నిద్రలో నడిచే వ్యాధి... తగ్గేదెలా?


హోమియో కౌన్సెలింగ్

 

తీవ్రమైన నడుము నొప్పి..?


నా వయసు 30. నేను గత కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితోబాధపడుతున్నాను. నొప్పి తీవ్రత వల్ల నా రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నాను. దయచేసి పరిష్కారం చెప్పండి. - డి.పి.స్వాతి, హైదరాబాద్



నడుమునొప్పిలో చాలా రకాలున్నాయి. వాటిలో మీకు వచ్చినది ఏ రకం నడుము నొప్పో తెలుసుకుంటే చికిత్స సులభమవుతుంది....

 ఆన్యులార్ టేర్: వెన్నుపూస మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యులార్ టేర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యులార్ వాపునకు గురై, నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ డీ జనరేటివ్ డిసీజ్ అని అంటారు.

 

హెర్నియేటెడ్ డిస్క్: దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని హెర్నియేషన్ అంటారు. ఇలా హెర్నియేట్ అయిన డిస్క్ వెన్నెముక బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను సయాటికా అని అంటారు.

 

స్పాండిలోసిస్: ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మించి ముందుకు కాని వెనకకు కాని జారతాయి.

 స్పైనల్ స్పినోసిస్: వెన్నులోపల ఉండే స్పైనల్ కెనాల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవడం.

 ఆంకిలోసింగ్ స్పాండిలోసిస్: ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురికావడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా తుంటి కీలు, వెన్నుపూసలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకుపోయి నడుం కదలికలు కష్టతరమవుతాయి. దీనినే లాంబూస్పైన్ అని అంటారు.నడుంనొప్పి దీర్ఘకాలికంగా ఉండి జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుంటా వైద్యుని సంప్రదించాలి.



 నిర్థారించడం ఎలాగంటే...

 సీబీపీ, ఆర్ ఎ ఫ్యాక్టర్, ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై, హెచ్‌ఎల్‌ఎ బి 27 వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. ఇతర వ్యాధులను గుర్తింవచ్చు.



ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

 ఎక్కువగా బరువులను ఎత్తకూడదు. పడుకునేందుకు స్థిరంగా ఉండే కాయర్ పరుపులను లేదా బేస్ గట్టిగా ఉండే పరుపులను వాడాలి. హై హీల్స్ చెప్పులు వాడకూడదు. ఐస్‌ప్యాక్స్, వేడి కాపడాలను ప్రయోగిస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.

 హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లోని జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్య పద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ల తిమ్మిర్లు, పాదాల మంటలకే కాకుండా మూలకారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుంనొప్పి సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

 

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

 


నాణెం మింగాను, ఏమవుతుంది?

నా వయసు 20 ఏళ్లు. మూడు నెలల క్రితం ఐదు రూపాయల నాణేన్ని మింగాను. అది బయటకు వచ్చిందో రాలేదో తెలియదు. ఒకవేళ ఆ నాణెం కడుపులోనే ఉంటే ఏదైనా సమస్యలు ఉంటాయా?

 - శ్రీనివాస్, ఈ-మెయిల్



 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే... మీరు నాణెం మింగి మూడు నెలలు గడచిపోవడంతో పాటు, దాని కారణంగా తలెత్తాల్సిన సమస్యలేమీ ఇప్పటి వరకు తలెత్తలేదు కాబట్టి 99 శాతం నాణెం మలమార్గం ద్వారా బయటకు వచ్చే ఉంటుందని భావించవచ్చు. కానీ ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం ఒకసారి మీరు అబ్డామిన్ ఎక్స్-రే చేయించుకోవడం అవసరం. ఒకవేళ ఆ ఎక్స్-రేలో నాణెం పేగుల్లో ఎక్కడైనా చిక్కుబడిపోయి ఉంటే అది కూడా తెలుస్తుంది. అలా చిక్కుబడిపోయి ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

 

నా వయసు 56 ఏళ్లు. నేను పూర్తి ఆరోగ్య పరీక్షలు (టోటల్ హెల్త్ చెకప్) చేయించుకున్నాను. అన్ని పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు. కానీ కాలేయంలో కొవ్వు చేరినట్లుగా చెప్పారు. నాకు మద్యం అలవాటేమీ లేదు. కాలేయంలోని కొవ్వును ఏవిధంగా తగ్గించాలి. మందులతో ఈ సమస్య తగ్గుతుందా?

