కాళోజీ జీవితం... సాహిత్యం

కాళోజీ జీవితం... సాహిత్యం


కాళోజీ ప్రజాకవి. రచయిత. ఉద్యమకారుడు. నిత్య చైతన్యశీలి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ వైతాళికుడు. వ్యక్తి ఉన్నతుడై వ్యక్తిత్వం సమోన్నతమైతే ఆ రెంటి కలయిక కాళోజీ అనంటారు. రాజీ పడి బతికేవాడి ఆయుష్షు కన్నా ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడి యశస్సు గొప్పది అని నిరూపించి అలాంటి యశస్సును మూటగట్టుకున్న గొప్ప కవి కాళోజీ. ఆయన జీవిత చరిత్రే- 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్ర. అందుకే ఆయన ప్రభావం నాడూ ఉంది. నేడూ ఉంది. రేపూ ఉంటుంది. అందుకే  నల్లగుంట్ల యాదగిరి రావు ఆయన పట్ల ఆరాధ్యం పెంచుకున్నారు. తాను చదివిన ఎమ్మెస్సీ మేథ్స్‌ను అక్కడితో వదిలి కేవలం కాళోజీ కోసమే ఎంఏ తెలుగు చేసి ఆ తర్వాత కాళోజీ సాహిత్యాన్ని ిపీహెచ్.డి అంశంగా ఎంచుకున్నారు. ఇదంతా తెచ్చిపెట్టుకునే అభిమానంతో జరిగే పని కాదు. దానికి లోలోపలి అర్పణభావం ఉండాలి.



500 పేజీల ఈ పుస్తకంలో రచయిత వదిలిపెట్టిన అంశమంటూ ఏదీ మిగల్లేదు. కాళోజీ బాల్యం, చదువు, వివాహం, జైలు జీవితం, గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమ ప్రభావం, కవిత్వం (నా గొడవ, పరాభవ వసంతం, పరాభవ గ్రీష్మం, పరాభవ వర్షం, పరాభవ శరత్తు, పరాభవ హేమంతం, పరాభవ శిశిరం), ఎమర్జెన్సీ జీవితం, కథలు (మనమే నయం, ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ, ఆగస్టు 15, భూతదయ), ఆత్మ కథ (నా గొడవ)... వీటన్నింటినీ సాకల్యంగా చిత్రించడం, చర్చించడం కనిపిస్తుంది. ముఖ్యంగా కాళోజీ వ్యక్తిత్వంలోని లక్షణాలు- స్వేచ్ఛా పిపాస, నిర్భయత్వం, ధైర్యం, సంచార గుణం, జ్ఞాన తృష్ణ, గాంధేయవాదం, స్నేహశీలత్వం, జ్ఞాపక శక్తి... వీటన్నింటినీ తగు దృష్టాంతాలతో తెలుసుకుంటూ ఉంటే కొత్తతరాలకు ఈ వ్యక్తిత్వాన్ని ఎంత చేరువ చేస్తే అంత బాగుణ్ణు కదా అనిపిస్తుంది.



ఇవాళ తెలంగాణ కల సాకారమైంది. కాని ఈ కల సాకారం కావడం వెనుక కాళోజీ వేసిన బీజాలూ అవి చూపిన ప్రభావమూ అందుకొరకు ఆయన స్థిరపరచిన కార్యరంగం అత్యంత శక్తిమంతమైనవి. తెలంగాణవారిపై తెలంగాణేతరుల పెత్తనాన్ని నిరసిస్తూ ఆ రోజుల్లోనే  కాళోజి రాసిన ‘లంకా పునరుద్ధరణ’ కథ ఇటీవల వరకూ సాగిన ఒక ధోరణికి చెంపపెట్టు. కాళోజీ సాహిత్యమూ, జీవితమూ లేవనెత్తిన అంశాలపై, చూపిన దిశపై జరగవలసిన చర్చ చాలా ఉన్నది. తెలంగాణ భవిష్యత్తులోని ప్రతి మలుపులోనూ ఆయన నుంచి స్వీకరించాల్సింది ఎంతో ఉంటుంది. అందుకు ఉపయుక్తంగా సమగ్రమైన పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని అందించిన నల్లగుంట్ల యాదగిరిరావు ధన్యులు. ప్రతి సాహితీ ప్రేమికుడూ, ప్రతి తెలంగాణ చదువరి తప్పకుండా పరిశీలించదగ్గ పుస్తకం ఇది.



 దిశ: కాళోజీ సాహిత్య సమగ్ర పరిశీలన- డా. నల్లగుంట్ల యాదగిరి రావు

 వెల: రూ.360; ప్రతులకు- 9848382555

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top