గ్రీకువీరుడు... నాకొద్దు

బడ్జెట్: రూ.34 కోట్లు  వ సూళ్లు: రూ.2,500కోట్ల 40 లక్షలు


సినిమా / మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్

 

నియోవర్డోలాస్...1995లో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి. సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చిన్నా చితకా వేషాలు. కానీ అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఆఫర్లు కూడా అంతంతమాత్రమే. ఆ సమయంలోనే తనలో దాగి ఉన్న స్క్రిప్ట్‌రైటింగ్ గుర్తుకువచ్చింది. కథ మొదలుపెట్టింది. ఇక తన ఆలోచనలను అక్షరాలుగా మార్చింది. ఎవరి కథో ఎందుకు? తన జీవితాన్నే రాద్దామనుకుంది. 1993లో హాలీవుడ్ నటుడు ఇయాన్ గోమెజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నియా వర్డోలాస్. దీని కోసం ఆమె తన కుటుంబంతో చిన్న పాటి యుద్ధమే చేసింది. ఆ డ్రామానే కథగా అల్లి స్క్రిప్ట్ తయారు చేసింది. అదే ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’ అయితే సినిమాగా కాదు. కేవలం వన్ ఉమెన్ ప్లే కోసమే. అంటే ఆ నాటకంలో ఒకే ఒక్క స్త్రీ పాత్ర ఉంటుంది.



ఆమె పాత్ర చుట్టూనే ఈ నాటకం సాగుతుంది. నియో కథానాయికగా నటించిన ఈ నాటకం హాస్యభరితంగా సాగుతూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తి సూపర్‌హిట్ అయింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ నాటకాన్ని చూడటానికి క్యూలు కట్టారు. ఇంత క్రేజ్ తెచ్చుకున్న నాటకాన్ని సినిమా స్క్రిప్ట్‌గా తీర్చిదిద్ది నిర్మాణ సంస్థల గడపలు తొక్కింది. అందరూ కథాకథనాలు బాగుందన్న వాళ్లే కానీ చిన్న మెలిక. స్క్రిప్ట్ ఓకే, ‘‘కానీ హీరోయిన్‌గా నువ్వు కాకుండా వేరే అమ్మాయి అయితే బాగుంటుంది’’ అని సలహా. వినీ వినీ విసిగిపోయింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆమె ఆశ నిరాశే అయింది. ఆ సమయంలోనే ఒకే ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ నుంచి వచ్చింది. ఎవరో కావాలని ఆటపట్టించడానికి చేసుంటారేమో అనుకుంది. కానీ నిజమే. ఈ స్క్రిప్ట్‌తో సినిమా తీద్దామన్నాడు. హీరోయిన్ కూడా తనే. ఇంకేముంది . ఎగిరి గంతేసింది. జోల్జ్‌విక్ దర్శకత్వంలో జాన్ కార్బెట్ హీరోగా నటించిన ఈ చిత్రం 2002 ఏప్రిల్ 19న విడుదలై సంచలన విజయం సాధించింది. పెద్ద పెద్ద స్టార్లు, గ్రాఫిక్స్ హంగులూ ఆర్భాటాల్లేని పెళ్లిసందడే ఈ సినిమా.



అమెరికాలో పెళ్లి సందడి

అనగనగా ఓ అమెరికన్ యువతి. పేరు టూలా పోర్టోకలాస్. ప్రతి అమ్మాయికీ ఉండే ఆశలే. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా సెటిలైపోవాలి. కానీ ఒకే ఒక్క రూల్ ఆమె పెళ్లికి అడ్డు పడుతూ ఉంటుంది. అదేంటంటే కేవలం గ్రీక్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. అమెరికాలోని గ్రీక్ కుటుంబాల్లో రాసుకోని రాజ్యాంగ మిది. టూలా తండ్రి గస్ పార్టోకలాస్ కూడా ఇదే ఫాలో అయ్యాడు. గస్ వ్యాపారాలను చూసుకుంటూ ఉంటాడు. వీళ్లది ఉమ్మడి కుటుంబం. అందర్నీ లెక్కపడితే 60 దాటాల్సిందే. ఇంత మంది మధ్యలో అల్లారుముద్దుగా పెరుగుతుంది టూలా. ఆమెకు ఒక అక్క. తమ్ముడు. తండ్రి మాటను పెద్దమ్మాయి తు.చ తప్పకుండా పాటించింది. 33 ఏళ్లు వచ్చేసరికి గ్రీక్ అబ్బాయినే పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో బిజీ అయిపోయింది. టూలాకు 30 ఏళ్లు. కానీ పెళ్లి ఘడియలు మాత్రం ఆమె జీవితంలోకి రావడం లేదు. తండ్రి మాత్రం పెళ్లి సంబంధాలను చూస్తూనే ఉన్నాడు. కానీ ఎవరికీ ఆమె నచ్చడం లేదు. తండ్రి పెంపకంలో భయం భయంగా పెరిగిన టూలా ఎవరికీ ఏదీ మనసు విప్పి చెప్పుకోలేదు. కాస్త వయసొచ్చాక కాలేజీ చదువు కూడా ఆపించేసి తన రెస్టారెంట్ బిజినెస్‌ను అప్పగించాడు. అందుకే చిన్న చిన్న సరదాలు, సంతోషాలకు ఆమె దూరం. తాను చిన్నతనం నుంచి అందంగా ఉండనని టూలా నమ్మకం.



