తల్లి ఆనందమే బిడ్డ భవిష్యత్తు

వ్యాయామ శిక్షణా తరగతులలో గర్భిణులు


జాయ్‌ఫుల్‌ ప్రెగ్నెన్సీ



‘‘గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి చేసే ప్రతి ఆలోచనా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే ఆమెకి మానసిక ఆనందం, ఆరోగ్యం చాలా అవసరం. గర్భం దాల్చిన  సమయంలో నెగిటివ్‌ ఆలోచనలు ఎంత మాత్రం దరికి రానివ్వకూడదు. ’’ అంటున్నారు జాయ్‌ పుల్‌ ప్రెగ్నెన్సీకి అవసరమైన శిక్షణా తరగతులకు కేరాఫ్‌ అయిన జెస్సీ నాయుడు. ఆనందదాయకమైన ప్రెగ్నెన్సీ కోసం జెస్సీ అందిస్తున్న సూచనలివి.



గర్భిణి తగినంత శారీరక విశ్రాంతి తీసుకోవాలి. నెలలు నిండుతున్న కొద్దీ నిద్రపోయేటప్పుడు తలెత్తే అసౌకర్యం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవ్వ వచ్చు కాబట్టి ముందుగా వీలైనంత నిద్రపోవడం మంచిది. కూరగాయాలు, పండ్లు ఆహారంలో భాగం చేయాలి. ఫాస్ట్‌ ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్, సుగర్‌ ఎక్కువగా ఉండేవి, శాట్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ బాగా ఉండేవి దూరం పెట్టాలి.



ఒత్తిడి కారణంగా ఉద్భవించే స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసోల్‌ గర్భంలోని బిడ్డపై ప్రభావం చూపుతుంది. తద్వారా పుట్టిన బిడ్డ ఎక్కువగా ఏడవడం, నిద్రలేమితో బాధపడడం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా తల్లుల తీవ్రమైన మానసిక ఒత్తిడి పిల్లలు సరిపడా బరువు లేకుండా పుట్టేందుకు కూడా కారణం అవుతుంది. ఈ సమయంలో కుటుంబ సహకారం, మద్ధతు గర్భిణులకు అత్యవసరం. కాబట్టి తల్లి కాబోతున్నవారు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి. మెడిటేషన్, నచ్చిన సంగీతం వినడం, గోరువెచ్చని నీటి స్నానం... ఇలా ఒత్తిడిని దూరం చేసే వ్యాపకాలు ఎంచుకోవాలి. అతి వేడి నీటిని స్నానానికి వాడకూడదు. ఇది గర్భంలోని బిడ్డకు హానికరం.



వ్యాయామం అవసరం

తొలి దశలో వాకింగ్‌ రోజుకు 20 నుంచి 30 నిమిషాల వరకూ చేయవచ్చు. నిదానంగా మాత్రమే నడవాలి. అయితే లో లైన్‌ ప్లాసెంటా అనే ప్రత్యేకమైన సమస్య ఉంటే మాత్రం ఎటువంటి వ్యాయామం చేయకూడదు. అలాంటి వాళ్లు రాజయోగ ప్రాణయామ  చేయవచ్చు. తొలి 3 నెలల పాటు కేవలం నిలుచుని చేసేవి, అప్పర్‌బాడీకి చేసే వ్యాయామాలు మాత్రమే చేయాలి.



5వ నెలలో గర్భంలో పెరిగే బిడ్డకి వినికిడి శక్తి ఏర్పడుతుంటుంది. కాబట్టి మ్యూజిక్‌ థెరపీ వంటివి ఉపకరిస్తాయి. గర్భంలో పెరుగుతున్న బిడ్డతో తరచు  తల్లీ తండ్రీ సంభాషిస్తుండాలి. 6వ నెల నుంచి తల్లి కళ్ల ద్వారా బిడ్డ చూస్తుంది. కాబట్టి తల్లి తను వీక్షించే దృశ్యాలు కూడా సమీక్షించుకోవాలి.  గర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో సాధారణంగా బిడ్డకు తల కిందకు కాళ్లు పైకి ఉంటాయి. అయితే  అరుదుగా కొన్నిసార్లు తలపైకి ఉండి కాళ్లు కిందకు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే చాలావరకూ సిజేరియన్‌ ఆపరేషన్‌ అవసరం అవుతుంటుంది. దీనికి పరిష్కార ప్రక్రియని మేం స్పిన్నింగ్‌ బేబీ అంటాం. పొట్ట మీద నుంచే బిడ్డను చేతులతో తిప్పుతూ చేసే ప్రక్రియ ఇది. కేవలం 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంలో  ప్రతి రోజూ పర్వతాసనం చేయగలిగితే బిడ్డ తనంతట తానే తిరిగిపోయే అవకాశం ఉంటుంది.



నెలలు గడుస్తు్తన్న కొద్దీ తన చుట్టూ పేరుకున్న అమ్నియాటిక్‌ ఫ్లూయిడ్‌ని బిడ్డ రుచి చూడగలుగుతుంది. ఈ దశలో బిడ్డకు వీలున్నన్ని రుచి, వాసన చూసే అవకాశం అందివ్వాలి అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల గర్భంలో ఉండగానే విభిన్న రకాల వాసనలను, రుచులను గ్రహించగలిగే శక్తి రావడం వల్ల పుట్టిన తర్వాత అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించగలుగుతుంది. లోపలి బిడ్డను సున్నితంగా మసాజ్‌ చేయవచ్చు. ఇలాంటి చర్యలకు బిడ్డ స్పందించే తీరును గమనించడం చాలా సరదాగా, ఆనందంగా ఉంటుంది. గర్భం మీద  ఫ్లాష్‌లైట్లు పడడం అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంతిమంతమైన లైట్స్‌ బిడ్డ కళ్లకు హాని చేస్తాయి అని నిపుణులు అంటారు. అదెలా ఉన్నా గర్భంలోని బిడ్డ నిద్రకు మాత్రం అది చేటు తెచ్చే అవకాశం ఉంది. నవమాసాలూ నిండాక, బిడ్డ బాగా చైతన్యవంతం అయ్యాక ఫ్లాష్‌లైట్‌ పడినా ప్రభావం ఏమీ ఉండదు.

సమన్వయం: సత్యబాబు





జెస్సీ నాయుడు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top