ఎంత పని చేశావ్‌ బిగ్‌ బాస్‌

ఎంత పని చేశావ్‌ బిగ్‌ బాస్‌ - Sakshi


సమ్‌సారం

సంసారంలో సినిమా




టీ కప్పులో తుఫాన్లు ఆ కప్పును గానీ ఇంటి కప్పును గానీ ఏమీ చేయలేవు. కాని ఏ తప్పూ చేయకపోయినా కొన్ని తుఫాన్లు తలకు చుట్టుకుంటాయి. మెడకు బిగుసుకుంటాయి. గొడవ బిగ్‌బాస్‌తో వచ్చింది. ‘మా టీవీ’లో ఆ షో మొదలయ్యాక లక్ష్మి, లక్ష్మి భర్త శ్యామల రావు, వాళ్ల ఇద్దరు పిల్లలు టింకూ రీచా తరచూ చూస్తున్నారు. ధన్‌రాజ్, వేద, సమీర్, మధుప్రియ... అలా మెడలో మైకులు వేసుకుని నాలుగు గోడల మధ్య వాచీలు లేకుండా టీవీలు లేకుండా న్యూస్‌ పేపర్‌ కూడా లేకుండా అన్నాళ్లు ఇంటికి దూరంగా ఉండటం, పైగా వారి ప్రతి కదలికా చూసే వీలు ప్రేక్షకులకు ఉండటం థ్రిల్లింగ్‌గా అనిపించి చాలా మందిలాగే లక్ష్మి, శ్యామలరావు కూడా చూస్తున్నారు.షో నాలుగు వారాలు గడిచి ఐదో వారంలో పడ్డాక లక్ష్మి అంది– ‘అబ్బ... ఎలా ఉంటున్నారో వాళ్లంతా ఇళ్లకు దూరంగా. అదే మీరైతే ఉండగలరా’ శ్యామలరావు కాస్త బుర్ర వాడి ఉంటే పోయుండేది. కాని ఏదో పరధ్యానంలో ఉండి ‘ఎందుకు ఉండను. ఉంటాను’ అన్నాడు.లక్ష్మి ఫీలింగ్స్‌ మారాయి. అప్పుడైనా శ్యామలరావు అలెర్టవ్వాల్సింది.



‘అదేంటండీ... ఇంటినీ పిల్లలనూ వదిలి మీరుండగలరా?’ అని రెట్టించింది. ఆమె ప్రశ్నలో ‘ఇంటిని’ బదులు ‘నన్ను’ అని శ్యామలరావు అర్థం చేసుకోవాల్సింది. ‘ఎందుకు ఉండను. వాళ్లు డబ్బులిస్తారు కదా’ అని మాట జారాడు. అంతే. టక్కున టీవీ ఆఫ్‌ అయ్యింది. టక్కున లేచి నిలబడింది. పిల్లల వీపుల మీద బదా.. బదామని దెబ్బల సౌండ్‌ వచ్చింది. ‘పదండి... ఇరవైనాలుగ్గంటలు టీవీయే మీకు. పడుకోరా’ అని గదిలోకి తీసుకెళ్లింది. శ్యామలరావుకు ఫీజులెగిరిపోయాయి. ఇప్పుడేం జరిగిందని ఇలా మారిపోయింది అని చూపుడువేలూ మధ్యవేలుతో నెత్తిని కాసేపు గీరుకున్నాడు. లోపల పిల్లలు నిద్రపోతున్న నిశ్శబ్దం, లక్ష్మి వెక్కిళ్లు పెడుతున్న చప్పుడు...

‘దేవుడా’ అని చేష్టలుడిగి, కాళ్లు చేతులు ఆడక హాల్లో అలానే కూలబడి కూచున్నాడు శ్యామలరావు.



