మేడిన్ ఇండియా!

మేడిన్  ఇండియా! - Sakshi


భారత్ ప్రపంచానికి కార్మికులను అందించే కర్మాగారం... ఇండియా అంటే ఒక కాల్‌సెంటర్! ఔట్‌సోర్సింగ్ తో పొరుగు దేశాలకు సేవలనందిస్తూ పొట్టనింపుకొనే దేశం.. ఇది నాణేనికి ఒక వైపు!అతి తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపిన దేశం. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చు తోనే ఆ అద్భుతాన్ని సృష్టించగలిగారు భారత శాస్త్రవేత్తలు. ఈ విషయంలో నాసా, ఇసాలు కూడా ఇండియాని చూసి ఔరా అనుకొన్నాయి. ఇదీ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్న ఇండియా రెండో కోణం!



అంతేనా... తరచి చూడాలి కానీ ఇంకా ఎంతో ఉంది. కేవలం ఇస్రో చేస్తున్నవి మాత్రమే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. గత దశాబ్దాల్లో మేధోవలసతో సతమతమైన దేశంలో ఇప్పుడు స్టార్టప్‌ల మోతమోగుతోంది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని మన మేధావులు వారి వీధుల నుంచే విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతున్నారు. అనేక మందికి ఉపాధి చూపగల, మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేయగల వారి ఆవిష్కరణల ద్వారా అబ్బురపరచడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి.. వారి ఆవిష్కరణల గురించి...

 

 తవుడు నుంచి విద్యుత్!



విద్యుత్ కోతల గురించి భారతీయులకు ఉన్నంత విజ్ఞానం ఎవరికీ ఉండదు. మరి అందరికీ అవగాహన ఉన్న ఈ అంశంపై ఒక పరిష్కారమార్గాన్ని కనుగొని వార్తల్లోకి వచ్చాడు జ్ఞానేష్‌పాండే అనే బిహారీ. ఇతడి ఆలోచన ఇప్పుడు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సరికొత్త పవర్ ప్లాంట్‌లను ఆవిష్కరించింది. 250 గ్రామాల్లోని 20,000 గృహాల్లో కరెంటు దీపాన్ని వెలిగించింది. తవుడుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఆవిష్కరించాడు పాండే. గ్రామీణప్రాంతాల్లో వరి తవుడు విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. పశువుల దాణాకు ఉపయోగించే ఈ తవుడుతోనే ఇప్పుడు అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మన సమాజాలను ప్రభావితం చేయడానికి ఇంతకన్నా గొప్ప ఆలోచన ఏముంది!

 

వ్యవ‘సాయం’ చేస్తుంది!



పంటలకు పురుగుమందులను స్ప్రే చేయడానికి తగిన డ్రోన్‌ను రూపొందించాడు దులాల్ అధికారి అనే బెంగాల్ విద్యార్థి. సాధారణంగా మోటార్‌స్ప్రేయర్లతో రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇది కష్టంతో కూడుకొన్న పని.. ఎక్కువ సమయం తీసుకొనే పని. కొన్ని రకాల పంటలకు మోటార్‌స్ప్రేతో మందులు చల్లడం కూడా సాధ్యం కాదు. ఈ అవాంతరాలను నివారిస్తుంది ఈ డ్రోన్. గాల్లో విహరిస్తూ పెస్టిసైడ్‌లను స్ప్రే చేస్తుంది. పూర్తిస్థాయి దేశీయ యంత్రసామగ్రితో దీన్ని  రూపొందించారు. దీనికి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉపయోగం మాత్రం అమూల్యమైనది. ఒక మోటార్ స్ప్రేయర్  మూడుగంటల్లో చేయగల పనిని రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే ఈ డ్రోన్ స్ప్రేయర్ కేవలం పది నుంచి పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తుందంటే దీని గొప్పతనాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

 

పిజ్జా ఇక చల్లారదు!




