వచ్చి వాలింది నమ్మకం

ఎమాన్, చెల్లెలు షాయ్‌మా


ఆల్‌ ది బెస్ట్‌



నమ్మకానికి ఎంత బలముంది! ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన అమ్మాయిని కదలించి ఆమెకు రెక్కలు తొడిగింది. నాలుగు గోడలే ఇక నా ప్రపంచమా అనుకున్న అమ్మాయిని ఈజిప్టు నుంచి భారత్‌ రప్పించింది. చదివే ఉంటారు, ఎమాన్‌ బరువు 500 కేజీలు! వయసు 37. ప్రపంచంలోనే ఇంతకన్నా బరువైన అమ్మాయి లేనే లేదు. దీన్నొక రికార్డుగా చెప్పడం కాదు. ఇంత బాధను అనుభవిస్తోందని చెప్పడం. కానీ ఎమాన్‌ తన బాధను కనిపించనివ్వడం లేదు. ఎమాన్‌ అమ్మ, చెల్లి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు తనను చూసి బాధపడడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే బాధను అదిమిపట్టి, నవ్వుల్ని పంచడానికి పెదవుల్ని కొద్దిగా కదిలిస్తుంటుంది. ప్రస్తుతం ఎమాన్‌ ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో ఉంది. అక్కడ ఆమెకు రెండేళ్ల పాటు చికిత్స చేసి, బరువును తగ్గిస్తారు.పుట్టడమే ఐదు కేజీల బరువుతో పుట్టింది ఎమాన్‌. పదకొండవ యేట నుంచి అకస్మాత్తుగా బరువు పెరగడం మొదలైంది. బేరియాట్రిక్‌ ఇన్ఫెక్షన్‌ అన్నారు వైద్యులు. ఎమాన్‌కు బరువు భారం అయింది. చదువు భారం అయింది. బాల్యం భారం అయింది. కనీసం లేచి నడవలేని స్థితికి వచ్చింది. కానీ ఎమాన్‌ మానసికంగా బలమైన అమ్మాయి.



‘బరువు తగ్గుతానమ్మా.. బాధ పడకండి’ అని చిరునవ్వుతో అనేది. తనకు నమ్మకం తగ్గగలనని! అయితే ఆ నమ్మకానికి మరో పరీక్ష ఎదురైంది. క్రమంగా బరువు మరో 300 కేజీలు పెరిగింది! ఒంట్లో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగాయి. గుండె బలహీనం అయింది. అప్పట్నుంచీ ఎమాన్‌ పూర్తిగా మంచం మీదే ఉండిపోవలసి వచ్చింది. మనిషే కాదు, మాటలూ కదలడం ఆగిపోయాయి. అన్నీ సైగలే. ఈజిప్టు వైద్యులు చేతులెత్తేశారు. గ్రీస్‌ నుంచి పిలిపించుకున్న వైద్యులూ చేతనైంది చేసి వెళ్లారు. ఎమాన్‌ మాత్రం అచేతనంగానే ఉండిపోయింది. షాయ్‌మా.. ఎమాన్‌ చెల్లెలు. అక్క కోసం ఎంతదూరమైనా వెళ్దామనుకుంది. అవసరమైతే దేవుడి దగ్గరికి కూడా! అంత పట్టుతో ఉంది. మంచి వైద్యుల కోసం ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. అలా భారత్‌లో ప్రసిద్ధ బేరియాట్రిక్‌ సర్జన్‌ ముఫ్‌జల్‌ లక్డావాలాను కలిసింది.  ‘నేను చేస్తాను’ అన్నారు ఆయన. షాయ్‌మా కళ్లలో వెలుగు. ఆ ఆశల వెలుగు దారిలో ఆ ఇంటి పాప ఎమాన్‌.. కైరో నుంచి పది రోజుల క్రితమే ముంబై చేరుకుంది. ఈజిప్టు నుంచి ఇండియాకు ప్రత్యేక విమానంలో ఎమాన్‌ను తెచ్చారు. ఎమాన్‌ తరలింపుకు.. కేవలం తరలింపుకు 83 లక్షల రూపాయల ఖర్చు అయింది!



