ఫీజు సరే.. సరైన స్కూల్లోనే చేర్పిస్తున్నారా..!

ఫీజు సరే.. సరైన స్కూల్లోనే చేర్పిస్తున్నారా..!


కేజీ టు పీజీ..

హౌ టు సెలక్ట్ బెస్ట్ స్కూల్? ఇప్పుడు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది తల్లిదండ్రులు, విద్యార్థులకు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతున్న అంశం. జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ బోర్డు మొదలు స్టేట్ బోర్డుల వరకు అనుబంధంగా లక్షల సంఖ్యలో స్కూళ్లు. వాటి పేర్లకు టెక్నో, గ్లోబల్, ఒలింపియాడ్ వంటి సఫిక్స్‌లు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.



నగరాలు దాటి ఇప్పుడు ప్రయివేటు స్కూళ్లు చిన్నచిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రయివేటు స్కూళ్ల మోజులో , తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే ఆతృతతో.. అప్పులు చేసైనా వేలల్లో ఫీజులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు.. ఆయా పాఠశాలల ప్రమాణాలపై దృష్టిపెట్టడంలేదు. ఈ నేపథ్యంలో.. ఏది మంచి స్కూలో, పిల్లలను ఎలాంటి స్కూల్లో చేర్పిస్తే.. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందో  తెలుపుతూ సాక్షి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..

 

ప్రస్తుతం మంచి స్కూల్ ఎంపిక విషయంలో తల్లిదండ్రుల కసరత్తు కేజీ (కిండర్ గార్టెన్) స్థాయి నుంచే మొదలవుతోంది. మెట్రోసిటీలు, ఇతర నగరాల్లో అప్పటికే పేరు గడించిన పాఠశాలల్లో ప్రవేశాల కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో కిండర్‌గార్టెన్‌లో అడ్మిషన్ కోసం 1,473 దరఖాస్తులు వచ్చాయి. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.



అప్పటికే ప్రమాణాలు, నాణ్యమైన విద్య పరంగా పేరున్న పాఠశాలలను మినహాయిస్తే.. వేల సంఖ్యలో ఉన్న ఇతర పాఠశాలల విషయంలోనే తల్లిదండ్రుల ఆందోళన. ఈ క్రమంలో వారు పాఠశాలను ఎంపిక చేసుకునేముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా సుదీర్ఘ కాలం చదవాల్సిన పాఠశాల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలనేది నిపుణుల సూచన.

 

గుర్తింపు.. అత్యంత ప్రధానం


స్కూళ్ల ఎంపికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఆ సంస్థకు ఉన్న గుర్తింపు. సీబీఎస్‌ఈ/స్టేట్ బోర్డ్.. ఆయా స్కూల్ బోర్డ్‌ల ప్రామాణిక గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. ఇందుకోసం నియంత్రణ సంస్థల వెబ్‌సైట్ల నుంచి సమాచారం పొందొచ్చు. బోర్‌‌డ గుర్తింపులేని స్కూల్లో చేరితే విద్యార్థి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనేది నిపుణుల అభిప్రాయం.

 

ప్రత్యక్ష పరిశీలన

పాఠశాలల గుర్తింపు విషయంలో స్పష్టత వచ్చాక తర్వాత చేయాల్సిన పని ఎంపిక చేసుకున్న స్కూల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించడం. అక్కడి పరిసరాలను గమనించడం. అంతేకాకుండా పాఠశాలలను ఎంపిక చేసుకునే ముందు అప్పటికే ఆయా స్కూల్‌లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతోపాటు పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధుల ద్వారా సమాచారం సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది.

 

మెథడాలజీ ఏంటి?


