షర్మిలని చూస్తేనాకు గర్వంగా ఉంది...

షర్మిలని చూస్తే నాకు గర్వంగా ఉంది...


ఈరోజు షర్మిల పాదయాత్ర ముగింపురోజు. 230 రోజులు, 3075 కిలోమీటర్లు సాగింది ఈ మరో ప్రజాప్రస్థానం. ఇది తన చిత్తశుద్ధికి, పట్టుదలకే కాకుండా తనకు అన్న మీద వున్న అపారమైన ప్రేమకు సుదీర్ఘ నిదర్శనం. తను మొదలుపెట్టకముందు నేను తనతో అన్నాను - ‘పాపా వద్దు, ఇంత కష్టం ఎందుకు పెట్టుకున్నావ్’ అని! దానికి తను - ‘అన్న పడే కష్టం ముందు నాది ఎంత  వదినా! అన్నకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధం. కనీసం ఇదైనా చెయ్యగలుగుతున్నాను. అన్నను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.

 

 నేను అన్నకోసం ఏమీ చేయలేకపోతున్నానే అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇది చెయ్యగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంది. షర్మిలకు వాళ్ల నాన్న అన్నా, అన్న అన్నా ప్రాణం. ఆ అనురాగం ఏ ఆడపిల్లకైనా వుంటుంది కానీ షర్మిలకు ఒక మోతాదు ఎక్కువ. అందుకే దేవుడు తన తండ్రి నడిచిన బాటలో, తన అన్నకోసం నడవడానికి అవకాశం ఇచ్చాడనుకుంటా. ఒకసారి తను అంది - ‘‘పాదయాత్రలో ఎవరైనా నాతో ‘చెల్లి అంటే నీలా ఉండాలమ్మా’ అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వదినా’’ అని!

 

 ఒక మహిళగా షర్మిల ఈ సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి ముగించినందుకు సాటి మహిళగా నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. అణగారిన ప్రజలకోసం వారిని ధైర్యపరుస్తూ నడిచిన ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగియడంతో సాధారణ ప్రజగా నేను సంతోషంగా ఉన్నాను. అన్నకోసం తలపెట్టి నడిచి, ఈ మరో ప్రజాప్రస్థానాన్ని ముగించినందుకు ఒక కుటుంబ సభ్యురాలిగా నేను సంతోషిస్తున్నాను. ఇంటికి తిరిగి వస్తున్నందుకు మేమంతా తనకోసం వేచి ఉన్నాము.

 

 ఒకవైపు ఇలా అనిపించినా - రాష్ట్రానికి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న అన్యాయాన్ని చూసి గుండె తరుక్కుపోతూ వుంది. రాజకీయ ప్రయోజనాలకోసం ఇంతవరకు జగన్‌ను జైలులో పెట్టారు. రాజకీయ లబ్దికోసం మా జీవితాలను అష్టకష్టాలపాలు చేశారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రం మీదనే పడ్డారు. 2004-2009 వరకు స్వర్ణయుగం చూసిన మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనే కొలమానం తప్ప మరే ధ్యాసా లేదు ఈ కాంగ్రెస్‌కు. ప్రజలు, వారి ప్రయోజనాలకన్నా ఈ పార్టీకి అధికారమే పరమావధి అయింది. దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమేసినట్టు ఈ కాంగ్రెస్ వాళ్లను తరిమి వేయవలసిన సమయం వచ్చింది. కాగల కార్యం గంధర్వులే చేస్తారంటారు. ఆ దేవుడే ఈ స్వార్థ కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కేస్తాడు.

 

 తెలంగాణ ప్రజల మనోభావాలకు జగన్ ఏరోజూ వ్యతిరేకి కాదు. కాని ఇలా అడ్డగోలుగా, ఎవ్వరినీ పిలవకుండా, ఏమీ మాట్లాడకుండా ఓట్లకోసం, సీట్లకోసం అన్యాయం చేస్తూ, నియంతృత్వ పోకడతో వీళ్లు వ్యవహరిస్తూ - ‘అన్నీ మాట్లాడాము, అంతా అయిపోయింది, ఇంకెవ్వరి మాటలతో, ఎవ్వరి భావాలతో పనిలేదు. మాకు ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాము. మీ గోడుతో మాకు పనిలేదు’ అని అంటున్నారు. ‘తెలంగాణ ఇస్తున్నాము. వారిని కాస్త నొప్పించినా మనకు ఓట్లు, సీట్లు తగ్గుతాయి, మనకు క్రెడిట్ రాదు. అదే అటువైపు సీట్లు ఎలాగూ రావు కాబట్టి వారికి అన్యాయం జరిగినా పర్వాలేదు’ అన్న రీతిలో అన్యాయపు ఆలోచనలు చేస్తున్న కాంగ్రెస్‌వారిని; స్పందిస్తే తెలంగాణ ప్రాంతంలో ఓట్లు, సీట్లు దెబ్బతింటాయని, అన్యాయం జరిగినా పట్టించుకోని చంద్రబాబు గారిని చూస్తుంటే బాధనిపిస్తోంది.

