హెచ్‌ఐవీ చాపకింది నీరులా... రక్షణ పొందడమిలా!

హెచ్‌ఐవీ చాపకింది నీరులా... రక్షణ పొందడమిలా! - Sakshi


హెచ్‌ఐవీ వైరస్ రక్తం నుంచి వేరుచేస్తే చాలా త్వరగా చనిపోతుంది. నేరుగా హాని చేయదు. కానీ చాపకింది నీరులా ఎంతో హాని చేస్తుంది. అది మన రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. దాంతో అంతకు మునుపు మనం హాని చేయగలదని భావించని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే పెనుముప్పుగా తయారవుతాయి. మనకు సోకి కూడా ఏమీ చేయకుండా వాటంతట అవే తగ్గిపోయే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ, ఇతర సూక్ష్మజీవుల వల్ల సంక్రమించే జబ్బులూ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అంతకుమునుపు అస్సలు హాని చేయకుండా, హెచ్‌ఐవీ కారణంగా రోగనిరోధకశక్తి దెబ్బతినడం వల్ల ఇవి ముప్పుగా పరిణమిస్తాయి కాబట్టి వీటిని హెచ్‌ఐవీకి సంబంధించిన అవకాశవాద ఇన్ఫెక్షన్స్‌గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో వీటినే ‘ఆపర్చ్యయనిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెచ్‌ఐవీ’గా అభివర్ణిస్తారు. డిసెంబరు 1న ఎయిడ్స్ డే సందర్భంగా... హెచ్‌ఐవీని ఆసరా చేసుకుని విజృంభించే ఈ తరహా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, సాధారణ జీవితం గడపడం ఎలాగో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

 

హెచ్‌ఐవీ రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు సోకేదెప్పుడు...?


మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా హెచ్‌ఐవీ సోకినవారు కూడా మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అయితే హెచ్‌ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బ తీస్తూపోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కణాల కౌంట్) ప్రతి మైక్రోలీటర్‌కూ 200 కంటే తగ్గితే (200 సెల్స్/మైక్రోఎల్) అప్పుడు ఆ రోగికి  ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సంక్రమిస్తాయి.



అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చూడవచ్చు. అందుకే అనేక వ్యాధుల్లాగే ఎయిడ్స్ పూర్తిగా తగ్గకపోయినా...  ఈ రోజుల్లో ఎయిడ్స్ కూడా డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల్లాగే వైద్యంతో అదుపులో ఉండే వ్యాధి (మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్). సాటి వ్యక్తులంతా అపోహాలు తొలగించుకొని వీళ్ల పట్ల వివక్ష చూపకపోతే చాలు... ఈ రోగులు సైతం పూర్తి జీవితకాలం సాధారణంగానే బతకగలరు.

 

ఎంతెంత కౌంట్‌కు... ఏయే తరహా జబ్బులకు చికిత్స...

హెచ్‌ఐవీ సోకిన వారు ఎవరైనా వారి ‘టీ’సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉంటే వారి రోగనిరోధకశక్తి మామూలుగానే ఉంటుంది. అయితే అంతకంటే తగ్గితే మాత్రం ఏమేరకు కౌంట్ తగ్గిందో దాన్ని బట్టి సంక్రమించగల వ్యాధులకు తగిన నివారణచర్యలు / నివారణ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అది...

 

* టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉంటే న్యూమోసిస్టిక్ నిమోనియా వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవాలి.  టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తగ్గి... ఆ తర్వాత చేయించిన రక్తపరీక్షలో టాక్సోప్లాస్మా అనే ఏకకణజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలితే, ఆ సాంక్రమికవ్యాధి పెచ్చుమీరకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి.

* టీ సెల్ కౌంట్ 50 /మైక్రోలీటర్ కంటే తగ్గితే మైకోబ్యాక్టీరియా ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ) అనే తరహా బ్యాక్టీరియల్ ఇన్షెక్షన్లను నివారించేందుకు అవసరమైన మందులు తీసుకోవాలి.

 

 

వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఇక్కడ పేర్కొన్న చాలా వ్యాక్సిన్ల వల్ల కొద్దిపాటి మంట/నొప్పి ఉంటుంది. అది కేవలం ఒక్క రోజులో తగ్గుతుంది.