స్కూల్‌ను ఎంపిక చేసుకుని ఒక నిర్దిష్ట అంచనాకు వచ్చాక.. ఆ పాఠశాలలో అనుసరిస్తున్న టీచింగ్ మెథడాలజీ గురించి అన్వేషించాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉన్న స్కూల్ అయితే మంచిది. వాస్తవానికి 2011 నుంచి సీబీఎస్‌ఈ స్కూళ్లలో, 2014 నుంచి స్టేట్ బోర్డ్‌ల అనుబంధ స్కూళ్లలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిచ్చేలా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనే విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే దీన్ని అమలు చేయడంలో 70 శాతంపైగా పాఠశాలలు వెనుకంజలో ఉన్నాయి. కాబట్టి సీసీఈ కోణంలో అనుసరిస్తున్న విధానాలు తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.

 

ఉపాధ్యాయుల అర్హతలు  

చాలా ప్రయివేటు స్కూళ్లలో అర్హులైన ఉపాధ్యాయులు ఉండటం లేదు. దాంతో విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. కాబట్టి తమ పిల్లలను ఒక పాఠశాలలో చేర్చే ముందు తల్లిదండ్రులు ప్రధానంగా చూడాల్సిన అంశం.. ఆ పాఠశాల ఉపాధ్యాయుల అర్హతలు. కిండర్ గార్టెన్ నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవాలి. స్కూల్స్‌లో డీఈడీ, బీఈడీ వంటి అర్హతలు ఉన్న వారినే టీచర్లుగా నియమించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.



కానీ వాస్తవానికి అధిక శాతం పాఠశాలలు వీటిని విస్మరిస్తున్నాయి. ప్రధానంగా ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే ఉపాధ్యాయుల తోడ్పాటు పిల్లలకు ఎంతో అవసరం. భవిష్యత్తు నిర్మాణానికి ఈ రెండు స్థాయిలు పునాదులు. వీటిలో సరైన గెడైన్స్ లేకపోతే తర్వాతి దశలో చదువు పరంగా, అభ్యసన నెపుణ్యాల పరంగా విద్యార్థిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.  కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.

 

టీచర్లు అప్‌డేట్ అవుతున్నారా..

డీఈడీ, బీఈడీ, ఇతర టీచర్ ట్రైనింగ్ కోర్సుల అర్హతతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన దేశంలో సీబీఎస్‌ఈ క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల కోసం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఇలాంటి వర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు స్కూల్ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇస్తున్న అవకాశం గురించి తెలుసుకోవాలి.

 

బోధన పరంగా ఎలా

తరగతి గదిలో విభిన్న నేపథ్యాల విద్యార్థులు ఉంటారు. ఇందులో కొందరు టీచర్ చెప్పిన వెంటనే నేర్చుకోగలుగుతారు. మరికొందరు ఒకటికి రెండుసార్లు చెబితే కానీ అర్థం చేసుకోరు. ఈ నేపథ్యంలో బోధన విషయంలో అనుసరించే విధానం గురించి తెలుసుకోవాలి. ప్రత్యేకంగా స్లో లెర్నర్స్‌కు బోధించే విధానాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టాప్ పెర్ఫార్మర్స్‌ను ప్రత్యేకంగా ఒక గ్రూప్‌గా ఏర్పరచి బోధించడం, గ్రేడ్‌లు, స్కూల్ పబ్లిసిటీ వంటి కోణాల్లో వారిపైనే ఎక్కువ శ్రద్ధ చూపించడం సాధారణ అంశంగా మారింది.



కానీ ఇలాంటి ధోరణి ఇతర విద్యార్థుల్లో ఆత్మన్యూనతకు దారితీస్తుంది. బోధనపరంగా తరగతిలోనే కాకుండా.. తరగతి గది వెలుపల బోధన పరంగా తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించాలి. అంటే.. తరగతిలో బోధించిన ఒక అంశాన్ని ప్రాక్టికల్‌గా వాస్తవ ప్రపంచంతో అన్వయించే నైపుణ్యాలు అందించే విధంగా అవుటాఫ్ ది క్లాస్ రూం మెథడాలజీ గురించి తెలుసుకోవాలి.

