కనపడని పాతమిత్రులు...

కనపడని పాతమిత్రులు... - Sakshi


ఆ రోజులు...

 

ఊరంతా దీపాలు ముట్టించుకున్నాక ఊరు మధ్యగా వెళ్లే రోడ్డు మీద కూడా ఒక దీపం వెలుగుతుంది. ఖాళీ నెరొలాక్ డబ్బాలో వెడల్పాటి వత్తి గుచ్చి కిరోసిన్ పోసి ఎంత గాలి కొట్టినా ఆరిపోనంత మొండిగా సిద్ధమైన ఆ దీపం రాత్రంతా మండుతూ రంగుల చాక్‌పీసులతో గీసిన దయామయుడైన ఏసుప్రభువును చూపిస్తూ ఆ బొమ్మను గీసిన చేతులకు సాయం చేయమని ప్రాధేయ పడుతూ ఉంటుంది. బస్సులు వెళుతూ ఉంటాయి. లారీలు వెళుతూ ఉంటాయి. పాదచారులు కూడా. ఇంతమంది వెళుతుంటే వారి కాళ్లు పడకుండా పారేసిన అరటిగెలల మోడులను రక్షగా అమర్చి నా పని అయిపోయిందన్నట్టుగా దూరంగా వెళ్లి నిద్రపోతున్న ఆ అనామక చిత్రకారుడికి ఏదైనా ఇమ్మని కరుణామయుని గుండెల మీద ఉన్న శిలువ మౌనంగా ప్రతి ఒక్కరికీ మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఐదు పైసలు పడతాయి. సిల్వర్ కలర్‌లో మెరుస్తూ కొత్త పది పైసలు పడతాయి.



కాని చీకటిలో కలిసిపోయే పావలా కాసే అతడికి కాసింత టీ పోస్తుంది. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, కాషాయ వర్ణాలలో ఉన్న షిర్డీ సాయిబాబా.... రోడ్డు మీదన్న దుమ్మును పదే పదే అరచేతుల్తో తోస్తూ తోస్తూ రంగు సుద్దలతో దైవానికి ప్రాణం పోస్తూ పోస్తూ ఎంత పెద్ద దేవుణ్ణి గీసినా ఒక్క పది రూపాయలు గిట్టక  అలసి పోయి ఆకలితో అలమటించిపోయి ఒక్క మాట మాట్లాడకుండా కనపడకుండా పోయిన ఆ పాత మిత్రుడు ఒక చిననాటి జ్ఞాపకం.



సినిమా హాళ్ల దగ్గర ఫస్ట్ షో మొదలవుతుంది. చిన్న ఊళ్లలో వేరే వ్యాపకం లేకుండా ఉంటుంది. అటూ ఇటూ చూసి  ఆ బక్కపలచటి మనిషి మెల్లగా మట్టి లోడటం మొదలుపెడతాడు. అతడు చేయబోయేది తెలిసి పిల్లలు చుట్టూ మూగుతుంటారు. దారిన పోయేవారు ఒక కన్నేసి పెడుతూ ఉంటారు. నడుముకు ఒక వస్త్రం తప్ప వేరే ఏ భాగ్యం లేని ఆ మనిషి అప్పుడిక మెల్లగా తాను తీసిన జానెడు లోతు గొయ్యిలో తలను దూర్చి తల కిందులుగా నిలబడి కంఠం వరకూ మట్టిని కప్పుకుని తన పీకల్లోతు కష్టాలను లోకానికి చెప్పుకుంటాడు. చిల్లర పడుతుంది. అదృష్టం బాగుంటే రూపాయి నోటు కూడా పడుతుంది. ఇంకా బాగుంటే ఇటుక రంగులో ఉండే రెండు రూపాయల నోటు! లోపల ఉన్నవాడికి గాలి ఎలా ఆడుతుంది? ఏమో. కాని ఆ గాలాడని బతుకు వదలని ఒక జ్ఞాపకం.

 రాత్రి ఎనిమిదైతే జుట్టు తెల్లబడ్డ ఆ పండు ముసలాయన చూపులు ఏమాత్రం మరల్చకుండా చేతిలో కంచు గంటను మోగిస్తూ అంగళ్లు ఉన్న బజారులో ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతాడు. ఇక షాపులు కట్టేసే సమయం వచ్చిందని గణగణలతో హెచ్చరిక చేస్తాడు. అతడి మాటే వేదవాక్కుగా మరో పదిహేను ఇరవై నిమిషాలలో షాపులన్నీ మెల్లమెల్లగా కట్టేసి బజార్లు నిర్మానుష్యమై పోతాయి. నిద్రలను దొంగిలించే టీవీలు రాని ఆ కాలంలో రాత్రి తొమ్మిదికంతా ఊరు నిద్రపోయిన జ్ఞాపకం. నిద్ర పోయే ముందు ఇంట్లో అందరూ ముచ్చట్లు చెప్పుకున్న మేలిమి జ్ఞాపకం.