 

 ఒకరోజు రాయల తెలంగాణ అంటారు, ఒకరోజు తెలంగాణ అంటారు. ఒకరోజు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అంటారు, ఒకరోజు హైదరాబాద్ తెలంగాణకు అంటారు. నదీజలాల గురించి ఒక్క మాటా ఎత్తరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలిసి కూడా, కృష్ణానది మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తరువాత కానీ, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే గానీ కిందికి నీరు వదలని పరిస్థితి.

 

 ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి మార్పులూ చేర్పులూ చేయకుండా, మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే, శ్రీశైలంకు నీరు, ఆ తరువాత నాగార్జునసాగర్‌కు నీరు ఎక్కడ నుంచి వస్తాయి? దిగువన కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప, మంచినీరు ఎక్కడ ఉంది? దిగువనున్నవారు ఎలా బతకగలరు? పోలవరంకు జాతీయ హోదా ఇస్తాము అని అంటారు కాని, దానికి నీళ్లు ఎలా ఇస్తారు? ఎక్కడ నుంచి ఇస్తారు? అనేది చెప్పరు. ప్రజలందరికీ సముచిత న్యాయం ఎలా చేస్తారో ప్రజల ముందు ఉంచరు. ఎవ్వరితోనూ మాట్లాడరు. ఏ పార్టీలనూ చర్చలకు పిలవరు. అభిప్రాయాలు తీసుకోరు. ఎన్ని సీట్లు వస్తాయనేదాన్ని బట్టి, వాళ్లకు ఇష్టం వచ్చినట్టు పంపకాలు చేసి, దాన్ని బిల్లుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ప్రజలకు అన్యాయం చేసి మళ్లీ 2014లో అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేసుకుంటున్నారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి మనది. ప్రజల జీవితాలతో ఆడుకునే పార్టీకి ఎవ్వరూ ఓటు వెయ్యరు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు.

 

 ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం దేవుడు రోజురోజుకూ బయలుపరుస్తున్నాడు. ఆ దేవుడే ఈ పార్టీని కూకటివేళ్లతో పెకలించివేసే రోజు ఎంతో దూరంలో లేదు.  ఇన్ని రోజులు ‘జగన్ నా కోసం, నా పిల్లల కోసం బయట ఉంటే బాగుండు’ అని అనుకునేదాన్ని. కానీ ఈ రోజు ‘నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, ప్రజల కోసం జగన్ బయట ఉండి ఉంటే ఎంత బాగుండు. వీళ్లను ఎండగట్టి ఉండేవాడు. వీళ్లతో ప్రజల పక్షాన గట్టిగా పోరాటం చేసి ఉండేవాడు. ప్రజల గొంతును ఇంకా గట్టిగా వినబడేటట్టు చేసి ఉండేవాడు’ అని అనిపిస్తూ ఉంది.



జగన్ మన కోసం గట్టిగా పోరాడతాడని, అందుకే జగన్‌కు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే 14 నెలలు పైబడి పెట్టారని తలుచుకుంటే ఎంతో బాధగా ఉంది. ‘ప్రజల తరఫున మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. బాబుగారు ఎలాగూ కుమ్మక్కైపోయారు. మనం ఇష్టం వచ్చినట్టు కరెంట్ బిల్లులు వెయ్యవచ్చు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపవచ్చు, 108, పెన్షన్లు, ఇళ్లు ఆపవచ్చు. అడ్డుగోలుగా, విచక్షణారహితంగా రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి, చిన్నాభిన్నం చేసి, చంద్రబాబుగారితో కలిిసి రాజకీయ క్రీడ ఆడుకోవచ్చు’ అని అనుకొని జగన్‌ను లోపల పెట్టి ఉంటారు.

 

 అయినా పైన దేవుడనేవాడు ఉన్నాడు. ఆయన అన్యాయాన్ని ఎంతోకాలం సహించడు. ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగే అన్యాయాన్ని, మా కుటుంబానికి జరిగే అన్యాయాన్ని తప్పక తిప్పి కొడతాడు. కాంగ్రెస్‌వాళ్లు ఊహించని విధంగా వాళ్ల ఎత్తులు, జిత్తులు అన్నీ చిత్తుచిత్తుగా ఓడించి నీతిని, న్యాయాన్ని, మంచిని, మేలును, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మన రాష్ట్రానికి, మన ప్రజలకు, మాకు చేకూరుస్తాడు.

 

 - వైఎస్ భారతి,

 w/o వైఎస్ జగన్


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top