శివరాత్రి ,ఏం చేయాలి? ,ఎలా జరుపుకోవాలి?

శివరాత్రి ,ఏం చేయాలి? ,ఎలా జరుపుకోవాలి? - Sakshi


ఎలా ఉండాలి?

పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అదే మన సనాతన సంస్కృతి.



ఏ పండుగ జరుపుకోవడానికైనా, అసలు కారణాలు తెలుసుకుంటే కానీ, ఆంతర్యం బోధపడదు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్‌ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు పెద్దలు.



జీవారాధన ముఖ్యం

మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. ఎందుకంటే, అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అన్నారు. అందుకే ‘జీవారాధనే శివారాధన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.



ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం. బాలలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధ సేవనం చేయాల్సిన వారికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయడం వల్ల ఉపవాస ఫలం ఉండదు.  



ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి.



ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.



మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం.



శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

∙ఆహారానికి, నిద్రకే కాదు... మాటలకు కూడా..!



శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి.



వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే!

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారికి ఆరోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటప్పుడు అవసరమైనంతవరకే మాట్లాడండి, ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.



మహిమాన్వితం... మంత్ర జపం

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.



శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top