దైవం మానవ రూపంలో...

దైవం మానవ రూపంలో...


మార్చి 3, సోమవారం శ్రీరామకృష్ణ పరమహంస జయంతి)


స్వామి వివేకానంద లాంటి ఎందరినో తన ఉపదేశాలతో మహామహులుగా తీర్చిదిద్ది మానవాళికి అందించారు రామకృష్ణ పరమహంస. భక్తి, దైవం లాంటి ఎన్నో అంశాల గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా శతాబ్దిన్నర క్రితం ఆయన చెప్పిన మాటలు ఇవాళ్టికీ స్మరణీయాలు, ఆచరణీయాలు. వాటిలో కొన్ని...

 

ఉన్నాడు... అతడున్నాడు... అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదనీ అంటే శుద్ధ తప్పు.  

 

పిలిస్తే పలుకుతాడు: ఏకకాలంలో అటు సగుణుడూ, ఇటు నిర్గుణుడూ, అటు నానారూపధారి, ఇటు ఏ విధమైన రంగూ రూపం లేనివాడూ భగవంతుడు. ఏ మతమైతే ఏమిటి? ఏ మార్గమైతే ఏమిటి? అందరూ ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి, ఏ మతాన్నీ, మార్గాన్నీ ద్వేషించకూడదు. కించపరచకూడదు. కులం, మతం ఏదైనా సరే, ఎవరైనా, ఎలాగైనా ఆ దేవదేవుణ్ణి పిలవచ్చు. మనస్ఫూర్తిగా, హృదయాంతరాళంలో నుంచి పిలిస్తే చాలు... ఆయన నిశ్చయంగా పలుకుతాడు. దర్శనమిస్తాడు.

 

మరి, అలాంటప్పుడు తీర్థయాత్రలు చేయడం, మెడలో మాలలు ధరించడం మొదలైన ఆచారాలన్నీ ఎందుకని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో అవన్నీ అవసరం. అయితే, జిజ్ఞాసువులు క్రమంగా బాహ్యాడంబరాలన్నిటినీ దాటుకొని వస్తారు. అప్పుడిక కేవలం భగవన్నామ జపం, స్మరణ, చింతనే మిగులుతాయి.

 

అందరూ ఆయనే ... వయస్సు ఎంత మీద పడ్డా, కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద మమకారం, ఈ బంధాల పట్ల వ్యామోహం పోనివారు ఎంతోమంది ఉంటారు. తీర్థయాత్రకు వెళ్ళినా వారి ధ్యాస అంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే. అలాంటివాళ్ళు తమ బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళనే సాక్షాత్తూ దైవస్వరూపులని భావించడం మొదలుపెట్టాలి. అప్పుడు మనుమరాలి మీద ప్రేమ అంతా ఆ దేవి మీద భక్తిగా మారుతుంది.

 

పిల్లను ఆడిస్తున్నా, అన్నం పెడుతున్నా, చివరకు నుదుట బొట్టు పెడుతున్నా అంతా ఆ అమ్మవారికే చేస్తున్నానని ఊహించుకోవాలి. దాని వల్ల ఇంట్లోనే ఉన్నప్పటికీ, దైవ సాన్నిధ్యంలో ఉన్న భావన, లాభం కలుగుతాయి. అందుకే, తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితులు - ఇలా ఎవరినీ ప్రేమించినా సరే, ఆ వ్యక్తి సాక్షాత్ భగవత్ స్వరూపమేననీ, దేవుడి అవతారమేననీ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంతో సులభమైన ఈ మార్గం మన మనస్సునూ, జీవితాన్నీ మాలిన్య రహితం చేసుకొనేందుకు ఉపకరిస్తుంది.

 

 - డా॥రెంటాల జయదేవ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top