డాడీ జుకర్‌బర్గ్ పిల్లాడయ్యాడు!

డాడీ జుకర్‌బర్గ్  పిల్లాడయ్యాడు! - Sakshi


ఒక్క పోస్ట్.. పెటర్నిటీ లీవ్‌ని సార్థకం చేస్తుంది.

ఒక్క ట్వీట్.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంది.

ఒక్క వింత హ్యాబిట్.. ‘వద్దు బ్రోస్... ఆ అలవాటు మానుకోండి’ అని నెట్‌లో హితవు చెప్పిస్తుంది.

ఒక్క చాపల్యం.. వీడియోలో వైరల్ అవుతుంది. ఆదిత్య 369 లా వెనక్కి వెళ్లిన కాలం...

ఒక్క రూపాయికి కడుపునిండా టిఫిన్ పెట్టి పంపిస్తుంది.

ఈవారం ‘నెట్ ఇంట్లో’ మీరు ఈ ట్రెండ్స్ అన్నీ చూడొచ్చు.


 

నెట్‌ఇంట్లో

ఆశ్చర్యపోకండి... జుకర్‌బర్గ్ డాడీ ఎప్పుడు అయ్యాడా అని! ఈ ఫేస్‌బుక్ సీఈఓ ప్రస్తుతం పెటర్నిటీ లీవ్‌లో ఉన్నాడు. కానీ అప్పుడే డాడీ అయిపోయినట్లు... పుట్టబోయే చిన్నారితో ఆడుకునే అనుభవం కోసమా అన్నట్లు... ఓ మామూలు ఫేస్‌బుక్ అకౌంట్ హోల్డర్‌గా విమానాల్ని టాయ్స్‌లా పోస్ట్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు అతి దిగువగా ప్రయాణిస్తూ ఆకాశంలో చక్కర్లు కొడుతున్న దృశ్యాల 360 డిగ్రీ వీడియోను ఆయన నవంబర్ 24న పోస్ట్ చేశారు. పనిలో పనిగా ఈ సదుపాయం ఫేస్‌బుక్ లో కూడా ఉందని మరీ ఆయన చెప్పారు. దీనిపై వచ్చిన వేలాది కామెంట్లకు ఓపిగ్గా సమాధానాలు రాశారు. డాడీ అయ్యాక ఆయనకు ఈ ఓపిక ఇంకా బాగా పనికిరావచ్చు.

 

విక్రమూర్ఖుడు

గురుడు పట్టు వదలని విక్రమార్కుడు.. సారీ, విక్రమూర్ఖుడు. ఓ దుకాణానికి వెళ్లాడు. ఏడు ఫ్రాంకులు చెల్లించి క్యాబిన్‌లోకి వెళ్లాడు. లోపల్నుంచి తలుపు మూసుకున్నాడు. ఇంతలో దుకాణానికి నిప్పంటుకుంది. అందరూ ఖాళీ చేశారు కానీ క్యాబిన్‌లో ఉన్న మనోడు మాత్రం బయటికి రానంటాడు! మంటల్లోంచి వస్తున్న పొగకు ఉక్కిరిబిక్కిరై కూడా, భళ్లు భళ్లున దగ్గుతున్నా కూడా దొంగచాటుగా చూస్తున్న వీడియోను ఆసాంతం చూసేయాలని నిర్ణయించుకున్నాడు. ‘బయటకి రావయ్యా మగడా... చనిపోతావు’ అని అగ్నిమాపక సిబ్బంది ఎంత మొత్తుకున్నా వినకుండా ‘వీడియో పూర్తవాలి. నేను బయటకి రావాలి’ అని తేల్చేశాడు. చివరికి క్యాబిన్ తలుపులు బద్దలుగొట్టి, అతడిని బలవంతంగా బయటికి తేవాల్సి వచ్చింది. లాక్కువస్తుంటే కూడా ‘నా వీడియో... ఇంకా పూర్తి కాలేదు’ అని గోలపెట్టాడట. చివరికి ఎలాగోలా బయటకు తెచ్చాక ‘ఏడు ఫ్రాంకులు ఇచ్చా మరి... పూర్తిగా చూడకుండా ఎలా వదుల్తా’ అని అన్నాడట. ఈ సంఘటన జర్మనీలోని బెర్లిన్ లో జరిగింది.