 

మీడియం మార్పు

ప్రస్తుతం ఇంగ్లిష్ మాధ్యమానికున్న క్రేజ్ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మాతృభాష నుంచి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చేర్పించడం సర్వసాధారణమైంది. దీంతో అప్పటికే ఇంగ్లిష్ మీడియంలో నిలదొక్కుకున్న ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి మీడియం మారిన విద్యార్థుల విషయంలో పాఠశాల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి తెలుసుకోవాలి.

 

సిలబస్‌పై పరిశీలన

పాఠశాల బోర్డ్ సిలబస్‌కు అనుగుణంగానే సాగుతోందా.. లేదా సొంత విధానాలేమైనా అమలు చేస్తోందా? అలాంటి వాటి సమర్థ అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా సిలబస్, పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు అదనపు సమాచారాన్ని అందించేందుకు ఉన్న సౌకర్యాలు(లైబ్రరీ, ఇంటర్నెట్, ఐసీటీ) గురించి తెలుసుకోవాలి. ఇది హైస్కూల్ స్థాయిలో పాఠశాలల విషయంలో ఎంతో ఆవశ్యకం.

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్

పిల్లలకు పరిణితి లభించే విషయంలో పాఠశాల స్థాయిలో అకడమిక్ నైపుణ్యాలతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, టాలెంట్ ఎగ్జిబిషన్స్ వంటివి) కూడా కీలక పాత్ర పోసిస్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సదుపాయాల గురించి పరిశీలించాలి.

 

ఫీజులు విషయంలోనూ

పాఠశాలల ఎంపిక విషయంలో అన్ని అంశాల్లో స్పష్టత లభించాక.. ఫీజుల విషయంలోనూ దృష్టిసారించాలి. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కిండర్ గార్టెన్‌కే రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులుంటున్నాయి. హైస్కూల్ స్థాయిలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థ నిర్దేశించిన ఫీజులకు తగ్గ స్థాయిలో బోధన, మౌలికపరమైన సదుపాయాలు ఉన్నాయా? లేదా? గమనించాలి.

 

పాఠశాల పనితీరు

పాఠశాల అకడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఆరా తీయాలి. నిబంధనల ప్రకారం- ఒక పాఠశాల గత మూడేళ్ల అకడమిక్ ఉత్తీర్ణతల సగటు ఆయా బోర్డ్‌ల ఉత్తీర్ణతల సగటుతో పోల్చితే ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ పాఠశాల అకడమిక్ పరంగా నైపుణ్యాలు పాటిస్తుందని అర్థం. అదేవిధంగా సదరు పాఠశాలలో పని చేస్తున్న టీచర్ల నియామక విషయాలు తెలుసుకోవాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం- ప్రైవేటు పాఠశాలలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా శాశ్వత ప్రాతిపదికగా ఉపాధ్యాయులను నియమించుకోవాలి.

 

హయ్యర్ సెకండరీ (+2/ఇంటర్మీడియెట్)

మన విద్యా విధానంలో హయ్యర్ సెకండరీగా పిలిచే +2 లేదా ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల కళాశాలల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు సంబంధించి లేబొరేటరీలు, బోధనప్పుడు వాటిలో గడిపే సమయాలను పరిశీలించాలి. అదేవిధంగా సీబీఎస్‌ఈలో ప్రస్తుతం ఎలక్టివ్స్ అనే విధానం అమలవుతోంది.



ఒక సీబీఎస్‌ఈ పాఠశాలలో కనిష్టంగా ఐదుగురు విద్యార్థులు ఒక ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటే.. ఆ ఎలక్టివ్ కోర్సును నిర్వహించేందుకు పాఠశాలకు అనుమతి లభిస్తుంది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సదరు ఎలక్టివ్స్‌లో ఎంతమంది ఉన్నారు? అందుకు తగిన బోధన సదుపాయాలు ఉన్నాయా? లేదా పరిశీలించి సంతృప్తి చెందితేనే ప్రవేశం తీసుకోవాలి. యూజీ, పీజీ కోర్సుల కళాశాలల ఎంపిక విషయంలోనూ ప్రమాణాలకే పెద్దపీట వేయాలి.

