ప్రేమించాను.. అది కూడా తప్పేనా?

ప్రేమించాను.. అది కూడా తప్పేనా?


షీ అలర్ట్ ! : మహిళలూ జాగ్రత్త!

సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...



‘సందీప్... ఒక్కసారి నేను చెప్పేది విను... ప్లీజ్’... పిచ్చిదానిలా అరుస్తున్నాను. తనకెదురుగా నేలమీద కూర్చుని ఉన్నాను. నా రెండు చేతులతో తన కాళ్లు పట్టుకున్నాను. తల పెకైత్తి తన ముఖంలోకి చూస్తున్నాను. నా మాట వినమని అర్థిస్తున్నాను. కానీ తన నుంచి స్పందన లేదు. నా వైపే చూడటం లేదు. తన ముఖంలోని హావభావాలను గమనిస్తుంటే తనసలు నా మాట వింటున్నట్టే అనిపించడం లేదు. మనసు చివుక్కుమంది. బాధ పొంగుకొస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తననెలా కన్విన్‌‌స చేయాలో తెలియట్లేదు. నా భావాలన్నింటినీ మాటలుగా మార్చి తన చెవిని వేశాను. నా బాధనంతా కన్నీటిగా రాల్చి తన కాళ్లు కడిగాను. అయినా తను కరగలేదు.



కనికరించలేదు. కఠిన శిలలా నిలబడ్డాడు. శూన్యాన్ని కొలిచాడే తప్ప తన చూపులను నావైపు ప్రసరింపనీయలేదు.క్షణాలు గడిచాయి. నిమిషాలు కరిగాయి. మా మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అది తనలో అసహనాన్ని పెంచింది. విసుగ్గా కదిలాడు. తన కాళ్లతోనే నా చేతులను తోసేసి విసవిసా నడచుకుంటూ వెళ్లిపోయాడు. సందీప్! సందీప్!! నా స్వరం అంతకంతకూ హెచ్చుతోంది. తనను తిరిగి రమ్మంటూ వేడుకుంటోంది. కానీ ఫలితం లేదు. తను వెళ్లిపోయాడు. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. శాశ్వతంగా వదిలించుకుని వెళ్లిపోయాడు.



నా ఆశల్ని తన పాదాల కింద నలిపేసి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. నేను మిగిలాను. నేను మాత్రమే మిగిలాను. వెక్కి వెక్కి ఏడుస్తూ... ఎగసిపడుతోన్న కన్నీటి కెరటాల్లో పడి లేస్తూ... అక్కడే కూర్చుండిపోయాను. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? ఇది ఎవరి తప్పు? నాదా? నా ప్రేమదా? ఎవరిది? మనసు ఘోషిస్తోంది. ఆ ఘోష నాకు మాత్రమే వినిపిస్తోంది. తనకి కూడా వినిపిస్తే ఎంత బాగుండేది! తనను పట్టి లాగి వెనక్కి తీసుకొస్తే నా జీవితం ఎంత గొప్ప మలుపు తిరిగుండేది!! కానీ అలా జరగలేదు. అతను తిరిగి రాలేదు.



ఎంతగా ప్రేమించాను తనని! ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. కాలేజీలో తొలిసారి అడుగుపెట్టాను. అసలే ఇంజినీరింగ్ కాలేజీ. ర్యాగింగ్ ఎక్కువ ఉంటుందని మా కజిన్ చెప్పాడు. అందుకే భయంభయంగా నడుస్తున్నాను. ఎవరైనా దగ్గరకు వస్తారేమో, ఏమైనా అంటారేమోనని బిత్తర చూపులు చూస్తున్నాను. అనుకున్నంతా అయ్యింది. ఓ కుర్రాళ్ల గుంపు హఠాత్తుగా నా ముందు ప్రత్యక్షమయ్యింది. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అది చెయ్యి ఇది చెయ్యి అంటూ అల్లరి పెట్టింది. ముందునుంచే టెన్షన్‌లో ఉన్నానేమో... దెబ్బకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఒక్కసారిగా భోరుమన్నాను. నా ఏడుపు చూసి వారిలో ఒకడు నవ్వడం మొదలుపెట్టాడు.



మిగతా వాళ్లంతా శ్రుతి కలిపారు. అంతలో ఓ స్వరం గట్టిగా అరిచింది... ‘స్టాపిట్’ అంటూ. అందరి నోళ్లకీ మూత పడిపోయింది. అందరూ అతనివైపు చూశారు. నేనూ అటు దృష్టి మరల్చాను. చక్కని పొడవు... అందమైన ముఖం... ఒత్తయిన జుత్తు... ఆకర్షించే స్టైల్... హీరోలా ఉన్నాడు. ‘పాపం తను ఏడుస్తోంది కదా, ఇంకా ఎందుకు అల్లరి చేస్తారు, వదిలేయండి’ అన్నాడతను కాస్త కోపంగా, కాస్త నచ్చజెప్తున్నట్టుగా. వాళ్లెవరూ ఎదురు చెప్పలేదు. మౌనంగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ‘కంగారు పడకండి... క్లాసుకు వెళ్లండి’ అనేసి వెళ్లిపోతున్న అతని వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూండిపోయాను.



