గైనకాలజీ కౌన్సెలింగ్


ట్యూబ్ తొలగించారు.. గర్భం వస్తుందా?

 నా వయసు 26 ఏళ్లు. పెళ్లయ్యి నాలుగేళ్లయ్యింది. పెళ్లైన రెండు నెలలకే గర్భం వస్తే అప్పుడే వద్దని అబార్షన్ చేయించుకున్నాను. తర్వాత మూడేళ్లకు గర్భం వచ్చింది. కడుపునొప్పి వచ్చి కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంటే, డాక్టర్ స్కానింగ్ చేసి... ‘గర్భం కుడి ట్యూబ్‌లో వచ్చిందనీ, ఆపరేషన్ చేసి, కుడి ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు నాకు ఒక్కటే ట్యూబ్ ఉంది. నాకు మళ్లీ సాధారణంగా గర్భం వస్తుందా, రాదా అని చాలా ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.

 - ఒక సోదరి, గిద్దలూరు



 గర్భాశయం ఇరువైపులా రెండు ఫెలోపియన్ ట్యూబ్‌లు, రెండు అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒకవైపు, ఇంకో నెల మరోవైపు... ఇలా అండాశయం నుంచి అండం విడుదలై, ఆ వైపు ఉన్న ట్యూబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆ నెలలో శుక్రకణం కలవడం వల్ల ఆ అండం ఫలదీకరణ చెందితే, అది అండం నుంచి పిండంగా మారుతూ... క్రమంగా ట్యూబ్ నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి, అక్కడ పెరగడం మొదలవుతుంది. ఈ ట్యూబ్‌లలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లగానీ, ఇతర కారణాల వల్లగానీ, ట్యూబ్‌లు దెబ్బతిని, సరిగా పనిచేయనప్పుడుగానీ, లేదా పాక్షికంగా మూసుకుపోవడం వల్లగానీ జరిగితే ఫలదీకరణ చెందిన అండం, గర్భాశయంలోకి ప్రవేశించకుండా, ట్యూబ్‌లోనే పెరగడం మొదలవుతుంది. (కొంతమందిలో అబార్షన్ తర్వాత గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చి, ఇది ట్యూబ్‌కి పాకి, అది పాక్షికంగా దెబ్బతినవచ్చు). గర్భాశయంలోకి రాకుండా, మిగతా చోట్ల పెరిగే గర్భాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కొందరిలో అరుదుగా అండాశయంలో, పొట్టలో, గర్భాశయం ముఖద్వారం (సర్విక్స్) వద్ద కూడా పిండం పెరగవచ్చు. గర్భాశయం లాగా ట్యూబ్‌లు, ఇతర భాగాలు సాగలేవు కాబట్టి పిండం పెరిగేకొద్దీ, ట్యూబ్‌లు పగిలి కడుపులోనే రక్తస్రావం అవుతుంది.



అలాంటప్పుడు వెంటనే ఆపరేషన్ చేసి, పగిలిన ట్యూబ్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఇంకొక ట్యూబ్ ఆరోగ్యంగా ఉంటే గర్భం వచ్చే అవకాశాలు 70 శాతానికి పైనే ఉంటాయి. పది శాతం మందిలో మళ్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే మళ్లీ గర్భం దాల్చినప్పుడు, కాస్త త్వరగా అంటే పీరియడ్స్ మిస్ అయిన వారం, పది రోజుల లోపల) స్కానింగ్ చేయించుకొని, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేక నార్మల్ గర్భమా అని నిర్ధారణ చేసుకుంటే మంచిది. ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే దాన్ని ఆరంభదశలోనే కనిపెడితే, మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా దాన్ని కరిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా జరిగితే  వీలైనంతవరకు ట్యూబ్ తీయకుండానే విపత్తు నివారణకు ప్రయత్నించవచ్చు. ఇక మీకు ఎలాగూ ఒక ట్యూబ్‌తో 70 శాతానికి పైగానే గర్భధారణ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆందోళన చెందకండి. నిత్యం మీ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో ఉండండి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top