నీర్జా ప్రాఫిట్‌ హైజాక్‌!

నీర్జా ప్రాఫిట్‌ హైజాక్‌!


లెక్క లెక్కే



అప్పుడు విమానం హైజాక్‌ అయింది. ఇప్పుడు ప్రాఫిట్‌ హైజాక్‌ అయిందా? ఏమో! సిచ్యుయేషన్‌ చూస్తే అలాగే ఉంది. సినిమా వాళ్ల మాట నీటి మీద రాత అని నీర్జా బానోత్‌ కుటుంబానికి గ్రహింపుకొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటి? ఎయిర్‌హోస్టెస్‌ నీరజా బానోత్‌... ఎప్పటి మాట? అవును, విమానం హైజాక్‌ ముప్పై ఏళ్ల కిందటి సంగతి. ప్రాఫిట్‌ హైజాక్‌ తాజా ఖబర్‌.



అది 1986, సెప్టెంబర్‌ 5. పాన్‌ ఆమ్‌ 73 విమానం హైజాక్‌. బాంబే– కరాచీ– ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా న్యూయార్క్‌కు ప్రయాణించాలి. పాకిస్థాన్‌ పోలీసుల వేషధారణలో ఉన్న లిబియా టెర్రరిస్టులు విమానాన్ని కరాచీలో దించారు. ఎయిర్‌హోస్టెస్‌ 22 ఏళ్ల నీర్జాబానోత్‌ ఉగ్రదాడి నుంచి ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలర్పించింది. ఆమె సాహసానికి, సమయస్ఫూర్తికి, పరాక్రమానికి గాను భారత ప్రభుత్వం 1997లో అశోక చక్ర అవార్డు ప్రదానం చేసింది.



ఇప్పుడేమయింది?

నీర్జా బానోత్‌ బయోపిక్‌ తీయాలనే మంచి సంకల్పంతో 2015 మే నెలలో ఆమెను వార్తల్లోకి తెచ్చింది బాలీవుడ్‌. నీర్జా పాత్రధారి సోనమ్‌కపూర్, దర్శకుడు రామ్‌ మధ్వానీ, నిర్మాత అతుల్‌ కస్‌బేకర్‌తో సినిమా బృందం... నీర్జ సొంతూరు చండీఘర్‌ వెళ్లి... ఆమె అలవాట్ల నుంచి, ఇష్టాల వరకు ప్రతిదీ పూసగుచ్చినట్లు అధ్యయనం చేశారు. స్క్రిప్టుకి అంగీకారం కోరారు. నీర్జ తల్లిదండ్రులు భావోద్వేగంతో ఆమోదం తెలిపారు. ఆ ఎమోషన్‌లో నిర్మాత మరో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.



అదేంటంటే... సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో పది శాతం నీర్జా బానోత్‌ కుటుంబానికి ఇస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ నిర్మాత ఆ ఒప్పందాన్ని తప్పాడని నీర్జా సోదరుడు అనీష్‌ బానోత్‌ లీగల్‌ నోటీస్‌ పంపాడు. అదే ఇప్పుడు వార్త. ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశానంటాడు నిర్మాత. బానోత్‌ లాయరు అనూష నాగరాజన్‌ మాత్రం... ‘‘ఇవ్వాల్సినంత ఇవ్వలేదు’’ అంటున్నారు. ఆ సినిమా నూటాపాతిక కోట్ల వ్యాపారం చేసింది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top