భుజానికి డప్పు తగిలించుకున్న మనిషి కూడలిలో డమడమమని మోగించి ఫలానా రోజున పోలేరమ్మకు పొంగళ్లు పెడతారహో అని ప్రకటిస్తాడు. ఇక పసుపూ కుంకుమలతో  పోలేరమ్మబండలు కళకళలాడతాయి. వేప మండలు తోరణాలు అవుతాయి. తలస్నానం చేసి వదులుముడులలో మందారాలు గుచ్చిన ఆడవాళ్లు వరసలు కడతారు... బాగా బలిసి మదమెక్కి కనపడిన బర్రెగొడ్డునల్లా భయపెట్టే బలిష్టమైన పోలేరమ్మ దున్నపోతు వీధిన ఠీవిగా నిలబడి స్కూళ్లకెళ్లే పిల్లలను బెదరగొడుతుంది.



 ఆ ముంగిస కూచోగా ఎప్పుడూ చూడలేదు. నిద్రపోగా అసలే చూడలేదు. నేలకు దించిన మోకు చుట్టూ అవిశ్రాంతంగా అది తిరుగుతూ ఉంటే బుట్టలో ఉన్న నాగన్న  పడగ దించి పడుకుని ఉంటే ఆ రెంటికీ కాసేపట్లో ఫైటింగ్ అని అట్టహాసం చేసి నలుగురూ పోగయ్యాక డోలు వాయించే కుర్రాణ్ణి నెత్తురు కక్కుకునేలా చేసి కదిలారో మీ గతి ఇంతే అని బెదరగొట్టి చేతికందిన మూలికను రూపాయి రెండు రూపాయిలకు అంటగట్టి ఆ పూటకు రైల్వేరోడ్డులోని హోటలు నుంచి పార్శిలు భోజనం తెచ్చి కుటుంబానికంతటికీ నాలుగు ముద్దలు తినిపించే మోళీ సాయెబూ అతడి వదులు లాల్చి చక్కటి ముక్కూ తెల్లటి పళ్లూ... ఆట మొదలయ్యేంత వరకూ అతడు వాయించే బుల్‌బుల్‌తారా దాని మీద పలికించే ఆకుచాటు పిందె తడిసే.... నిన్న మొన్నే చూసినట్టుగా తాజా జ్ఞాపకం.



 సంవత్సరానికి ఒకసారి ఊరికి పులుల్ని సింహాలనీ ఏనుగుల్నీ ఒంటెల్నీ తీసుకొచ్చి సాయంత్రం కాగానే ఊరి మీద ఫోకస్ తిప్పే ఆ సర్కస్‌లు.... ఉర్సుల్లో తిరునాళ్లలో కెమెరాలు మెడలో వేసుకుని ఎన్టీఆర్ పక్కన ఏఎన్నార్ పక్కన శ్రీదేవి పక్కన ఫోటోలు తీసి గంటలో కడిగి ఇచ్చే ఆ స్టూడియోలు.... స్కూటర్ మీద కూచుని దిగిన ఫొటో... ఇద్దరు మిత్రులు డబుల్ ఫోజ్ ఫొటో.... నాలుగు బల్లల మీద పరిచిన ఎర్ర జంపఖానా మీద మెడలో బంతిపూల మాలతో హరికథను మొదలెట్టే భాగవతారుడు, భర్‌దే జోలీ పాడే చప్పట్ల ఆ ఖవాలీ బృందం.... ఈ బుగ్గ నుంచి ఆ బుగ్గకు కత్తిని దూర్చే రౌద్ర భక్తుడు... బవిరి గడ్డంతో నాపరాతిని విసిరి పారేసే పక్కీరు....

 సొంటి కాపీ... అని ఒకరకంగా అరుస్తూ చురుగ్గా తిరిగి అమ్మే ఆ పెద్ద మనిషి, ఒంటి మీద చొక్కా లేకుండా బెజ్జాల బనీను, చారల లుంగీ కట్టుకుని భుజాన లెదర్‌బ్యాగుతో గుబిలి తీస్తానని సైకిల్ పట్టుకుని తిరిగే ఆ ముసల్మాను, భాగ్య లక్ష్మి స్టేట్‌లాటరీ... టికెట్టు వెల ఒక్క రూపాయి... అంటూ గొంతు చించుకుంటూ రిక్షాలో క్లిప్పులకు టికెట్లు వేలాడదీస్తూ తిరిగే ఆ పంతులుగారు....  ఫలానా హాలులో ఫలానా సినిమా వచ్చిందంటూ వీధివీధినా బండి తోసుకు తిరిగే లోకల్ టాలెంట్ స్టార్ అనౌన్సర్లు.... చింతామణి నాటకం పోస్టర్లు....

 సత్య హరిశ్చంద్ర కోసం డి.వి.సుబ్బారావు వస్తున్నాడొస్తున్నాడంటూ ఆర్టీసీ బస్సు వెనుక ప్రకటనలు....

 కాలేజీ గోడల మీద ఇంక్విలాబ్ జిందాబాద్.... కావిరంగుతో గీసిన కణకణలాడే పిడికిళ్లు....

 కనపడుట లేదు. కనపడుట లేదు.

 బి.టెక్ చదువు... అమెరికా కదులు... ఎవరు ఎలాగైనా పోనీ.

 - ఖదీర్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top