నిస్పృహ వద్దు

నిస్పృహ వద్దు


డిప్రెషన్ అంటే ఇది కాదు...

 

చాలా మంది డిప్రెషన్‌ను ఒక మానసిక బలహీనత అనుకుంటారు. మరికొందరు వ్యక్తిత్వ లోపంగా భావిస్తారు. చేయాల్సిన పనిని తప్పించుకోవడం కోసం సాకుగా చూపే సోమరితనంగా ఇంకొందరు పరిగణిస్తారు.



కానీ ఇవన్నీ తప్పే. ఇవన్నీ అపోహలే. డిప్రెషన్ అంటే మూడ్స్ బాగుండకపోవడం కాదు. డిప్రెషన్ అంటే మూడీగా ఉండటం కాదు. అయితే నిజానికి డిప్రెషన్ అంటే ఏమిటి? ఏమిటంటే... మూడ్స్‌కు సంబంధించిన ఒక మానసిక రుగ్మతే డిప్రెషన్.

 


ఎంత  విస్తృతం  అంటే..?

 


అదొక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. చాలా సాధారణం కూడా. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరూ, ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని మొత్తం మహిళల్లో 21 శాతం మంది, పురుషుల్లో 12 శాతం మంది తమ జీవితకాలంలోని  ఏదో ఒక దశలో డిప్రెషన్‌తో బాధపడుతున్న లేదా బాధపడిన వారే. డిప్రెషన్ వ్యాధికి  స్త్రీ, పురుషుడూ... విద్యావంతుడు, నిరక్షరాస్యుడూ... ఆర్థికంగా బలవంతుడూ, బలహీనుడూ అనే వివక్ష లేదు. ఇది ఎవరికైనా రావచ్చు.

 

 

డిప్రెషన్‌కు  కారణాలు

 

మెదడులో వచ్చే మార్పుల వల్లనే డిప్రెషన్ వస్తుందన్న విషయం నిర్ద్వంద్వమైనదే. కానీ దానికి దోహదపడే పరిస్థితులపై, కారణాలపై శాస్త్రవేత్తలలో వాగ్వాదాలు నడుస్తున్నాయి. జన్యుపరమైన అంశాలూ, హార్మోన్ల పాళ్లలో మార్పులు, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు/జబ్బులు, తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన విచారం (గ్రీఫ్), తీవ్రమైన అవమానాలకూ/అత్యాచారాలకు లోనుకావడం కూడా డిప్రెషన్‌కు దారితీయవచ్చుననేది పరిశోధకుల అభిప్రాయం. పైన పేర్కొన్న అన్ని అంశాల్లో ఒకటిగానీ, లేదా చాలా అంశాలు కలగలసి గానీ మెదడులోని రసాయనాల్లో మార్పులు తీసుకురావచ్చనీ, దాంతో అది డిప్రెషన్‌కు దారితీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

 

డిప్రెషన్‌లో  రకాలు


 

డిప్రెషన్‌కు సంబంధించిన రుగ్మతలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు అధిక స్థాయి (మేజర్) డిప్రెషన్ ఉన్నవారిలో వారి పనిసామర్థ్యం, నిద్ర, చదువు, తిండి, జీవితాన్ని ఆస్వాదించడం... ఇలా దైనందిన వ్యవహారాల్లోని ప్రతి అంశమూ ప్రభావితమవుతుంది. కొన్ని రకాల డిప్రెషన్‌లు కాస్త వైవిధ్యమైన లక్షణాలతో కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని...

 

సైకోటిక్ డిప్రెషన్: కొందరు జీవితంలో తీవ్రంగా వ్యాకులతకు లోనవ్వడంతో పాటు కాస్తంత తీవ్రంగా (సైకోసిస్‌తో) ప్రవర్తించడం వంటి లక్షణాలను కనబరుస్తారు. వీటిలో చాలామంది కొన్ని రకాల భ్రాంతులకు లోనవుతారు.