 

నిపుణుల మాట



టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ తెలుసుకోవాలి

తల్లిదండ్రులు కేవలం పాఠశాలలను ఎంపిక చేసుకోవడానికే పరిమితం కాకుండా.. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. సీబీఎస్‌ఈ ఉపాధ్యాయుల అకడమిక్ డెవలప్‌మెంట్ కోసం పలు రిఫ్రెష్‌మెంట్ వర్క్‌షాప్స్, సెమినార్స్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నైపుణ్యాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి వాటికి హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలలో బోధన అంత బాగుంటుంది.

- డి.టి.ఎస్.రావు, రీజినల్ ఆఫీసర్, సీబీఎస్‌ఈ

 

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్

పాఠశాలను ఎంపిక చేసుకునే విషయంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలి. అప్పుడే పిల్లలు చిన్నప్పటి నుంచే వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగే అవకాశం లభిస్తుంది.     

- కె.శరత్ చంద్ర, బటర్ ఫ్లై ఫీల్డ్స్ కో ఫౌండర్

 

సదుపాయాల మేరకు ఫీజులు

ప్రైవేటు పాఠశాలల్లో కేజీ స్థాయిలోనే వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఆ మేరకు అవి సదుపాయాలు కల్పిస్తున్నాయా? లేదా? అనేది తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పరిశీలించాలి. ఉన్నత ప్రమాణాలు, సౌకర్యాలు కల్పిస్తున్న పాఠశాలల ఫీజులతో పోల్చుకుంటూ ఇతర పాఠశాలలు కూడా అదే మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ సదుపాయాలు కల్పించడం లేదు. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి.

- ఎం.పద్మజ, వైస్ ప్రిన్సిపాల్, చిరెక్ పబ్లిక్ స్కూల్

 

విద్యార్థి మానసిక దృక్పథం ఆధారంగా

పాఠశాలల ఎంపిక విషయంలో తల్లిదండ్రులు నిబంధనలు, ప్రమాణాలు, ఉపాధ్యాయుల అర్హతలు వంటి వాటన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది తమ పిల్లల మానసిక దృక్పథం. వారి అభ్యసన స్థాయి, గ్రాహక శక్తులను గుర్తించి ఆ మేరకు పాఠశాలలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇతరులతో సమానంగా రాణించలేక మానసిక ఆందోళన చెందుతారు.

- ఎ. సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్

 

తల్లిదండ్రులు ప్రశ్నించొచ్చు

పాఠశాలలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను సదరు పాఠశాలలు అమలు చేస్తున్నాయా? లేదా? అని తల్లిదండ్రులు నిరంభ్యంతరంగా ప్రశ్నించొచ్చు. టాయిలెట్స్ నుంచి లేబొరేటరీల వరకు సదరు పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి తెలుసుకోవచ్చు. ఆర్‌టీఈ ఈ అవకాశం కల్పిస్తోంది.



పాఠశాలల యాజమాన్యాలు కూడా వారు అనుసరిస్తున్న బోధన పద్ధతులు, ఏ చాప్టర్‌ను ఎంత సమయంలో పూర్తిచేస్తారు  వంటి వివరాల నుంచి ఉపాధ్యాయుల విద్యార్హతలు, వారికి అందిస్తున్న వేతనాలు, వారికోసం నిర్వహించే శిక్షణ తరగతుల వివరాలను నోటీస్‌బోర్డ్‌లో పెట్టాలి. ఇది తప్పనిసరి నిబంధన. అలాంటి సమాచారం ఇవ్వకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.

- జి.గోపాల్‌రెడ్డి, డెరైక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top