 

ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్లు... ప్రొఫిలాక్టిక్ చికిత్సలు

హెచ్‌ఐవీ రోగిలో ‘టీ’ సెల్స్ తగ్గి, రకరకాల ఇన్ఫెక్షన్లు సోకేందుకు అవకాశం ఉందని నిర్దిష్టంగా తెలిసినప్పుడు, అవి రాకుండానే ముందుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే వ్యాధి రాకుండా తీసుకునే చికిత్సను ‘ప్రొఫిలాక్సిస్’ చికిత్స అంటారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు తగ్గిన కౌంటును అనుసరించి, ఆయా దశల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొఫిలాక్టిక్ చికిత్సలు తీసుకుంటే వారు సైతం నార్మల్‌గా ఉంటారు. ఈలోపు రోగనిరోధక శక్తి పెరిగే మందులూ వాడుతుంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్ తరహా ప్రొఫిలాక్టిక్ మందులను సీడీ4 సెల్ కౌంట్ మెరుగుపడే వరకూ వాడవచ్చు.

 

హెచ్‌ఐవీ రోగులకు... వ్యాక్సిన్లు ఉపయోగపడతాయా?

ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల వ్యాధులను నివారించే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంది. ఇవి మామూలు వ్యక్తులకు ఎలాగూ ఉపయోగపడతాయి. అయితే హెచ్‌ఐవీ రోగులకూ ఇవి అదే తరహాలో ఉపయోగపడతాయా అనే సంశయం చాలా మందికి ఉంటుంది. సాధారణ ప్రజల్లో వ్యాధిని నివారించే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో... హెచ్‌ఐవీ రోగులకూ ఆయా వ్యాక్సిన్లు అదే తరహాలో ఉపయోగపడతాయి. నిజానికి మామూలు వ్యక్తుల కంటే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ఇవి మరింత ఉపయోగకరం.



అయితే హెచ్‌ఐవీ ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లే సురక్షితం. అంటే ఉదాహరణకు వ్యాక్సిన్ల తయారీ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా ఒక తరహా వ్యాక్సిన్ తయారీలో చనిపోయిన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ తరహా వ్యాక్సిన్‌ను ‘ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. ఇక మరికొన్ని రకాల వ్యాక్సిన్లలో జీవించి ఉన్న వైరసే అయినప్పటికీ బాగా బలహీనపరచినదాన్ని, నిష్క్రియతో ఉండేదాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహాగా రూపొందించిన వైరస్‌ను ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. సాధారణంగా ఎయిడ్స్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్‌ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్‌ఐవీ ఉన్న రోగులకు చికెన్‌పాక్స్‌ను నివారించేందుకు లైవ్ అటెన్యుయేటెడ్  వ్యాక్సిన్‌నూ ఉపయోగించవచ్చు.

 

హెచ్‌ఐవీ రోగులు ప్రయాణం చేయదలిస్తే...?

హెచ్‌ఐవీ రోగులు ఒకవేళ ప్రయాణం చేయదలిస్తే, వారు ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో తమ డాక్టర్‌తో సంప్రదించాలి. అక్కడి స్థానిక పరిస్థితులు, అక్కడి స్థానిక వ్యాధులకు అనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు, నివారణ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని రకాల ట్రావెల్ వ్యాక్సిన్లు హెచ్‌ఐవీ రోగులకు సురక్షితమే అయినా మరికొన్ని సురక్షితం కావు. అందుకే ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

పరిస్థితులను బట్టి అదనంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

మెనింగోకోకల్ వ్యాక్సిన్ : మెనింగోకోకస్ అనే సూక్ష్మక్రిమి మెదడు చుట్టూ ఉండే పొరల వాపు వచ్చేలా చేసి, మెనింజైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. హెచ్‌ఐవీ ఉన్నవారిలో... కాలేజీలలోని డార్మెటరీలలో నివసించేవారు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. మెనింజైటిస్ విస్తృతంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేవారు, లేదా అకస్మాత్తుగా ఈ వ్యాధి విజృంభించినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి.

హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కలుషితమైన నీటి వల్ల ఈ వైరస్ సోకుతుంది. మాదకద్రవ్యాలను రక్తనాళం (ఐవీ) ద్వారా లోపలికి తీసుకునే వారు, ఇంతకుమునుపే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రక్తస్రావం విపరీతంగా జరిగే హీమోఫీలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, ప్రపంచ పర్యటనలకు వెళ్లేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి.

 

లైవ్ వ్యాక్సిన్లలో ఏవి తీసుకోవాలి?


హెచ్‌ఐవీ రోగులు కొన్ని లైవ్ వ్యాక్సిన్లను సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వారు తమ టీసెల్ (సీడీ4) కౌంట్ 200 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవి..

వారిసెల్లా వ్యాక్సిన్ : రెండు మోతాదుల్లో తీసుకోవాల్సి ఈ వ్యాక్సిన్ చికెన్‌పాక్స్‌నుంచి రక్షణ ఇస్తుంది.

జోస్టర్ వ్యాక్సిన్ : ఒక మోతాదులో తీసుకోవాల్సిన ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ఇది చికెన్‌పాక్స్‌కు సంబంధించిన వ్యాధి. ఇందులో చర్మంపై తీవ్రమైన నొప్పితో కూడిన కదుముల వంటి ర్యాష్ కనిపిస్తుంది.

 

గర్భధారణను కోరుకుంటే...?

హెచ్‌ఐవీ ఉన్న మహిళలు గర్భాన్ని ధరించాలని కోరుకుంటే తప్పనిసరిగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణకు ముందుగా విధిగా తీసుకోవాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి.

 

ఏయే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఎంతెంత వ్యవధి తర్వాత?

హెచ్‌ఐవీ రోగులు వాడాల్సిన వ్యాక్సిన్లు...

ఫ్లూ వ్యాక్సిన్ : జ్వరం, చలి, కండరాల నొప్పులు, దగ్గు, బొంగురుగొంతు లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. దీన్ని ‘ఫ్లూ షాట్’ లేదా ‘ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్’ అంటారు.  దీన్ని ప్రతి ఏడాదీ ఒక డోసు తీసుకోవాలి.

న్యూమోకోకల్ వ్యాక్సిన్: న్యూమోకోకస్ అనేది ఊపిరితిత్తులు, చెవులు, రక్తం లేదా మెదడు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసే సూక్ష్మక్రిమి. దీన్ని నివారించే  వ్యాక్సిన్‌ను న్యూమోనియా వ్యాక్సిన్ అని కూడా  అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్‌ఐవీ ఉన్నవారు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని 19 నుంచి 64 ఏళ్ల మధ్యన వాడుతుండాలి. ఇక వారికి 65 ఏళ్లు నిండాక కూడా ఈ రెండింట్లో ఒకదాన్ని వాడాలి. అయితే గత ఐదేళ్లలో వాడని రకాన్నే ఈసారి వాడాలి.

 

డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్ : డిఫ్తీరియా రోగులకు గొంతు వెనక నల్లటి పొర ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు సృష్టిస్తుంది. టెటనస్ వ్యాధి కండరాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పెర్టుసిస్‌ను కోరింత దగ్గు అని కూడా అంటారు. దీని వల్ల రోగులకు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఈ మూడు జబ్బులనూ నివారించే ఒకే వ్యాక్సిన్‌ను హెచ్‌ఐవీ రోగులు ఒకే మోతాదు (ఒక షాట్‌గా) తీసుకోవాలి. ఇలా ఈ మూడు వ్యాక్సిన్లు కలిపిన ఒకే షాట్‌ను ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి.

 

హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ : ఈ వైరస్ మర్మావయవాల వద్ద పులిపిరుల వంటి వాటికీ, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్‌ఐవీ ఉన్నవారు ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి.

హెపటైటిస్ బి వ్యాక్సిన్: హెపటైటిస్-బి వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి.