మొదట ఎమాన్‌కు వీసా ఇవ్వడానికి ఈజిప్టులోని భారతీయ అధికారులు నిరాకరించారు. డాక్టర్‌ లక్డావాలా తనే చొరవ చూపి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఒక మాట చెప్పించి వీసా తెప్పించారు. వచ్చే రెండున్నరేళ్లలో కనీసం 200 కేజీల బరువు తగ్గించడమే లక్ష్యంగా డాక్టర్‌లు ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టేశారు.



పది కిలోల బరువు తగ్గడానికే మనం నానాపాట్లూ పడతాం. తగ్గకపోతే కాన్ఫిడెన్స్‌ కోల్పోయి, బరువు తగ్గించుకునే ప్రయత్నాలన్నిటినీ నిస్పృహతో ఆపేస్తాం. ఎమాన్‌కు ఉన్న నమ్మకంలో పిసరంత ఉన్నా చాలు. మన భారం తగ్గుతుంది. నమ్మకం భారాన్ని దించుతుంది. సమస్యను దూదిపింజను చేస్తుంది.

– కె.శ్రావణి, ‘సాక్షి’ వెబ్‌



బరువు తగ్గడానికి కోటి!

►ఎమాన్‌ సర్జరీకి కోటి రూపాయలు అవుతుందని అంచనా. ∙ఎమాన్‌ సర్జరీ కోసం ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యానికి 25 లక్షల రూపాయల విరాళం అందింది. ∙బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ తల్లి పింకీ రోషన్‌ 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ∙ముంబై ఆసుపత్రిలో చేర్పించిన ఈ పది రోజుల్లోనూ ఎమాన్‌ 30 కేజీల బరువు తగ్గారు! రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోగలుగుతున్నారు. గాలిలో ముద్దులు పంపుతూ వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ∙ఎమాన్‌కు రోజుకు రెండుసార్లు ఫిజియో థెరపీ జరుగుతోంది. రోజుకు 1200 కేలరీల ఆహారం మాత్రమే ఆమెకు ఇస్తున్నారు. ∙ఈజిప్టులో ఉన్నప్పుడు ఎమాన్‌ తల్లి, చెల్లి ఆమెకు ఆహారం తినిపించేవారు. శుభ్రత కోసం రోజుకు ఐదుసార్లు స్నానం చేయించేవారు.



►ఎమాన్‌ మంచం మీద ఉండగానే ఆమె చెల్లెలు షాయ్‌మా పెళ్లి జరిగిపోయింది.

►ఎమాన్‌ తల్లి టైలర్‌. ఆరు నెలల క్రితం భర్త చనిపోవడంతో ఆమే కుటుంబాన్ని పోషిస్తోంది.

►ఎమాన్‌ చెల్లి ఇంజనీరు. అక్క కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమెతోనే ఉంటోంది. తన రెండేళ్ల కూతుర్ని అలెగ్జాండ్రియాలో అమ్మమ్మ దగ్గర వదిలి ఎమాన్‌తో పాటు ముంబై వచ్చేసింది.



ఎమాన్‌కు ఇష్టమైన పాట

►ఎమాన్‌కు బాలీవుడ్‌ ఖాన్స్‌ ముగ్గురూ ఇష్టం.  సల్మాన్‌ మీద ఆమె మనసు కూడా పారేసుకుంది.

►అసుపత్రిలో ఉన్నంతకాలం ఆమె కోసం ఈ ముగ్గురు ఖాన్‌ల సినిమాలే వేసేలా ఏర్పాట్లు చేశారు.

►ఎమాన్‌ ఈజిప్షియన్‌ అయినా, హిందీ అంటే తనకు చాలా ఇష్టం. ఇంట్లో హిందీ చానెల్సే చూస్తుంది. హిందీ పాటలు ఇష్టంగా వింటుంది.

►సల్మాన్‌ నటించిన ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మే కి రాత్‌ హై’ సాంగ్‌తో పాటు, దబాంగ్, సుల్తాన్‌ పాటలు ఎమాన్‌కు ఇష్టమట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top