కాసేపు తర్వాత లక్ష్మి బయటకు వచ్చింది. కళ్లు ఎర్రగా అయ్యాయి. ముక్కు దొండపండులా కందిపోయింది. ‘ఏమిటి లక్ష్మి.. ఇప్పుడేమైందని’... ‘మీకేమండీ.. మీరు మగమహరాజులు. అన్ని విధాలా నష్టపోయేదీ నాశనమయ్యేది మేమేగా. ఆడవాళ్లమేగా’...‘ఏమన్నానని నువ్వు’... ‘ఇంక మాట్లాడవద్దు మీరు. అసలు పెళ్లెందుకు చేసుకున్నట్టు. నువ్వంటే నాకిష్టం లేదు నేను చేసుకోను అని చూపుల నాడే చెప్పకపోయారా? ఎగిరి గంతేసుకొని ఎందుకు చేసుకున్నారు? చేసుకున్న నాటి నుంచి ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. పుట్టిన రోజు నాడు పండగరోజు నాడు ఇదిగో ఈ చీర తీసుకో అని ఒక్కటన్నా తెచ్చిచ్చారా?’...‘అదేమిటి.. మొన్నే కదా ఆర్‌ ఎస్‌ బ్రదర్స్‌లో ఆరు వేలు బిల్లు చేశావు’...‘నేను అడిగితే కొనివ్వడం వేరు.



మీకై మీరు తెచ్చివ్వడం వేరు’ ‘అదొకటుందా’ ‘ఉండదా. మీ చెల్లెలికి బాగలేదు... నాలుగు రోజులు వెళ్లి దాని సంగతి చూసి రా తల్లీ అని మా అమ్మ ఫోన్‌ చేస్తే వెళ్తే మీరెక్కడ అవస్థలు పడతారో, ఇడ్లీ బదులు నీళ్ల ఉప్మా చేసుకుని ఎక్కడ తింటారో అని మీ మీద ప్రేమతో నేను వెళ్లలేదే... అలాంటిది నన్ను వదిలేసి నా పిల్లలను వదిలేసి ఇంటిని వదిలేసి బిగ్‌బాస్‌కు వెళతానని వెళ్లగలనని ఎలా అంటారండీ మీరు. ఏ నోటితో అంటారు. హు.. అందుకే అంటారు.. మనసులో ఉన్నవి మరుపున బయటపడతాయి అని. ఇవాళ మీ మనసులోదంతా బయట పడింది’....



‘అలా అర్థమైందా.. నా టైమ్‌ బాగలేదు’...

‘హు.. మిమ్మల్ని చేసుకున్నప్పటి నుంచి నా టైమ్‌ బాగలేదు. పెళ్లయి పద్నాలుగేళ్లేగా అయ్యింది. అప్పుడే మొహం మొత్తి పోయానా మీకు. నా కన్నూ ముక్కూ పనికి రాకుండా పోయాయా మీకూ? అయినా నాలుగేళ్లుగా గమనిస్తున్నాను. నేనంటే అసలు లెక్కే లేనట్టుగా ఉంటున్నారు. మొన్నటికి మొన్న దువ్వాడ జగన్నాథం చూసి సినిమా సంగతి ఏమోగాని హీరోయిన్‌ మాత్రం అదుర్స్‌ అనలేదు మీరూ’... ‘అలా అంటే నీ మీద మనసు లేనట్టేనా’ ‘మనసుంటే అలాంటి మాటలు మాట్లాడతారా? నేనేమన్నాను? బిగ్‌బాస్‌కు వెళ్లి ఎవరైనా ఎలా ఉండగలరు మీరుండగలరా అని అడిగాను. మీరేమనాలి? అమ్మో... నేనెందుకు వెళతాను. నిన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలనా అనాలి. అలా అనగలిగారా మీరు? అలా అనే ప్రేమ మీకుంటే కదా. లేనిది ఎక్కణ్ణుంచి వస్తుంది. నన్ను వదిలి డెబ్బై రోజులు ఉండగలనని అంటున్నారే. ఇలాంటి మనిషి రేపు నాకు అన్యాయం చేసి చల్‌ మోహనరంగా అని వేరే ఎవత్తోనో వెళ్లడని గ్యారంటీ ఏమిటి? ఎవరిస్తారు గ్యారంటీ... నాకు తేలాలి ఇప్పుడు’ ‘పిచ్చిమొహమా. చంపకే నీ గోలతో’... ‘అంతే... మీరు చేస్తే మంచి. నేను చేస్తే గోల. జీవితమే నాశనమైపోయాక ఇక ఎన్ననుకొని ఏం లాభం లేండి. ఏమండీ... ఒక్క మాట ఇవ్వండి. రేపు పెద్దల ఎదుట పంచాయితీలో మనం విడిపోయాక పిల్లలు కావాలని మాత్రం అడక్కండి. వాళ్లు లేకుండా నేను బతకలేను’... ‘ఓరి నాయనో.. ఇంకాపవే నువ్వు’