అందుకు తగ్గట్టే పెద్ద పెద్ద కళ్లద్దాలు, నీరసించిన ముఖంతో 30 ఏళ్ల అమ్మాయి కూడా 40, 50 ఏళ్ల మహిళగా కనిపిస్తుంది. ఇలా నిస్సారంగా గడి చిపోతున్న ఆమె జీవితంలోకి వసంతంలా ప్రవేశిస్తాడు ఇయాన్ మిల్లర్. రెస్టారెంట్‌కు కస్టమర్‌గా వచ్చిన ఇయాన్ మిల్లర్‌ను చూడగానే ఆమె మనసులో తొలిసారిగా వెన్నెల విరిసింది. ఆరడుగుల ఇయాన్‌ను చూడగానే వెంటనే ప్రేమలో పడిపోతుంది. అంత అందగాడి ముందు తానెంతని దిగులుపడుతుంది. ఇక తనను తాను కొత్తగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ రెస్టారెంట్ బిజినెస్‌లో ఉంటే తన కెరీర్ అర్థమైపోయిందామెకు. తండ్రి గస్ వద్దంటున్నా సరే కంప్యూటర్ కోర్సులో చేరుతుంది. తన అందానికి అడ్డుగా ఉన్న కళ్లద్దాలు తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టింది. మేకప్ మెరుపులే తెలియని తన ముఖానికి దాని మెరుపులను పరిచయం చేసింది. కోర్సు పూర్తయ్యాక తమ కుటుంబానికే చెందిన ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్‌ను మరింత ఆత్మవిశ్వాసంతో రన్ చేస్తుంది. ఇలా నిస్తేజంగా ఉన్న జీవితంలోకి మళ్లీ ఇయాన్ మిల్లర్ ఎంటరయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇయాన్ అమెరికన్ యువకుడు కాబట్టి తమ పెళ్లికితండ్రి ఒప్పుకుంటాడా అని టూలాకు ఏదో మూల సందేహం. అయినా సరే ఒప్పించే చేసుకోవాలి. తినే ఆహరం నుంచి మాట్లాడే భాష వరకూ ఏ విషయంలోనూ ఇరు కుటుంబాలకూ పొంతనే ఉండదు. ఇంతలో వీళ్ల విషయం ఇంట్లో తెలిసిపోయింది. గస్ కుటుంబ సభ్యుల సమక్షంలో పంచాయితీ పెట్టి బావురమన్నాడు. ఇయాన్‌ను తిట్టిపోశాడు. అయినా కూతురు పట్టుదల చూసి ఇయాన్‌ను మళ్లీ పిలిపించాడు. పెళ్లి కోసం ఏదైనా చేస్తానన్న ఇయాన్,గ్రీక్ చర్చిలో బాప్తిజం స్వీకరిస్తాడు. దీంతో అందరికీ ఓకే. ఓ శుభ సమయాన అందరి సమక్షంలో చర్చిలో టూలా, ఇయాన్‌లు తమ బంధాన్ని శాశ్వతం చేసుకుంటారు.    



సీక్వెల్ కూడా ఈ ఏడాదే...

ఈ సినిమా మొదటి భాగం ఎండింగ్ టైటిల్స్‌లో టూలా-ఇయాన్‌లకు ఓ పాప పుట్టినట్టు చూపించడంతో ముగుస్తుంది. వీళ్ల కూతురి పెళ్లి కోలాహలమే ఈ చిత్రం సీక్వెల్.  దాదాపు 14 ఏళ్ల  క్రితం వచ్చిన ఈ సినిమాలో ఉన్న నటీనటులే మళ్లీ ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారని ఇప్పటికే విడుదల  చేసిన  ప్రచార చిత్రం బట్టి తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.



 - బి.శశాంక్  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top