 

ట్విట్టర్ పవర్

ట్వీట్ అంటే తోకలేని పిట్ట. నూట నలభై అక్షరాల్లో అది ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుంది. దాని పవరేంటో చూడాలంటే నమ్రతా మహాజన్ కథ తెలుసుకోవాల్సిందే. గతవారం నమ్రత మహారాష్ట్రలో రైల్ల్లో ప్రయాణిస్తోంది. కంపార్ట్‌మెంట్‌లో ఆమె ఎదురుగా ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతని కదలికలు ఆమెలో అనుమానం రేకెత్తించాయి. ఏదో జరగొచ్చునన్న భయం ఆమెను ఆవరించింది. ఆమె తన సెల్ ఫోన్‌లో తక్షణం ఏకంగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకే ట్వీట్ చేసింది! క్షణాల్లో ఆమె టికెట్ పీఎన్‌ఆర్ నంబర్ పంపమని రైల్వే అధికారులు ఆమెను అడిగారు. ఆమె పంపింది. తర్వాతి స్టేషన్ వచ్చేసరికి పోలీసులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె ఎదుటి వ్యక్తిని పశ్నించారు. అతను హడలిపోయాడు. తరువాత ఆ వ్యక్తిని వేరే కంపార్ట్‌మెంట్‌కి తరలించారు. ఇప్పుడు అంతా సురేశ్ ప్రభు పనితీరును మెచ్చుకుంటున్నారు. కానీ అసలు కథంతా నడిపించింది మాత్రం ట్విట్టర్ అనే సోషల్ మీడియానే. ఒక్క ట్వీట్ తో రైల్వే యంత్రాంగమంతటినీ కదిలించేసింది నమ్రత. అదీ ట్విట్టర్ పవరంటే!

 

మెరుపు దాడి

జిగేల్మనే గడ్డం... జిలుగు వెలుగుల గడ్డం! ఇప్పుడు గడ్డానికి మెరుపు అద్దడం లేటెస్ట్ ఫేషన్. గడ్డానికి ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఇలా రకరకాల రంగుల మెరుపు అంటించి జిగేల్మనడం ఇప్పుడు యూరప్, అమెరికాల్లో వేలం వెర్రిగా సాగుతోంది. జిలుగు వెలుగుల గడ్డంతో, మెరుపుల మీసంతో అందరూ రెడీ అవుతున్నారు. కొందరైతే కేవలం గడ్డానికి, మీసానికే కాదు, నాలుకకు కూడా మెరుపు అంటించుకుని తయారవున్నారు. ఇప్పుడిదే లేటెస్ట్ ఫ్యాషన్ అని సరదా పడున్నారు. వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్లూ లేకపోలేదు . ‘బ్రోస్ ... డోన్ట్ లెట్ బ్రోస్ గ్లిట్టర్ దెయిర్ బియర్డ్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఒక ఉద్యమమే సాగుతోంది. గడ్డానికి మెరుపులు అద్దుకోవడం సులువే కానీ, వాటిని వదిలించుకోవడం మాత్రం చాలా కష్టం. కాబట్టి యూరప్ ట్రెండ్ ఫాలో అయ్యే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఆ తరువాత మీ ఇష్టం.

 

నాటి ధరలు... నేటి వంటలు

ఉప్మా ప్లేటు ఇరవై పైసలు. ఫిల్టర్ కాఫీ పదిహేను పైసలు. రసం వడ యాభై పైసలు. ఇడ్లీ ఇరవై పైసలు,  సాదా దోశ నలభై ఐదు పైసలు. ఒక ప్లేటు రసం వడ, రెండు ఉప్మా, ఒక ఫిల్టర్ కాఫీ తింటే టాక్సులతో సహా బిల్లు అక్షరాలా ఒక్క రూపాయి మరియు అయిదు నయా పైసలు. పది రూపాయలుంటే పది మంది పండగ చేసుకోవచ్చు. విందు భోజనం ఆరగించేయొచ్చు. ముంబై మాతుంగాలోని మద్రాస్ కేఫ్ 75 ఏళ్లు పూర్తిచేసుకుని, డైమండ్ జూబ్లీ జరుపుకుంటోంది. అందుకే కస్టమర్లకు హోటల్ మొదలుపెట్టిన నాటి ధరలకు ... అంటే 1940 నాటి ధరలకే టిఫిన్లు ఇస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ కొన్ని రోజులకు మాత్రమేనట. ఇప్పుడు ఈ హోటల్ ఇచ్చిన బిల్లుల ఫోటోలు ఇంటర్‌నెట్ అంతా విహరిస్తున్నాయి. మీకూ ఆనాటి ధరలకే ఈనాడు టిఫిన్ చెయ్యాలని ఉంటే తక్షణం ఓ ఆరేడు వేలు మీవి కాదకుని విమానం ఎక్కేసి ముంబాయి వెళ్లిపొండి. టిఫిన్ నలభై ఐదు పైసలు. రానూపోను ఖర్చు మాత్రం ఓ ఆరేడువేలు. అంతే...!!

 

 కూర్పు: కె. రాకా సుధాకరరావు  www.sakshipost.com

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top