‘ఏడవకు. నువ్వంటే నాకు ప్రాణం. మా ఆఫీస్‌ వాళ్లు పూణే ఆఫీసుకు డెప్యుటేషన్‌ మీదు ఆర్నెల్లు వెళ్లిరా డబుల్‌ పేమెంట్‌ ఇస్తానంటే వెళ్లానా? ఎందుకు వెళ్లలేదు... నీ మీద ప్రేమతో కాదూ? ఫ్రెండ్సందరూ జాలీ ట్రిప్‌ వేసుకొని థాయ్‌లాండ్‌ వెళుతుంటే వెళ్లానా? మా ఆవిడ లేకుండా నేను రాను గురూ అని తప్పించుకోలేదూ? నీ కోసం పర్సనల్‌ లోన్‌ అప్లయ్‌ చేశానే? దేనికి? చాలా రోజులుగా కొనివ్వాలనుకుంటున్న మామిడి పిందెల గొలుసు కోసం కాదూ? నెక్స్‌ వీక్‌ శుక్ర, శనివారం అరకుకు టికెట్లు బుక్‌ చేశానే... కొత్తగా అద్దాల రైలు వేశారట చూపిద్దామని కాదూ... సాయంత్రం ఆఫీసవ్వగానే టక్కున ఇంట్లో వాలి పోయేది ఎవరి కోసం నీ కోసం కాదూ. రేపు సాయంత్రం చీర కొనిద్దామనుకుంటున్నాను. నీ మీద ప్రేమతో కాదూ’.... వెక్కిళ్లు ఆగాయి. ‘అంతేనా’ ‘ముమ్మాటికీ అంతే’. ‘సరే.. లేవండి... నిద్ర పోదాం’ అంది లక్ష్మి ఏడుపు ఆపి. శ్యామలరావు లేచాడు. లక్ష్మి ఫ్రిజ్‌లో ఉన్న పూలు తీసుకుని తలలో పెట్టుకుంది.శ్యామలరావు చిన్న చిర్నవ్వుతో చేయి పట్టుకున్నాడు. గండం ఆవేళకు గట్టెక్కింది. ఎంత పని చేశావు బిగ్‌బాస్‌.



సినిమాలో సంసార

మనం ఎప్పుడు కొనుక్కుంటామో? ఏమిటో?


మధు(జగపతిబాబు) ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. నెలకి మూడు వేలు జీతం. డబ్బు ఆశ లేకుండా ఉన్నదానితో తృప్తి పొందుతాడు. పైగా నిజాయతీ పరుడు. మధు వివాహం రాధతో (ఆమని) జరుగుతుంది. రాధకు బాగా డబ్బు, నగలు పిచ్చి. ‘వచ్చే జీతం సరిపోవడం లేదు.. లంచాలు తీసుకోండి.. అప్పుడు ఎంచక్కా మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు’ అని ఎప్పుడూ భర్తను దెప్పిపొడుస్తుంటుంది. భార్య మాటలకి నవ్వి ఊరుకుంటాడే కానీ తన నిజాయితీని మాత్రం కోల్పోడు మధు. సంపాదించడం చేతకాని నా మొగుణ్ణి అనాలి అని ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటుంది రాధ. ఓ రోజు పొద్దున్నే పడుకుని ఉన్న భర్త వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, ‘ఏవండోయ్‌.. వెనకింటి కాంతంగారు నాలుగు కాసుల గొలుసు చేయించేసుకుంది. పక్కవీధి తాయారమ్మగారు కలర్‌టీవీ కొనుక్కున్నారు. పచ్చ మీది వాళ్లమ్మాయి పట్టీలు కొనుక్కుంది. అందరూ అన్నీ కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో? ఏమిటో?’ అని చెబుతుంది. ‘శుభలగ్నం’ సినిమాలోని ఇలాంటి దృశ్యాలు మన నిజ జీవితంలోనూ ఉండేవే. అయితే కొంచెం అటూఇటూగా.



ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.

సాక్షి పాఠకులతో పంచుకోండి.

ఈ మెయిల్‌: samsaaram2017@gmail.com

– ఎస్‌.వి.ఎస్‌


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top