 

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ : చిన్నారికి జన్మనిచ్చిన తల్లికి వచ్చే మానసిక సమస్య ఇది. పాపాయిని ప్రసవించిన వెంటనే వాళ్లలో కలిగే హార్మోనల్, భౌతికమైన మార్పులు ఈ తరహా డిప్రెషన్‌కు దారితీస్తాయి. కొత్తగా పుట్టిన తన బుజ్జాయిని అపురూపంగా, అత్యంత జాగ్రత్తగా చూసుకోగలనో లేదో అన్న సందేహం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 10 నుంచి 15 శాతం తల్లులు ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ బారిన పడతారు.

 

సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (శ్యాడ్):  చలికాలంలో తగినంత సహజ సూర్యకాంతి ఉండదు. దాంతో కొందరిలో డిప్రెషన్ వస్తుంటుంది. మళ్లీ వేసవి రాగానే మళ్లీ పగటి నిడివి పెరగడం, కాంతి కూడా పెరగడం వల్ల ఈ డిప్రెషన్ సహజంగానే తగ్గుతుంది. శ్యాడ్ అనే ఈ రుగ్మత కనిపిస్తే కాంతితో చికిత్స చేస్తారు. దీన్నే లైట్ థెరపీ అంటారు. ఈ రుగ్మతకు లోనైన వారిలో సగానికి పైగా రోగులు ‘లైట్ థెరపీ’తోనే బాగుపడతారు. ఇక మిగతావారికే కొన్ని రకాల మందులు, కొంత సైకోథెరపీ అవసరమవుతాయి. కొందరిలో ఈ మూడూ కలిసి ఇవ్వాల్సి రావచ్చు.



ఇక మరికొందరిలో బై-పోలార్ డిజార్డర్ అనే తరహా డిప్రెషన్ ఉంటుంది. వీరు అప్పటికప్పుడే తమను తాము చాలా గొప్పగా ఊహించుకుని, అంతలోనే తీవ్రంగా కుంగిపోతారు. ఇలా గొప్పగా భావించుకోవడం, తీవ్రంగా కుంగిపోవడం... ఒకదాని తర్వాత మరొకటిగా (సైక్లిక్‌ఫామ్‌లో) వస్తూ ఉంటాయి. ఈ సైకిల్‌లో గొప్పగా ఊహించుకోడాన్ని ‘మేనియా’గానూ, తీవ్రంగా కుంగిపోవడాన్ని ‘డిప్రెషన్’గానూ పేర్కొంటారు.

 

డిప్రెషన్‌కు  లక్షణాలు



డిప్రెషన్ సాధారణంగా ఆ రుగ్మతకు లోనైన వ్యక్తి తాలూకు ఆలోచనలనూ, భావోద్వేగాలనూ, ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి అతడిలో మానసిక లక్షణాలే కాకుండా, భౌతికమైన లక్షణాలూ కనిపించేలా చేస్తుంది. డిప్రెషన్‌కు లోనైన వారిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలివే...



 తీవ్రమైన విచారం  జీవితంపై నమ్మకం కోల్పోవడం  అపరాధభావన ముభావంగా ఉండటం  ఒక్కసారిగా చాలా  కోపం రావడం  స్నేహితులను కలవడంలోనూ లేదా తమకు గతంలో ఇష్టమైన/ఆనందం కలిగించిన అంశాలలోనూ ఆసక్తికనబరచకపోవడం సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం



 ఆలోచనల పరంగా...



  ఏదైనా ఆలోచన కలిగినప్పుడు దానిపై సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోవడం  నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం   విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇబ్బంది తమకు తామే హానిచేసుకునేలాంటి ఆలోచనలు రావడం  డిప్రెషన్ తీవ్రమైనప్పుడు భ్రాంతులకు లోనుకావడం.



ప్రవర్తన పరంగా...



ఇతరులతో కలవలేకపోవడం అవమానానికి గురైనట్లుగా భావించడం  తరచూ స్కూల్/ఆఫీసుకు ఎగవేతలు.

 

భౌతికంగా...