అదే మొదలు. ఆరోజు నా మనసులో మొదలైన అలజడి నన్ను నిలబడనివ్వలేదు. నాటి నుంచీ అతని కోసమే కన్నులు వెతికేవి. అతను కనబడితే హృదయలయలు హెచ్చేవి. తను మా సీనియర్ అని, కాలేజీ స్టూడెంట్స్ లీడర్ యూనియన్ ప్రెసిడెంటనీ తెలిసింది. అన్నింట్లో ఫస్టొస్తాడని తెలిసి మనసు మురిసింది. నాకు తెలియకుండానే నా మనసుని అతడు ఆక్రమించేశాడు. నిలువెల్లా ఆశలు రేపి నన్ను తన సొంతం చేసేసుకున్నాడు. నేను సెకండియర్‌లోకి వచ్చాను. తను ఫైనలియర్‌లో ఉన్నాడు. ఆలస్యం చేస్తే అందుకుండా పోతాడు. అందుకే నా మనసులోని మాట చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాను.



కానీ అంతలోనే ఓ నిజం తెలిసింది. అతడి మనసులో అప్పటికే తన క్లాస్‌మేట్ మాధవి ప్రవేశించింది. అతడి ప్రేమను అందుకుని, అతడితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. తట్టుకోలేకపోయాను. తల్లడిల్లిపోయాను. నా ఆశలసౌధం కూలిపోతూ కనిపించింది. అందమైన భవిష్యత్తు అంధకారమయమైపోతున్నట్టు అనిపించింది. అలా జరగడానికి వీల్లేదు. అదే జరిగితే నేను జీవించలేను. అందుకే నేను చేయాల్సింది చేశాను. మాధవితో పరిచయం చేసుకున్నాను. ఆత్మీయురాలిగా మారాను. అన్నింటా నేనే అయ్యాను. అన్నీ నాతో పంచుకునేలా చేశాను. తను తన ప్రేమ గురించి నాతో చెప్పింది. నేను ఆ ప్రేమకి అప్పుడే సమాధి కట్టేశాను. సందీప్ మంచివాడు కాదన్నాను.



అతడు నాకు కూడా ప్రేమలేఖలు రాశాడని చెప్పాను. ఫేస్‌బుక్‌లో అతను నాకు ఇచ్చిన రొమాంటిక్ మెసేజులను చూపించాను. ఆ అకౌంట్ ఓపెన్ చేసిందేనేనేనని, దాని నుంచి నాకు నేనే మెసేజులు ఇచ్చుకున్నానని తెలియని మాధవి విస్తుపోయింది. మనసు రగిలి అతడిని నిలదీసింది. అందరి ముందూ అవమానించింది. ఛీకొట్టి వెళ్లిపోయింది. అలా వాళ్ల బంధం ముగిసిపోయింది.నా ఆనందం అవధులు దాటింది. ఇక సందీప్‌తో నా జీవితానికి కొత్త నాంది పడబోతోందంటూ నా మనసు పులకరించింది. తనను ఓదార్చాలని, ఓదార్పు రూపంలో తనకు నా ప్రేమను పరిచయం చేయాలని బయలుదేరాను. తనని కలిశాను. నా మనసు తెలిపాను. అర్థం చేసుకుంటాడనుకున్నాను. ఆప్యా యంగా ఆలింగనం చేసుకుంటాడనుకున్నాను.



కానీ అలా చేయలేదు. అరిచాడు. అసహ్యించుకున్నాడు. తనకు నిజం తెలిసిపోయిందన్నాడు. ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది నేనేనని కనిపెట్టానని చెప్పాడు. క్షమించమన్నాను. తన మీద ప్రేమతోనే అలా చేశానని చెప్పాను. తను లేకపోతే జీవించలేకే అంత పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డానని సంజాయిషీ ఇచ్చుకున్నాను. కానీ తను వినిపించుకోలేదు. నా విన్నపాన్ని మన్నించలేదు. తన మనసులో నాకు చోటివ్వలేదు. వెళ్లిపోయాడు. చిరాకుపడి, ఛీకొట్టి, నా కలలను ఛిద్రం చేసి వెళ్లిపోయాడు.



నా జీవితం నుంచే కాదు... కాలేజీ నుంచే వెళ్లిపోయాడు. నేను చేసిన తప్పు తాచుపామై నా ప్రేమను కాటేసింది. నా మనసును శూన్యం చేసింది. నా జీవితాన్ని పతనం చేసింది. అపరాధభావంతో అనుక్షణం అలమటిస్తున్నాను. తనకి చేసిన ద్రోహం మర్చిపోలేక, తనని మర్చిపోయి బతకలేక నరకం చూస్తున్నాను. అయినా నేనేం చేశాను? పిచ్చిగా ప్రేమించాను. అంతేగా. దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా?!

 - మేఘన (గోప్యత కోసం పేరు మార్చాం)

 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top