నా కారు నాయిష్టం...

నా కారు నాయిష్టం...


కోటి రూపాయల కారు ఒక హీరోయిన్‌కి...

అదీ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌కి పెద్ద విషయమా!

ఆ.. ఈ రోజుల్లో విషయం చిన్నదా అన్నది కాదు...

రూమర్‌ పెద్దదా అన్నదే విషయం!

ఇదే కాదు..  ఇంటి గొడవ రచ్చకీడ్చడం..

అబ్బో భలే సరదాగా ఉంటుందే!

కానీ పడేవాళ్లకి తెలుస్తుంది కష్టమేంటో..

అంజలి ఓపెన్‌గా మాట్లాడిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ మీ కోసం...




చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.. కూల్‌గా ఉన్నారనిపిస్తోంది...

అంజలి: అవునండి. చాలా కూల్‌గా, హ్యాపీగా ఉన్నాను. చెప్పాలంటే ఎప్పటికన్నా ప్రశాంతంగా ఉన్నాను.



ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయినందుకే ఈ హ్యాపీనెస్సా?

అంజలి: కరెక్ట్‌గా చెప్పాలంటే నేనెప్పుడూ పెద్దగా టెన్షన్‌ పడింది లేదు. అఫ్‌కోర్స్‌ చిన్న చిన్న సమస్యలు తీరినప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు కదా.



అసలు ప్రపంచంలో వేరే సమస్యలేవీ లేనట్లు.. మీ పిన్ని, మీ ఇంటి సమస్యల గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడుకోవడం ఎలా అనిపించింది?

అంజలి:ఏ ఇంట్లో సమస్యలు ఉండవు చెప్పండి? కొన్ని చిన్న సమస్యలు.. కొన్ని పెద్దవి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఈలోపు నలుగురూ నాలుగు మాటలు మాట్లాడేస్తారు. అవతలి వ్యక్తుల జీవితాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోవడంలో కలిగే ఆనందం ఏముంటుందో! పైగా గోరంత విషయాన్ని కొండంత చేస్తారు. లేని విషయాన్ని ఉన్నట్లుగా సృష్టిస్తారు.



నిజమే.. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి కొందరు ఏవేవో మాట్లాడతారు. ఆ మధ్య మీరు కొన్న కారు గిఫ్ట్‌ అన్నది కొందరి అభిప్రాయం...

అంజలి: వినడానికి చాలా బాధగా ఉందండి. ఒక కారు కొనుక్కునే స్థితిలో నేను లేనా? కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న కారుని కూడా గిఫ్ట్‌ అంటే ఇంకేం అనాలి? ఎలాంటి కష్టమో చెబుతాను. లాస్ట్‌ ఇయర్‌ ‘డిక్టేటర్‌’ చేస్తున్న సమయంలోనే ‘సరైనోడు’లోని ‘బ్లాక్‌ బస్టర్‌’ సాంగ్‌ చేశాను. రెంటికీ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కష్టమైంది. డేలో ‘డిక్టేటర్‌’, నైట్‌ ‘సరైనోడు’ షూటింగ్‌ చేశాను. 48 గంటలు కంటిన్యూస్‌గా నిద్రపోలేదు. అంతెందుకు? ‘చిత్రాంగద’ని తీసుకుందాం.. అమెరికాలో మైనస్‌ 11 డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్‌ చేశాం. చలికి వణికిపోయే దాన్ని. ఒకటీ రెండు రోజులంటే ఫర్వాలేదు. ఎక్కువ భాగం షూటింగ్‌ చేసింది అక్కడే. అంత హార్డ్‌వర్క్‌ చేసి, సంపాదిస్తాం. కావాల్సినవి కొనుక్కుంటాం. ఆ కష్టం మాది కాదన్నట్లు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో ఊహించవచ్చు.



ఈ మధ్య హైదరాబాద్‌ రావడం తగ్గించేశారేం?

అంజలి: చేతిలో ఉన్నవి తమిళ సినిమాలు కావడంతో మన ఊరికి కాస్త దూరమయ్యా. రిలీజ్‌కి రెడీ అవుతున్న ద్విభాషా చిత్రం ‘చిత్రాంగద’ షూటింగ్‌ ఎక్కువగా యూఎస్‌లోనే చేశాం. మిగతా సినిమాల షూటింగ్‌ కొడైకెనాల్, ఊటీ, వేరే ప్రాంతాల్లో ఉండ టంవల్ల నేను చెన్నైలో ఉంటున్నది కూడా తక్కువే.



‘గీతాంజలి’ తర్వాత మళ్లీ మీరు టైటిల్‌ రోల్‌ చేసిన సినిమా ‘చిత్రాంగద’. ఎంతైనా టైటిల్‌ రోల్‌ అంటే పెద్ద బాధ్యతే కదా?

