నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌


లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌


హలో సర్‌. నా వయసు 22. ఓ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాను. నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెకు పెళ్లయింది. కాని ఆ అమ్మాయంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నానని ఆమెకు తెలుసు. కాని నేనెప్పుడూ ఆమెకు నా మనసులో మాట చెప్పలేదు. నేను చెబుదామంటే మా ఇంటిచుట్టూ వున్నవాళ్లందరూ వాళ్ల చుట్టాలే. ఏదైనా ప్రాబ్లమ్‌ అవుతుందేమోనని భయపడుతున్నాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. తను కూడా నాలాగే భయపడుతోంది. నేను తనని చూడకుండా ఉండలేకపోతున్నా. ప్రతిక్షణం ఆమే గుర్తుకువస్తోంది. ఎప్పుడూ తననే చూడాలనిపిస్తోంది. దయచేసి నాకేదైనా ఉపాయం చెబుతారని ఆశిస్తున్నాను.

– ప్రశాంత్, ఈ–మెయిల్‌


అరటిపండు తింటూ నీ సమస్య చదువుతున్నాను. నాలుగో వాక్యం చదివేసరికి తోలు తింటున్నాను. ఈ విషయం నేను గమనించలేదు. పక్కనే ఉన్న నీలాంబరి కెవ్వుమని అరిచింది. ఏమని... ‘సార్‌ పండు వదిలి తోలు తింటున్నార్సార్‌.... !’ తోలుతీస్తా... పెళ్లయిన అమ్మాయితో ప్రేమేందోయ్‌...! ప్రేమకు కారణాలు ఉండవు కాని, ధర్మం ఉండదా? వావి, వరస, గౌరవం ఉండవా? పెళ్లయిన అమ్మాయి వదినతో సమానం. వదిన తల్లితో సమానం. నాశనం చేస్తున్నావ్‌! నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావ్‌! రాముడు సీతమ్మవారి ఆభరణాలను  లక్ష్మణుడుకి చూపించి ‘ఇవి మీ వదినవేనా?’ అని అడుగుతాడు. ఉన్న నగలన్నింటిలో లక్ష్మణుడు గుర్తించినవి అమ్మవారి అందెలే. ఎందుకో తెలుసా? లక్ష్మణుడు వదినగారిని నేరుగా ఎప్పుడూ చూడలేదు. ఆవిడ పాదాలను మాత్రమే రోజూ పొద్దునే నమస్కరించేవాడు. అందుకే కాళ్ల అందెలను గుర్తుపట్టాడు.



ఇది మన సంస్కారం. వద్దు తమ్ముడూ ప్రేమను ఇంత లోకువ చేయవద్దు. నీకో మంచి పరిష్కారం చెబుతాను. నీ ప్రేమను ఆరాధనగా మార్చుకో. ఆ తల్లిని గౌరవించు. ఆ తల్లికీ, తన కుటుంబానికీ లక్ష్మణుడిలాగే కాకుండా హనుమంతుడిలా కూడా సేవించు. నీకు తప్పకుండా ప్రాయశ్చిత్తం దక్కుతుంది. లవ్‌ డాక్టర్‌ ఏంటి... స్వామీజీలా ఉపదేశాలు ఇస్తున్నాడేంటి? అనుకోవద్దు. నీ ప్రేమని అర్ధం చేసుకోక కాదు, ఆ తల్లి కష్టం అర్థం చేసుకొని ఇలా చెప్పాను. ఇంత వేదనతో నీకు చెబుతున్నానంటే నిన్ను ఒక మహా పాపం నుంచి కాపాడుకోవడానికి మాత్రమే. దీంట్లో ఇంకో ఆర్గ్యుమెంట్‌ కూడా ఉంటుంది. ‘ప్రేమ గుడ్డిది కదా!’ అని నువ్వు నన్ను అడగవచ్చు. ప్రేమ గుడ్డిది కావచ్చు కాని దాని వల్ల మన జీవితం చీకటి మయం అయితే పర్వాలేదు కాని, ఇంకొకరి జీవితంలో చీకటి ప్రవేశిం^è కూడదు. నేనిన్ని చెప్పిన తర్వాత కూడా మనసు వశం కాకపోతే ఆ తల్లి దగ్గర నుంచి బాగా దూరంగా వెళ్లిపో. దూరంగానే ఉండు. అంతే...! ఆన్సర్‌ రాసిన తర్వాత నీలాంబరి ఆనందం పట్టలేక ‘భేష్‌ సార్‌... భేష్‌.. భలే సమాధానం ఇచ్చారు’ అంటూ ఇంకో అరటిపండు చేతికిచ్చింది. నేను తోలు తీశా!

ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top