 - సుదర్శన్‌రావు, నేలకొండపల్లి



మీ సమస్యను ఇంగ్లిష్‌లో ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’ గా పరిగణిస్తారు. ఈ సమస్య మద్యం అలవాటు లేని వారిలోనూ కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చిన సమస్యను ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’గా డాక్టర్లు చెబుతారు. హెపటైటిస్-సి వైరస్ సోకడం, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇలాంటి సమస్య వస్తుంటుంది. మీరు టోటల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అయితే ఈ వ్యాధి నిర్ధారణ కోసం మరికొన్ని నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్-బి, సి, డయాబెటిస్ టెస్ట్ వంటివి అన్నమాట. మీకు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటో తెలుసుకొని, దానికి మందులు వాడటమే ప్రథమచికిత్స. ఒకవేళ డయాబెటిస్ వల్ల ఈ సమస్య వచ్చి ఉంటే దాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకొని, సరైన మందులు వాడితే 6 నుంచి 10 నెలల్లో ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి లివర్ సిర్రోసిస్ గా పరిణమించే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోండి.

 

పల్మునాలజీ కౌన్సెలింగ్

 

నిద్రలో నడిచే వ్యాధి... తగ్గేదెలా?

నా వయసు 18 ఏళ్లు. హాస్టల్‌లో ఉంటాను. నిద్రలేవగానే చూసుకుంటే కొన్నిసార్లు నా శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయి. నేను నిద్రలో నడుస్తున్నానని నా హాస్టల్‌మేట్స్ కూడా చెబుతున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. ఈ విషయంలో నేనేం చేయాలో సలహా ఇవ్వగలరు.

 - సుహాస్, హైదరాబాద్



కొందరిలో నిద్రలోనే నడిచే రుగ్మత ఉంటుంది. దీన్ని ‘స్లీప్ వాకింగ్’ అంటారు. ఇలా నిద్రలోనే నడవటం అన్నది గాఢ నిద్ర దశ నుంచి మామూలు దశకు, ఆ తర్వాత మెలకువ దశకు చేరే సమయంలో జరుగుతుంటుంది. సాధారణంగా ఆ దశలో వారు మాట్లాడుతున్న మాటలు కూడా అర్థరహితంగా ఉంటుంటాయి. స్లీప్ వాకింగ్ అనేది సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయంలో కనిపించడం చాలా మామూలే. అయితే కొందరు పెద్దవాళ్లలో కనిపించడం కూడా అరుదేమీ కాదు. నిద్రలో నడుస్తున్నప్పుడు వాళ్ల కళ్లు తెరచుకొని ఉండి, అంతగా స్పష్టంగా లేని దృశ్యం వాళ్లకు కనపడుతూ ఉంటుంది. అలాంటి దశలో వాళ్లను ఏమైనా అడిగితే నిద్రలో ఉన్నట్లుగా అస్పష్టంగా జవాబివ్వవచ్చు. లేదా అస్సలు స్పందించకపోవచ్చు. వారిని తమ పడక వద్దకు తీసుకువచ్చి, నిద్రలేపితే అతడికి జరిగిందేదీ గుర్తురాకపోవచ్చు కూడా.



 నిద్రలో నడిచే రుగ్మతకు చాలా అంశాలు దోహదపడతాయి. సాధారణంగా కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఈ రుగ్మత ఉంటే మిగతావారిలోనూ అది కనిపించే అవకాశాలు ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారిలో, ఎప్పుడుపడితే అప్పుడు నిద్రకు ఉపక్రమించేవారిలో, తీవ్రమైన ఒత్తిడితో బాధపడేవారిలో, మద్యం తీసుకున్నవారితో పాటు కొన్ని నిద్రను తెచ్చే మాత్రలు, సైకోసిస్‌ను నయం చేసేందుకు వాడే మాత్రలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. ఇక గుండెలయలో తేడా రావడం, తీవ్రమైన జ్వరం, రాత్రివేళ ఆస్తమా, రాత్రివేళ ఫిట్స్, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి  వైద్యపరమైన సమస్యలతో  పాటు అనేక మానసిక వ్యాధులతో బాధపడేవారితో కూడా ఈ సమస్య రావచ్చు. దీనికి వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కాకపోతే ‘హిప్నాసిస్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే... సాధారణంగా పిల్లల్లో కనిపించే ఈ రుగ్మత వారు పెద్దయ్యేకొద్దీ మామూలుగానే తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే మాత్రం వారు సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఇలాంటివారు అంచులు లేని పడక మీద పడుకోవడం, మెట్ల దగ్గరకు వెళ్లడం, పిట్టగోడ లేని పై అంతస్తుల్లో పడుకోవడం వంటివి చేయకుండా జాగ్రత్తపడాలి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top