పాత కారుపై లోను..


కొత్త, పాత కార్లను కొనుక్కోవడానికే కాదు.. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల కోవలో పాత కార్లపై రుణాలు కూడా అందిస్తున్నాయి బ్యాంకులు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు మొదలైనవి ఇలాంటి రుణాలు ఇస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇచ్చే రుణాల  విషయానికొస్తే.. ప్రైవేట్‌గా వాడుకున్నదైతే వాహనం ఏడేళ్లకు మించి పాతబడకూడదు. అదే కమర్షియల్ వాడకంలో ఉన్నదైతే ఆరేళ్లకు మించి పాతబడకూడదు. వ్యక్తిగత రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల కన్నా దాదాపు 2 శాతం తక్కువ వడ్డీ రేటుకి ఈ లోన్స్ అందిస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు కూడా ఈ తరహా లోన్స్‌ని ప్రవేశపెడుతోంది.

 

బబ్ల్యూస్.. పోస్ట్ చేస్తే పైసా..




సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు సాధారణంగా యూజర్ల సంఖ్యను చూపించి, అడ్వరై ్టజ్‌మెంట్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటాయి కానీ యూజర్లకు అందులో వాటాలేమీ ఇవ్వవు. ఇందుకు భిన్నంగా తాజాగా బబ్ల్యూస్ (www.bubblews.com)అనే సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఒకటి పుట్టుకొచ్చింది. యూజర్లు ఏదైనా పోస్ట్ చేసినా.. లేదా షేర్ చేసినా ప్రతిసారీ ఈ సంస్థ తమ ప్రకటనల ఆదాయంలో కొంత వాటాను వారికి కూడా ఇస్తామంటోంది. ఇలా ప్రతి పోస్ట్‌కి దాదాపు ఒక్క సెంటు (అమెరికన్ డాలర్లో వందో వంతు.. మన కరెన్సీలో సుమారు అరవై పైసలు) లభించవచ్చు. మన అకౌంట్లో మొత్తం 50 డాలర్లు జమయిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అరవింద్ దీక్షిత్, జేసన్ జకారీ దీన్ని ఏర్పాటు చేశారు. బబుల్, న్యూస్ అనే రెండు పదాలను కలిపేసి బబ్ల్యూస్ అని పేరు పెట్టారు. ఇందులో కనీసం 400 క్యారెక్టర్స్‌తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

 

వైద్యానికి ‘ఆరోగ్య ఫైనాన్స్’ రుణాలు

 

వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి తగ్గ ఆరోగ్య బీమా పాలసీలూ అందుబాటులోకి వస్తున్నాయి. చికిత్స ఖర్చులకు బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయి. అయితే, బీమాను పక్కనపెడితే బ్యాంకు రుణాలు పొందాలంటే శాలరీ స్లిప్పులని మరొకటని.. బోలెడన్ని డాక్యుమెంట్లు అవసరమవుతుంటాయి. అంతంత మాత్రం జీతం అందుకునే వారి వద్ద ఇలాంటివి ఉండవు. మరి ఇలాంటి వారి పరిస్థితి ఏమిటి?  ఫలితంగా బ్యాంకుల నుంచి లోన్లు పొందడం కష్టమవుతుంటుంది. ఇలాంటి వారి చికిత్స అవసరాలు తీర్చే దిశగా కొన్ని సంస్థలు తెరపైకి వస్తున్నాయి. ఆరోగ్య ఫైనాన్స్ అటువంటిదే. పరిస్థితిని బట్టి చికిత్స రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5- 24 గంటల్లోగా దరఖాస్తుదారును కంపెనీ సంప్రదిస్తుంది. ఫైనాన్స్ కౌన్సిలరు..ఆస్పత్రికి వస్తారు. దరఖాస్తుదారు కుటుంబంతో మాట్లాడి, రుణం తిరిగి చెల్లించడంలో వారి నిబద్ధత గురించి అంచనా వేస్తారు. ఆ తర్వాత అర్హులని భావించిన పక్షంలో  కేసును బట్టి రూ.20,000 నుంచి రూ. 2,00,000 దాకా ఆరోగ్య ఫైనాన్స్.. రుణం మంజూరు చేస్తుంది. దీనిపై దాదాపు 12 శాతం వార్షిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్ మొత్తాన్ని బట్టి ఆరు నెలల నుంచి మూడేళ్లలోగా రుణాన్ని తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లోని 50 పైగా ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని ఈ రుణాలు అందిస్తోంది ఆరోగ్య ఫైనాన్స్.

 

డీల్స్ అండ్ డిస్కౌంట్స్



ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైటు ఫ్లిప్‌కార్ట్‌డాట్‌కామ్.. బ్యాగులు, బెల్టులు, వాలెట్లపై 80 శాతం పైగా, చేతి పనిముట్లపై 20 శాతం మేర డిస్కౌంట్లు ఇస్తోంది. ఫ్యాషన్ సేల్ కింద మహిళల ఫుట్‌వేర్‌పైన.. పురుషుల దుస్తులపైన సుమారు 70 శాతం దాకా, పిల్లల దుస్తులపై 40 శాతం మేర, వాచీలపై కనిష్టంగా 40 శాతం, సన్‌గ్లాసెస్‌పై 80 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తోంది. ఆభరణాల మీద దాదాపు 60 శాతం మేర డిస్కౌంట్లు అందిస్తోంది.

 

మీ ఆర్థిక లక్ష్యం సాధించారా?



ఇల్లు, వాహనం, ఉన్నత విద్య మొదలైన లక్ష్యాల సాధన కోసం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళికలు (డౌన్‌పేమెంట్లు, మార్జిన్లు సమకూర్చుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టేం దుకు ప్లానింగ్ చేసుకోవడం వంటివి) సాధిం చిన విజయాలను మాతో పంచుకోండి. అలాగే, పొదుపు, పెట్టుబడులు, మనీ మేనేజ్‌మెంటుకి సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటించే వైవిధ్యమైన చిట్కాలు, విధానాలేమైనా ఉంటే మాకు రాయండి.

 మీ లేఖ పంపాల్సిన చిరునామా

 బిజినెస్ డెస్క్, సాక్షి తెలుగు దినపత్రిక,

 సాక్షి టవర్స్, రోడ్ నంబర్-1,బంజారాహిల్స్,

 హైదరాబాద్. పిన్-500034

 email: business@sakshi.com


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top