 

వచ్చేందుకు అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు... చికిత్సలు

న్యూమోసిస్టిస్

న్యూమోసిస్టిస్ కేరినై న్యుమోనియా (పీసీపీ) అనే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకావం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో అత్యధికుల్లో మరణానికి దారితీసే న్యూమోనియా రకాల్లో ఇదొకటి. యాంటీబయాటిక్స్‌తో చికిత్స ద్వారా ఈ పీసీపీని నివారించవచ్చు. నోటిలో థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి, టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉన్నవారికి ఈ వ్యాధి చికిత్స అవసరం. అయితే ఒకవేళ హెచ్‌ఐవీ ఉన్నందున యాంటీ రిట్రోవైరల్ మందులు (ఏఆర్‌వీ) వాడుతూ... వాళ్ల టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే ఎక్కువ ఉంటే వారు ఆరు నెలల పాటు పీసీపీకి చికిత్స తీసుకొని ఆ తర్వాత దాన్ని ఆపేయవచ్చు. కానీ టీసెల్ కౌంట్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం జీవితాంతం ‘పీసీపీ’కీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

     

టోక్సోప్లాస్మా

పెద్దగా బాహ్యలక్షణాలేవీ కనిపించకుండా సంక్రమించే వ్యాధుల్లో టోక్సోప్లాస్మోసిస్ ఒకటి. అయితే టోక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్‌కు కారణమైన ఏకకణజీవి... కొందరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగేలా చేసి, మృత్యువుకు సైతం దారితీయవచ్చు. ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అతడి రక్తంలో  టోక్సోప్లాస్మా పరాన్నజీవి అప్పటికే ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వెంటనే రక్తపరీక్ష నిర్వహించాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిలో టీసెల్స్ కౌంట్ 100/మైక్రోలీటర్ ఉంటే టోక్సోప్లాస్మా నివారణ చికిత్స ప్రారంభించాలి. అయితే న్యుమోసిస్టిక్ కేరినై న్యూమోనియా (పీసీపీ) చికిత్స కోసం వాడే కొన్ని మందులు టోక్సోప్లాస్మానూ నివారిస్తాయి.



ఒకవేళ రక్తపరీక్షలో ఆ రోగికి అంతకుమునుపు టోక్సోప్లాస్మా లేదని తెలిస్తే అతడు ఆ వ్యాధికి ఎక్స్‌పోజ్ కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అతడు పచ్చి మాంసం లేదా ఉడికీ ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. పిల్లి విసర్జనకు, మట్టికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టోక్సోప్లాస్మా నివారణకు మరికొన్ని చర్యలు/జాగ్రత్తలు చేపట్టాలి. అవి...

* వేటమాంసం, బీఫ్ అండ్ పోర్క్ రంగు పింక్ కలర్‌లో ఉందంటే అది ఉడకనట్టు లెక్క. అలాంటి మాంసాన్ని ఎయిడ్స్ రోగి తినకూడదు.

* పిల్లి విసర్జనను శుభ్రపరచదలచుకుంటే చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

* తోట పని చేసిన తర్వాత చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి.

* పచ్చిగా తినే పండ్లు, కూరగాయలను చాలా శుభ్రంగా కడిగాకే తినాలి.

* మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ-మ్యాక్)

* హెచ్‌ఐవీ రోగుల్లో టీ సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్స్ కంటే తక్కువ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లలో ఇదొకటి. మ్యాక్‌కు గురైన రోగుల్లో అత్యధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వాతావరణాల్లోనూ మ్యాక్ కనిపిస్తుంది. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన దీన్ని నివారించలేము. అయితే ‘టీ’సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఆ తర్వాత టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్‌కు చేరగానే ఈ చికిత్సను ఆపేయవచ్చు.  ఈ చికిత్స కనీసం మూడు నెలలు కొనసాగాల్సి ఉంటుంది.

     

క్యాండిడా (ఈస్ట్)

క్యాండిడా అనే ఈ ఇన్ఫెక్షన్ హెచ్‌ఐవీ ఉన్న రోగుల్లో సాధారణంగా నోరు, యోని ప్రాంతాల్లో రావచ్చు. ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంలోని ముడుత పడే ప్రాంతాల్లో పెరగవచ్చు. మలద్వారం చుట్టూ కూడా రావచ్చు. అయితే తరచూ పునరావృతమవుతుంటే తప్ప దీనికి నివారణ చికిత్సలు చేయరు.