 తీవ్రమైన అలసట  కారణం లేకుండా ఎన్నో చోట్ల నొప్పులు రావడం  ఆకలిలో మార్పులు  బరువు కోల్పోవడం లేదా  అకస్మాత్తుగా చాలా బరువు పెరగడం  నిద్ర అలవాట్లలో మార్పులు (తీవ్రమైన నిద్రలేమి/అతిగా నిద్రపోవడం)



గమనిక : పైన పేర్కొన్న అంశాలలో చాలావరకు మన దైనందిన జీవితంలో ఏదో ఒకదాన్ని ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటాం. వాటన్నింటినీ డిప్రెషన్‌గా పేర్కొనలేం. నిపుణులైన డాక్టర్లు ఎవరైనా రోగికి డిప్రెషన్ ఉన్నట్లు గ్రహిస్తే... పై లక్షణాల్లో చాలా అంశాలు కలగలసి ఉన్నట్లుగా కనుక్కుంటారు. కాబట్టి పైన పేర్కొన్న అంశాల్లో ఒకటి రెండు కనిపిస్తే... దాన్ని పట్టుకుని మీకు డిప్రెషన్ ఉన్నట్లుగా భావించడం సరికాదు. ఆయా అంశాల్లో చాలామట్టుకు రెండువారాలకు పైగా ఉండటం, తామెంతగా ప్రయత్నించినా, సొంతంగా వాటి నుంచి బయటపడలేకపోవడం వంటి అనేక అంశాలను పరిశీలించి డాక్టర్లు డిప్రెషన్‌ను నిర్ధారణ చేస్తారు.

 

కలర్‌ఫుల్ ప్రపంచమైన బాలీవుడ్‌లో అగ్రశ్రేణి నటి దీపికా పదుకొణె. డబ్బుకు, గ్లామర్‌కు కొదవలేదు. అభిమానుల ఆదరానికి కొరతలేదు. అయినా దీపిక కూడా డిప్రెషన్‌కు లోనయ్యారు. మొదట్లో అందరిలాగే వైద్యుణ్ని సంప్రదించడానికి సంశయించారు. కానీ ఇదీ అన్ని వ్యాధుల్లాంటిదేనని గ్రహించి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. ఆమె పరోక్ష సందేశంతో ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తగిన చికిత్స తీసుకుని బాగుపడాలన్నదే ఈ కథనం ఉద్దేశం...

 

నివారించండిలా...

 

తప్పక వాడాల్సి వస్తే తప్ప... సాధ్యమైనంతవరకు యాంటీబయాటిక్స్  వాడవద్దు  

 క్లోరిన్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన నీరు లేదా ఫ్లోరినేటెడ్ నీరు తాగవద్దు.

 

మెదడుకు,  పొట్టకు బంధమిలా...

 

మన మెదడులో నిరాశ, నిస్పృహలూ, డిప్రెషన్ వంటివి కలిగాయనుకోండి. అవి పొట్టలో ఇబ్బందితో బయటపడతాయి. కడుపులో మంట, తిన్నది జీర్ణం కానట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మొదట కనపడతాయి. ఆ తర్వాత కూడా మనం డిప్రెషన్‌కు చికిత్స తీసుకోకపోతే అది గుండెజబ్బులకూ, టైప్ 2 డయాబెటిస్‌కూ దారితీయవచ్చు.

 

ఇక మనం పొట్టలో ఇబ్బందిని తగ్గించడం కోసం ప్రోబయాటిక్స్ (అంటే... పాలను పెరుగులా మార్చే బ్యాక్టీరియా... ఒక్కమాటలో చెప్పాలంటే తియ్యని పెరుగు), విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి... ఇచ్చినప్పుడు అవి పొట్ట ఇబ్బందితో పాటు మెదడులోని డిప్రెషన్‌నూ తగ్గిస్తాయి. ఎందుకంటే పొట్ట ఇబ్బందిని తొలగించడానికి వెలువరచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలన్నీ మెదడులోని డిప్రెషన్‌ను ప్రేరేపించే అంశాలను జోకొట్టి డిప్రెషన్‌నూ తగ్గిస్తాయి.  



