హృదయాన్ని కదిలించిన చిన్నారి!

నదియా అబుషబాన్


బాల్యానికి ఏదీ నేర్పక్కర్లేదు.. అన్నీ తనే నే ర్చేసుకుంటుంది. ప్రపంచం తనతో ప్రవర్తించే తీరుకు తగినట్టుగా స్పందిస్తుంది. నవ్వితే నవ్వుతుంది.. ఏడిపిస్తే ఏడుస్తుంది! భయపెడితే... భయపడుతుంది. అప్పుడప్పుడు ఆ భయం... భయపెట్టే వారి హృదయాన్ని సైతం ద్రవింపజేస్తుంది.



గాజా.. ఇరాక్.. సిరియా.. ఎక్కడైతేనేం కరుడుగట్టిన మతోన్మాదం, యుద్ధోన్మాదం పసిపాపలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో చెప్పడానికి మరే మాటలూ అవసరం లేదు. ఈ ఫోటో చాలు. నదియా అబుషబాన్ అనే లేడీ ఫోటో జర్నలిస్టు సిరియాలో తీసిన ఛాయా చిత్రమిది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడ సృష్టిస్తున్న విలయతాండవాన్ని చిత్రీకరించడానికి అక్కడకు వెళ్లిన నదియా అక్కడే కనిపించిన ఒక పసిపాపను ముద్దుగా ఫొటో తీయబోయింది.



అది గమనించిన ఆ చిన్నారి వెంటనే రెండు చేతులూ పెకైత్తింది! ‘నేను లొంగిపోతున్నా.. నన్నేం చేయద్దు..’ అన్న వేడుకోలు అది! నదియా చేతిలోని కెమెరాను చూసి దాన్ని వెపన్‌గా భ్రమపడింది ఆ  పసిపాప. ఎక్కడ తనను కాల్చి చంపుతుందో అనే భయంతో రెండు చేతులూ పెకైత్తి తను లొంగిపోతానని వేడుకొంది.



నిర్ఘాంతపోవడం ఆ ఫోటో జర్నలిస్టువంతయ్యింది. ఇదీ ఐఎస్ టైజం విశృంఖలంగా రెచ్చిపోతున్న ప్రాంతంలోని చిన్నారుల పరిస్థితి. అనునిత్యం తుపాకీ పేలుళ్ల మధ్య, గొంతులు కోసి ఆనందిస్తున్న ఉగ్రవాదుల మధ్య ఉంటున్న పిల్లల పరిస్థితి ఇది. అక్కడ పుట్టడమే వారు చేసుకున్న పాపం. ఈ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది నదియా. సోషల్ నెట్‌వర్క్ సైట్లలో దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కళ్లలో తడి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top