ఆల్కహాల్... పరిమితంగానూ ప్రమాదమే!

ఆల్కహాల్... పరిమితంగానూ ప్రమాదమే!


పరిపరి శోధన

 

చాలా పరిమితంగా తీసుకుంటే ఆల్కహాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనీ, మోతాదుకు మించకుండా రెడ్ వైన్ లాంటివి తీసుకుంటే కొంతవరకు గుండెజబ్బుల నివారణకు తోడ్పడుతుందనే అపోహ ఉంది. కానీ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా ఆల్కహాల్ ప్రమాదకరమే అంటున్నారు పరిశోధకులు. కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు ఆల్కహాల్ దోహదపడుతుందన్నది తాజా పరిశోధనలు చెబుతున్న మాట. ఎంత పరిమితంగా తాగినా అది గొంతు, ల్యారింగ్స్, ఈసోఫేగస్, కాలేయం, పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ, రొమ్ము క్యాన్సర్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అధ్యయనవేత్తలు. న్యూజిల్యాండ్‌లోని ఒటాగో మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చెందిన పరిశోధకులు చెబుతున్న మాట ఇది. అక్కడి ప్రొఫెసర్ జీనీ కానర్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో స్పష్టంగా వెల్లడైన మాట ఇది.‘‘ఇంకా మరెన్నో క్యాన్సర్లకు కూడా మద్యం కారణం కావచ్చు.





కానీ ఆ ఏడు రకాల క్యాన్సర్లను మద్యం ప్రేరేపిస్తుందని మా అధ్యయనాల్లో వెల్లడైంది’’ అన్నారు జీనీ కానర్. ‘‘మా అధ్యయనాల ప్రకారం... ఫలానా పరిమితి వరకు మద్యం సురక్షితమైనది అని చెప్పడానికి కూడా వీల్లేదు’’ అమె చెబుతున్నారు. ‘‘క్యాన్సర్ వచ్చే అవకాశాలు డోస్ డిపెండెంట్ అని కూడా చెప్పవచ్చు. అంటే మీరు తాగే మోతాదు పెరుగే కొద్దీ... క్యాన్సర్ వచ్చే అవకాశాలూ అంతే పెరుగుతుంటాయి’’ అని హెచ్చరిస్తున్నారామె. పైగా ఎనర్జీ డ్రింక్‌లతో తక్షణం ఉత్తేజం కలుగుతుందనే భావన కలిగించడం కలిగించడం కోసం వాటిల్లో ఆల్కహాల్ కలుపుతుంటారని తేలింది. కొన్ని శీతల పానీయాల్లో అమెరికాకు చెందిన నార్దరన్ కెంటకీ యూనివర్సిటీ అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీని వల్ల యువత క్రమంగా మద్యానికి అలవాటు పడటం, తర్వాత అదేపనిగా తాగడం (బింజ్ డ్రింకింగ్) జరుగుతోందని ఆ యూనివర్సిటీ చెందిన అధ్యయనవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. ఇక వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ (డబ్ల్యూసీఆర్‌ఎఫ్)కు చెందిన ప్రోగ్రామ్ మేనేజర్ సుసానా బ్రౌన్ మాట్లాడుతూ ‘‘మద్యం ఎంత తక్కువ మోతాదుల్లో తీసుకున్నా అది కాలేయ క్యాన్సర్‌కు దోహదం చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘అందుకే మా అధ్యయన ఫలితాల ఆధారంగా ఎంత తక్కువ మోతాదుల్లో అయినా అసలు మద్యమే తాగకూడదని మేం సూచిస్తుంటాం’’ అంటున్నారు సుసానా బ్రౌన్.



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top