వినూత్న బోధన, విశిష్ట పరిశోధనలు @ ఐఐటీ- బాంబే

వినూత్న బోధన, విశిష్ట పరిశోధనలు @ ఐఐటీ- బాంబే - Sakshi


మై క్యాంపస్ లైఫ్

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - బాంబే.. ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు.. అత్యంత ఇష్టమైన గమ్యం. అంతేకాదు ప్రపంచస్థాయీ పరిశోధనలకు, అత్యుత్తమ విద్యా బోధనకు పెట్టింది పేరు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ)లో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఎస్. వెంకట శైలేష్.. క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా..

 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 16వ ర్యాంకు

మాది హైదరాబాద్. నాన్న డీఎల్‌ఆర్‌ఎల్‌లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. పదో తరగతిలో 555 మార్కులు, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో 983 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్- 2013లో 16వ ర్యాంకు, ఎంసెట్‌లో 25వ ర్యాంకు సాధించాను.

 

 స్టూడెంట్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్: క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే దాదాపు 200 మంది వరకు ఉన్నారు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. ర్యాగింగ్ అసలు లేదు. క్యాంపస్‌లో చేరేటప్పుడే స్టూడెంట్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ కింద ఇద్దరు సీనియర్లను ప్రతి ఒక్క విద్యార్థికీ కేటాయిస్తారు. వీరు క్యాంపస్‌కు సంబంధించిన వివిధ విషయాలపై అవగాహన కల్పిస్తారు.

 

 బోధన.. వినూత్నం: సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయాన్ని స్లాట్స్‌గా విభజిస్తారు. ఈ స్లాట్స్‌లో ఎప్పుడైనా తరగతులు నిర్వహిస్తారు. బ్రాంచ్‌ను బట్టి రోజుకు 4 కోర్సుల్లో క్లాసులుంటాయి. వారానికి 20 గంటలు తగ్గకుండా తరగతులు నిర్వహిస్తారు. ల్యాబ్ వర్క్ వారానికి మూడుసార్లు ఉంటుంది. ఆధునిక విధానాల ద్వారా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బోధనలో ఇండస్ట్రీ, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తారు. ఆయా సబ్జెక్టులపై పట్టు కోసం చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో కోర్సులు చేస్తుంటారు. నేను మొదటి ఏడాదిలో 10కి 9.56 సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్‌పాయింట్ ఏవరేజ్) సాధించాను. ఆయా బ్రాంచ్‌ల్లో ఎక్కువ మార్కులు సాధించినవారికి అవార్డుతోపాటు నగదు బహుమతులు ఉంటాయి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై తరగతులు కూడా నిర్వహిస్తారు. ఫ్యాకల్టీతోపాటు అదనంగా టీచింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. సాధారణంగా బీటెక్ పూర్తయిన వారు, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు టీచింగ్ అసిస్టెంట్స్‌గా వ్యవహరిస్తారు. బీటెక్‌లో ప్రతి సెమిస్టర్‌కు ఆరు నుంచి ఏడు కోర్సులు ఉంటాయి. ఈ ఏడు కోర్సులకు కలిపి ఐదుగురు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. సబ్జెక్టుల పరంగా ఎదురయ్యే సందేహాలను వీరినడిగి నివృత్తి చేసుకోవచ్చు.

 

ఆలోచనలకు ప్రోత్సాహం: ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. వివిధ పోటీలు కూడా నిర్వహిస్తారు. విద్యార్థుల కొచ్చే ఆలోచనలను ఈ ఫెస్ట్‌లో వివరించవచ్చు. వారు తయారుచేసిన వివిధ యంత్ర పరికరాలు, రూపొందించిన అప్లికేషన్స్‌ను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించవచ్చు. పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి అవార్డులు, నగదు బహుమతులు ఉంటాయి.

 

స్టార్టప్స్‌కు ఫండింగ్: సృజనాత్మక  ఆలోచనలతో స్టార్టప్స్‌ను ఏర్పాటు చేయాలనుకునేవారికి.. ఫండింగ్ సదుపాయం ఇన్‌స్టిట్యూట్ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఇంక్యుబేషన్ సెల్, బ్రాంచ్‌లవారీగా డిపార్ట్‌మెంట్ క్లబ్‌లు ఉన్నాయి. ఫండింగ్ కావాలనుకునేవారు ఈ క్లబ్‌లను సంప్రదించొచ్చు. విద్యార్థుల ఆలోచనలను స్వీకరించి ఉత్తమమైనవాటిని ఫండింగ్‌కు ఎంపిక చేస్తారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడి ఆర్థిక సహాయం అందిస్తారు. అంతేకాకుండా కొత్త స్టార్టప్ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే తీరును తెలియజేస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇస్తారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top