ఇలా చేయండి!


‘రిటైరయ్యాక కూడా జీవితం ఉంటుంది

 ఆ జీవితాన్ని వ్యర్థంగా గడపరాదు...

 అర్థవంతంగా గడపాలి’

 ఇది చదువుల శకుంతలమ్మ చెప్పే సూక్తి.

 ఈ లెక్కల టీచర్ భాషలో ‘అర్థవంతం’...

 అంటే పరోపకారం!

 అప్పుడే ఆమె దగ్గర లెక్క సరిగ్గా కుదురుతుంది.

 చదువంటే డిగ్రీ కాదు...

 జీవితాలు బాగుపడడం...

 ఇది ఆమె చెప్పే మరో సూక్తి.

 లెక్కల్లో విలువలకు నైతిక విలువలను రంగరించడమే ఆమెకు తెలిసిన లెక్క.

 దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి చదువు చెప్పడం ఆమెకు ఆనందం.


 

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్ నుంచి లోపలికి వెళ్తే అశోక్‌నగర్ కల్చరల్ అసోసియేషన్ వారి కమ్యూనిటీ భవనం. ఆ భవనంలోని మధ్య హాలు గ్రంథాలయం. కాలనీలోని పెద్దవాళ్లు పుస్తకాలు చదువుకుంటున్నారు. అదే హాల్లో ఒక పక్కగా, మరో గదిలో ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు ట్యూషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ భవనం గేటు ఎదురుగా కనిపించే ఇల్లే వేమూరి శకుంతలది. ఆమె ఇంట్లో... దాదాపుగా పదిమంది పెద్ద పిల్లలున్నారు.

 

హారిక... వాసవి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఆగస్టులో ఉద్యోగంలో చేరనుంది. రమాలీల... ఈ అమ్మాయి పాలిటెక్నిక్ విద్యార్థి.



ఈ-సెట్‌లో 18వ ర్యాంకు తెచ్చుకుంది. ఆ పక్కనే ఉన్న కిరణ్‌సాయి 128వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కౌన్సెలింగ్ మొదలైతే వీరిద్దరూ ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలో చేరుతారు. లీలావతి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో సీటు తెచ్చుకుంది. ‘‘ఈ అమ్మాయికి లెక్కల మీద పట్టు పెద్దగా లేదు. అందుకే తనకు ఇష్టమైన మరో రంగాన్ని సూచించాను’’ అంటూ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు 79 ఏళ్ల వేమూరి శకుంతల.



ఈ పిల్లలందరూ వాళ్ల కుటుంబాల నుంచి తొలితరం విద్యావంతులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరి తల్లిదండ్రుల్లో ఎవరూ పిల్లల చదువు కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగిన స్థితిలో లేరు. ఇస్త్రీ బండితో బతుకు వెళ్లదీసేవాళ్లు, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్లు, వాచ్‌మ్యాన్, అటెండర్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. ‘‘మేమంతా ఇంత బాగా చదివి, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నామంటే అమ్మ వల్లనే’’ అన్నారు ఈ పిల్లలందరూ ముక్తకంఠంతో. ‘‘మేము కూడా మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తాం’’ అని చిన్న పిల్లలు వంత పలుకుతున్నారు.

 

లెక్కల టీచరమ్మ!

 

నగరంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్న వర్గాల పిల్లలు చదువుకునే కాలేజ్‌గా పేరున్న ఫ్రాన్సిస్‌లో మంచి లెక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శకుంతల, లెక్కల పాఠాలను దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి అందించడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ‘‘మా ఇంట్లో పని చేసే ఆమె ఒకరోజు చాలా బాధపడుతూ... తన రెక్కల కష్టంతో కొడుకుని చదివిస్తున్నానని, కానీ కొడుక్కి లెక్కలు రావడం లేదని, వాడికి లెక్కలు నేర్పించమని అడిగింది. ఫెయిలవుతాడని భయపడిన ఆ కుర్రాడు 72 మార్కులతో పాసయ్యాడు. రిటైరయ్యాక ఇదే వ్యాపకం’’ అన్నారామె చుట్టూ ఉన్న పిల్లలను చూస్తూ.

 

విద్యార్థుల మధ్య వంతెన

 

శకుంతలమ్మ దగ్గర చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న సంపన్న విద్యార్థులు ఆమెకి చేదోడుగా ఉంటున్నారు. ఫీజులు కట్టడానికి ఒక్కో విద్యార్థినీ ఒక్కో సంపన్న పూర్వ విద్యార్థితో అనుసంధానం చేస్తారామె. సమాజంలో దిగువ స్థాయిలో జీవిస్తున్న వారి కోసం రిజర్వేషన్లు పెంచడమే పరిష్కారం  కాదంటారామె ‘‘ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించుకోగలిగినంత నాణ్యమైన విద్యనందించాలి.



అప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో నిలబడగలిగే శక్తి తెచ్చుకుంటారు. ధైర్యాన్ని సంపాదించుకుంటారు’’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు శకుంతలమ్మ. ఆమె చెబుతున్నట్లే ఆమె దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు రిజర్వేషన్ కోటా కోసం చూడడం లేదు. ఓపెన్‌లో సీటు తెచ్చుకుని చదువుకుంటున్నారు. ‘ఓపెన్‌లో మెరిట్ సీటు తెచ్చుకుంటే నాకదే మీరిచ్చే గురుదక్షిణ’ అని పిల్లలకు లక్ష్యాన్ని స్థిరీకరిస్తున్నారామె.

 

- సాక్షి ప్రతినిధి

 

కొంతైనా చేయాలని...

 శకుంతల మేడమ్ చేస్తున్న పని నాకు బాగా నచ్చింది. ఆమెలా కాకపోయినా కొంతైనా చేయగలిగితే బావుణ్ణు అనుకునేదానిని. మా పాపకు పెళ్లయిన తర్వాత నేను కూడా ఇందులో భాగస్వామినయ్యాను. పిల్లలకు ట్యూషన్ క్లాసులు, వాళ్ల చేత ఏయే పరీక్షలు ఎప్పుడు రాయించాలి... వంటి పనుల్లో మేడమ్‌కి సహాయంగా ఉంటున్నాను.

 - శ్రీవల్లి, శకుంతలమ్మకు సహకార భాగస్వామి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top