  విటమిన్-డి లోపం కూడా డిప్రెషన్‌కు దారితీసే అంశమే. మన శరీరంలో విటమిన్- డి పాళ్లు 20 ఎన్జీ/ఎమ్‌ఎల్ కు తగ్గితే డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు 11 రెట్లు పెరుగుతాయి. అందుకే సూర్యరశ్మికి తక్కువగా ఎక్స్‌పోజ్ కావడం వల్ల వచ్చే  ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ - శ్యాడ్’తో బాధపడేవారికి విటమిన్-డి ఇవ్వడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.  విటమిన్ బి12 లోపం కూడా డిప్రెషన్‌కు దారి తీయవచ్చు. ఈ రెండింటి లోపం ఉన్నప్పుడు ఆహారంతో వాటిని భర్తీ చేయవచ్చు. ఇందుకు మాంసాహారంలోని ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, తిమింగలం నుంచి తీసి తయారు చేసే ‘క్రిల్ ఆయిల్’ (వేల్ ఆయిల్ ) ఉపయోగపడతాయి.

 

డిప్రెషన్  తగ్గాలంటే...


 

మన శరీరంలో చక్కెర పాళ్లు పెరిగితే... దాన్ని నియంత్రించేందుకు జరిగే జీవరసాయన చర్యలు డిప్రెషన్‌ను పెంచే అవకాశం ఉంది. మనం చక్కెరను తీసుకోగానే దాన్ని అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ స్రవిస్తుంది. దాంతో వెంటనే మెదడులో గ్లుటామేట్ అనే రసాయనం స్రవిస్తుంది. దీనికి  డిప్రెషన్‌ను పెంచే గుణం ఉంది. కాబట్టి స్వీట్స్ తినడంలో సంయమనం పాటించండి. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే చక్కెర పాళ్లు డిప్రెషన్‌ను పెంచుతాయి. కాబట్టి బేకరీ ఐటమ్స్ వంటివాటిని తగ్గించుకోండి. ఆ స్థానంలో పొట్టు ఉండే కార్బోహైడ్రేట్‌ట్లు చక్కెర విడుదలను నియంత్రిస్తాయి కాబట్టి పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన పదార్థాలను తినండి. ఇక మన ఇడ్లీ, దోసె వంటివి డిప్రెషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఎందుకంటే  ఇడ్లీ పిండి, దోసె పిండిలో పొట్టకు  మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంటాయి. ఇవి పొట్టలోకి వెళ్లి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 

సరికొత్త చికిత్సలు

 

 పెరుగు వంటి ప్రోబయాటిక్ పదార్థాలను ఇచ్చి చేసే చికిత్సలు డిప్రెషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయి. అందుకే వీటిని సైకోబయోటిక్స్ ఇచ్చే ప్రక్రియగా ఈ తరహా చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ సైకోబయోటిక్స్ కడుపులోని ఇన్‌ఫ్లమేషన్ గుణాన్ని తగ్గించి మెదడునూ సాంత్వన పరుస్తాయి.

 

ధ్యానం చేయడం (మెడిటేషన్) అనే ప్రక్రియ కూడా డిప్రెషన్ తగ్గించడంలో ఔషధం అంతటి భూమిక పోషిస్తుందని పరిశోధనల వల్ల తేలింది. దీనికి తోడు ఫార్మకోజీనోమిక్స్ అనే మందులతోనూ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తోనూ డిప్రెషన్‌తో బాధపడుతున్నవారిలో సానుకూల ధోరణిని పెంచి, వారిని బాగుచేయవచ్చు.



ఇక సరికొత్త మందుల విషయానికి వస్తే... కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ యాంటగొనిస్ట్స్, డెక్సామెథాజోన్, పార్షియల్ అడ్రనిలెక్టమీ వంటి శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక సీబీటీ, బ్రెయిన్ స్టిమ్యులేషన్స్, ట్రాన్స్‌క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్, ఎగ్జోజెనస్ బ్రెయిన్-డిరైవ్‌డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్లు ఇవ్వడం, సెరటోనిన్ రీ-అప్‌టేక్ ఇన్హిబిటార్స్‌ను సెలక్టివ్‌గా వాడటం, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులతో డిప్రెషన్‌ను సమర్థంగా నయం చేయవచ్చు.

 

మీ సేవాభావం... కావాలి ఇతరులకు ఆదర్శం!




 వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలే ప్రాతిపదిక. మీ ఎంట్రీలను పంపండి. మీ సేవాకార్యకలాపాల  దృష్టాంతాలకు  ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను పంపండి. చిరునామా: సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034.

 

సరికొత్త కారణాలు...

 

ఎంతోకాలంగా భావిస్తున్న సాంప్రదాయిక కారణాలతో పాటు ఇటీవల కొత్త పరిశోధనలతో మరెన్నో అంశాలు

 డిప్రెషన్‌కు  కారణమవుతున్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. వాటిని తెలుసుకుని, సమూలంగా అంకురం నుంచి వాటిని తొలగించగలిగితే డిప్రెషన్ కూడా దూరమవుతుంది.

 

 ఇదో విచిత్రం!

 

దీర్ఘకాలికంగా ఒక వ్యక్తిపై అదేపనిగా ఒత్తిడి పడుతూ ఉంటే అతడి జన్యువుల్లోనూ మార్పు వస్తుంది. రోజంతా అతడి ఎముక మజ్జ నుంచి ఎర్ర, తెల్ల రక్తకణాలు పెద్దసంఖ్యలో విడుదలవుతాయి. ఒక వైరస్ శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి జరిగే ప్రక్రియే... ఈ ఒత్తిడిని ఎదుర్కోవడంలోనూ జరుగుతుంది. అంటే యాంత్రికంగా శరీరం తనకు అయిష్టమైనదేదో లోనికి ప్రవేశించిందని గుర్తిస్తుందన్నమాట. అది ‘ఒత్తిడి’ అని శరీరానికి తెలియదు కదా. దాంతో ఈ ఎర్ర, తెల్ల రక్తకణాలకు తోడుగా వ్యాధినిరోధక కణాలూ పెద్దఎత్తున ఉత్పత్తి అవుతాయి. అసలక్కడ లేని శత్రువుతో పోరాటం చేయడం మొదలుపెడతాయి. పోరు ప్రారంభించగానే భౌతిక మార్పులతో శరీరంలో మంట, నొప్పి (ఇన్‌ఫ్లమేషన్) మొదలవుతుంది. తాము యుద్ధం చేయడానికి శత్రువు లేకపోవడంతో అవి మనలోని గుండె, రక్తప్రసరణ వ్యవస్థపై పోరాడి, గుండెజబ్బులకు కారణమవుతాయి. డయాబెటిస్‌కు దారితీస్తాయి. ఒక్కోసారి స్థూలకాయానికీ కారణమవుతాయి. అదేపనిగా జరిగే ఈ ప్రక్రియ వల్ల కొందరి కణాల్లో జన్యుపరమైన మార్పులూ రావచ్చు. ఇక మౌంట్ సియానీలోని ఐకాహ్‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో కొన్ని ఎలుకల మీద జరిగిన పరిశోధనల్లో ఇలా ఇన్‌ఫ్లమేటరీకి దారితీసే ఇమ్యూన్ కణాలు అదేపనిగా విడుదల అవుతూ ఉంటే... మెదడు బయట ఉంటే కొన్ని కణాలు ‘ఇంటర్‌ల్యూకిన్-6’ అనే ఒక రకం రసాయనాన్ని విడుదల చేస్తుందనీ, అది ‘డిప్రెషన్’ను కలిగిస్తుందని తేలింది.

 

చేదు  అనుభవం    


 

ఏదైనా ఇష్టంలేని చేదు అనుభవంతో డిప్రెషన్ వస్తుందని కౌమార వయసు (టీన్స్)లోని 36,000 మందిపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. మెదడుకు ఏదైనా ఆఘాతం తగలడం అనేది ఇరవై ఒక్క సెకండ్లకు పైగా కొనసాగినప్పుడూ డిప్రెషన్ కలుగుతుందని ‘జర్నల్ ఆఫ్ అడాలసెన్స్ హెల్త్’ పేర్కొంది. ఇలాంటప్పుడు తప్పక డాక్టర్‌ను కలవాలని ఆ జర్నల్ సూచిస్తోంది.  

