అయిపోయాక నేను, మా ఆవిడ రిషి దగ్గరికి వెళ్తుండేవాళ్లం. ఆదివారం మధ్యాహ్నం తర్వాత తిరిగి వచ్చేవాళ్లం. సంఘటన జరిగిన ముందు ఆదివారం మధ్యాహ్నం రెండున్నర వరకు నేను అక్కడే ఉన్నా. మా ఆవిడను హాస్టల్‌లోనే ఉండమని చెప్పి రిషితో బయటికి వెళ్లి ఆమెకు కావాల్సిన స్టేషనరీ కొనిచ్చా. తర్వాత ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నేను, మా ఆవిడ కలిసి వరంగల్‌కు వచ్చేశాం. రిషి నాకు ప్రతిరోజూ కనీసం మూడుసార్లు ఫోన్ చేస్తుండేది. సోమవారం దాదాపు 24 మంది క్లాస్‌మేట్స్‌తో కలిసి ‘బాహుబలి’ సినిమాకు వెళ్లింది. సినిమా ఇంటర్‌వెల్‌లో రిషి నాకు ఫోన్ చేసింది. నా పక్కన మా సహోద్యోగి ఉన్నారు. ‘ఎందుకు సార్ సినిమాకు వెళ్లిన అమ్మాయిని డిస్ట్రబ్ చేస్తారు’ అన్నారు. ‘మా అమ్మాయే చేసిందయ్యా, నేను చేయలేదు’ అని చెప్పా. ‘బాహుబలి’ ఫస్ట్ ఆఫ్ బాగుంది నాన్నా అని ఇంటర్వెల్ మధ్యలో ఫోన్ చేసి చెప్పింది.



ఆడపిల్లల చదువులకిక  ఎండ్ ఆఫ్ ది రోడ్!?

ఆర్కిటెక్చర్ స్టూడెంట్‌గా నిర్మాణపరమైన గ్రాఫిక్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పింది. సినిమా పూర్తయ్యాక ఫోన్ చేసింది. ‘మీరూ చూడండి నాన్నా’ అని చెప్పింది. హాస్టల్‌కు వెళ్లి భోజనం చేసిన తర్వాత ఫోన్ చేసింది. ముగ్గురు మాత్రమే సినిమాకు వెళ్లినట్లు పుకార్లు వచ్చాయి. ఇది కరెక్టుకాదు. వాస్తవాలు తెలుసుకుని రాయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.

 - పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్; ఫొటో: సంపెట వెంకటేశ్వర్లు

 

 మిస్ పర్‌ఫెక్ట్: ‘‘రిషితేశ్వరి మంచి స్టూడెంట్. తన పనేదో తాను చూసుకొనేది. ప్రతిభ, నిజాయతీ లాంటి గుణాలను ఆమెలో చూసిన సీనియర్లు రిషితేశ్వరికి ఈ ఏడాది ‘మిస్ పర్‌ఫెక్ట్’ టైటిల్ కూడా ఇచ్చారు.’’

 - జి. సాయిదీప, బీఆర్క్ సెకండియర్, రాజమండ్రి



 ఆ అమ్మాయికి నాన్నే సర్వస్వం: ‘‘రిషితేశ్వరిది ఫ్రెండ్లీ నేచర్. ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ నాన్నకు చెప్పుకొనేది. ఎవర్నీ హర్ట్ చేయదు. ఏదన్నా అంటే, గట్టిగా జవాబిచ్చే ఆమె ఆత్మహత్య చేసుకుందంటే, నమ్మశక్యం కావడం లేదు.’’

 - పి. అవినాశ్, బీఆర్క్ థర్డ్ ఇయర్, రాజంపేట



 చాలా సెన్సిటివ్: ‘‘రిషితేశ్వరి చాలా సెన్సిటివ్. ర్యాగింగ్‌తో ఇబ్బంది పడుతున్నానని మాతో అన్నప్పుడు చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఇలా అవుతుందనుకోలేదు. క్యాంటీన్‌కు వెళ్ళినప్పుడు తాను తినకుండా మా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తున్నాయి.’’

 - దుర్గాప్రసాద్, బీఆర్క్ సెకండ్ ఇయర్, కర్లంపూడి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top