పిజ్జా మన ఆహారం కాదు.. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తినే పిజ్జా ప్యాకింగ్ విషయంలో ఒక భారతీయుడి ఆవిష్కరణకు గొప్ప గుర్తింపు దక్కింది. మంచి ఆదరణ లభిస్తోంది. ముంబైకి చెందిన వినయ్ మెహతా అనే ప్యాకేజర్ ‘వెన్‌టిట్’ అనే పిజ్జా ప్యాకింగ్‌బాక్స్‌ను రూపొందించాడు. పిజ్జాను వేడి వేడిగా ఉంచడటమే దీని ప్రత్యేకత. ప్యాక్ చేసిన పిజ్జాను డెలివరీ అయ్యేంత వరకూ హాట్ హాట్ ఉంచే విన్‌టిట్ బాక్స్ పిజ్జామేకింగ్‌సంస్థలకు బాగా నచ్చేసింది. దీంతో మెహతాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. వెన్‌టిట్ బాక్స్‌కు వందదేశాల్లో పేటెంట్ దక్కిందంటే.. మెహతా సాధించిన విజయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

త్రినేత్రంతో చూడొచ్చు...



దృష్టి సంబంధ సమస్యల పరిశీలనలో త్రినేత్ర ఆవిష్కరణ గొప్ప అభివృద్ధి అని అంటున్నారు నిపుణులు. బెంగళూరు పరిశోధకులు కే చంద్రశేఖర్, శ్యామ్ వాసుదేవరావులు అభివృద్ధి పరిచిన ఈ వైద్యశాస్త్ర పరికరం కంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది. దీనితో కళ్లను పరీక్షించడం ద్వారా ఐదు రకాల దృష్టిదోషాలను ముందుగానే కనుగొనవచ్చు. కాటరాక్ట్, డయాబెటిక్ రెటీనా, కార్నియా వంటి దృష్టి సంబంధ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ముందస్తు చికిత్సకు వెళ్లవచ్చు.



ముందుగానే సమస్యలను గుర్తించగల శక్తి ఉన్న ఈ పరికరానికి ’త్రినేత్ర’ అనే పేరు పెట్టారు ఆవిష్కర్తలు. ఇప్పటికే ఈ తరహా పరికరాలు కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ధర విషయంలో త్రినేత్ర వాటిలో ఐదోవంతు మాత్రమే ఉంటుంది.

 

శ్వాసతోనే సౌకర్యం!



కేవలం శ్వాసతోనే ఎలక్ట్రిక్ వీల్ చైర్ దిశను మార్చగల అధునాతన ఆలోచనను ఆవిష్కరింపజేసి చూపాడు సుశాంత్ పత్నిక్. శారీరక వైకల్యంతో బాధపడుతూ వీల్ చైర్‌కే పరిమితం అయిన వారి అవస్థ ఈ కుర్రాడిని కదిలింపజేశాయి. వారు వీల్‌చెయిర్‌మీద అయినా తమకు నచ్చినట్టుగా కదలడానికి తగిన విధంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇతడు ‘బ్రీతింగ్ సెన్సర్ ఆపరేటస్’ను రూపొందించాడు. వీల్‌చెయిర్‌కు పరిమితమైన వ్యక్తులు చెయ్యి, కాలు కదల్చాన అవసరం లేకుండా శ్వాసను బట్టే వారి చక్రాల కుర్చీ కదిలే ఏర్పాటు చేశాడు సుశాంత్. తన ఆవిష్కరణకు ద్వారా వీల్ చెయిర్‌ను కదిలించలేని శారీరక వికలాంగులకు గొప్పవరాన్ని ప్రసాదించిన సుశాంత్‌కు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి అవార్డు కూడా దక్కింది.

 

 పల్లెటూరి ఫ్రిడ్జ్



గ్రామీణ ప్రాంత ప్రజలకు సౌకర్యం కోసం కాదు కానీ.. పండించిన కూరగాయల, ఆకుకూరల కోసం రిఫ్రిజిరేటర్ అవసరం. కాయగూరలు, ఆకుకూరలు, పళ్లు వంటివి సాధారణ వాతావరణంలో తొందరగా పాడైపోతాయి. వాటిని శీతలవాతావరణంలో నిల్వ ఉంచితే మార్కెటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జోధ్‌పూర్ లోని సెంట్రల్ అరిడ్ జోన్ పరిశోధక కేంద్రం వారు కొత్తరకమైన రిఫ్రిజిరేటర్‌ను రూపొందించారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. ఇసుక, సిమెంటు, ఇటుకల సాయంతో నిర్మించే ఇది బాష్పీభవనం సూత్రం మీద పనిచేస్తుంది. ఇళ్ల వద్దే నిర్మించుకోగల ఇది మండువేసవిలో కూడా 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దీంట్లో ముప్పైనుంచి యాభై కిలోగ్రాముల కాయగూరలను నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top