 

దీర్ఘకాల  ఒత్తిడి


 

కొన్ని వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా ఒత్తిడికి గురవుతుంటే వారి మెదడులోని ‘మైక్రోగ్లియా’ అనే ఒక రకమైన కణాలు మార్పులకు లోనవుతాయి. ఈ మైక్రోగ్లియా కణాలు మెదడులోని కణాల్లో 10 శాతం ఉంటాయి. వీటిని మెదడు వ్యాధి నిరోధక కణాలుగా భావించవచ్చు. దీర్ఘకాలం కొనసాగే ఒత్తిడి వల్ల ఈ కణాల స్వరూపంలో మార్పులు వచ్చినప్పుడూ డిప్రెషన్ కలుగుతుందని హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దాంతో న్యూరో-సైకియాట్రిక్ వ్యాధులు రావడం సహజమని పేర్కొంటున్నారు. దీనివల్ల మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ అనే భాగం ప్రభావితమవుతుంది. (మనలోని భావోద్వేగాలకూ, నేర్చుకునే ప్రక్రియకూ, జ్ఞాపకముంచుకోవడం అనే కార్యకలాపాలకు మూలకేంద్రం ఈ హిప్పోక్యాంపసే).

 

‘టీన్ జీన్’ కూడా ఒక కారణమే...

 

మన మెదడులో ఏర్పడిన కణాలు తొలి రెండేళ్ల పాటు విభజితమవుతుంటాయి. ఆ తర్వాత అవి అటు ఇటు రీ-అడ్జెస్ట్ అవుతాయంతే. ఇక బాల్యం దాటి టీనేజ్‌లో ప్రవేశించాక... ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సంతరించుకునే సమయంలో మెదడు కణాలు పరిణతి సాధిస్తూ, వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ మార్పుచెందుతుంటాయి. ఈ మార్పులనే ‘టీన్ జీన్’గా వ్యవహరిస్తుంటారు. ఈ సమయంలో యువతలో ఉండే ఉత్సాహం, ఉద్వేగాలు తప్పుదారి పట్టి మాదకద్రవ్యాల (డ్రగ్ అబ్యూజ్) వంటి దురలవాట్లకు లోనయ్యేందుకూ లేదా తమ తీవ్ర భావోద్వేగాలతో స్క్రీజోఫ్రీనియా, డిప్రెషన్‌లకు గురయ్యేందుకు అవకాశాలున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందుకే ఆ వయసు పిల్లల వ్యక్తిత్వం సరిగా వికసితమయ్యేలా మంచి పుస్తకాలు చదవడం, మంచి హాబీలను అభివృద్ధి చేసుకోవడం, లలితకళల వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో ఆ వయసువారిని నిమగ్నం చేయడం మంచిది.

 

వ్యాపకం లేకపోవడం

 


పూర్తిస్థాయి విశ్రాంతి గానీ వ్యాపకంగానీ లేకపోవడం వంటి అంశాలు సైతం ‘డిప్రెషన్’కు దారితీయవచ్చని ‘కెనెడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ’ పేర్కొంటోంది.  గుండె ఆపరేషన్ అయిన వారు తాము ఏ పనీ చేయకూడదనే అపోహలో ఉంటారు. ఫలితంగా ‘గుండె శస్త్రచికిత్స’ జరిగిన వారిలో 40 శాతం మంది డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. గుండె శస్త్రచికిత్స జరిగిన వారు గుండెపై భారం పడేలా పనిచేయకూడదన్న అంశం వాస్తవమే గానీ... దానర్థం అసలే పనిచేయకూడదని కాదు. తమకు ఆనందం కలిగించే వ్యాపకాలు, నడక, గార్డెనింగ్ వంటివి శ్రమ కలగని రీతిలో చేయాల్సిందే. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మనలో ఫీల్‌గుడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు వ్యాయామం చేయగానే మన  శరీరంలోంచి ‘కైన్యురెనిన్’ అనే ప్రోటీన్ తొలగిపోతుంది. అలాగే శరీరంలో ఉండిపోతే ఆ ప్రోటీన్ మనకు ‘డిప్రెషన్’ను కలిగిస్తుంది. అందుకే అలసట కలగని విధంగానూ, ఆరోగ్యకరమైన రీతిలోనూ వ్యాయామం చేయడం అవసరమే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top