హ్యాపీ మమ్మీ

హ్యాపీ మమ్మీ


ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ అంటే ఏమిటి, ఎలా?



గర్భధారణ గురించి ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు కానీ... ఎవరిని అడగాలి?

సురక్షితమైన గర్భధారణకు, సుఖప్రసవానికి తీసుకోవాల్సిన కొన్ని విలువైన సూచనలు, జాగ్రత్తలివి... బీ ఏ హ్యాపీ మామ్‌... అంటోంది సాక్షి.




గతంలో పిల్లల కోసం ప్లానింగ్‌ అంటూ ఏదీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు  అంతా పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది. యువతీ యువకులకు ఇప్పుడు మొదటి ప్రాధాన్యం తమ కెరియరే. ఫలితంగా దానికి ఏమాత్రం విఘాతం కలగకుండా జీవితాన్ని ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందుకే తమకు అనువైన సమయంలోనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం అన్నది ఇప్పటి యువత ఫాలో అవుతున్న ట్రెండ్‌. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ కూడా హ్యాపీగా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనర్థాలు నివారించాలి. వాటికోసం చేయాల్సినవీ... చేయకూడనివీ ఇవే... దీన్నే ప్రి–కన్సెప్షనల్‌ కౌన్సెలింగ్‌ అంటారు. ఇందుకోసం ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే మూడు నెలల ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.



చేయాల్సినవి...

యువతులు తమకు పీరియడ్స్‌ వచ్చిన 11వ రోజు నుంచి 25 వ రోజు వరకు రోజు విడిచి రోజు కలయిక ఉండేలా చూసుకోండి. ఈమధ్య రోజుల్లోనే అండం విడుదల (ఓవ్యులేషన్‌) జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జరిగే సెక్స్‌ వల్లనే గర్భధారణ జరుగుతుంది.



ఇలా ఏడాది పాటు ప్రయత్నించాక కూడా గర్భధారణ జరగకపోతే అప్పుడు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. గతంలో పిల్లలు ఉన్నవారు సైతం ఒకవేళ ముప్పౖయెదేళ్ల వయసు దాటితే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.



ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే ముందుగా వీలైతే ఒకసారి మహిళలు రుబెల్లా, ఐజీజీ, వీజడ్‌వీ, టీఎస్‌హెచ్‌ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.



ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకున్న నాటినుంచి ఆరోగ్యకరమైన సమతులాహారాన్ని వేళకు తింటూ ఉండాలి. అందులో ఆకుపచ్చని ఆకుకూరలూ, కూరగాయలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండాలి.



డాక్టర్‌ను సంప్రదించి ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటూ ఉండాలి. వాటి వల్ల బిడ్డల్లో పుట్టుకతో వచ్చే అనేక లోపాల (బర్త్‌ డిఫెక్ట్స్‌)ను నివారించవచ్చు.



ఎప్పుడూ మీరు పాజిటివ్‌ దృక్పథంతో ఉండండి. ఉల్లాసభరితమైన, సంతోషభరితమైన వాతావరణంలో ఉండండి. ఆహ్లాకరమైన సంగీతం వినండి. టీవీ చూస్తున్నప్పుడూ అలాంటి ప్రోగ్రాములే చూస్తూ ఉండండి.



నిత్యం ఒత్తిడి ఉండే వృత్తుల్లో ఉండేవారు కొద్ది రోజులు దాని నుంచి దూరంగా ఉండండి.





చేయకూడనివి...

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత మహిళలు తాము తీసుకునే పదార్థాల్లో  చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.



గర్భధారణ కోసమంటూ పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్‌ మందులంటూ లభ్యమయ్యే పొడుల వంటివాటి జోలికి వెళ్లవద్దు. ఇలాంటివి మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు.



ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత దంపతుల్దిరిలో ఏ ఒక్కరూ మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటివి చాలా పరిమితంగా తీసుకోవాలి.



ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే వెంటనే  నిరాశ పడకండి. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top