ఇదొక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల నేలలో ఇది పెరుగుతుంది. దీని వల్ల క్రిప్టోకాక్సోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇది టీసెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న వారిలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఎయిడ్స్ రోగుల్లో కనిపించే అత్యధిక ఇన్ఫెక్షన్లలో దీనికి నాలుగో స్థానం. అయితే యాంటీ రిట్రోవైరల్ మందుల ఉపయోగం తర్వాత ఇది కనిపించే ఫ్రీక్వెన్సీ కొంత తగ్గినప్పటికీ, ఎయిడ్స్ మందులు వాడని వారిలో ఇప్పటికీ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మందులు వాడినప్పటికీ దీని నివారణ విషయంలో పెద్ద తేడా ఏమీ లేనందువల్ల సాధారణంగా దీనికి ఎలాంటి మందులనూ సిఫార్సు చేయరు.

 

సైటోమెగాలోవైరస్

ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ సైటోమెగాలో వైరస్ (సీఎమ్‌వీ) సోకిన కొద్దిమందిలో తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎయిడ్స్ రోగుల్లో ఈ వైరస్ ఉంటే అది వారి కళ్లు, జీర్ణవ్యవస్థ, మెదడు, వెన్నుపూస వంటి భాగాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. కంటిలో రెటీనాను దెబ్బతీసే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ వల్ల రోగికి కనిపించే దృశ్యం అస్పష్టంగా మారి క్రమంగా చూపుపోవడం జరగవచ్చు. హెచ్‌ఐవీకి గురికాకమునుపే ఈ సీఎమ్‌వీకి గురైన కేసులు చాలా ఎక్కువే ఉంటాయి. ఇలా గతంలోనే సీఎమ్‌వీకి గురైన వారికి హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయితే వారి టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తగ్గితే... కంటికి సంబంధించిన లక్షణాలు కనింపించినా, కనిపించకపోయినా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి.



అయితే సీఎమ్‌వీ నివారణకు మందులు వాడినా పెద్ద ఫలితాలేమీ కనిపించకపోవడంతో దీని నివారణకు సాధారణంగా మందులూ సూచించరు. కాకపోతే... సీఎమ్‌వీ రెటినైటిస్ తొలిదశలోనే ఉన్నప్పుడు (అంటే చూపు అస్పష్టంగా మారడం, కంటి ముందు నల్లమచ్చలు కనిపించడం, మిరుమిట్లు గొలుపుతున్నట్లు, తేలుతున్నట్లు మెరుపులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు) తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తక్షణం చికిత్స తీసుకోవాలి. తొలిదశలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం, ఫలితం  తప్పక కనిపిస్తాయి.

     

క్రిప్టోస్పోరీడియోసిస్

ఇది కలుషితమైన నీటిని తాగేవారిలో, అలాంటి నీటిలో ఈదే వారిలో కనిపించే పరాన్నజీవి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలం నుంచి ఇది నీటిలోకి చేరి... ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ క్రిమి కలిగించే ఇన్ఫెక్షన్‌ను ‘క్రిప్టోస్పోరీడియోసిస్’ అంటారు. హెచ్‌ఐవీ ఉన్న రోగులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది వారికి నీళ్లవిరోచనాలను కలిగిస్తుంది. మామూలు వారికీ ఇది సోకే అవకాశం ఉన్నప్పటికీ... టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్‌ఐవీ రోగులకు ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా పునరావృతమవుతూ ఉంటుంది. దీని రిస్క్ నుంచి తప్పించుకోడానికి రోగులు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.



ముఖ్యంగా డయాపర్స్‌ను మార్చాక, తోటపనిలో భాగంగా మట్టిని ముట్టుకున్న తర్వాత, పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. ఒక్కోసారి మున్సిపల్ నీటిపంపిణీ వ్యవస్థలోని నీరు కలుషితం కావడం వల్ల ఇది ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో నీటిని కాచి, వడపోసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిప్టోస్పోరీడియోసిస్‌కు నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. అయితే మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ-మ్యాక్)కు ఇచ్చే చికిత్సే క్రిప్టోస్పోరీడియోసిస్‌కూ ఉపయోగపడుతుంది.

నిర్వహణ: యాసీన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top