అంజలి: అవునండి. సినిమా మొత్తం హీరోయిన్‌ భుజాల మీద నడిపించాల్సి ఉంటుంది. మోయగల సత్తా ఉండాలి. అదే హీరో ఓరియంటెడ్‌ మూవీ అయితే ప్రాబ్లమ్‌ ఉండదు. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా హీరోయిన్‌కి ఏం కాదు. కానీ, లేడీ ఓరియంటెడ్‌ మూవీ అంటే... భారమంతా హీరోయిన్‌ మీదే ఉంటుంది. ఇవన్నీ తెలిసినా ‘చిత్రాంగద’ ఒప్పుకోవడానికి కారణం డైరెక్టర్‌ అశోక్‌ చెప్పిన కథ. అసలు ఇలాంటి లైన్‌ నేనెక్కడా వినలేదు. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ ఏ మూవీ రాలేదు. అందుకే థ్రిల్‌ అయ్యి, ఒప్పుకున్నా. వచ్చే నెల 3న ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. చూసినవాళ్లు కూడా థ్రిల్‌ అవుతారు.



తెలుగు, తమిళ్‌.. ఇలా రెండు భాషల్లో సినిమా చేసినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందేమో?

అంజలి: అవును. అలవాటైతే ఓకే కానీ, ఫస్ట్‌ టైమ్‌ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌ పెద్ద ఛాలెంజ్‌. ఒక భాషలో చేసిన వెంటనే మరో భాషలో సేమ్‌ సీన్‌ చేసేటప్పుడు సేమ్‌ ఎమోషన్‌ వస్తుందనే గ్యారంటీ లేదు. ఆ విధంగా ‘చిత్రాంగద’ సవాల్‌ అనిపించింది. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు మొత్తం సినిమా చూశాను. అప్పుడు ఈ సినిమాకి పడిన కష్టం విలువైనదే అనిపించింది. అశోక్‌ వెరీ టాలెంటెడ్‌ టెక్నీషియన్‌. ఇలాంటి స్క్రిప్ట్‌ని సెలక్ట్‌ చేసుకోవడానికి ధైర్యం కావాలి. ఎవరూ ఊహించలేని సీన్స్‌తో సినిమా ఉంటుంది.



తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది మీరు స్టార్‌ కాగలిగారు. కానీ, తెలుగులో ఎక్కువ చేయడం లేదేంటి?

అంజలి: నాకు స్టోరీ.. ప్లస్‌ నేను చేయబోయే క్యారెక్టర్‌ ముఖ్యం. ఈ రెండూ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ మధ్య తెలుగులో ఎగ్జయిటింగ్‌కి గురి చేసే స్క్రిప్ట్‌ రాలేదు. ఈలోపు తమిళ్‌లో వరుసగా మంచి అవకాశాలొచ్చాయి. అందుకని ఒప్పుకున్నాను.



ఇప్పుడు నార్త్‌ హీరోయిన్లదే హవా. వాళ్లతో పోటీపడి నిలదొక్కుకునే మీలాంటి తెలుగు హీరోయిన్లు ఒకరిద్దరు ఉంటారేమో. ఆ విషయంలో మీరెప్పుడైనా ఒత్తిడి ఫీలయ్యారా?

అంజలి: ఇప్పుడిలా ఉంది కానీ, ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు ఏ స్థాయిలో రాణించారో తెలిసిందే. ఆ తర్వాత మారిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘తెలుగు అమ్మాయిలు ఇలా వచ్చి, అలా వెళ్లిపోతున్నారు. నిలదొక్కుకుంటున్నవాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. మన కెరీర్‌ ఎలా ఉంటుందో’ అనుకున్నా. నా విషయంలో ‘లిటిల్‌ లక్‌’, ‘మోర్‌ హార్డ్‌ వర్క్‌’ ఉపయోగపడ్డాయి. సినిమా ఒప్పుకున్నాక ఎంత కష్టమైనా కానివ్వండి.. ఆలోచించ కుండా చేసేస్తా. అదే నన్ను నిలబెట్టింది.



మీరు మీడియాకి దూరంగా ఉంటారు.. మీడియా అంటే పడదా?

