చర్మం దురదపెడుతోంది.. తగ్గేదెలా?

చర్మం దురదపెడుతోంది.. తగ్గేదెలా?


నా వయసు 46 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్‌ డర్మటైటిస్‌ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? ఇది హోమియోలో పూర్తిగా నయమవుతుందా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.

– నిరంజన్‌రెడ్డి, కర్నూలు

చర్మంలో సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు సెబోరిక్‌ డర్మటైటిస్‌ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్‌ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది.



కారణాలు

ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్‌ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది.

∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్‌సన్‌ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ.

∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం.

∙వాతావరణం, హార్మోన్‌ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు.

లక్షణాలు

∙సెబోరిక్‌ డర్మటైటిస్‌ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది ∙దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కువగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది.



నిర్ధారణ

వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్‌ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు.

మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్‌ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌ సీఎండ్‌డి హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌



నా కిడ్నీలు పని చేయడం లేదా?!

నా వయసు 65 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను హైబీపీతో బాధపడుతున్నాను. కిందటి ఏడాది ఒకసారి రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్‌ 6, యూరియా 120 వరకు ఉన్నాయి. నా కిడ్నీలు పనిచేయడం లేదన్నారు గానీ నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. నాకు ఇలా ఏ లక్షణాలూ కనిపించకపోయినా లోపల ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయా? నాకు తగిన సలహా ఇవ్వండి.

– శ్రీనివాసరావు, ఇల్లందు



మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బు వచ్చినవారిలో రెండు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోతుంది. రక్తపరీక్షలూ ఏమీ తెలియకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం కంటే తగ్గగానే ఈ జబ్బు లక్షణాలు వెంటనే తెలుస్తాయి. కాబట్టి మీరు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. హైబీపీ, డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే... వారికి క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏడాదీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే... కిడ్నీలను కాపాడుకునే వీలు అంత ఎక్కువ.

నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? – ఈశ్వరయ్య, నల్లగొండ

డయాలసిస్‌ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్‌ లేదా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్‌ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి.



నా వయసు 52 ఏళ్లు. నాకు గత పన్నెండేళ్లుగా షుగర్‌ ఉంది. ఈమధ్య ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు కాళ్ల వాపులు వస్తున్నాయి. నా రక్తపరీక్షలో క్రియాటినిన్‌ 10 ఎంజీ/డీఎల్, యూరియా 28 ఎంజీ/డీఎల్, ప్రోటీన్‌ మూడు ప్లస్‌ ఉన్నాయని చెప్పారు. నాకు షుగర్‌ వల్ల సమస్య వస్తోందా? నాకు తగిన సలహా ఇవ్వండి. – సుబ్బారావు, పెందుర్తి



మీ రిపోర్డులను బట్టి మీకు మూత్రంలో ప్రోటీన్‌ ఎక్కువగా పోతోంది. ఇది మీకు ఉన్న షుగర్‌ వ్యాధి వల్ల వచ్చిన కిడ్నీ సమస్యా (డయాబెటిక్‌ నెఫ్రోపతి) లేక మరోదైనా సమస్యతో ఇలా జరుగుతోందా అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ దగ్గకు కూడా వెళ్లి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. షుగర్‌ వల్ల రెటీనా దెబ్బతింటే (డయాబెటిక్‌ రెటినోపతి) అనే సమస్య వస్తుంది. మీ మూత్రంలో యూరియా ఎక్కువగా పోవడం కూడా షుగర్‌ వల్లనే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా షుగర్‌ నియంత్రణలో ఉంచుకోవాలి. తినకముందు బ్లడ్‌ షుగర్‌ 100 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్‌ ఉండేలా నియంత్రించుకోవాలి. బీపీ 125/75 ఎమ్‌ఎమ్‌హెచ్‌జీ ఉండేలా చూసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్‌ పోవడం తగ్గించడం కోసం ఏసీఈ, ఏఆర్‌బీ అనే మందులు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు 150 ఎంజీ/డీఎల్‌ లోపలే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇవే కాకుండా ఉప్పు బాగా తగ్గించి వాడాలి. (రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువే తీసుకోవాలి). పొగతాగడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్‌ సూచించకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు.



డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top