ప్రకాశం ఏదీ?

ప్రకాశం ఏదీ?


ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న జిల్లా ఇది.

కానీ...

పాలకులకు ఆయనకున్న దేశభక్తి లేదు.

ప్రజలంటే ఆయనకున్న అనురక్తి లేదు.

మూత్రపిండాల వ్యాధితో పిల్లలు సైతం రాలిపోతున్న జిల్లా ఇది.

ఈ చీకటి ప్రభుత్వం కొంచెం ప్రకాశం చూస్తే బాగుండు.

ప్రకాశం జిల్లాను చూస్తే బాగుండు.




మెకానిక్‌కు పెద్ద కష్టం

పేద కుటుంబంలో పుట్టి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న 20 ఏళ్ల షేక్‌ షంషూర్‌ కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఈ యువకుడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి  రోజు వారీ కూలీ. మెకానిక్‌ షాపులో పని చేసే షంషూర్‌ నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు చికిత్స చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కిస్తే సరిపోతుందని చెప్పి రెండుసార్లు రక్తం ఎక్కించారు. కొద్దిరోజుల తరువాత ఏ ఆహారం తిన్నా వాంతి చేసుకోవడం, అందులో రక్తం కనిపించడంతో బద్వేలు నుంచి వచ్చిన భూతవైద్యుని ఆశ్రయించారు. అప్పటికి తగ్గక పోవడంతో ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ప్రైవేటు వైద్యశాలలో చూపించారు. ఆ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి  రెండు కిడ్నీలు పాడయ్యాయి వెంటనే మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో వేరే హాస్పిటల్‌కు వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దుతో చికిత్సకు డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షంషూర్‌ నెల్లూరులో చికిత్స పొందుతున్నాడు.



నీటి సమస్యే ప్రధాన కారణం..

కలుషితమైన నీటివల్లే తన కుమారుడి కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారని షంషూర్‌ తండ్రి ఇబ్రహీం ఆవేదనగా తెలిపాడు. తాము పంచాయతి వారు సరఫరాచేసే కుళాయి నీరు తాగే వారమనీ ఆ నీరు వాసనగా  ఉండేదని తెలిపాడు. షంషూర్‌కు మెడ దగ్గర రంధ్రం వేసి ఇప్పటివరకు 24 సార్లు డయాలసిస్‌ చేయించామనీ వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించాల్సి ఉంటుందనీ వెళ్లిన ప్రతిసారి 700 రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపాడు. ఇదిగాక వారానికి 2,500 రూపాయల విలువగల ఇంజక్షన్, 500 రూపాయల మందులు, నెలకు ఒకసారి 3,500 రూపాయల విలువగల ఇంజక్షన్‌ వాడాల్సి వస్తోందని అంత ఖర్చు తాము ఏమాత్రం భరించలేమని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటివరకు నెల్లూరులో చికిత్సకు 44 వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు. అయితే ప్రతిసారి మెడద్వారా డయాలసిస్‌ చేయడం కుదరదని, చెన్నై వెళ్లి చేతిలో ఆపరేషన్‌ ద్వారా పైపు ఏర్పాటు చేసుకొని వస్తే దాని ద్వారా డయాలసిస్‌ చేస్తామని నెల్లూరు వైద్యులు తెలిపారని చెప్పాడు.



కూతురు పెండ్లి డబ్బుతో చికిత్స..

కూతురు ఆషా పెండ్లి కోసం 3 లక్షల రూపాయలు దాచి పెట్టామనీ పెళ్లి కూడా కుదిరిందనీ అయితే కుమారునికి వ్యాధి బయటపడటంతో చికిత్సకు డబ్బులు అవసరమని పెండ్లిని రద్దు చేసుకున్నామని ఇబ్రహీం తెలిపాడు. తాను కూడా తమ్ముడి కోసం మహారాష్ట్రలో చేస్తున్న పనిని వదిలేసి వచ్చానని అన్న షబ్బీర్‌ చెప్పాడు.



జీవన్‌ ఆధార్‌లో రిజిస్ట్రేషన్‌ విఫలం..

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవన్‌ ఆధార్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో కిడ్నీ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించడంతో అక్కడికి  వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నామని ఎవరిని అడిగినా ఒకరిపై ఒకరు చెబుతున్నారే తప్ప రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని, ఎంఎల్‌ఏ, ఎంపి లెటరు తీసుకుని వస్తేనే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటామని చెప్పారన్నాడు. చివరికి ఒక స్నేహితుడి సహాయంతో వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు సహకారంతో జగన్‌ సార్‌ను కలుసుకుని తన సమస్యను చెప్పగలిగామని ఇబ్రహీం తెలిపాడు. ప్రభుత్వసాయం కోసం ఎదురు చూస్తున్నాడు.



ఆరోగ్యశ్రీ వల్లే బతుకుతున్నా...