అంజలి: అయ్యో అలాంటిదేమీ లేదండి. నా సినిమా రిలీజ్‌ అప్పుడు ప్రమోట్‌ చేయడానికి మీడియా ముందుకు వస్తుంటాను. మిగతా సమయాల్లో మాట్లాడటానికి ఏం ఉంటుంది? ఏదో కలవాలి కదా అని మీడియా ముందుకు వస్తే  ఏం మాట్లాడాలో తెలియదు. ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం ఉంది. మన ఇంట్లోనే మనవాళ్లు ఒక్కోసారి మనం మాట్లాడే మాటలను అర్థం చేసుకోరు. మీడియా అంటే ఎంతో మంది ఉంటారు. కొందరికి నా మాటలు వేరే రకంగా అర్థం కావచ్చు. వేరే విధంగా రాయొచ్చు. నేను వాళ్లని తప్పుబట్టడంలేదు. ఇదంతా ఆలోచించే.. సినిమా ప్రమోషన్‌కు మాత్రమే మీడియాను కలుస్తున్నా.



తక్కువ సమయంలో హీరోయిన్‌గా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకున్నారు.. తల్చుకుంటే ఏమనిపిస్తోంది?

అంజలి: లైమ్‌లైట్‌లో ఉన్నవాళ్లకు తప్పదు. ఎవరి జీవితంలో అయినా సమస్యలు ఉంటాయి. కానీ, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి నలుగురూ మాట్లాడుకుంటారు. వాటిలో నిజం ఎంతుంది అనేది పక్కనపెడితే కల్పితాలు బోల్డన్ని ఉంటాయి. మొదట్లో చాలా బాధపడేదాన్ని. రాను రాను పట్టించుకోవడం మానేశాను.



ఇన్ని వివాదాలున్న అమ్మాయితో సినిమానా? అని నిర్మాతలు పక్కన పెట్టేస్తారు. మీ చేతిలో నాలుగైదు సినిమాలుండటం విశేషమే..

అంజలి: ఆ విషయంలో నేను లక్కీ. ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా కారణం. నా గురించి తెలిసిన వాళ్లు ‘ఈ అమ్మాయి చాలా మంచిది. ప్రొఫెషన్‌ అంటే గౌరవం ఉంది’ అనుకున్నారు. మీరన్నట్లు వివాదాల్లో ఉన్న హీరోయిన్లను ఎంక రేజ్‌ చేయడానికి ఇష్టపడరు. కానీ, నా సిన్సియార్టీ తెలుసు కాబట్టే అవకాశాలు ఇస్తున్నారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేందుకు ఎంత హార్డ్‌వర్క్‌ చేయాలో అంతా చేస్తున్నాను.



మనమా.. బ్లాక్‌బస్టరా అనుకున్నా!


హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు.. మరి, ‘సరైనోడు’లో స్పెషల్‌ సాంగ్‌  ‘బ్లాక్‌ బస్టర్‌’ చేయడానికి రీజన్‌ ఏంటి?

యాక్చువల్‌గా నాకు సింగిల్‌ సాంగ్‌ చేసే ఐడియా లేదు. అసలు ఎవరైనా అడుగుతారని కూడా ఊహించలేదు. అలాంటి టైమ్‌లో ‘బ్లాక్‌ బస్టర్‌..’ సాంగ్‌కి అడిగారు. ఇప్పటివరకూ స్పెషల్‌ సాంగ్‌ చేయని హీరోయిన్‌తో ఈ సాంగ్‌ చేయించాలనుకున్నామనీ, బాగా డ్యాన్స్‌ చేసే అమ్మాయి కూడా అయ్యుండాలనీ నాతో అన్నారు. బన్నీకి ఈక్వల్‌గా డాన్స్‌ చేయగలనా అనిపించింది. అదే అన్నాను. ‘చేయగలరు’ అన్నారు. నేనూ, బన్నీ వన్నండాఫ్‌ డే ప్రాక్టీస్‌ చేశాం. పాట చాలా రిచ్‌గా ఉంటుంది. ట్యూన్‌ సూపర్బ్‌. సినిమాకి ఎస్సెట్‌ అయిన పాట కాబట్టి, ‘ఐయామ్‌ హ్యాపీ’.

‘చిత్రాంగద’ కోసం ఒక పాట కూడా పాడారు.. సింగర్‌గానూ   

కంటిన్యూ కావాలనుకుంటున్నారా?


(నవ్వుతూ) అశోక్‌ పాడమన్నారు. ‘ఏమో ఎలా ఉంటుందో’ అని ముందు ఒప్పుకోలేదు. ‘నువ్వు పాడగలవు’ అని పాడించారు. నిజం చెప్పాలంటే పాడినంతసేపూ నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. మొత్తం పాడాక ‘మనమూ పాడగలం’ అనిపించింది. మళ్లీ పాట పాడే అవకాశం వస్తే.. చూద్దాం.



అసలు ఇంతదాకా వస్తానని అనుకున్నారా?

అంజలి: లేదండి. సినిమాల్లోకి రావడం, పెద్ద స్థాయికి చేరుకోవడం, ఇటు తెలుగు, అటు తమిళ్‌లో సినిమాలు చేయడం.. ఏదీ ఊహించలేదు. అందుకే నేనింతదాకా రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నాను.



మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా?

అంజలి: నో ప్రాబ్లమ్స్‌. ప్రశాంతంగా ఉన్నాను.



మీకు మోరల్‌ సపోర్ట్‌ తక్కువేమో.. అందుకే ఎక్కువ సమస్యలు చుట్టుముట్టాయేమో అనిపిస్తోంది...

అంజలి: అలా ఏం కాదండి. మా అమ్మ, ఇద్దరు అన్నయ్యలు, అక్క.. నా వెనక వాళ్లున్నారు. నాకు దక్కిన విజయాలను పంచుకున్నట్లుగానే.. నా బాధలను కూడా పంచుకుంటారు. అలాగే, మంచి స్నేహితులు ఉన్నారు. నేనేం ఒంటరిగా లేను. మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు.



గడచిన విషయాలను పదే పదే తలుచుకునే అలవాటు ఉందా?

అంజలి: అస్సలు లేదు. మంచిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చెడుని మర్చిపోవాలి. చెడు విషయాలను మనసులో భద్రంగా దాచుకుంటే ఏం లాభం? బాధపడిపోయి, క్రుంగిపోతాం. నెగటివిటీ పెరిగిపోతుంది. దానివల్ల లైఫ్‌ బాగుండదు. అదే మంచి విషయాలను గుర్తుంచుకున్నా మనుకోండి.. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ పెరుగుతుంది. అది జీవితానికి ఉపయోగపడుతుంది. ‘ఆల్వేస్‌ బీ పాజిటివ్‌’ అనేది నా పాలసీ.



బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఎలా రిలాక్స్‌ అవుతారు?

అంజలి: నాకు ఇద్దరు, ముగ్గురు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లతో కలసి నచ్చిన కంట్రీకి వెళతాను. ఆ ట్రిప్‌తో స్ట్రెస్‌ మొత్తం పోతుంది.



హీరోయిన్ల కెరీర్‌ ఓ పదేళ్లు ఉంటుందేమో.. ఈలోపే తెలివిగా సెటిల్‌ అయిపోవాలి. మరి.. మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో మీరెంతవరకూ బెస్ట్‌?

అంజలి: కష్టపడి సంపాదించిన డబ్బు విలువ ఎవరికైనా బాగా తెలుస్తుంది. అందుకే నేను డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. హీరోయిన్ల కెరీర్‌ పదేళ్లని అన్నారు కానీ.. అన్నేళ్లు కూడా ఉంటుందో లేదో తెలియదు. అందుకే సంపాదించేటప్పుడే జాగ్రత్తపడాలి.



కొంతమంది హీరోయిన్లు నగల వ్యాపారం అనీ, హోటల్‌ బిజినెస్‌ అనీ చేస్తున్నారు. మీకలాంటి ఆలోచన?

అంజలి: ఇప్పటికైతే లేదు. షూటింగ్స్‌కే సరిపోతోంది. సినిమాలు స్టాప్‌ చేసిన తర్వాత మాత్రం కచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను.



పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా?

అంజలి: ప్రస్తుతానికైతే లేదు. అయితే అదొక మేజికల్‌ మూమెంట్‌. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రేపు వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. రెండు, మూడేళ్ల వరకూ ఆ మూమెంట్‌ రాకపోయినా నో వండర్‌.



మీ మనసు గెలుచుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?

అంజలి: మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ కంపల్సరీ. హుందాగా ప్రవర్తించాలి. డీసెంట్‌గా ఉండాలి. గుడ్‌ లుకింగ్‌గా ఉండాలి. అత్యాశ అనుకోకపోతే ఒకటి చెబుతా. నన్ను రాణిలా చూసుకోవాలి (నవ్వుతూ)..



ఇలాంటి లక్షణాలున్న అబ్బాయి మీకిప్పటివరకూ తారసపడలేదా?

అంజలి: పడ్డారు. పెళ్లి చేసుకోవాలనే ఫీల్‌ కలగాలి కదా. ఇప్పటివరకూ ఆ దృష్టితో నేనెవర్నీ చూడలేదు.



2017 మీకెలా ఉంటుందనుకుంటున్నారు?

అంజలి: మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అన్నీ నాకు మంచి పేరు తెచ్చే సినిమాలే. ప్రొఫెషనల్‌గా బాగుంటుందనుకుంటున్నాను. పర్సనల్‌గా కూడా హ్యాపీగా ఉన్నాను. పాజిటివ్‌గా థింక్‌ చేస్తాను కాబట్టి.. అంతా బాగుంటుందని నమ్ముతున్నాను.

– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top