నా భార్య మెచ్యూర్ కూడా కాలేదు

నా భార్య  మెచ్యూర్ కూడా కాలేదు


లీగల్ కౌన్సెలింగ్



మేడం, నా వయసు 28 సంవత్సరాలు. పోలీసు డిపార్టుమెంట్‌లో పని చేస్తున్నాను. నా సమస్య వివరించాలంటే సిగ్గుగా, భయంగా ఉంది. భయమెందుకంటే 498 ఎ గురించి. పైగా నేను పోలీస్ డిపార్ట్‌మెంట్ వాడిని. అందరూ నన్నే దుమ్మెత్తి పోస్తారు. సిగ్గెందుకంటే నా వివాహమై పదినెలలైంది. ఇంతవరకూ మా మధ్య శారీరక బంధం ఏర్పడలేదు. కొత్తకదా భయపడుతోందేమో అని కొన్ని నెలలు సర్దుకున్నాను. ఎవ్వరికీ చెప్పలేదు. తనలో చాలా ఫ్రెండ్లీగా మెలిగాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మా మధ్య ఆ చర్య కష్టమైంది. చివరికి ఆమెను ఎంతో అనునయించి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లాను. లేడీ డాక్టర్ చెప్పిన విషయం విని నాకు నోటమాట రాలేదు. నా కలలు కుప్పకూలాయి. ఒకవైపు కోపం, మరోవైపు ఆవేదన. ఆమెకు అసలు జననాంగాలు అభివృద్ధి చెందలేదట. గర్భసంచి కూడా లేదట. పిల్లలమాట అటువంచి సంసార జీవితమే సాధ్యం కాదట. నాకే ఎందుకిలా జరిగిందో ఏం పాపం చేశానో అర్థం కావట్లేదు. పైగా నా భార్య ఇంతవరకూ మెచ్యూర్ కూడా కాలేదని, సంసారం, సంతానం అసాధ్యమని లేడీ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు.సెకండ్ ఒపీనియన్‌లో కూడా అలాంటి రిపోర్ట్‌లే వచ్చాయి. సిగ్గుతో, అవమానంతో, భయంతో చచ్చిపోతున్నాను. ఆడవాళ్లకు మంచి సలహాలు ఇస్తారుగా. మరి నాకేం చెప్తారో, దయచేసి చెప్పండమ్మా! - వై.కె.శ్రీనివాస్, పామర్రు

దిగులు పడకండి శ్రీనివాస్, ఇందులో మీ తప్పేమీ లేదు. మీ భార్య, ఆమె తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు. ఎందుకంటే అసలు రజస్వలే కాని పిల్లకు పెళ్లి చేయడం వారు చేసిన తప్పు. మీ వివాహం జరిగి పదినెలలు అయిందంటున్నారు కదా, మీ వివాహాన్ని కోర్టు ద్వారా రద్దు చేసుకోవచ్చు. మీ కేసులో మీ భార్య ఇంపొటెంట్. అంటే సంసారానికి, సంతానానికి అర్హురాలు కాదు కాబట్టి సెక్షన్ 12, హిందూ వివాహ చట్టం 1955ను అనుసరించి, మీ వద్దనున్న మెడికల్ రిపోర్టుల ఆధారంగా మీ వివాహాన్ని రద్దు పరుచుకోండి. అంటే నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయించుకోండి. ఈ కేసు వివాహమైన సంవత్సరంలోగా వేయాలి. త్వరపడండి. వారు మీమీద 498 ఎ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆందోళన అవసరం లేదు.

 



మేడమ్, నా పేరు సల్మా. మేము ముస్లిమ్స్. నా వివాహమై 15 సంవత్సరాలయింది. నా భర్త ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు. మాకు ఒక బాబు. హై స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఐదేళ్ల కిందట మావారు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఆయనకు చెడు అలవాట్లు అనేకం. బాగా తాగడం, పేకాటాడటం, అప్పులు చేయడం మొదలైనవి నేను అతని ఆచూకీ గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మా అత్తామామలు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. మిస్సింగ్ కేసు పెట్టి నాలుగేళ్లైంది. అదీ తేలలేదు. నాకు దుబాయ్‌లో ఆయాగా ఉద్యోగం వచ్చింది. నా బతుకుతెరువు నేను చూసుకోవాలి. నా బాబును చదివించుకోవాలి. బాబు బాధ్యత నా తలిదండ్రులకు అప్పగించి, ఉద్యోగానికి వెళ్లాలి. నేను విడాకులు తీసుకుని దుబాయికి పోవాలి. నేను ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు. నాకు మా చట్టం పట్ల సరియైన అవగాహన లేదు.

 మీరు తప్పకుండా విడాకులు తీసుకోవచ్చు. ఆచూకీ తెలియని భర్తకోసం ఎన్నాళ్లు ఎదురు చూస్తారు? మీకోసం ఉన్న చట్టం డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ 1939. అంటే ముస్లిం వివాహాల రద్దు చట్టం అన్నమాట. ముస్లిం మహిళలు ఈ చట్టాన్ని అనుసరించి వివాహం రద్దు చేసుకోవచ్చు. ఏయే కారణాల వల్ల ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చా ఇందులో తెలియపరిచారు. ఒక ముస్లిం మహిళ భర్త ఆచూకీ తెలియవలసిన వారికి; అంటే కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు నాలుగు సంవత్సరాల నుండి తెలియకుండా ఉంటే ఆమె ఆ కారణంగా కోర్టులో విడాకుల దావా వేయవచ్చు. ప్రతివాదులుగా భర్త దగ్గరి బంధువులకు, వారసులుంటే వారికి నోటీసు ఇచ్చి, దావా వేయాలి. ప్రతివాదుల వాదనలు విన్న ఆరునెలల తర్వాత మాత్రమే అమలులోకి వస్తుంది. ఈ ఆరునెలల కాలంలో భర్త స్వయంగా కానీ, ఏజెంట్ ద్వారా కానీ కోర్టు ముందు హాజరై, తన భార్యతో వైవాహిక జీవితం గడుపుతానని కోర్టును సంతృప్తి పరిచినప్పుడు కోర్టు ఆ డిక్రీని రద్దు పరిచే అవకాశం ఉంది.

 


ఇ.పార్వతి

అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top