గత నాలుగేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదుకునే వారు లేక బాధపడుతున్నానని కిడ్నీ బాధితుడు మల్లెల ఎలేజర్‌ అన్నాడు. హనుమంతునిపాడు మండలం హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన మెల్లెలఎలేజర్‌ది నిరుపేద కుటుంబం. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మరియమ్మ, 5 మంది సంతానం ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పరీక్షలు చేయించుకుంటే రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాని చెప్పారు. దాంతోవారానికి 3 సార్లు డయాలిసిస్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే డబ్బులు లేక మూడుసార్లు డయాలిసిస్‌ మానుకున్నాడు. దీంతో పొట్టంతా వాపు వచ్చింది. కదలలేని పరిస్థితిలో మంచం పట్టి ఉన్నాడు. కుటుంబానికి ఎటువంటి ఆదాయం లేదు.  భార్యాపిల్లలు సంపాదించిన రోజువారీ కూలీతో పోషణ జరుపు కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ కార్డు వలనే ఇంత కాలం గొంతులో ఊపిరుందని, అది లేకుంటే ఎప్పుడో మృతి చెందేవాడినని ఎలేజర్‌ అన్నాడు. కుటుంబం గడవక పిల్లల్ని చదువు మాన్పించి కూలి పనులకు పంపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.



ఆ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన వీరపనేని లింగయ్య కుటుంబంలో నలుగురికి కిడ్నీ వ్యాధి సోకింది. లింగయ్యకు, అతడి భార్య నాగరత్తమ్మకు, ఐదో కుమారుడు గోపాల్‌కు, లింగయ్య వదిన నారాయణమ్మకు కిడ్నీ వ్యాధి సోకింది. ఒకే కుటుంబంలో నలుగురికి ఈ వ్యాధి సోకడంతో కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. లింగయ్య మిగతా నలుగురు కుమారులు తోచిన సంపాదన చేస్తూ వీరికి వైద్యం చేయిస్తున్నారు. మూడేళ్ల కిందట గోపాల్‌కు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్పటికే కుదిరిన పెళ్లి ఆగిపోయి తల్లిదండ్రులు లింగయ్య, నాగరత్తమ్మలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒకపక్క తమ ఇద్దరికీ అదే వ్యాధి సోకి మృత్యువుకు చేరువ అవుతుంటే యుక్తవయస్సులో ఎటువంటి సంతోషాలకు నోచుకోని తన బిడ్డ ఇలా ఈ వ్యాధి బారిన పడటం తల్లిదండ్రులను కలచివేసింది.



భారమైన వైద్యఖర్చులు..

ఒకే కుటుంబంలో నలుగురికి వ్యాధి సోకడం వల్ల ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో అందరికీ వైద్యం చేసే స్తోమత లేని లింగయ్య దంపతులు సతమతమవుతున్నారు. తమ పిల్లలకు తాము భారంగా మారుతున్నామని ఏమి చేయాలో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సాయం చేస్తే తప్ప కోలుకోలేని ఇలాంటికుటుంబాలు ఈ ప్రాంతంలో కొల్లలు.



తిరుపతమ్మకు ఆయువు పోయండి...

బతకాలనే ఆశకు ఆయువు పోయండి అంటూ ఆ అమ్మాయి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని పెదవరిమడుగు గ్రామానికి చెందిన నూకతోటి తిరుపతమ్మ వయసు 19 సంవత్సరాలు. వీరిది నిరుపేద కుటుంబం. తల్లి ఆదిలక్ష్మి వ్యవసాయ కూలీ. కొన్నేళ్ల కిందటే ఇల్లు విడిచి వెళ్లిపోయిన తండ్రి ఆచూకీ నేటికీ లేదు. ఈనెల 19వ తేదీ తిరుపతమ్మకు కాళ్లు, చేతులు వాపు రావడంతో ఒంగోలులోని కిడ్నీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అమ్మాయికి మూత్రపిండాలు రెండూ చెడిపోయినట్లు తెలపడంతో తల్లి తల్లడిల్లిపోయింది. తమకు సెంటు భూమి కూడా లేదని, కూలిపని చేసి ఇద్దరు కుమార్తెలను పోషించి పెద్ద చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపాల్సిన వయస్సులో కూతురు గురించి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చిందని ఆమె కన్నీర మున్నీరయ్యింది. ఈవిషయాన్ని పీసీపల్లి సభలో శుక్రవారం వైఎస్‌ జగన్‌కు విన్నవించింది.



ప్రకాశం జిల్లాలో మితిమీరిన ఫ్లోరైడ్‌తో ప్రాణనష్టం.

రెండేళ్లలో కిడ్నీ వ్యాధులతో 420 మంది మృతి

  అనధికారికంగా వెయ్యిమందికి పైనే

  చావుకు దగ్గరగా వందల్లో బాధితులు

  కనిగిరి, కొండపి ప్రాంతాల్లో అధికం

రోగులకు ఉచిత వైద్యం లేదు... డయాలసిస్‌ లేదు

  తూతూ మంత్రంగా ప్రభుత్వ వ్యవహారం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top