ఇందులోకి వచ్చాక... ప్రతిరోజూ ఓ పరీక్షే!

ఇందులోకి వచ్చాక...  ప్రతిరోజూ ఓ పరీక్షే!


పూనమ్ మాలకొండయ్య... నిబద్ధత కలిగిన ఐఎఎస్ అధికారిణి. విద్య, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, రవాణా, ఆర్థిక, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్యం, రాష్ట్ర రోడ్డు రవాణా, పౌరసరఫరాలు, మహిళాశిశు సంక్షేమం వంటి రంగాల్లో పనిచేశారు. ఏ రంగంలో అవినీతి రాజ్యమేలుతుంటే అక్కడ ఆమెను నియమిస్తారు పాలకులు. ఏ రంగంలో సంస్కరణలు అవసరమో అక్కడ ఆమె పేరు గుర్తొస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ‘ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీ’కి చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆమెతో ముఖాముఖి...

 

దేశనిర్మాణం యువత చేతిలో ఉంటుంది. యువత చైతన్యవంతంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కో దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే తొలగిపోతుంది.

 

 

నిజాయితీగల అధికారి, నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మీ ప్రిన్సిపుల్ ఏమిటి?



మా తాతగారు పోలీసు అధికారిగా చేసిన సాహసాల గురించి మా అమ్మ చాలా చెప్పేది. చారిత్రక కథనాలను కళ్లకు కట్టినట్లు వర్ణించేది. ఆ కథల్లోనే మంచిచెడులు, నిజాయితీ అన్నీ కలగలిసి ఉండేవి. అన్నింటికీ మించి ‘నిజాయితీ ఎప్పటికీ నిలుస్తుంది. మనిషిని సమాజంలో హుందాగా నిలబెడుతుంది’ అని నమ్మే మనిషిని నేను.



డాక్టరేట్ అందుకోవాల్సిన సమయంలో సివిల్స్ వైపు వచ్చేశారు. అప్పట్లో డాక్టరేట్ మిస్ అయిందనిపించలేదా?



అనిపించేది. అందుకే ఐఎఎస్‌గా విధులు నిర్వర్తిస్తూనే ‘మహిళలు- అక్షరాస్యత’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాను.



మీ పరిశోధనాంశాలను మహిళాభివృద్ధి కోసం పొందుపరిచారా?



కంటిన్యూయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో నిరక్షరాస్యులైన మహిళల కోసం ఓ ప్లాన్‌ను చేర్చాను. పెళ్లయి పిల్లలున్నా సరే చదువుకోవాలనిపిస్తే ఆరేళ్ల కాలంలో పన్నెండవ తరగతి పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకోవచ్చు. ఆ తర్వాత డిఎడ్ శిక్షణ తీసుకుని టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించవచ్చు. విద్యాశాఖలో పనిచేసినప్పుడు దీనిని రూపొందించాను.

 


స్త్రీ విద్య పట్ల ప్రత్యేక ఆసక్తి ఉందా?



దేశ నిర్మాణానికి స్త్రీ విద్య చాలా ముఖ్యం. అందుకే స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికలు చదువు మానేయడం, పోషకాహార లోపంతో మహిళలు అనారోగ్యం పాలవడం మీద దృష్టి పెట్టా.మీకు మీ ఉద్యోగబాధ్యతలపరంగా తృప్తి ఇచ్చిన రంగాలు... వ్యవసాయ, విద్య, వైద్యరంగాలు. వీటిలో ప్రజోపయోగ విధానాలను రూపొందించి అమలు చేసే అవకాశం ఎక్కువ.   ఐఎఎస్ అధికారిగా ఎదుర్కొన్న పరీక్షలు..!ఐఎఎస్‌లోకి రావడానికి ఒక పరీక్ష పాసయితే చాలు. ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ ఓ పరీక్షలాగే ఉంటుంది. మోస్ట్ చాలెంజింగ్ జాబ్.   ఆసక్తి లేకుండా కొనసాగిన రంగాలు..! నేను డిపార్ట్‌మెంట్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకోను. సర్వీస్‌తో సన్నిహితంగా ఉంటాను. కాబట్టి ఏ శాఖలోనైనా నా లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.



ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఏం చేయబోతున్నారు?



{పభుత్వానికి 77 రికమండేషన్స్‌తో నివేదిక ఇచ్చాను. వాటిలో కొన్ని... సిటీ బస్సులో మహిళలకు- మగవారికి మధ్య అడ్డుగా జాలీ ఏర్పాటు, షీ బృందాల వంటివి అమలులోకి వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఈవ్ టీజింగ్‌ను నిరోధిస్తూ శాసనం, ఉమెన్ హెల్ప్‌లైన్ వంటివి అమలులోకి రానున్నాయి.



మహిళ పరిస్థితి మారాలంటే?... బాలికల్లో ‘తాము ఎవరికంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు’ అనే అభిప్రాయం బలంగా నాటుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ప్రమాదాన్ని ఎదుర్కోగలమనే భరోసా ఉంటే, బాలికలు తమంతట తామే అన్నింట్లో ముందడుగు వేస్తారు.  



విద్యావ్యవస్థ మీద మీకు కలిగిన అభిప్రాయం?...ఎనిమిది, తొమ్మిది తరగతుల నుంచి వారికి ఆసక్తి ఉన్న వృత్తివిద్యలను నేర్పించే విధంగా విద్యావిధానం మారాలి. అలాగే జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పు తీసుకురావడం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి.



గొప్ప అధికారం ఉన్న ఉద్యోగం కదా! సివిల్స్ విద్యార్థులకు మీ సూచన..?



ఇందులో అధికారం ఉంటుంది. కానీ అధికారం కోసం ఉద్యోగం కాకూడదు. ఇది పవర్ ఉన్న ఉద్యోగం అనుకోరాదు, దేశాన్ని పవర్‌ఫుల్‌గా మార్చగలిగే అవకాశం ఉన్న ఉద్యోగం అనుకోవాలి.

 - వి.ఎం.ఆర్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top